కోచింగ్ సెంటర్స్: దిల్లీ తరహా ప్రమాదాలు జరక్కుండా హైదరాబాద్‌‌లోని ఇన్‌స్టిట్యూట్‌లు భద్రమేనా?

కోచింగ్ సెంటర్ విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, దిల్లీ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి తరువాత హైదరాబాద్‌లోనూ కోచింగ్ సెంటర్ల భద్రత చర్చనీయాంశమైంది.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశ రాజధాని దిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటన దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ తీరుపై సందేహాలను లేవనెత్తింది.

సివిల్ సర్వీసెస్ సహా గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు నియామకాల వంటి పోటీ పరీక్షలకు హైదరాబాద్ కోచింగ్ హబ్‌గా మారింది.

అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో అనేక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

దిల్లీలోని రాజేంద్ర‌నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో, బయటకు వచ్చే అవకాశం లేక ముగ్గురు విద్యార్థులు చనిపోయారని, ఈ లైబ్రరీని సెల్లార్‌లో నిర్వహిస్తున్నారని పోలీసులు, అధికారులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి

హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటి?

హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లు సాధారణ వాణిజ్య భవనాలు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను కూడా పాటించడం లేదని బీబీసీ పరిశీలనలో తేలింది.

అశోక్‌నగర్‌లో కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలను బీబీసీ పరిశీలించింది.

ప్రధాన రహదారిలో నిర్వహిస్తున్న ఓ కోచింగ్ సెంటర్‌లో లోపలకు వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒక దారి మాత్రమే దారి ఉంది. ఎగ్జిట్ (బయటకు వెళ్ళేదారి) ప్రత్యేకంగా లేదు.

తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ పరీక్షలలో శిక్షణ కోసం పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు వస్తున్నారు.

భూమి
ఫొటో క్యాప్షన్, తరగతి గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నారని భూమి చెప్పారు.

‘ఒకే గదిలో కుక్కుతున్నారు’

కోచింగ్ సెంటర్లలో ఒకే గదిలో ఎక్కువ మందిని కూర్చోపెట్టడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కనిపిస్తున్నాయని భూమి అనే విద్యార్థిని బీబీసీకి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భూమి గత కొన్ని నెలలుగా అశోక్ నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు.

‘‘హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో ప్రధాన సమస్య… ఎక్కువ మందిని ఒకే చోట ఉంచి తరగతులు చెబుతుంటారు. చిన్న గదుల్లో విద్యార్థులను కుక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం లేదా ఇబ్బంది ఎదురైతే బయటకు వెళ్లేందుకు కేవలం ఒకేదారి ఉంటుంది’’ అని చెప్పారు భూమి.

ఇదే విషయంపై సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థిని కళ కూడా మాట్లాడారు.

‘‘దిల్లీ ఘటన తర్వాత కోచింగ్ సెంటర్ల భద్రతపై అంతటా చర్చ జరుగుతోంది. విద్యార్థులు కోచింగ్ కోసం వస్తారు. కోచింగ్ పూర్తికాగానే వెళ్ళిపోతున్నారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల తీరూ అంతే. భద్రత గురించి ఎవరూ మాట్లాడటం లేదు’’ అని చెప్పారు కళ.

కొన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న భవనాలవద్ద అయితే, ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ భవనం చుట్టూ తిరిగే వీలు లేదు. ప్రధాన మార్గం వైపు కాకుండా మిగిలిన మూడు వైపులా వాహనం తిరిగే అవకాశమే లేదు.

దిల్లీ విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, దిల్లీ ఘటనపై అక్కడి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

‘దిల్లీలో బేస్‌మెంట్లలో తరగతులు’

సివిల్స్ కోచింగ్ అనే సరికి విద్యార్థులు ఎక్కువగా దిల్లీ వైపు చూస్తుంటారు. ఏపీ, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఏటా దిల్లీ వెళ్లి చదువుకుంటుంటారు.

దిల్లీ ఘటన తర్వాత అక్కడ కొన్ని కోచింగ్ సెంటర్లలో భద్రతపై చర్చ నడుస్తోంది.

దిల్లీలో పరిస్థితులపై అక్కడే ఉంటూ సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఒకరు బీబీసీతో మాట్లాడారు.

‘‘దిల్లీలో భవనాల సెల్లార్లు/బేస్‌మెంట్లలో తరగతులు నిర్వహిస్తుంటారు. ఒకే తరగతిలో 250-300 మంది ఉంటారు. కోచింగ్ ఫీజులు కూడా చాలా ఎక్కువ. ఒకవేళ అదనంగా టెస్ట్ సిరీస్ కావాలంటే మరింత ఫీజు కట్టాలి. సెల్లార్లలో లైబ్రరీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. విద్యార్థులు ఇంటి అద్దెలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. కరెంటు యూనిట్ కు 4 రూపాయలు ఉంటే, మా వద్ద నుంచి ఇంటి యజమానులు 12 రూపాయలు వసూలు చేస్తుంటారు. దిల్లీ ఘటన తర్వాత మొదటి అంతస్తులో ఉన్న లైబ్రరీల ధరలు పెంచేశారు. గతంలో లైబ్రరీ ఫీజు 2000 నుంచి 2500 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని 4000 నుంచి 4500 రూపాయలకు పెంచారు’’ అని చెప్పారు సదరు విద్యార్థిని.

ఇంటి నుంచే చదువుకోవచ్చు

సివిల్స్ కల నెరవేర్చుకోవాలంటే దిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితులు తగ్గుతున్నాయని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన సివిల్స్ పరీక్షల మెంటార్ ఎం.వెంకటేశ్ బాబు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఇంటి వద్ద నుంచి కూడా చదువుకోవచ్చని చెప్పారు.

‘‘ప్రస్తుతం దిల్లీ అనే కాదు, హైదరాబాద్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఇంటర్నెట్‌లోనే అన్నిసబ్జెక్టుల వీడియో తరగతులు వినే అవకాశం ఉంది. పర్సనల్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టడీ మెటీరియల్ కూడా కొరియర్‌లో వస్తుంది’’ అని వివరించారు.

దిల్లీ వెళ్తేనే ఐఏఎస్ సాధించగలం అనే అపోహ నుంచి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు వెంకటేశ్ బాబు.

వెంకట చైతన్య
ఫొటో క్యాప్షన్, కోచింగ్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో ముందే చూసుకోవాలన్నారు చైతన్య.

మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తుండాలి

‘‘విద్యార్థులకు అకడమిక్‌గా నేర్పించడమే కాదు, ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడితే ఎలా తప్పించుకోవాలనే విషయంపై అవగాహన కల్పించాలి. మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది’’ అని చెప్పారు విజయనగరం జిల్లాకు చెందిన ఎం.ప్రసాద్. ఆయన ప్రస్తుతం అశోక్ నగర్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారు.

‘‘భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా.. లేదా అని కోచింగ్ సెంటర్లో చేరే ముందు కచ్చితంగా తెలుసుకొని చేరాలి. సివిల్స్ సాధించడం అనేది కొన్నేళ్ల ప్రయాణం. తరగతి గదులకే పరిమితం కాకుండా మిగిలిన వాతావరణాన్ని చూడాలి. నేను అంతా చూసుకునే చేరాను. అలాగే కోచింగ్ సెంటర్లు హాస్టల్ సౌకర్యం, ఇతరత్రా వసతులు కల్పించాలి’’ అన్నారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్‌లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న వెంకటచైతన్య.

కోచింగ్ సెంటర్లు ఎలా ఉండాలనే విషయంపై శరత్ చంద్ర ఐఏఎస్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు శరత్ చంద్ర బీబీసీతో మాట్లాడారు.

‘‘కోచింగ్ సెంటర్లు ఉన్న భవనాల్లో వరద నీరు పారేందుకు వీలుగా డ్రెయిన్ సౌకర్యం ఉండాలి. దగ్గర్లో ట్రాన్స్‌ఫార్మర్ ఉంటే కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి. విద్యుత్ వ్యవస్థను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే, ఫైర్ సేఫ్టీ అలారం ఉండాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. భవనాల విషయంలోనూ ఫైరింజన్లు తిరిగేలా ఉండాలి’’ అని బీబీసీకి చెప్పారు.

హైదరాబాద్ కోచింగ్ సెంటర్లు
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే

భారీగా ఫీజులు

హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లలో ఫీజుల భారం కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు విద్యార్థులు.

బీబీసీ కొంతమంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు సివిల్స్ కోచింగ్‌కు ఏడాదికి 1.20 లక్షల రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారని చెప్పారు.

గ్రూప్స్ పరీక్షలకు 60 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు.

‘‘కోచింగ్ కేంద్రాలలో ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్య తరగతి విద్యార్థులకు ఆ ఫీజులు కట్టేంత ఆర్థిక స్తోమత లేదు. ఫీజుల భారం తగ్గాలి. తరగతుల్లోనూ 100-200 మంది విద్యార్థులు ఉంటారు. పరిమిత సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలి’’ అని చెప్పారు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న కావ్య.

తనిఖీలు చేస్తాం..

ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే, నాలుగేళ్ల కిందట వరకు మున్సిపల్ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించేవారు.

కోచింగ్ సెంటర్ నిర్వహణ పేరుతో ప్రత్యేకంగా అనుమతులు తీసుకునేవారు కాదు.

దీంతో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్రమాణాలేవీ నిర్దేశించలేదు.

2019లో గుజరాత్‌లోని సూరత్‌లో ఒక కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

ఆ ఘటన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్ల భద్రతపై తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది తెలంగాణలోని అప్పటి ప్రభుత్వం.

ఈ బాధ్యత విద్యాశాఖకు అప్పగించింది.

కానీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

మళ్లీ రెండేళ్ల కిందట విద్యాశాఖాధికారులు మొత్తం తనిఖీ చేసి హైదరాబాద్ జిల్లా పరిధిలో 112 కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు.

ఆ తర్వాత మళ్లీ అనుమతులు, తనిఖీల ఊసే లేదు.

‘‘దిల్లీ ఘటన తర్వాత హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లపై తనిఖీలు చేయాలని నిర్ణయించాం. ఉప విద్యాశాఖాధికారులతో కోచింగ్ సెంటర్లకు వెళ్లి అనుమతులు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై తనిఖీలు చేయిస్తాం’’ అని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఆర్.రోహిణి బీబీసీకి చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)