పెంటగాన్: 9/11 దాడుల కేసులో ముగ్గురు నిందితుల నేరాంగీకారం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాక్స్ మట్జా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా మీద 2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముగ్గురు నిందితులు నేరాంగీకార ఒప్పందానికి అంగీకరించారని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
ఖాలిద్ షేక్ మొమ్మమద్, వాలిద్ ముహమ్మద్ సలీహ్ ముబారక్ బిన్ అతాష్, ముస్తఫా అహ్మద్ ఆదమ్ అల్-హవ్సావి అనే ముగ్గురిపై విచారణ జరపకుండానే క్యూబాలోని, గ్వాంటనామో బే యూఎస్ నేవీ బేస్‌లో ఏళ్లుగా నిర్బంధంలో ఉంచారు.
నేరాంగీకార ఒప్పందానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, మరణశిక్ష డిమాండ్ చేయకుండా ఉండేందుకు ప్రాసిక్యూషన్ అంగీకరించడంతో దానికి బదులుగా నిందితులు నేరాంగీకారానికి ఒప్పుకున్నారని అమెరికా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడుల్లో న్యూయార్క్, వర్జీనియా, పెన్సిల్వేనియాలోని దాదాపు 3,000 మంది ప్రజలు మరణించారు. ఈ ఘటన ‘‘ఉగ్రవాదంపై యుద్ధానికి’’, అఫ్గానిస్తాన్, ఇరాక్‌లపై దండయాత్రకు దారితీసింది.

బాధితుల కుటుంబాలకు ప్రాసిక్యూటర్లు పంపిన లేఖ ద్వారా ఈ ఒప్పందం తొలిసారి బహిర్గతమైందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
వీలైనంత త్వరగా వచ్చే వారం ఈ వ్యవహారం మిలిటరీ కోర్టు ముందుకు వస్తుందని పేర్కొంది.
నేరాంగీకార ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలు ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో లేవని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ముగ్గురు నిందితులపై పౌరుల మీద దాడి చేయడం, యుద్ధ చట్టాలను ఉల్లంఘిస్తూ హత్యకు పాల్పడటం, హైజాకింగ్, తీవ్రవాదం వంటి నేరారోపణలు ఉన్నాయి.
ఖాలిద్ షేక్ మొహమ్మద్‌ను ఈ దాడికి సూత్రధారిగా పరిగణిస్తున్నారు. ఈ దాడిలో ప్రయాణికుల విమానాలను స్వాధీనం చేసుకున్న హైజాకర్లు, వాటితో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌లను ఢీ కొట్టారు.
ప్రయాణికులు ఎదురు తిరగడంతో నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని పొలంలో కూలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
మొహమ్మద్ అమెరికాలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. 2003 మార్చిలో హస్వావితో కలిసి మొహమ్మద్ పోలీసులకు పట్టుబడ్డారు.
విమానాలను హైజాక్ చేయాలని అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌కు మొహమ్మద్ చెప్పాడని, ఆ తర్వాత కొంతమంది హైజాకర్‌లను రిక్రూట్ చేసుకుని, వారికి శిక్షణ ఇవ్వడంలో మొహమ్మద్ సహాయం చేశారని ప్రాసిక్యూటర్లు వాదించారు.
ఆయనను అత్యంత కఠినమైన విధానాల్లో పోలీసులు విచారించారు. 183 సార్లు ‘‘వాటర్ బోర్డింగ్-సిమ్యులేటెడ్ డ్రౌనింగ్’’ అనే ప్రక్రియను వాడారు. తర్వాత ఈ ప్రక్రియను అమెరికా నిషేధించింది.
బైడెన్ ప్రభుత్వం మొహమ్మద్‌తో సహా అయిదుగురు వ్యక్తుల నేరాంగీకార ఒప్పంద అప్పీల్‌ను సెప్టెంబర్‌లో తిరస్కరించింది.
నిందితులు పెట్టుకున్న అప్పీల్‌లో తమను ఏకాంతంగా నిర్బంధించకూడదని, మానసిక చికిత్సకు అనుమతించాలని అధ్యక్షుడి నుంచి హామీని కోరినట్లు తెలుస్తోంది.
కొత్త ఒప్పందం గురించి బుధవారమే అధ్యక్ష కార్యాలయానికి తెలిసిందని, ఈ విషయంతో తమకు ఎలాంటి ప్రమేయం లేదని వైట్‌హౌస్ తెలిపింది.

ఫొటో సోర్స్, Phil Penman
రిపబ్లికన్ల విమర్శ
నాటి దాడుల్లో జిమ్ స్మిత్ అనే పౌరుడు తన భార్యను కోల్పోయారు.
‘‘బాధితుల కుటుంబాలు 23 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. ఈ జంతువులు మావాళ్లకు ఏ గతి పట్టించారో కోర్టులో చెప్పేందుకు మేం నిరీక్షిస్తున్నాం. కానీ, ఇప్పుడు మేం ఆ అవకాశాన్ని కోల్పోయాం. మా నుంచి దాన్ని లాక్కున్నారు. వారు చేసిన పనులకుగానూ మరణశిక్ష వేయాలి’’ అని న్యూయార్క్ పోస్ట్‌తో ఆయన అన్నారు.
నిందితులతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు బైడెన్ ప్రభుత్వంపై రిపబ్లికన్లు విమర్శలు చేశారు.
సెనేట్ మైనారిటీ నాయకుడు మిచ్ మెక్‌కానెల్, "అమెరికాను రక్షించడానికి, న్యాయం అందించడానికి బదులు ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. ఉగ్రవాదులతో చర్చలు జరపడం కంటే హీనమైన విషయం ఏమిటంటే, కస్టడీలో ఉన్న వాళ్లతో చర్చలు జరపడం’’ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














