లక్ష్య సేన్: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో ఓటమి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సంజయ్ కిశోర్
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ఒలింపిక్స్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ సెమీ ఫైనల్‌లో ఓటమి పాలయ్యాడు.
లక్ష్య సేన్ ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్(డెన్మార్క్) చేతిలో 22-20, 21-14 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయాడు. దీంతో ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయాడు.
సెమీస్‌లో ఓడిపోయినప్పటికీ కాంస్యం కోసం జరగాల్సిన పోరులో లక్ష్య విజయం సాధిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2022లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన అక్సెల్సెన్ కొన్నాళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తన విజయాలతో ఆధిపత్యం సాగిస్తున్నాడు.
లక్ష్యసేన్‌కు అక్సెల్సెన్‌పై మంచి రికార్డు లేదు. గతంలో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లలో ఎక్కువసార్లు అక్సెల్సెన్ విజయం సాధించాడు.


ఫొటో సోర్స్, Getty Images
సెమీస్‌కు చేరడం ఒక రికార్డ్
ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్యసేన్ సెమీస్‌కు చేరడమే ఒక రికార్డ్.
ఒలింపిక్స్‌లో బ్యాండ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్న తొలి భారతీయ ఆటగాడు ఇతడే.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చౌ టియాన్ చెన్‌ను లక్ష్యసేన్ ఓడించాడు.
మహిళల సింగిల్స్‌ను కూడా కలుపుకుంటే పీవీ సింధూ, సైనా నెహ్వాల్ తర్వాత మూడవ ఆటగాడు లక్ష్యసేన్.
ఒలింపిక్ గేమ్స్‌లో చాలా మంది భారత క్రీడాకారులు పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్-ఫైనల్స్ వరకు చేరుకున్నారు. కానీ, తొలిసారి లక్ష్యసేన్ సెమీస్‌లో ఆడాడు.
క్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను 21-19 స్వల్ప తేడాతో కోల్పోయాడు. కానీ, ఆ తర్వాత గేమ్‌లో టియాన్ చెన్‌ను 21-15 తేడాతో ఓడించాడు. మూడవ గేమ్‌ను 21-12 తేడాతో గెలిచి, సెమీస్‌కు మార్గం సుగమం చేసుకున్నాడు.
2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో రజత పతకాన్ని, 2022 కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించాడు లక్ష్య సేన్.
2023 తొలి ఆరు నెలల కాలం సేన్‌కు పెద్దగా కలిసిరాలేదు.
మలేసియన్ ఓపెన్‌లో మరో భారత క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇండియన్ ఓపెన్‌లో ప్రణయ్‌ను ఓడించడం ద్వారా బదులు తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, రెండో రౌండ్‌లో డెన్మార్క్ ఆటగాడు డాన్ రాస్మస్ జెమ్కీ చేతిలో ఓడిపోవడంతో, టోర్నమెంట్ నుంచే వైదొలగాల్సి వచ్చింది.
జర్మన్ ఓపెన్‌లో, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో లక్ష్యసేన్‌కు నిరాశ ఎదురైంది. స్విస్ ఓపెన్, ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లలోనూ వైఫల్యాలను చవిచూశాడు.
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్(పురుషుల సింగిల్స్ విభాగం)లో లక్ష్యసేన్ 25వ స్థానానికి పడిపోయాడు. లక్ష్యసేన్ ఆరోగ్య సమస్య కూడా దీనికి ప్రధాన కారణంగా ఉంది.
యూరప్ పర్యటన సమయంలో ‘డివియేటెడ్ నాసల్ సెప్టం’కు గురయ్యాడు. సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
జూన్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరుకోవడం ద్వారా లక్ష్యసేన్ తిరిగి పుంజుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
2022లో అద్భుత ప్రదర్శన
2023లో లక్ష్యసేన్ అంత బాగా ఆడనప్పటికీ, అంతకుముందు 2022లో మాత్రం అద్భుతంగా ఆడాడు.
ఆ ఏడాది అతని ఆటతీరు అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. లక్ష్యసేన్ కెరీర్‌లో 2022 ‘గ్రేట్ ఇయర్’ అనే చెప్పుకోవచ్చు.
జనవరి నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో ప్రపంచ చాంపియన్ కిన్ యూను ఓడించడం ద్వారా తన తొలి సూపర్-500 టైటిల్‌ను కొట్టేశాడు. యూరోపియన్ సర్క్యూట్‌లో కూడా అతని ఆటతీరు బాగుంది.
ఆల్ ఇంగ్లాండ్, జర్మన్ ఓపెన్‌లో రన్నర్‌గా నిలిచాడు. థామస్ కప్ ఫైనల్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు.
బర్మింగ్‌హామ్‌లో జరిగిన తన తొలి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. ఈ పతకం సాధించిన తర్వాత లక్ష్యసేన్‌కు అర్జున అవార్డును బహూకరించారు.
2022 అక్టోబర్‌లో పురుషుల సింగిల్స్‌లో తన కెరీర్‌లోనే అత్యంత ఉత్తమ ర్యాంకింగ్‌లో 8వ స్థానాన్ని చేరుకున్నాడు.
కానీ, 2022 చివరి నుంచి లక్ష్యసేన్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ముక్కు ఆపరేషన్ నుంచి న్యాయపరమైన కేసుల వరకు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఫాస్ట్-ట్రాక్ కెరీర్
లక్ష్యసేన్ కెరీర్ ప్రారంభంలో ‘ఎక్స్‌ప్రెస్ ట్రైన్’ మాదిరిగా దూసుకెళ్లింది. తన డీఎన్ఏలోనే బ్యాడ్మింటన్ ఉంది.
తన తండ్రి డీకే సేన్ నేషనల్ కోచ్. సోదరుడు చిరాగ్ సేన్ బ్యాడ్మింటన్ ఆటగాడు.
పదేళ్ల వయసు కూడా నిండనప్పుడే, లక్ష్యసేన్ కోచ్ విమల్ కుమార్‌ను ఆశ్చర్యపరిచాడు.
విమల్, ప్రకాశ్ పదుకొణేలను ఆకట్టుకున్న విషయం ఏంటంటే.. లక్ష్యసేన్ ఆ వయసులో కూడా గెలుపును చాలా సీరియస్‌గా తీసుకునేవాడు. ఒక్క ఓటమికే ఏడుపు మొదలుపెట్టేవాడు.
ఈ యువ ఆటగాడి బ్యాడ్మింటన్ జర్నీ ప్రకాశ్ పదుకొణే అకాడమీలో ఫాస్ట్ ట్రాక్‌లో సాగింది. ఆ తర్వాత ఆరేళ్లలో లక్ష్యసేన్ తేలికగా అండర్-13, అండర్-17, అండర్-19 నేషనల్ టోర్నమెంట్లు గెలుచుకున్నాడు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటంటే.. అండర్-19 నేషనల్ మెడల్ గెలుచుకున్నప్పుడు లక్ష్యసేన్ వయసు కేవలం 15 ఏళ్లే.
2014లో స్విస్ జూనియర్ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలిచిన లక్ష్యసేన్ ప్రపంచ వేదికపై తన తొలి విజయాన్ని అందుకున్నాడు.
ఆ విజయం తర్వాత, జూనియర్ సర్క్యూట్‌లో ప్రధాన ఆటగాడిగా నిలుస్తూ వచ్చాడు.
జూనియర్ వరల్డ్ నెంబర్.1 ర్యాంకింగ్‌ను పొందడం ద్వారా 2017 ఫిబ్రవరిలో లక్ష్యసేన్ కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది.
అర్జెంటీనాలో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో రజత పతకాన్ని, జూనియర్ ఏషియన్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా 2018 కూడా ఈ యంగ్ షట్లర్‌కు ప్రత్యేకమైనదిగానే నిలిచింది.
కేవలం 22 ఏళ్లున్నప్పుడే, అద్భుతమైన రికార్డును అందుకున్నప్పటికీ, ఎన్నో అడ్డంకులను, సవాళ్లను లక్ష్యసేన్ ఎదుర్కొన్నాడు.
గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. కరోనా మహమ్మారి సమయంలో బ్యాడ్మింటన్ క్యాలెండర్‌లో అంత ఎక్కువ అవకాశాలు దక్కలేదు.

ఫొటో సోర్స్, Getty Images
2023లో ఎదురైన ఒడిదొడుకులను పక్కన పెడితే, లక్ష్యసేన్ తన శక్తిని పదేపదే నిరూపించుకుంటూ వచ్చాడు.
ప్రకాశ్ పదుకొణే, పుల్లెల గోపిచంద్ తర్వాత భారత ప్రపంచ నెంబర్.1 ఆటగాడు ఇతనే కాగలడని లక్ష్యసేన్ ఆటతీరు సూచిస్తుంది.
ఇతనిలో ఎన్నోప్రత్యేకమైన నైపుణ్యాలున్నాయి. మంచి ఫిట్‌గా ఉంటాడు. స్ట్రైకింగ్ పవర్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తాడు.
అల్మోరాలో హిమాలయాలున్న ఎత్తైన ప్రాంతాల్లో పెరగడం వల్ల, లక్ష్యసేన్ శారీరకంగా చాలా దృఢంగా ఉంటాడు.
అలసట అనేది లేకుండా కొన్ని గంటల పాటు నిరంతరాయంగా ప్రాక్టీస్ చేయగలడు. గత దశాబ్దంలో ప్రపంచ వేదికపై భారత బ్యాడ్మింటన్ ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది.
అయితే, ఏషియన్ గేమ్స్‌లో 72 ఏళ్ల చరిత్రలో భారత్ సాధించిన మొత్తం 155 బంగారు పతకాల్లో బ్యాడ్మింటన్ బంగారు పతకం లేదు. ఒలింపిక్స్‌లో ఏ పురుష క్రీడాకారుడు కూడా ఈ ఘనతను సాధించలేదు.
గత ఏషియన్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్ రెండు పతకాలు సాధించింది. పీవీ సింధూ రజతం, సైనా నెహ్వాల్ కాంస్యం గెలిచారు.
మరోవైపు ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుంటే, టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధూ దేశం కోసం కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














