పారిస్ ఒలింపిక్స్: స్వప్నిల్‌కు షూటింగ్‌లో కాంస్యం, భారత్ ఖాతాలో మరో పతకం

ఫొటో సోర్స్, Swapnil Kusale
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలె కాంస్య పతకం సాధించాడు.
పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఈ పతకం గెలిచాడు.
ఫైనల్లో స్వప్నిల్ 454.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
ఈ విభాగంలో చైనా షూటర్ యుకున్ లియు స్వర్ణాన్ని గెలుచుకోగా, యుక్రెయిన్ షూటర్ సెర్హీ కులిష్ రజతాన్ని గెలిచాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.
ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి.
తాజా పతకంతో ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరింది.
50మీ. రైఫిల్ త్రీ పొజిషన్‌లో భారత్‌కు ఇదే తొలింపిక్ పతకం. రైఫిల్ షూటింగ్ ఈవెంట్‌లో రెండోది.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణాన్ని గెలిచారు.


ఫొటో సోర్స్, Getty Images
‘‘కాంస్యం గెలుపొందడం సంతోషంగా ఉంది’’
ఫైనల్లో ఒత్తిడిగా అనిపించిందని, కానీ తర్వాత కాంస్యం గెలవడం చాలా సంతోషంగా ఉందని మెడల్ గెలిచిన అనంతరం స్వప్నిల్ అన్నారు.
‘‘ఇన్నేళ్లుగా చేస్తూ వస్తున్నదే ఈరోజూ చేశాను. నా మెదడులో కొన్ని ‘‘కీవర్డ్స్’’ పెట్టుకున్నాను. కేవలం శ్వాసపైనే నా దృష్టి కేంద్రీకరించా. చాలా ఆనందంగా ఉంది. ఇంకా నమ్మలేకపోతున్నా’’ అని స్వప్నిల్ హర్షం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, swapnil kusale
ధోనీ తరహాలోనే టికెట్ కలెక్టర్
28 ఏళ్ల స్వప్నిల్ స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న కంబల్‌వాడి గ్రామం. ఆయన తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా, తల్లి అనిత కంబాల్‌వాడీ గ్రామ సర్పంచ్.
తమ కుమారుడికి ఆటలపై ఉన్న ఆసక్తిని చూసి వారు స్వప్నిల్‌ను నాసిక్‌లోని స్పోర్ట్స్ స్కూల్‌లో చేర్చారు. ఇక్కడే ఆయన షూటింగ్ ప్రయాణం మొదలైంది. 2009లో 14 ఏళ్ల వయస్సు నుంచి ఆయన షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
2022లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వప్నిల్ బంగారు పతకం సాధించాడు.
గత 12 ఏళ్లలో మొదట జూనియర్ స్థాయిలో, తర్వాత సీనియర్ కేటగిరీలో స్వప్నిల్ అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొన్నారు.
అయితే ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

ఫొటో సోర్స్, swapnil kusale
‘‘బుల్లెట్లు కొనేందుకు బ్యాంక్ లోన్ తీసుకున్నా’’
“స్వప్నిల్ షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇన్నేళ్లలో అతనికి షూటింగ్‌పై విసుగు వచ్చినట్లుగా నాకెప్పుడూ అనిపించలేదు. అతను చాలా ప్రశాంతంగా, క్రమశిక్షణతో ఉంటాడు’’ అని బీబీసీతో స్వప్నిల్ తండ్రి సురేశ్ కుసాలె చెప్పారు.
షూటింగ్ క్రీడ చాలా ఖరీదైనది. రైఫిల్స్, జాకెట్ల కోసం ఖర్చు చేయాలి. ఒక్క బుల్లెట్ కొనడానికి కూడా చాలా డబ్బు ఖర్చవుతుంది.
ప్రాక్టీస్ కోసం బుల్లెట్‌లు కొనడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో తన తండ్రి అప్పు చేశారని ఒక సందర్భంలో స్వప్నిల్ చెప్పారు.

ఫొటో సోర్స్, swapnil kusale
రైల్వే శాఖలో ఉద్యోగం
“ప్రాక్టీస్ ఆపకూడదని, మా నాన్న బ్యాంకు నుంచి అప్పు తీసుకొని బుల్లెట్లు కొనిచ్చారు. అప్పుడు ఒక్క బుల్లెట్ ఖరీదు 120 రూపాయలు. అందుకే షూటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతీ బుల్లెట్‌ని నేను జాగ్రత్తగా వాడాను. ఈ ఆటను మొదలుపెట్టినప్పుడు నా దగ్గర తగినన్ని పరికరాలు కూడా లేవు” అని మీడియాతో స్వప్నిల్ చెప్పారు.
తల్లిదండ్రులతో పాటు కోచ్ దీపాలీ దేశ్‌పాండే తనకు ఎంతో సహకరించారని స్వప్నిల్ చెప్పారు.
షూటింగ్ కెరీర్ ఆరంభంలో 'లక్ష్య స్పోర్ట్స్' సంస్థ స్వప్నిల్‌కు అండగా నిలిచింది.
తర్వాత భారతీయ రైల్వే ఆయనకు ఉద్యోగం ఉచ్చింది.
2015 నుంచి సెంట్రల్ రైల్వేలోని పుణే డివిజన్‌లో టీటీఈగా ఆయన పనిచేస్తున్నారు.
తర్వాత బాలేవాడీలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ క్రీడా ప్రబోధినిలో ఆయన షూటింగ్ ప్రాక్టీస్ చేశారు.

ఫొటో సోర్స్, swapnil
చాలా ఏళ్ల పాటు అనారోగ్యంతో పోరాడి..
షూటింగ్‌లో స్వప్నిల్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.
స్వప్నిల్ ఏళ్ల పాటు బలహీనత, జ్వరం, తీవ్రమైన నొప్పులతో బాధపడ్డారని ఆయనకు మెంటార్‌కు వ్యవహరించిన విశ్వజిత్ షిండే తెలిపారు.
‘‘అతని అనారోగ్యానికి కారణం ఏంటో చాలా కాలం పాటు తెలియలేదు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ ఆటను మాత్రం కొనసాగించాడు.
ఎట్టకేలకు 2003 డిసెంబర్‌లో స్వప్నిల్ సమస్యకు మూలం ఏంటో తెలిసింది. స్వప్నిల్‌కు పాలతో ఎలర్జీ అని తేలింది. పాలలోని లాక్టోస్ కారణంగా స్వప్నిల్ పాలు, పాల ఉత్పత్తులు తినడం మానేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కూడా మెరుగుపడింది’’ అని ఆయన వెల్లడించారు.
ఫైనల్లో పతకం
అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే ఫైనల్‌కు చేరిన స్వప్నిల్ పతకాన్ని కూడా అందుకున్నారు.
పురుషుల 50మీ. ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో 590 పాయింట్లతో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచారు.
ఇందులో తొలి 8 స్థానాల్లో నిలిచిన షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.
గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలిచారు.
మూడు పొజిషన్లలో అంటే బోర్లా పడుకొని (ప్రోన్), మెకాళ్ల మీద (నీలింగ్), నిల్చొని (స్టాండింగ్) షూటింగ్ చేశారు.
ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














