ఎవరెస్ట్ డెత్ జోన్: 8,000 మీ.ల ఎత్తులో ఉన్న పర్వతారోహకుల మృతదేహాలను అనేక ఏళ్ల తర్వాత ఎలా కిందకు తెస్తున్నారంటే...

ఫొటో సోర్స్, Tshiring Jangbu Sherpa
- రచయిత, రమా పరాజులి,
- హోదా, బీబీసీ ప్రతినిధి
షిరింగ్ జంగ్బు షెర్పా ఒక దశాబ్దం కిందట హిమాలయాలలోని మౌంట్ లోథ్సే శిఖరానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో తాను చూసిన మృతదేహాన్ని ఇంకా మరిచిపోలేదు.
ప్రపంచంలోని నాలుగో ఎత్తయిన పర్వతాన్ని 2012 మే నెలలో అధిరోహించే ప్రయత్నం చేస్తున్న ఒక జర్మన్ పర్వతారోహకుడికి ఆ నేపాలీ షెర్పా (గైడ్, సహాయకుడు)గా పని చేస్తున్నారు.
తమ మార్గంలో అడ్డుగా ఉన్నది అప్పటికి కొన్ని రోజుల కిందట మరణించిన చెక్ రిపబ్లిక్ పర్వతారోహకుడు మిలన్ సెడ్లాసెక్ మృతదేహం అని వాళ్లు భావించారు.
ఆ చెక్ పర్వతారోహకుడు శిఖరాగ్రానికి అంత దగ్గరలో ఎందుకు చనిపోయారనే విషయంపై ఆ గైడ్‌కు ఆసక్తి కలిగింది. గడ్డకట్టిన ఆ మృతదేహం చేతుల్లో ఒకదానికి గ్లౌజు లేకపోవడాన్ని ఆయన గుర్తించారు.
"ఆయన చేయి తాడు నుంచి జారిపోయి ఉండవచ్చు." అని షిరింగ్ జంగ్బూ అన్నారు. "ఆయన తన బ్యాలెన్స్ కోల్పోయి, పై నుంచి కొండ మీద పడి, చనిపోయి ఉండొచ్చు." అని అభిప్రాయపడ్డారు.
ఆ మృతదేహం పడినచోట అలాగే ఉండిపోయింది. లోథ్సే పర్వతాన్ని ఎక్కాలనుకున్న ప్రతి పర్వతారోహకుడు ఆయన పడిపోయి ఉన్న ప్రదేశాన్ని దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చేది.
కానీ 46 ఏళ్ల షిరింగ్ జంగ్బుకు, ఆ పర్వతారోహకుని మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు 12 ఏళ్ల తర్వాత తిరిగి తానే వస్తానని అప్పట్లో తెలియదు.
హిమాలయాలను శుభ్రం చేయడానికి నేపాలీ సైన్యం నియమించిన డజను మంది నేపాలీ సైనిక సిబ్బంది, 18 మంది షెర్పాలలో షిరింగ్ ఒకరు. పర్వతారోహణలో గైడ్‌గా పని చేసేవారిని షెర్పాలని పిలుస్తుంటారు. వీరు నేపాల్ ప్రాంతాలలోని పర్వతాల వద్ద నివసించే ఒక ప్రత్యేక కమ్యూనిటీ.
ఒక శతాబ్దం కిందట ఎవరెస్ట్ ప్రాంతంలో పర్వతారోహణకు సంబంధించిన వివరాలు రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి 300మందికి పైగా మరణించారని అంచనా.
చాలా మృతదేహాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నేపాల్ పర్యాటక శాఖ ప్రకారం 2023లో 18 మంది మరణించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ ప్రభుత్వం మొదట 2019లో హిమాలయాలను శుభ్రం చేసే ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ఈ ప్రోగ్రామ్‌లో పర్వతారోహకుల మృతదేహాలను తొలగించడం కూడా ఉంది. ఈ సంవత్సరం 8,000 మీ (26,247 అడుగులు) ఎత్తులో, "డెత్ జోన్" అని పిలిచే ప్రదేశం నుంచి అయిదు మృతదేహాలను కిందికి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
జూన్ 5న ముగిసిన 54 రోజుల ఆపరేషన్ తర్వాత, తక్కువ ఎత్తు ప్రదేశాల నుంచి నాలుగు మృతదేహాలను, ఒక అస్థిపంజరాన్ని, 11 టన్నుల చెత్తను తొలగించగలిగారు.
"హిమాలయాలను కలుషితం చేస్తున్న చెత్త, దానిలో పాటు అక్కడే ఉండిపోయిన మృతదేహాల కారణంగా నేపాల్ చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది." అని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన మేజర్ ఆదిత్య కర్కి బీబీసీతో అన్నారు.


ఫొటో సోర్స్, Tshiring Jangbu Sherpa
భారీ వ్యయం
నేపాల్‌లోని పర్వతాలపై మరణించిన తమ బంధువుల మృతదేహాలను తిరిగి పొందడానికి అయ్యే ఖర్చును చాలామంది భరించలేరు. వాళ్లకు ఆర్థిక స్తోమత ఉన్నా, చాలా ప్రైవేట్ సంస్థలు డెత్ జోన్ నుంచి మృతదేహాలను తీసుకురావడానికి నిరాకరిస్తాయి. అది చాలా ప్రమాదకరమైనది కావడమే కారణం.
ఈ సంవత్సరం సైన్యం ఒక్కో మృతదేహాన్ని తీసుకురావడానికి దాదాపు రూ. 30 లక్షలను కేటాయించింది. 8వేల మీటర్ల ఎత్తు నుంచి ఒక్క మృతదేహాన్ని దింపడానికి 12 మంది, వారికి ఒక్కొక్కరికీ 4 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. ఒక సిలిండర్ ధర రూ.33వేల కంటే ఎక్కువ. అంటే కేవలం ఆక్సిజన్ కోసమే దాదాపు రూ.17 లక్షలు ఖర్చవుతుంది.
ప్రతి సంవత్సరం కేవలం 15 రోజులు మాత్రమే పర్వతారోహకులకు ఈ 8వేల మీటర్లు ఎక్కడానికి, దిగడానికి అనువుగా ఉంటుంది. ఆ సమయంలో గాలులు మందగిస్తాయి. డెత్ జోన్‌లో గాలి వేగం తరచుగా గంటకు 100 కిలోమీటర్లు దాటుతుంటుంది.
మృతదేహాలను గుర్తించాక, మిగతా పర్వతారోహకులకు ఇబ్బంది కలగకుండా ఈ బృందం ఎక్కువగా రాత్రివేళల్లోనే పని చేసింది.
"డెత్ జోన్ నుంచి మృతదేహాలను తిరిగి తీసుకురావడం చాలా కష్టం." అని షెర్పా జంగ్బూ చెప్పారు.
“నేను చాలాసార్లు వాంతి చేసుకున్నాను. ఎక్కువ ఎత్తులో గంటలు గంటలు గడుపుతాం కాబట్టి చాలామంది దగ్గుతూనే ఉంటారు. కొందరు తలనొప్పితో బాధపడుతుంటారు.’’అని చెప్పారు.
8,000 మీటర్ల ఎత్తులో, బలమైన షెర్పాలు కూడా మామూలుగా తాము మోసే బరువులో 30 శాతం తక్కువగా 25 కేజీల బరువు మాత్రమే మోయగలరు.
8,516 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ లోథ్సే శిఖరానికి సమీపంలో 12ఏళ్ల పాటు పడి ఉన్న చెక్ రిపబ్లిక్ దేశపు పర్వతారోహకుడి మృతదేహం ఎండ, మంచు కారణంగా రంగు మారిపోయింది. అది సగం వరకు మంచులో కూరుకుపోయి ఉందని జంగ్బు చెప్పారు.
స్వాధీనం చేసుకున్న నలుగురు పర్వతారోహకుల మృతదేహాలు వాళ్లు మరణించినప్పుడు ఎలా ఉన్నారో, అప్పటికీ అదే స్థితిలో ఉన్నారు. వారి అవయవాలు బిగుసుకుపోవడంతో, వాటిని కిందికి తీసుకురావడం మరింత కష్టమైంది.
మృతదేహాలను కిందకు తీసుకురావడానికి నేపాలీ సైన్యం రోపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎందుకంటే డెడ్‌బాడీలను వెనుక నుంచి నెట్టడం లేదా ముందు నుంచి లాగడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మృతదేహాలు రాళ్లు, మంచుతో నిండిన భూభాగంలో చిక్కుకుంటే, వాటిని మళ్లీ బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని.
చెక్ పర్వతారోహకుని మృతదేహాన్ని దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప శిబిరానికి తీసుకురావడానికి 24 గంటలు పట్టింది. మరో 13 గంటల తర్వాత ఆ మృతదేహాన్ని దిగువన ఉన్న మరో శిబిరానికి తరలించారు.
మృతదేహాలను హెలికాప్టర్‌లో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూకు తరలించే క్రమంలో వాతావరణం బాగా లేకపోవడంతో సిబ్బంది అయిదు రోజుల పాటు నామ్చే పట్టణంలో చిక్కుకున్నారు. జూన్ 4న వాళ్లు రాజధానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Tshiring Jangbu Sherpa
‘రుణం తీర్చుకుంటున్నాం’
ఎవరెస్ట్ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన నాలుగు మృతదేహాలు, ఒక అస్థిపంజరాన్ని కాఠ్‌మాండూలోని ఆసుపత్రిలో ఉంచారు.
చెక్ పర్వతారోహకుడు మిలన్ సెడ్లాసెక్, 2017లో మరణించిన అమెరికన్ పర్వతారోహకుడు రోలాండ్ ఇయర్‌వుడ్‌లకు సంబంధించిన గుర్తింపు పత్రాలను సైన్యం కనుగొంది. మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
మృతదేహాలు విదేశీయులకు చెందినవా లేక నేపాలీయులవా అన్నదానితో సంబంధం లేకుండా, గుర్తించిన మూడు నెలల తర్వాత మృతదేహాలను క్లెయిమ్ చేయడానికి ఎవరూ రాకపోతే వాటిని ఖననం చేస్తామని అధికారులు చెప్పారు.
హిమాలయాలలో రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 100 మంది షెర్పాలు మరణించారు. చాలా కుటుంబాలు బౌద్ధ ఆచారాల ప్రకారం వారి అంత్యక్రియలు నిర్వహించడానికి అనేక ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వస్తుంది.
తన 20వ ఏట మొదటిసారి హిమాలయాలను అధిరోహించిన షిరింగ్ జంగ్బు షెర్పా ఇప్పటివరకు మూడుసార్లు ఎవరెస్ట్‌ను, అయిదు సార్లు లోథ్సేను అధిరోహించారు.
“హిమాలయాలు మాకు చాలా అవకాశాలను ఇచ్చాయి.” అని ఆయన చెప్పారు.
"మృత దేహాలను వెలికితీసే ఈ ప్రత్యేకమైన పని ద్వారా, మేం ఆ హిమాలయాల రుణం తిరిగి చెల్లించుకుంటున్నాం" అని తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














