ఎస్సీ ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

ఫొటో సోర్స్, ANI
ఎస్సీలలో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా, ఒకరు వ్యతిరేకించారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పుచెప్పడం ద్వారా ఎస్సీ కోటాలో ఉప వర్గీకరణ ఉండదని 2004లో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది.
ఎస్సీ వర్గంలోని రెండు కులాలకు సగం సీట్లలో తొలి ప్రాధాన్యం ఇస్తూ తెచ్చిన చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం 2006లో ఆమోదించింది. షెడ్యూల్డ్ కులాలకు సగం సీట్లను రిజర్వ్ చేసే మునుపటి చట్టాన్ని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
షెడ్యూల్డ్ కులాల్లో ఉప కులాలను 'హోమోజీనస్ క్లాస్' (ఒకే సమూహంగా భావించలేమని) కాదని, వారి జనాభా గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితుల వంటి డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించవచ్చని జస్టిస్ చంద్రచూడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల కల ఫలించింది : మంద కృష్ణ మాదిగ

ఫొటో సోర్స్, Manda Krishna Madiga/FB
సుప్రీం కోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ''ముప్పై ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించింది. అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయవ్యవస్థ బలంగా నిలబడుతుందనడానికి ఈ తీర్పు నిదర్శనం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ఈ విజయం అమరులకు, ఉద్యమ మద్దతుదారులకు అంకితమిస్తున్నాం'' అన్నారు.
ఈ ప్రక్రియను ముందుకు నడిపించడంలో చొరవ చూపించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా అందరికీ ధన్యవాదాలు చెబుతున్నామని మంద కృష్ణ అన్నారు.
సుప్రీం కోర్టు తీర్పును ఏపీ, తెలంగాణలోని చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన అన్నారు.
''రిజర్వేషన్ల చట్టం రెండో అడుగు వేయబోతుంది. ఇప్పటివరకూ ఉమ్మడి రిజర్వేషన్లు నడిచాయి. రిజర్వేషన్లు అందుకోలేకపోయిన వర్గాలు నేడు రిజర్వేషన్లు అందుకుంటాయి. వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడేంత వరకూ ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయొద్దు. వర్గీకరణ జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నియామకాల వంటి నోటిఫికేషన్లు విడుదల చేయాలి'' ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశాం. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా వెంటనే వర్గీకరణను అమలు చేయకపోయినా, ఆలస్యమైనా అన్యాయం జరుగుతుంది. కాబట్టి విద్య, ఉద్యోగాలకు రీనోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్నాం'' అన్నారాయన.
''ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు.. ఇది మా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి అవరోధం కల్పించేందుకు ప్రయత్నించొద్దు’’ అని కృష్ణ మాదిగ అన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి, ప్రైవేటు రంగం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అజెండాతో సమష్టి పోరాటం చేద్దామని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ''డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తితో అన్నివర్గాల ప్రజలకూ రిజర్వేషన్ ఫలాలు అందాలనేదే మా ఉద్దేశం. సుప్రీం కోర్టు తీర్పుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ తీర్పుతో అన్యాయానికి గురవుతున్న వర్గాలకు న్యాయం జరుగుతుంది'' అన్నారు.
ఇదొక సామాజిక సమస్య అని, అందరికీ న్యాయం చేసే కోణంలోనే దీనిని చూడాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, FB/Anumula Revanth Reddy
రిజర్వేషన్లు అమలు చేస్తాం : రేవంత్ రెడ్డి
''తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం'' అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
''మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే సంపత్ కుమార్‌ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్‌ను సుప్రీం కోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీం కోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు'' అని రేవంత్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














