హిరోషిమా, నాగాసాకి: ‘ఈ బాంబు పడ్డచోట 75 ఏళ్లపాటు గడ్డి కూడా మొలవదన్నారు, కానీ....’

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శిథిలావస్థకు చేరిన హిరోషిమా నగరం
    • రచయిత, లూసీ వాలిస్
    • హోదా, బీబీసీ న్యూస్

హెచ్చరిక: ఈ కథనం కొందరు పాఠకులను కలచివేయొచ్చు.

ఆ రోజు ఉదయం...అప్పటికే కాస్త వేడిగా ఉంది. నుదుటిపై కారుతున్న చెమటను తుడుచుకుంటూ నీడకోసం వెతుకుతోంది చియెకొ కిరియాకి. అలా వెతుకుతున్నప్పుడు, ఒక్కసారిగా కళ్లతో చూడలేనంత వెలుతురు.

తాను పుట్టినప్పటి నుంచి 15 ఏళ్ల జీవితకాలంలో ఎన్నడూ చూడనంత కాంతి అది. 1945 ఆగస్టు 6వ తేదీ ఉదయం సరిగ్గా 8.15 గంటలకు జరిగిందది.

''ఉన్నట్టుండి సూర్యుడు భూమి మీద పడిపోయాడా అనిపించింది, కళ్లు బైర్లు‌కమ్మాయి'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

చియెకొ స్వస్థలమైన హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేసింది. యుద్ధంలో అణ్వాయుధాలను ఉపయోగించడం అదే తొలిసారి.

యూరప్‌లో జర్మనీ లొంగిపోయినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న దాని మిత్రరాజ్యాలకు చెందిన బలగాలు అప్పటికి జపాన్‌తో యుద్ధం చేస్తూ ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు

అప్పటి వరకు చియెకొ చదువుకుంటూ ఉండేది. కానీ, చాలా మంది సీనియర్ విద్యార్థుల తరహాలోనే ఆమెను కూడా యుద్ధ సమయంలో కర్మాగారాల్లో పనికి పంపారు.

బాంబు దాడిలో గాయపడిన స్నేహితురాలిని వీపు మీద మోసుకుంటూ తన పాఠశాల వైపు వెళ్లారు. అప్పటికే అక్కడున్న విద్యార్థులు చాలా మంది తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్నారు. హోం ఎకనమిక్స్ క్లాస్‌రూమ్‌లో కనిపించిన పాత నూనెతో వారి గాయాలకు ఆమె మర్దన చేశారు.

''ఆ సమయంలో మేం వారికి ఇవ్వగలిగిన ఏకైక చికిత్స అదే. ఒకరి తర్వాత మరొకరు చాలామంది చనిపోయారు.'' అని చియెకొ చెప్పారు.

''గ్రౌండ్‌లో ఒక గుంత తవ్వమని ప్రాణాలతో బయటపడిన మాలాంటి సీనియర్ విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పారు. నా తోటి విద్యార్థులను నేను నా చేతులతో ఖననం చేశా. అది నాకు చాలా బాధగా అనిపించింది.'' అన్నారామె.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాంబు పేలినప్పుడు హిరోషిమాపై పుట్టగొడుగు ఆకారంలో మేఘంలా కనిపించింది

చియెకొకు ఇప్పుడు 94 ఏళ్లు. హిరోషిమా, నాగాసాకిపై అణుబాంబు దాడులు జరిగి దాదాపు 80 ఏళ్లు అవుతోంది. ఆ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడిన వారు (వీరిని జపాన్‌లో హిబాకుషాగా పిలుస్తారు. హిబాకుషా అంటే బాంబుదాడి ప్రభావితులు అని అర్ధం.) ఇప్పుడు జీవిత చరమాంకానికి చేరుకున్నారు.

వారిలో చాలా మంది ఆరోగ్య సమస్యలతోనే కాలం గడిపారు. తమ ఆత్మీయులను కోల్పోవడమే కాకుండా, అణుదాడి కారణంగా వివక్షకు కూడా గురయ్యారు.

బీబీసీ రూపొందిస్తున్న డాక్యుమెంటరీ 'BBC Two' ఫిల్మ్‌తో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది భావితరాలకు హెచ్చరికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films/Chieko Kiriake

ఫొటో క్యాప్షన్, అణుబాంబు దాడికి ముందు, ప్రస్తుతం చియెకొ కిరియాకి

ఎన్నోసార్లు మరణం వరకూ వెళ్లా..

అంతపెద్ద దు:ఖం తర్వాత, నగరానికి పునరుజ్జీవం రావడం ప్రారంభమైందని చియెకొ చెప్పారు.

''75 ఏళ్ల వరకూ గడ్డి కూడా మొలవదని చెప్పారు, కానీ మరుసటి ఏడాది నాటికి పిచ్చుకలు తిరిగొచ్చాయి'' అని ఆమె చెప్పారు.

తన జీవితంలో చాలాసార్లు చావు వరకూ వెళ్లానని, కానీ ఏదో ఒక గొప్ప శక్తి తనను సజీవంగా ఉంచిందని అనుకుంటున్నట్లు ఆమె అన్నారు.

ఈరోజు బతికివున్న హిబాకుషాల్లో ఎక్కువ మంది అణుదాడి సమయానికి చిన్నారులే. వయసు పైబడుతున్న హిబాకుషాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు తీవ్రతరమవతున్నాయి. అణుదాడి ప్రమాదం గతంలో కంటే ఇప్పుడే ఎక్కువగా కనిపిస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుక్రెయిన్‌పై రష్యా దాడి, ఇజ్రాయెల్ - గాజా యుద్ధం వంటి ఘర్షణల గురించి తలుచుకుంటే ''నా శరీరం వణికిపోతుంది, కన్నీళ్లు ఆగడం లేదు'' అని 86 ఏళ్ల మిచికో కొడామ చెప్పారు.

''అణుబాంబు దాడుల వంటి నరకం మళ్లీ ఎప్పటికీ పునరావృతం కాకూడదు. అలాంటి వాటిని మనం అనుమతించకూడదు. నాకు సంక్షోభంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది.'' అన్నారు కొడామ.

అణు నిరాయుధీకరణపై గొంతెత్తిన మిచికో, అణుదాడి కారణంగా మరణించిన వారి గొంతుకను వినిపిస్తానని చెబుతున్నారు. అప్పటి వారి సాక్ష్యాలను భావితరాలకు ఆమె అందించారు.

''అణుబాంబు దాడిని అనుభవించిన హిబాకుషాల ప్రత్యక్ష అనుభవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నా.'' అని ఆమె అన్నారు.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films

ఫొటో క్యాప్షన్, ఆకాశం నుంచి నల్లటి బురద వర్షం పడినట్లు మిచికో చెప్పారు

నల్లటి వర్షం కురిసింది..

హిరోషిమాపై బాంబు పడినప్పుడు మిచికో స్కూల్లో ఉన్నారు, అప్పుడామె వయసు ఏడేళ్లు.

''క్లాస్‌రూం కిటికీల్లో నుంచి భయంకరమైన వెలుగు వచ్చింది. అది పసుపు, నారింజ, వెండి రంగుల్లో ఉంది'' అని ఆమె చెప్పారు.

క్లాస్ రూం కిటికీల అద్దాలు పగిలిపోవడం, గోడలు, డెస్కులు, కుర్చీలు ఎలా చెల్లాచెదురయ్యాయో ఆమె వివరించారు.

''సీలింగ్ కూలిపోయింది. నేను డెస్కు కింద దాక్కున్నా. పేలుడు తర్వాత, ఆ ధ్వంసమైన గదిలో ఎటు చూసినా శిథిలాల కింద చిక్కుకున్న కాళ్లు, చేతులు కనిపించాయి. క్లాస్ రూంలో నుంచి కారిడార్‌లోకి పాకుకుంటూ వచ్చా. సాయం చేయమని నా స్నేహితులు అర్థిస్తున్నారు.'' అని మిచికో చెప్పారు.

తండ్రి ఆమెను వీపుపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు.

నల్లటి వర్షం, 'బురద లాంటిది' ఆకాశం నుంచి పడిందని మిచికో చెప్పారు. అది రేడియోధార్మిక పదార్థం. పేలుడు నుంచి వెలువడిన మిశ్రమమని అన్నారు.

ఇంటికి వెళ్తున్నప్పుడు చూసిన దృశ్యాలను ఆమె మరిచిపోలేదు.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films/Michiko Kodama

ఫొటో క్యాప్షన్, ఇంటికి వెళ్తున్న సమయం 'నరకంలో ఓ దృశ్యం'లా అనిపించిందని మిచికో అన్నారు

''అది ఓ నరకం'' అని మిచికో చెప్పారు. ''మా ముందు నుంచి పారిపోతున్న వ్యక్తులు, వారి దుస్తులు దాదాపు పూర్తిగా కాలిపోయాయి. వారి శరీర భాగాలు కూడా కాలిపోతున్నాయి.'' అని చెప్పారామె.

తాను ఒంటరిగా ఉన్న తన వయసు అమ్మాయి ఒకరిని చూసినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె శరీరం కాలిపోయింది. ''ఆమె విశాలమైన కళ్లు మాత్రమే తెరిచివున్నాయి'' అని మిచికో చెప్పారు.

''ఆ అమ్మాయి కళ్లు ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉన్నాయి. నేను ఆమెను ఎప్పటికీ మర్చిపోలేను. అది జరిగి 78 ఏళ్లు గడచిపోయినా ఆమె ఆ దృశ్యం నా మనసులో నుంచి చెదిరిపోలేదు.'' అని ఆమె అన్నారు.

మిచికో వాళ్ల పాత ఇంట్లోనే ఉండి ఉంటే ఈరోజు ప్రాణాలతో ఉండేది కాదు. బాంబు పేలిన ప్రదేశానికి వారి పాత ఇల్లు కేవలం 350 మీటర్ల దూరంలో ఉండేది. బాంబు దాడి జరగడానికి కేవలం 20 రోజుల ముందు, ఆమె కుటుంబం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఇంటికి మారింది. అదే ఇప్పుడామె ప్రాణాలతో ఉండడానికి కారణమైంది.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films

ఫొటో క్యాప్షన్, బాంబు పేలినప్పుడు వెలువడిన భారీ కాంతిని సూయిచి గుర్తు చేసుకున్నారు

చమురు డబ్బా పేలిందనే భావనలోనే ఉన్నా..

1945 చివరినాటికి హిరోషిమాలో 1,40,000 మంది చనిపోయినట్లు అంచనా.

హిరోషిమాపై దాడి జరిగిన మూడు రోజుల తర్వాత, అమెరికా మరో అణుబాంబు వేసిన నాగాసాకిలో కనీసం 74,000 మంది చనిపోయారు.

నాగాసాకిలో బాంబు పేలిన ప్రదేశానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే సూయిచి కిడో ఉండేవారు. అప్పటికి ఆయనకు ఐదేళ్లు. ఆ బాంబు దాడిలో ఆయన ముఖం పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన తల్లి, సూయిచికి తీవ్రగాయాలు కాకుండా రక్షించారు.

''ఇంకెవరూ హిబాకుషాగా మారకుండా నిరోధించేందుకు చేపట్టిన మా మిషన్‌ను ఒక హిబాకుషాగా ఎప్పటికీ వదిలిపెట్టేది లేదు.'' అని అణ్వాయుధాల వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు ఇటీవల న్యూయార్క్ వెళ్లిన 83 ఏళ్ల సూయిచి చెప్పారు.

పేలుడు ధాటికి స్పృహతప్పి పడిపోయి, లేచిన తర్వాత ఆయనకు మొదట గుర్తుకొచ్చింది ఎర్రని ఆయిల్ డబ్బా. ఆ చమురు డబ్బా పేలుడే చుట్టుపక్కల వినాశనానికి కారణమని ఆయన చాలా ఏళ్లపాటు భావించారు.

ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనకు నిజం చెప్పలేదు. ఇది అణుబాంబు దాడి వల్ల జరిగిందని చెప్పకూడదని వారు భావించారు. కానీ ఆయన దాని గురించి ప్రస్తావించిన ప్రతిసారీ, వాళ్లు కన్నీళ్లు పెట్టుకునేవారు.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films/Kiyomi Iguro

ఫొటో క్యాప్షన్, యుక్త వయసులో, సంప్రదాయ దుస్తుల్లో కియోమి ఇగురో

సమాజంలో వివక్ష..

అన్ని గాయాలూ వెంటనే బయటపడవు. పేలుడు జరిగిన వారాలు, నెలల తర్వాత ఆ రెండు నగరాల్లోని చాలా మందిలో రేడియేషన్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయి. కేన్సర్, లుకేమియా బారినపడిన వారి సంఖ్య పెరిగింది.

ప్రాణాలతో బతికి బయటపడ్డవారు, కొన్నేళ్ల తర్వాత సమాజంలో వివక్షకు గురయ్యారు. ప్రత్యేకించి పెళ్లిళ్ల విషయంలో.

''హిబాకుషా రక్తం మా కుటుంబంలోకి ప్రవేశించడం మాకు ఇష్టం లేదు అని ఒకరు నాతో అన్నారు.'' అని మిచికో చెప్పారు.

అయితే, ఆ తర్వాత ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

కేన్సర్‌తో తల్లి, తండ్రి, సోదరులు ఆమెకు దూరమయ్యారు. 2011లో ఆమె కుమార్తె కూడా జబ్బుపడి ప్రాణాలు కోల్పోయింది.

''ఒంటరిగా అనిపించేది. కోపంగా, భయంగా ఉండేది. తర్వాత ఇక నా వంతే అనుకునేదాన్ని.'' అని ఆమె అన్నారు.

అణ్వాయుధాలు

ఫొటో సోర్స్, BBC/Minnow Films

ఫొటో క్యాప్షన్, అణ్వాయుధాలు, యుద్ధం లేని శాంతియుత ప్రపంచాన్ని కియోమి కోరుకున్నారు

బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన మరొకరు కియోమి ఇగురో. నాగాసాకిలో బాంబు పడేనాటికి ఆమెకు 19 ఏళ్లు. ఆమెకు దూరపు బంధువుతో వివాహమైంది. ఆ తర్వాత గర్భస్రావం జరిగింది. దానికి అణుబాంబు ప్రభావమే కారణమని తన అత్త అనేవారని ఆమె చెప్పారు.

''నీ భవిష్యత్తు భయానకం. ఆమె నాకు చెప్పిందదే.'' అన్నారామె.

అణుబాంబు ప్రభావానికి గురైనట్లు ఇరుగుపొరుగుకి చెప్పొద్దని తన అత్త ఆదేశించినట్లు కియోమి చెప్పారు.

డాక్యుమెంటరీ కోసం ఇంటర్వ్యూ చేసిన తర్వాత, కొద్దికాలానికే ఆమె చనిపోయారు.

అయితే, 98 ఏళ్ల ఆమె జీవిత కాలంలో, ప్రతి ఏటా నాగాసాకిలోని పీస్ పార్కుని సందర్శించి, ఆ రోజు అణుబాంబు నాగాసాకిని తాకిన 11.02 గంటలకు శాంతిని కాంక్షిస్తూ గంట మోగించేవారు.

యూనివర్సిటీలో జపనీస్ చరిత్ర బోధించేందుకు వెళ్లారు సూయిచి. తాను హిబాకుషా అని తెలియడంతో, దాని ప్రభావం తనపై పడిందని ఆయన చెప్పారు. కానీ, తాను సాధారణ మనిషిని కాదని గ్రహించిన ఆయన, మానవాళి రక్షణ కోసం గొంతెత్తడం తన కర్తవ్యంగా భావించారు.

"నేను ప్రత్యేకమైన వ్యక్తిననే భావన నాలో కలిగింది" అని సూయిచి చెప్పారు.

ఇవీ హిబాకుషాల మదిలో మెదులుతున్న భావాలు, గతం ఎప్పటికీ పునరావృతం కాకూడదనే గట్టి సంకల్పం వారిది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)