పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

1941 డిసెంబర్ 7వ తేదీన పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసింది.

అమెరికాకు చెందిన పెర్ల్ హార్బర్‌పై జపాన్ చేసిన దాడికి 80ఏళ్లు నిండాయి. రెండో ప్రపంచ యుద్ధంలో చోటుచేసుకున్న అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇదీ ఒకటి.

1931లో జపాన్ ఉత్తర చైనాలోని మంచూరియాను ఆక్రమించినప్పటి నుంచి అమెరికాతో సంబంధాలు క్షీణించాయి. దశాబ్ద కాలంగా జపాన్ - చైనాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా ఈ వివాదం తీవ్రమైంది.

1940లో జపాన్‌పై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది.

1940 సెప్టెంబర్‌లో జపాన్.. జర్మనీ, ఇటలీతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది. తద్వారా ఐరోపా యుద్ధంలో పోరాడుతున్న యాక్సిస్ కూటమి అధికారిక సభ్యుడిగా మారింది.

మరోవైపు వాణిజ్య ఆంక్షలు ఎత్తివేయాలని, రాయితీలు ఇవ్వాలని అమెరికాతో జపాన్ చర్చలు జరుపుతోంది.

అయితే, అమెరికా అందుకు సుముఖంగా ఉన్నట్లు జపాన్ భావించలేదు. ఎందుకంటే.. చైనాకు అమెరికా మిత్ర రాజ్యాలు మద్దతు ప్రకటించాయి.

చైనాపై దూకుడు కొనసాగించినందుకు గాను జపాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై వాషింగ్టన్‌లో జపాన్ అధికారులు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోర్డెల్ హల్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో పెర్ల్ హార్బర్‌పై జపాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.

హవాయిలోని పెర్ల్ హార్బర్‌ అమెరికా వైమానిక స్థావరం. దీనిపై దాడి చేసిన జపాన్.. అమెరికా, బ్రిటన్‌లపై యుద్ధాన్ని ప్రకటించింది.

దాదాపు 150 యుద్ధ విమానాలతో జపాన్ రెండు దఫాలుగా పెర్ల్ హార్బర్‌పై దాడి చేసింది. గంటన్నరకు పైగా బాంబులు వేసింది.

ఈ దాడిలో అమెరికాకు చెందిన ఆరు యుద్ధ నౌకలు, 112 యుద్ధ పడవలు, 164 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి.

పెర్ల్ హార్బర్ దాడి, ప్రతి దాడుల్లో మొత్తం 2400 మంది అమెరికన్లు, 100 మంది జపనీయులు మృతి చెందారు. 1178 మంది అమెరికన్లు గాయపడ్డారు.

దీంతో రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థ వైఖరి అవలంభిస్తూ వచ్చిన అమెరికా.. జపాన్‌పై యుద్ధం ప్రకటించింది.

పెర్ల్ హార్బర్ దాడి గురించి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ స్పందిస్తూ.. ‘‘ఇది అపఖ్యాతి పాలైన రోజు’’ అని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)