బీబీసీ 100 మంది మహిళలు 2021: జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..

100 women banner

2021 సంవత్సరానికిగానూ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబితాను బీబీసీ విడుదల చేసింది.

మన సమాజాన్ని, సంస్కృతిని, మొత్తంగా మన ప్రపంచాన్ని పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్న మహిళల గురించి ఈ ఏడాది '100 మంది మహిళామణులు' ప్రముఖంగా ప్రస్తావించింది.

అతి పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, సమోవా మొదటి మహిళా ప్రధాన మంత్రి ఫియామె నవోమి మటాఫా, వ్యాక్సీన్ కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ హెడీ జె లార్సన్, ప్రఖ్యాత రచయిత చిమామందా ఎన్‌గోజి అడిచి వంటి వారు ఈ ఏడాది జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు కూడా ఉన్నారు. ఒకరు మంజుల ప్రదీప్, మరొకరు ముగ్దా కల్రా.

ఈ సంవత్సరం జాబితాలో సగం మంది అఫ్గానిస్తాన్‌కు చెందిన మహిళలే. వీరిలో కొందరు తమ భద్రత కోసం మారుపేర్లతో, ఫొటోలు లేకుండా కనిపిస్తారు.

2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గాన్ ప్రజల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బాలికల మాధ్యమిక విద్యపై నిషేధం, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దు చేయడం, అనేక కార్యాలయాల్లో మహిళలను విధుల్లోకి రావొద్దని చెప్పడంతో సహా అనేక మార్పులు జరిగాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, వారి ధైర్యసాహసాలను, జీవితాన్ని పునర్నిర్మించుకునే దిశలో వారి విజయాలను ఈ ఏడాది '100 మంది మహిళల జాబితా' గుర్తించింది.

బీబీసి 2021 100 మంది మహిళలు

  • లీమా ఆఫ్షిద్

    అఫ్గానిస్తాన్కవికవయిత్రి

    ప్రముఖ కవి, రచయిత లీమా. ఆమె రాసే కవితలు, కథనాలు అఫ్గాన్ సంస్కృతిలో పాతుకుపోయిన పితృస్వామ్య కట్టుబాట్లను సవాలు చేస్తాయి.

    ఐదు సంవత్సరాలకు పైగా స్వతంత్ర రిపోర్టర్‌గా, సామాజిక వ్యాఖ్యాతగా పనిచేశారు.

    ఆమె షేర్-ఏ-దనేష్గా అనే కాబుల్ విశ్వవిద్యాలయం కవుల సంఘంలో సభ్యురాలు కూడా. కరోనావైరస్ మహమ్మారి సమయంలోనూ సమాజం గురించి ఆలోచించడం మరువకూడదనే ఉద్దేశంతో ఈ సంఘం వర్చువల్ కార్యక్రమాలు నిర్వహించింది.

    *అఫ్గానిస్తాన్ పతనం, 20 ఏళ్లు పోరాడి మళ్లీ అదే బురదలో మునిగిపోయినట్టుగా ఉంది. అయితే, మనం ఒక కొమ్మలా ఎదగగలమని, కటిక చీకటిలోంచి కాంతి వైపు పయణిస్తామని ఆశిస్తున్నాను.

  • హలీమా ఆడన్

    కెన్యామానవతావాది,మాజీ మోడల్

    హిజాబ్ ధరించిన తొలి సూపర్ మోడల్ హలీమా ఆడన్ సోమాలీ సంతతికి చెందిన మహిళ. కానీ, ఆమె కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించారు. 2017లో ఆమె ప్రపంచంలోని అతి పెద్ద మోడలింగ్ ఏజెన్సీలలో ఒకటైన ఐఎంజీ మోడల్స్‌కు సంతకం చేశారు. అయితే, మోడలింగ్ చేసేటప్పుడు హిజాబ్ తీసివేయమని అడగకూడదంటూ షరతు పెట్టారు.

    బ్రిటిష్ వోగ్, అల్లూర్ అండ్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్‌సూట్ ఎడిషన్ కవర్‌పై హిజాబ్ ధరించిన తొలి మోడల్ ఆమె. ముస్లిం మహిళల అవగాహన, గుర్తింపులను మెరుగుపరిచేందుకు ఆడన్ ప్రచారం చేస్తారు. బాలల హక్కుల అంశంలో యునిసెఫ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

    తన ముస్లిం విశ్వాసాలకు, మోడలింగ్‌కు పొసగని కారణంగా 2020లో ఆమె ఆ వృత్తి నుంచి తప్పుకున్నారు. కానీ, ఇప్పటికీ ఆమె ఫ్యాషన్ పరిశ్రమలో, వెలుపల కూడా ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తున్నారు.

    *కోవిడ్ మహమ్మారి సమయంలో మన ఆరోగ్య భద్రత కోసం ఫ్రంట్‌లైన్ వర్కర్లు ఎంతో శ్రమించ్చారు. వారి త్యాగాలకు ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతతో ముందుకు సాగడం ద్వారా మనం మళ్లీ ఈ ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలం.

  • ఒలుయేమి అడెటిబా-ఒరిజా

    నైజీరియాహెడ్‌ఫోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు

    హెడ్‌ఫోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, స్వయంగా క్రిమినల్ లాయర్. హెడ్‌ఫోర్ట్ ఫౌండేషన్ పేదవారికి, వెనుకబడిన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుంది. లాగోస్‌లో ఉన్న ఈ సంస్థలో పనిచేసేవారందరూ మహిళలే.

    బెయిల్ దొరకని పేదవారు, లేదా తప్పుడు కేసులతో అరెస్ట్ అయినవారు, విచారణ జరగకుండా ఎక్కువ కాలం జైల్లో బందీలుగా ఉన్నవారికి ఈ సంస్థ న్యాయ సహాయం అందిస్తుంది. నైజీరియాలో జైళ్లల్లో మగ్గుతున్నవారిలో 70 శాతం విచారణ కోసం వేచి చూస్తున్నవారే. ఒలుయేమి ఒరిజా బృందం చిన్న వయసులో జైలుకు వెళ్లినవారిపై దృష్టి సారిస్తుంది. జైలు బయట వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది.

    2018లో ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి చిన్న చిన్న నేరాలకు పాల్పడిన సుమారు 125 మందికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించింది.

    *అందరూ సహకరిస్తేనే ప్రపంచం మారుతుంది. స్వేచ్ఛ, భద్రతల కోసం మనమంతా పోరాడాలి.

  • ముఖదాసా అహ్మద్‌జాయ్

    అఫ్గానిస్తాన్సామాజిక, రాజకీయ ఉద్యమకారిణి

    సమీప జిల్లాలకు వెళ్లి గృహ హింస బాధితులకు సాయం అందించేందుకు, ఆమె తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నంగర్‌హర్ ప్రావిన్స్‌కు చెందిన 400 మందికి పైగా యువ మహిళా కార్యకర్తలతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.

    సామాజిక, రాజకీయ కార్యకర్తగా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, పెద్దఎత్తున తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్న తరుణంలో మహిళలకు అండగా నిలబడి, వారిలో ధైర్యాన్ని నింపే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు ముఖదాసా అహ్మద్‌జాయ్. ఆమె అఫ్గానిస్తాన్ యూత్ పార్లమెంట్ మాజీ సభ్యురాలు. మహిళలు, చిన్నారుల హక్కుల కోసం పనిచేశారు.

    శాంతి స్థాపన కోసం, వివాద పరిష్కారం కోసం విశేష కృషి చేసిన అత్యుత్తమ మహిళగా, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అందించిన ఎన్- పీస్ అవార్డును ఆమె అందుకున్నారు.

    *ఇలాంటి ఆకస్మిక మార్పును ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. యువతరం భవిష్యత్తు కోసం ఈ వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, సంస్కరించాలన్నదే మా ఏకైక కోరిక. అయితే, అంతర్జాతీయ సమాజం మద్దతుతో మాత్రమే అది సాధ్యమవుతుంది.

  • రాదా అక్బర్

    అఫ్గానిస్తాన్కళాకారిణి

    మహిళల పట్ల ద్వేషం, అణచివేతలు ఈ విజువల్ ఆర్టిస్ట్ కళారూపాలకు గుండెకాయ లాంటివి. మహిళల తరఫున గళమెత్తేందుకు, సమాజంలో వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు రాదా అక్బర్ తన కళను ఒక మాధ్యమంగా ఉపయోగించారు.

    2019 నుంచి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తన దేశ చరిత్రలో మహిళలు పోషించిన ప్రధాన పాత్రను గుర్తుచేసుకునేందుకు 'సూపర్ ఉమెన్' (అబర్జనన్) పేరుతో ప్రదర్శనలను నిర్వహిస్తోంది. కాబుల్‌లో లేదా మరో చోట మహిళల చరిత్రను తెలిపే మ్యూజియం ప్రారంభించేందుకు కసరత్తులు చేశారు.

    రాజకీయ, ఆర్థిక, మతపరమైన విషయాల్లో మహిళలకు అవరోధాంగా నిలుస్తున్న సామాజిక నియమాల పట్ల నిరసన తెలిపేందుకు తన కళ సహాయపడుతుందని ఆమె నమ్ముతున్నారు.

    *దశాబ్దాలుగా తీవ్రవాదుల, ప్రపంచ నేతల చర్యల వల్ల అఫ్గానిస్తాన్‌తో పాటు, ఇక్కడి ప్రజలు నలిగిపోతున్నారు. కానీ, మేము ఎప్పుడూ ప్రగతిశీల దేశం కోసం పనిచేయడం మానలేదు. మేము మళ్లీ స్వేచ్ఛా, సుసంపన్నమైన అఫ్గానిస్తాన్‌లో జీవిస్తాం.

  • అబియా అక్రం

    పాకిస్తాన్వికలాంగుల ఉద్యమ నాయకురాలు

    1997 నుంచి వికలాంగుల ఉద్యమంలో కార్యకర్త. స్వయంగా వికలాంగురాలైన ఆమె విద్యార్థిగా ఉన్న కాలంలో స్పెషల్ టాలెంట్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం (ఎస్‌టీఈపీ)ను ప్రారంభించారు.

    పాకిస్తాన్ నుంచి కామన్వెల్త్ యంగ్ డిసేబుల్డ్ పీపుల్స్ ఫోరమ్‌కు కో-ఆర్డినేటర్‌గా నామినేట్ అయిన తొలి మహిళ. అక్రం, 'నేషనల్ ఫోరమ్ ఆఫ్ వుమెన్ విత్ డిసెబిలిటీస్' వ్యవస్థాపకురాలు. వికలాంగుల హక్కులు, సమగ్రాభివృద్ధిపై యూఎన్ కన్వెన్షన్ అమలు కోసం ఆమె ప్రచారం చేశారు.

    యూఎన్ 2030 ఎజెండాలో, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో అంగవైకల్యాన్ని కూడా చేర్చడానికి ఆమె కృషి చేస్తున్నారు.

    *కోవిడ్-19 మహమ్మారి తరువాత ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి మనమంతా కలిసి పనిచేస్తూ సమాజంలో అన్ని అంశాలనూ మెరుగుపరచాలి. తద్వారా మరింత సమ్మిళిత అభివృద్ధిని సాధించగలం.

  • లీనా ఆలం

    అఫ్గానిస్తాన్నటి

    అవార్డులు సాధించిన టీవీ, సినిమా, రంగస్థల నటి, మానవ హక్కుల కార్యకర్త లీనా ఆలం. అఫ్గానిస్తాన్‌లో షెరీన్, కిల్లింగ్ ఆఫ్ ఫర్కుందా లాంటి స్త్రీవాద టీవీ షోలలో నటించినందుకు ఆమెకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఖురాన్‌ను కాల్చివేశారనే తప్పుడు ఆరోపణలతో ఒక మహళను బహిరంగంగా అల్లరి మూక కొట్టి చంపిన ఉదంతంపై తీసిన డాక్యుమెంటరీ ‘కిల్లింగ్ ఆఫ్ ఫర్కుందా’.

    1980లలో అఫ్గాన్ నుంచి పారిపోయిన లీనా ఆలం, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఇప్పటికీ ఆమె తన స్వదేశంలోని పరిస్థితులపై చిత్రాలు రూపొందిస్తున్నారు.

    2009లో ఆమె అఫ్గానిస్తాన్‌లోని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్‌కు శాంతి దూత నియమితులయ్యారు.

    *ఎంతో రక్తపాతం, త్యాగాలతో దేశాన్ని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పట్టింది. అదంతా రెప్పపాటులో నేలకూలడాన్ని చూడటం హృదయ విదారకంగా ఉంది. అయితే, ఈసారి బలమైన పునాదులతో పోరాటం కొనసాగాలి.

  • డాక్టర్ అలేమా

    అఫ్గానిస్తాన్తత్వవేత్త, ప్రచారకర్త

    తత్వశాస్త్రం, సోషల్ సైన్స్‌ అభ్యసించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ అలేమా, హ్యూమన్ రైట్స్ అండ్ సివిల్ సొసైటీ శాఖ డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించేందుకు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆమె మహిళా హక్కుల న్యాయవాది కూడా.

    జర్మనీ నుంచి తత్వశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన డాక్టర్ అలేమాకు క్లిష్ట పరిస్థితులను లోతుగా పరిశీలించడంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

    జర్మనీ- అఫ్గానిస్తాన్ మధ్య అంతర్జాతీయ సంబంధాలపై, అఫ్గానిస్తాన్‌లో మహిళల సాధికారత గురించి ఆమె పుస్తకాలు రాశారు. డాక్టర్ అలేమా హ్యూమానిటేరియన్ లా ప్రొఫెషనల్ ట్రైనర్‌గా, పరిశీలకురాలిగా.. శరణార్థులు, వలసదారులు, దేశ బహిష్కరణకు గురైన వారిపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తున్నారు.

    *ఆధునిక రాజ్యాంగం ప్రకారం పౌర హక్కులను పరిరక్షించే, మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ పనిచేసే హక్కు కల్పించే, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య అఫ్గానిస్తాన్‌ను చూడాలన్నది నా కల.

  • సెవ్దా అల్తునోలుక్

    టర్కీప్రొఫెషనల్ గోల్‌బాల్ ప్లేయర్

    పుట్టుకతోనే దృష్టి లోపం ఉన్న సెవ్దా అల్తునోలుక్ ఒక ప్రొఫెషనల్ గోల్‌బాల్ క్రీడాకారిణి. దృష్టి లోపం ఉన్న లేదా కళ్లకు గంతలు కట్టుకున్న క్రీడాకారుల జట్లు గంటలు కట్టిన బంతులను ప్రత్యర్థుల నెట్‌లోకి విసిరే ఆటే గోల్‌బాల్.

    ప్రపంచంలోని అత్యుత్తమ గోల్‌బాల్ క్రీడాకారిణిగా ఖ్యాతి పొందిన సెవ్దా రెండు పారాలింపిక్ గేమ్స్, రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, నాలుగు యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచారు. 2016 రియో, 2020 టోక్యో పారాలింపిక్స్‌‌లో టర్కీ మహిళల జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

    అనటోలియాలోని టోకట్‌లో జన్మించిన ఆమె అంకారాలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

    *అంగవైకల్యాన్ని అడ్డంకిగా చూడకూడదు. స్వీయ వ్యక్తీకరణకు అవకాశంగా భావించాలి.

  • వహిదా ఆమిరీ

    అఫ్గానిస్తాన్లైబ్రేరియన్, ఉద్యమకారిణి

    లైబ్రేరియన్, పుస్తక ప్రేమికురాలు, వహిదా ఆమిరీ ఒక లా గ్రాడ్యుయేట్. ఆమె తరచూ నిరసనల్లో పాల్గొంటుంటారు. అఫ్గానిస్తాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లాక, ఆమె లైబ్రరీలో పనిచేసే వీలులేకుండా పోయింది. దాంతో, ఆమె కాబుల్ నగర వీధుల్లో నిరసనకు దిగారు. అనేక మంది మహిళలు ఆమెతో చేతులు కలపారు. అఫ్గాన్ మహిళలు చదువుకొని, ఉద్యోగాలు చేసుకునే హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలవాలని కోరుతూ భారీ ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.

    ఆ తర్వాత నిరసన ప్రదర్శనలను తాలిబాన్ నిషేధించింది. అప్పటి నుంచి పుస్తక పఠనంతో పాటు, సమకాలీన అంశాలపై చర్చలను ప్రోత్సహించేందుకు ఆమె మరికొంత మంది మహిళలతో కలిసి పనిచేస్తున్నారు.

    2017 నుంచి ఆమె లైబ్రరీ నడుపుతుండేవారు. ఇప్పుడు ఆ లైబ్రరీ పుస్తకాలు లేకపోవడంతో, తన గుర్తింపు అంతా కోల్పోయానని ఆమిరీ అంటున్నారు.

    *ప్రపంచం మనల్ని మనుషులుగా గౌరవించలేదు. కానీ, అఫ్గానిస్తాన్ విధ్వంసానికి గురవుతున్నందున, మా నిరసనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం, పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నాం.

  • మోనికా అరాయ

    కోస్టా రికాఉద్గార రహిత రవాణా సౌకర్యాల న్యాయవాది

    ఒక వాతావరణ నిపుణురాలిగా మోనికా అరాయ ఉద్గార రహిత రవాణాను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. స్వదేశం కోస్టా రికాలో పౌరుల చొరవతో ప్రారంభమైన 'కోస్టా రికా లింపియా'తో సహా అమెరికా, యూరప్‌లలో సుస్థిరత్వాన్ని సాధించే దిశగా ప్రచారాలకు మార్గనిర్దేశం చేశారు. పునరుత్పాదక శక్తిలో కోస్టా రికా ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆమె చొరవ ఎంతో సహాయపడింది.

    రవాణా సమస్యలపై ఉన్నత స్థాయి యూఎన్ కమిటీ 'ఛాంపియన్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్‌'కు అరాయ ప్రత్యేక సలహాదారు. జీరో ఎమిషన్ రవాణా ప్రచారమైన 'రూట్‌జీరో'కు కూడా ఆమె సలహాదారు. క్లైమేట్ వర్క్స్ ఫౌండేషన్‌లో విశిష్ట సభ్యురాలు (ఫెల్లో).

    టెడ్ టాక్స్‌లో అరాయ ప్రసంగాలకు సుమారు 40 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆమె ప్రసంగాలను 31 భాషల్లోకి అనువదించారు. 2016లో అరాయ అంటార్కిటికా అన్వేషయాత్రలో పాల్గొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా యాత్ర.

    *మనం 'సాధారణం' అనుకునేదాన్ని మార్చడానికి ఇది సమయం. పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ తగ్గించడం కీలకం. ఇతర ముఖ్యమైన సామాజిక పరివర్తనలకు రాజకీయ మద్దతును పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది.

  • నతాషా అస్గర్

    బ్రిటన్వెల్ష్ పార్లమెంట్ సభ్యురాలు

    సెనెడ్ లేదా వెల్ష్ పార్లమెంటుకు ఎంపికైన తొలి మైనారిటీ మహిళ. 1999లో సెనెడ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు మైనారిటీ మహిళలకు స్థానం దక్కలేదు. ఈ ఏడాది వెల్ష్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై నతాషా చరిత్ర సృష్టించారు.

    కన్జర్వేటివ్ పార్టీ సభ్యురాలు, సౌత్ వేల్స్ ఈస్ట్ పార్లమెంటరీ ప్రాంతీయ సభ్యురాలు అయిన నటాషా అస్గర్ రవాణా, సాంకేతికత శాఖకు షాడో మినిస్టర్. వెల్ష్‌లో స్థానికులు, పర్యటకులు ప్రభుత్వ రవాణా సౌకర్యాలను మరింత సులువుగా వినియోగించుకునేందుకు ఒక ట్రావెల్ కార్డ్ తీసుకురావాలన్నది ఆమె ఆలోచన. ఇది ఆర్థికాభివృద్ధికి ఇంధనంగా మారుతుందని ఆమె ఆశిస్తున్నారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు నతాషా బ్యాంకులో పనిచేశారు. అలాగే, టీవీ ప్రెజెంటర్‌గా, రేడియో డీజేగా ఆమెకు మీడియాలో అనుభవం ఉంది. ఇప్పటివరకు ఆమె రెండు పుస్తకాలు రాశారు.

    *మనందరం కలిసికట్టుగా ఈ కష్టమైన మార్గాన్ని దాటి కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. మన జీవితాలు, చేస్తున్న పని మెరుగుపడేందుకు పనికొచ్చే అన్ని అవకాశాలను సంగ్రహించాలి.

  • జుహాల్ అత్మార్

    అఫ్గానిస్తాన్వ్యవస్థాపకురాలు, గుల్-ఎ-ముర్సల్ రీసైక్లింగ్

    అఫ్గానిస్తాన్‌లో చిత్తు కాగితాలను రీసైక్లింగ్ చేసే మొట్టమొదటి ఫ్యాక్టరీ గుల్-ఎ-ముర్సల్. వ్యాపారవేత్త జుహాల్ అత్మార్ దీనిని ఏర్పాటు చేశారు. ఎకనామిక్స్‌తో పాటు, వ్యాపార నేపథ్యం ఉన్న ఆమె 2016లో ఈ పరిశ్రమను ప్రారంభించారు. ఇందులో పనిచేసే వంద మంది ఉద్యోగుల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నారు. ఫ్లోర్ శుభ్రం చేయడం నుంచి మార్కెటింగ్ వరకు వివిధ రకాల బాధ్యతలను మహిళలే చూస్తున్నారు.

    ఈ ఫ్యాక్టరీలో రోజూ దాదాపు 5 టన్నుల కాగితాలను రీసైక్లింగ్ చేసి, టాయిలెట్ పేపర్లు తయారు చేసి దేశవ్యాప్తంగా అమ్ముతారు.

    అఫ్గానిస్తాన్‌లో మహిళలు వ్యాపారాలు చేసేందుకు అవసరమైన ఆర్థిక సాయం పొందడం ఎంత కష్టమో అత్మార్ స్వయంగా చూశారు.

    *భవిష్యత్తు గురించి చెప్పుకోవడానికి ఇంకేముంది? యువత, మహిళలు కన్న కలలు, లక్ష్యాలు, ఆశలు అన్నీ చెదిరిపోయాయి.

  • మార్సెలీనా బాటిస్టా

    మెక్సికోయూనియన్ లాడర్

    మార్సెలీనా బాటిస్టా, మెక్సికోలో గృహ కార్మికులకు మద్దతు, శిక్షణ ఇచ్చే సంస్థ డైరెక్టర్. గతంలో స్వయంగా గృహ కార్మికురాలిగా పనిచేసిన మార్సెలీనా 21 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించారు. గృహ కార్మికులకూ హక్కులు ఉంటాయని, న్యాయమైన వేతనాలు, అనారోగ్య సెలవులు వారికి కూడా లభించాలంటూ ప్రచారం చేస్తారామె. వారి సామాజిక స్థితిని మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నారు.

    వర్కర్లకు కూడా విద్య అందాలన్నదే ఆమె ధ్యేయం. మార్సెలీనా చొరవ ఫలితంగా, మెక్సికన్ ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక ఒప్పందంలో చేరింది. దోపిడీ, హింస, భద్రత లేని పరిస్థితుల్లో పని చేయడం లాంటి అంశాల నుంచి గృహ కార్మికులను రక్షించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.

    2010లో ఆమెకు జర్మనీలోని ఫ్రెడరిక్-ఎబర్ట్-స్టిఫ్టుంగ్ అందించే అంతర్జాతీయ మానవ హక్కుల బహుమతి లభించింది.

    *ప్రపంచాన్ని మార్చడమంటే లక్షలాది గృహ కార్మికుల పరిస్థితులను మెరుగుపరచడం. ముఖ్యంగా మహిళల జీవితాలను మెరుగుపరచాలి. ఇంటి పనికి తగిన గుర్తింపు వచ్చినప్పుడే ఈ సామాజిక అసమానత అంతమవుతుంది.

  • క్రిస్టల్ బయాత్

    అఫ్గానిస్తాన్సామాజిక కార్యకర్త

    సామాజిక కార్యకర్త, మానవ హక్కుల న్యాయవాది క్రిస్టల్ బయాత్, 2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పునరాగమనానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రముఖంగా కనిపించారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న కాబుల్ వీధుల్లో ప్రదర్శన నిర్వహించేందుకు ఆమె సాయం చేశారు.

    పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేయడం ప్రారంభించాక, తాలిబాన్ల రాకతో ఆమె చదువుకు అంతరాయం ఏర్పడింది.

    ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆమె, అక్కడి నుంచే అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పీహెచ్‌డీ పూర్తి చేసి, ఓ పుస్తకం రాయాలన్నది ఆమె ఆకాంక్ష.

    *అంతిమంగా, అఫ్గానిస్తాన్‌లో ఏవైనా ప్రజాస్వామిక మార్పులు జరిగితే అందులో భాగం కావాలన్నది నా కోరిక. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాలనేది నా కల. ఎందుకంటే నిజమైన అఫ్గాన్లు, ముఖ్యంగా మహిళల గోడును ప్రపంచం వినాల్సిన అవసరం ఉంది.

  • రజియా బరాక్‌జాయ్

    అఫ్గానిస్తాన్నిరసనకారిణి

    అధ్యక్ష భవనంలో అనేక సంవత్సరాల పాటు, వివిధ హోదాల్లో పనిచేశారు రజియా బరాక్‌జాయ్. అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ చేజిక్కించుకున్న తర్వాత ఆమెకు ఉద్యోగం లేకుండా పోయింది.

    అప్పటి నుంచి ఆమె కాబుల్‌ నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో చురుకుగా పాల్గొన్నారు. విద్య, ఉపాధి హక్కుల కోసం డిమాండ్ చేస్తూ అనేక మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. #AfghanWomenExist అనే నినాదం వెనుక ఉన్న మహిళల్లో రజియా కూడా ఒకరు. భయం అఫ్గాన్ మహిళలను సోషల్ మీడియా నుంచి దూరం చేస్తోందనే విషయాన్ని ఈ ఉద్యమంలో ప్రముఖంగా లేవనెత్తారు.

    లా అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.‌‍ ఎంబీఏ పూర్తి చేశారు. "బానిసత్వంలో జీవించడం కంటే స్వేచ్ఛ కోసం చనిపోవడం ఉత్తమం.” అని తన ఉద్యమం గురించి వివరిస్తూ బీబీసీకి రాసిన ఒక లేఖలో రజియా పేర్కొన్నారు.

    *దేశంలోని విద్యావంతులు, యువత - ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌లోని ధైర్యవంతులైన, వీర వనితలు- స్వాతంత్ర్య పతాకధారులుగా నిలిచే రోజు వస్తుంది. రోజూ వీధుల్లో జరుగుతున్న ప్రదర్శనల్లో ఆ పట్టుదల నాకు కనిపిస్తోంది.

  • నీలోఫర్ బయాత్

    అఫ్గానిస్తాన్వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి

    వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ జాతీయ జట్టు కెప్టెన్, వికలాంగ మహిళల కోసం పనిచేసే ప్రముఖ అడ్వొకేట్ నీలోఫర్ బయాత్ తాలిబాన్ నుంచి తప్పించుకునేందుకు స్వదేశాన్ని వదిలి పారిపోయారు. ఆమె భర్త కూడా వీల్‌ఛైర్ ఆటగాడే. ఇద్దరూ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ ఉద్యోగులు.

    ఆమె రెండేళ్లు ఉన్నప్పుడు వారి ఇంటిపై రాకెట్ పడింది. ఆ దాడిలో ఆమె సోదరుడు చనిపోగా, ఆమె వెన్నుపూసకు గాయమైంది. కాబుల్ నడిబొడ్డున ఉన్న మైదానంలో బయాత్ తొలి బాస్కెట్‌బాల్ గేమ్ ఆడారు. అఫ్గానిస్తాన్‌లో మహిళా క్రీడాకారులకు అదో కీలక మలుపు. ఆమె తన స్వదేశాన్ని వీడుతున్న శరణార్థుల గొంతుకగా మారారు. అఫ్గాన్ మహిళల కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు.

    బయాత్ మళ్లీ బాస్కెట్‌బాల్ ఆడతాననే ఆశాభావంతో ఉన్నారు.

    *అఫ్గానిస్తాన్‌లో ఆట ముగిసిందని, మరో క్షణం పాటు కూడా యుద్ధం జరగబోదని ఆశిస్తున్నాను. నా దేశ ప్రజల ముఖాల్లో అసలైన ఆనందాన్ని చూడాలనే ఆశతో ఉన్నాను.

  • జోస్ బాయ్స్

    బ్రిటన్ఆర్కిటెక్ట్

    ది డిసార్డినరీ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్' కో-డైరెక్టర్. అంగవైకల్యం ఉన్నవారికి కూడా అనువుగా ఉండేలా సాధారణ మానవ నిర్మిత పరిసరాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చో కనుగొనే దిశలో వికలాంగ ఆర్కిటెక్ట్‌లను ప్రోత్సహిస్తుందీ సంస్థ.

    ఆర్కిటెక్ట్‌గా, యాక్టివిస్ట్‌గా తన అనుభవాలను జోడించి జోస్ బాయ్స్ 1980లలో 'మ్యాట్రిక్స్ ఫెమినిస్ట్ డిజైన్ కలెక్టివ్‌'ను భాగస్వాములతో కలిసి స్థాపించారు. అలాగే, 'మేకింగ్ స్పేస్: వుమెన్ అండ్ ది మ్యాన్ మేడ్ ఎన్విరాన్‌మెంట్' రచయితలలో ఆమె ఒకరు. అనేక అంతర్జాతీయ సంస్థలలో విద్యావేత్తగా పనిచేశారు. ఆర్కిటెక్చరల్ డిజైన్లలో ప్రతిపాదనలను స్త్రీవాద దృక్కోణం నుంచి సృజనాత్మక రీతిలో సవాలు చేసే పద్ధతులపై పనిచేశారు.

    ఆర్కిటెక్ట్‌గా, యాక్టివిస్ట్‌గా తన అనుభవాలను జోడించి జోస్ బాయ్స్ 1980లలో 'మ్యాట్రిక్స్ ఫెమినిస్ట్ డిజైన్ కలెక్టివ్‌ 'ను భాగస్వాములతో కలిసి స్థాపించారు. అలాగే, 'మేకింగ్ స్పేస్: వుమెన్ అండ్ ది మ్యాన్ మేడ్ ఎన్విరాన్‌మెంట్ రచయితలలో ఆమె ఒకరు. అనేక అంతర్జాతీయ సంస్థలలో విద్యావేత్తగా పనిచేశారు. ఆర్కిటెక్చరల్ డిజైన్లలో ప్రతిపాదనలను స్త్రీవాద దృక్కోణం నుంచి సృజనాత్మక రీతిలో సవాలు చేసే పద్ధతులపై పనిచేశారు.

    *గత ఏడాది కాలంలో వికలాంగులు, ఇతర అట్టడుగు వర్గాలకు ఎదురైన అనుభవాలపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇదే సరైన మార్గం. పరస్పరాలంబనం, సహానుభూతి ఉన్న ప్రపంచంగా మారాలి.

  • కేథరిన్ కార్లెస్

    ఐర్లండ్స్థానిక చరిత్రకారులు

    గాల్వేలోని బాన్ సెకోర్స్ మదర్ అండ్ బేబీ హోమ్‌లో 796 మంది పిల్లల రహస్య మరణాల చరిత్రను వెలికితీశారు కేథరిన్ కార్లెస్. ఏళ్ల తరబడి ఎంతో శ్రమకోర్చి ఆమె చేసిన పరిశోధన చరిత్రలో దాగిన నిజాలను బయటపెట్టింది. 1920లలో పెళ్లి కాని తల్లుల కోసం ఏర్పాటు చేసిన ఐరిష్ ఇనిస్టిట్యూషన్ నుంచి 1950ల వరకు అంటే సుమారు ముప్ఫై సంవత్సరాల కాలంలో వందలాది చిన్నారులు అదృశ్యమైపోయారు. వారి ఖననానికి సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదు. ఆ ఇనిస్టిట్యూషన్‌ ఉన్న ప్రాంతంలో ఈ పిల్లల సమాధులను వెలికితీశారు కేథరిన్ కార్లెస్.

    ఇలాంటి ఇనిస్టిట్యూషన్లలో "శిశు మరణాల రేటు అత్యధికంగా ఉందని" కార్లెస్ బృందం చేసిన అధ్యయనంపై ఈ ఏడాది సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇవి చాలావరకు కాథలిక్ నన్‌ల ఆధ్వర్యంలో నడిచేవి. ఈ రిపోర్ట్ విడుదలైన తరువాత, ఐరిష్ ప్రభుత్వం క్షమాపణలు కోరింది.

    కార్లెస్ చేసిన 'అసాధారణ మానవతా సేవ'కు గుర్తింపుగా ఆమెను బార్ ఆఫ్ ఐర్లాండ్ హ్యూమన్ రైట్స్ అవార్డుతో సత్కరించారు.

    *నేను ప్రపంచాన్ని మళ్లీ రీసెట్ చేయగలిగితే, "సిగ్గు" అనే పదాన్ని తొలగిస్తాను. దాన్ని "అవమానకరమైన, బాధాకరమైన అనుభూతి"గా డిక్షనరీల్లో నిర్వచించారు. అణుబాంబులాంటి భయంకరమైన పదం అది.

  • ఫైజా దర్ఖానీ

    అఫ్గానిస్తాన్పర్యావరణవేత్త

    ఆఫ్ఘనిస్తాన్‌లో వాతావరణ మార్పుల అంశంపై పనిచేస్తున్న కొద్ది మంది వ్యక్తులలో ఫైజా దర్ఖానీ ఒకరు. బాదఖ్‌షాన్ ప్రావిన్స్‌లోని జాతీయ పర్యావరణ పరిరక్షణ సంస్థ మాజీ డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మహిళల హక్కుల కోసం కూడా ఆమె పోరాడుతున్నారు.

    యూనివర్సిటీ పుత్ర మలేషియా నుంచి ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్‌లో మాస్టర్స్ డిగ్రీతో పట్టా పొందారు. పట్టణాల్లో పచ్చదనం పరిరక్షణపై, జనసాంద్రత అధికంగా ఉండే నగరాల్లో ఆహార కొరత తీర్చేందుకు వర్టికల్ వ్యవసాయం లాంటి వినూత్న పద్ధతులపై ఆమె పరిశోధనా పత్రాలను సమర్పించారు.

    పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, మహిళలే కేంద్ర బిందువుగా ఉండే విధంగా సుస్థిర కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె నమ్ముతున్నారు.

    *సమూహం నుంచి దూరంగా నిలబడటం సాహసోపేతమైన పని. మీ కలలను అనుసరిస్తూ, వాటిని సాకారం చేసుకోవాలి. పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం, యుద్ధాలు లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండటం నా కల.

  • అజ్మీనా ద్రోడియా

    కెనడాబంబుల్‌లో సేఫ్టీ పాలసీ లీడ్

    జెండర్, టెక్నాలజీ, మానవ హక్కుల నిపుణురాలు అజ్మీనా ద్రోడియా ప్రస్తుతం బంబుల్‌లో సేఫ్టీ పాలసీ లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. బంబుల్ ఒక డేటింగ్ యాప్. సోషల్ మీడియాలో వేధింపుల సమస్యను పరిష్కరించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ 2021 జూలైలో ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. దానిపై 200 మందికి పైగా ఉన్నత స్థాయి మహిళలు సంతకం చేశారు.

    జెండర్ ఆధారంగా వేధింపులు, దాన్లో జాతి, వర్గం పాత్రలను విశ్లేషిస్తూ 'టాక్సిక్ ట్విట్టర్: వయొలెన్స్ అండ్ అబ్యూజ్ అగైన్స్ట్ వుమెన్ ఆన్‌లైన్' అనే నివేదిక రాశారు.

    ద్రోడియా గతంలో వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్‌లో జెండర్, డాటా హక్కులపై పనిచేశారు. అలాగే, ఆన్‌లైన్‌లో మహిళలకు, అట్టడుగు వర్గాలకు భద్రత కల్పించే దిశలో వివిధ టెక్ కంపెనీలలో కలిసి పనిచేశారు.

    *ఆన్‌లైన్ స్పేస్‌ల డిజైన్‌లో మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే ప్రపంచం నాకు కావాలి. మహిళలు ఆన్‌లైన్‌లో నిర్భయంగా, సమానంగా, స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు పంచుకునే ప్రపంచం కావాలి.

  • పాష్తానా దురానీ

    అఫ్గానిస్తాన్టీచర్ - లర్న్ అఫ్గానిస్తాన్

    లర్న్ అఫ్గానిస్తాన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాష్తానా దురానీ. ఆమె టీచర్ కూడా. బాలికల హక్కులపై ప్రత్యేక దృష్టితో విద్యా రంగంలో ఆవిష్కరణల కోసం కృషి చేశారు. కాందహార్‌లో స్కూలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు అవ్వాలనుకునేవారికి శిక్షణ ఇచ్చారు.

    రుమీ అనే మొబైల్ అప్లికేషన్ ద్వారా బాలికలు విభిన్న అంశాల గురించి తెలుసుకునేందుకు సాయపడ్డారు. వివిధ రకాల సమాచారం, వీడియోలు, ఎడ్యుకేషనల్ గేమ్స్ అందించేవారు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో మంత్రసానులుగా పనిచేసేందుకు కూడా మహిళలకు లర్న్ సంస్థ శిక్షణ ఇచ్చింది.

    ఐక్యరాజ్య సమితిలో అఫ్గాన్ యువతకు ప్రాతినిధ్యం వహించారు దురానీ. అఫ్గాన్ బాలికలు చదువుకునేందుకు చేసిన కృషికి ఆమె మలాలా ఫండ్ ఎడ్యుకేషన్ ఛాంపియన్ అవార్డు అందుకున్నారు.

    *ప్రపంచం మమ్మల్ని ఎంతగా అణచివేయాలని అనుకుంటోందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. కానీ, మేం ఎంతగా గాయపడినా, దెబ్బలు తిన్నా సరే పట్టు వీడేది లేదు. ఎంతదూరమైనా వెళ్తాం.

  • నజ్లా ఎల్మంగూష్

    బ్రిటన్లిబియా విదేశాంగ మంత్రి

    లిబియాకు తొలి మహిళా విదేశాంగ మంత్రిగా ఎల్మంగూష్ ఈ ఏడాది నియమితులయ్యారు. ఆమె దౌత్యవేత్త, న్యాయవాది కూడా. 2011లో లిబియా విప్లవం కాలంలో నజ్లా ఎల్మంగూష్ నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌లో భాగంగా ఉన్నారు. పౌర సమాజ సంస్థలతో సంబంధాలు కలుపుకునేందుకు కృషి చేశారు.

    యునైటెడ్ స్టేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో ఆమె లిబియా ప్రతినిధిగా వ్యవహరించారు. 'సెంటర్ ఫర్ వరల్డ్ రెలిజియన్స్, డిప్లమసీ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్'లో శాంతి, న్యాయం పెంపొందించే కార్యక్రమాలపై పనిచేశారు. స్వదేశంలోని రాజకీయ అంతర్గత తగాదాల ఒత్తిడి వల్ల ఎల్మంగూష్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. ఇటీవల ఆమె ప్రయాణాలపై నిషేధం విధించారు కూడా.

    ఎల్మంగూష్ బెంఘాజీ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీ పూర్తి చేశారు. అలాగే, జార్జ్ మేసన్ విశ్వవిద్యాలయంలో 'వివాదాల విశ్లేషణ, పరిష్కారం' అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు.

    *2021లో ప్రపంచం చాలా పరిణామం చెందింది. ప్రపంచం సాధారణ స్థితికి రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల జీవితాలకు సరైన అర్థం, ఉద్దేశ్యాన్ని తెచ్చే అభివృద్ధి మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుంది.

  • షీలా ఇన్సాన్‌దోస్త్

    అఫ్గానిస్తాన్ఉపాధ్యాయురాలు

    మహిళలు, బాలికలు చదువుకునే హక్కు గురించి అవగాహన పెంపొందించడం అఫ్గాన్ ఉపాధ్యాయురాలు షీలా ఇన్సాన్‌దోస్త్ ఎంచుకున్న ప్రధానాంశం. రిలీజియస్ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, స్కూళ్లలో టీచర్‌గా పని చేశారు.

    రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మహిళల పాత్రను ప్రోత్సహించేందుకు ఆమె క్రియాశీలంగా పనిచేశారు. మహిళల విద్య, ఉద్యోగ హక్కుల గురించి అఫ్గాన్ మీడియాలో కనిపించారు. ఇటీవల కాబుల్ వీధుల్లో జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆమె, దేశంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా తెల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

    ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే, మరోవైపు అఫ్గానిస్తాన్‌లో పలు మహిళా సంస్థల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.

    *రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని చూడాలని ఉంది. మహిళలు చదువుకునే హక్కు కొనసాగించాలి. మహిళలపై, మైనారిటీలపై హింసను, అసమానతలను నిర్మూలించాలని కోరుకుంటున్నాను.

  • సయీదా ఎతెబారీ

    అఫ్గానిస్తాన్జ్యువెలరీ డిజైనర్

    సయీదా ఒక వ్యాపారవేత్త, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జ్యువెలరీ డిజైనర్, ఆభరణాల తయారీదారు.

    సయీదా రూపొందించిన డిజైన్లను వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ మ్యూజియంలో ప్రదర్శించారు. స్థానిక రత్నాలు, మోటిఫ్‌లతో అఫ్గానిస్తాన్ సాంప్రదాయ శైలిని ప్రతిబింబించేలా ఆమె డిజైన్లు ఉంటాయి.

    ఆమెకు ఏడాది వయసు ఉన్నప్పుడు శరణార్థుల శిబిరంలో మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ సోకడంతో చెవుడు వచ్చింది. తన తండ్రి సాయంతో ఏర్పాటైన బధిరుల విద్యా సంస్థలో ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత, ఆభరణాల డిజైనింగ్ నేర్చుకునేందుకు టర్కోయిస్ మౌంటైన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అఫ్గాన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్‌లో చేరారు.

    *ప్రస్తుతం మహిళలంతా నిరుద్యోగులయ్యారు, పురుషులు మాత్రమే బయటి పనులు చేయగలుగుతున్నారు. ప్రభుత్వం మారింది, అఫ్గానిస్తాన్‌కు మెరుగైన భవిష్యత్తు కోసం నేను కన్న కలలు నిరాశను మిగిల్చాయి.

  • సహర్ ఫిత్రత్

    అఫ్గానిస్తాన్స్త్రీవాద కార్యకర్త

    అఫ్గానిస్తాన్‌లో లింగపరమైన మూస ధోరణుల్లో మార్పు కోసం నిర్వహించిన అనేక నిరసన కార్యక్రమాల వెనుక స్త్రీవాద కార్యకర్త సహర్ ఫిత్రత్ ఉన్నారు. తొలి విడత తాలిబాన్ పాలనా కాలంలో ఒక యువ శరణార్థిగా ఇరాన్, పాకిస్తాన్‌ దేశాల్లో తలదాచుకున్నారు. ఆమె 2006లో కాబుల్‌కు తిరిగి వచ్చారు. యుక్తవయసులోనే స్త్రీవాద కార్యకర్తగా మారారు.

    ఆమె రచనల్లో, డాక్యుమెంటరీలలో స్త్రీవాదం స్పష్టంగా కనిపిస్తుంది. వీధుల్లో వేధింపులపై ‘డోంట్ ట్రస్ట్ మై సైలెన్స్’ పేరుతో 2013లో ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ అందుకు ఒక ఉదాహరణ. ఫిత్రత్ అఫ్గానిస్తాన్‌లోని యునెస్కో విద్యా విభాగంతో, హ్యూమన్ రైట్స్ వాచ్‌తో కలిసి పనిచేశారు.

    సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ నుంచి క్రిటికల్ జెండర్ స్టడీస్‌లో మాస్టర్స్ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ స్టడీస్‌లో చదువుతున్నారు.

    *చదువుకోవడం అనేది బాలికల ప్రాథమిక హక్కుగా మారి, దాని కోసం పోరాడాల్సిన అవసరం లేని రోజు రావాలని ఆశిస్తున్నాను. పర్వతాల కంటే ఎత్తైన తమ కలల కోసం పోరాడే అఫ్గాన్ అమ్మాయిలను చూడాలని ఉంది.

  • మెలిండా ఫ్రెంచ్ గేట్స్

    అమెరికాపరోపకార స్వభావం గల వ్యాపారవేత్త

    లోకోపకారి, వ్యాపారవేత్త అయిన మెలిండా గేట్స్ మహిళలు, బాలికల కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న న్యాయవాది. ప్రపంచంలోని అతి పెద్ద దాతృత్వ సంస్థలలో ఒకటైన బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు కో-చైర్‌గా వ్యవహరిస్తూ సంస్థ లక్ష్యాలు, ప్రాధాన్యతలకు దిశానిర్దేశం చేస్తారు.

    పైవటల్ వెంచర్స్ సంస్థకు వ్యవస్థాపకురాలు కూడా. ఇది, మహిళలు, కుటుంబాలకు సామాజిక పురోగతిని అందించడానికి కృషి చేస్తున్న పెట్టుబడి సంస్థ. ఆమె రాసిన 'ది మొమెంట్ ఆఫ్ లిఫ్ట్' పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

    డ్యూక్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేశారు మెలిండా గేట్స్. ఒక దశాబ్దం పాటు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారు. విధుల్లో భాగంగా పలు మల్టీమీడియా ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. ఆ తరువాత, కుటుంబం, దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు ఆ కంపెనీని విడిచిపెట్టారు.

    *ప్రపంచవ్యాప్తంగా లోతుగా పాతుకుపోయిన అసమానతలను కోవిడ్ 19 మహమ్మారి బట్టబయలు చేసింది. ఇకపై మహిళలు, బాలికలను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి సాధిస్తే వర్తమానం బాగుపడుతుంది. అలాగే, భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది.

  • ఫాతిమా గైలానీ

    అఫ్గానిస్తాన్శాంతి సంధానకర్త

    2020లో తాలిబాన్లతో జరిపిన చర్చల్లో పాల్గొన్న నలుగురు మహిళా శాంతి సంధానకర్తలలో ఫాతిమా ఒకరు. ఫాతిమా గైలానీ ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు, మహిళా హక్కుల కార్యకర్త. 43 ఏళ్లుగా మానవతా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

    1980లలో సోవియట్ ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటించిన అఫ్గాన్ మహిళల్లో ఆమె ఒకరు. దేశ బహిష్కరణకు గురైన ఆమె, లండన్‌లో ఉంటూ అఫ్గాన్ ముజాహిదీన్‌కు అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు తాలిబాన్లపై పైచేయి సాధించిన తర్వాత ఆమె అఫ్గానిస్తాన్‌కు తిరిగి వచ్చి, అఫ్గానిస్తాన్ నూతన రాజ్యాంగం రాయడంలో సాయపడ్డారు.

    2005 నుంచి 2016 వరకు అఫ్గాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పటికీ ఆమె ఆ సంస్థ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.

    *నిజమైన దేశ నిర్మాణానికి దోహదపడే అర్ధవంతమైన జాతీయ స్థాయి చర్చను నేను కోరుకుంటున్నాను.

  • కరోలినా గార్సియా

    అర్జెంటీనానెట్‌ఫ్లిక్స్ డైరెక్టర్

    ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఒరిజినల్ సిరీస్ డైరెక్టర్ కరోలినా గార్సియా అర్జెంటీనాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. డాన్స్, సంగీతంలో శిక్షణ పొందిన ఆమె తొలుత '20th సెంచరీ ఫాక్స్‌'లో ఇంటర్న్‌గా చేరారు. ఆ తరువాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఎంటర్‌టైన్మెంట్ రంగంలో ముందుకు దూసుకుపోయారు.

    నెట్‌ఫ్లిక్స్‌లో క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్‌గా స్ట్రేంజర్ థింగ్స్, ది చిల్లింగ్ అడ్వెంచర్స్ ఆఫ్ సబ్రినా, 13 రీజన్స్ వై, ఎటిపికల్ అండ్ రైజింగ్ డియోన్‌ లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరీస్‌లను ఆమె పర్యవేక్షించారు.

    హాలీవుడ్‌లో నాయకత్వ స్థానాల్లో ఉన్న కొద్దిమంది మహిళల్లో గార్సియా ఒకరు. తెరపై లాటినాస్ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, వారి కథలను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారామె.

    *గత కొన్ని సంవత్సరాలు మనందరినీ బాగా కుదిపేశాయి. కానీ, జీవితం చిన్నది. చేతిలో ఉన్న విలువైన కాలాన్ని భయంతో ఎందుకు గడపాలి? 'జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి' అని మా అమ్మమ్మ చెబుతుంటారు. ఆమె మాటలను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది.

  • సాఘీ గాహ్రెమన్

    ఇరాన్కవయిత్రి

    ఇరానియన్,కెనడియన్ రచయిత. ఇరానియన్ క్వీర్ ఆర్గనైజేషన్ (ఐఆర్‌క్యూఓ) సహ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు.

    టొరంటోలో ఉన్న ఈ సంస్థ ఇరాన్‌లో నివసిస్తున్న లేదా బహిష్కరించబడిన గే, లెస్బియన్, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పించే దిశగా పనిచేస్తుంది. అలాగే, ఇరాన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల ఉల్లంఘనలను కూడా పర్యవేక్షిస్తుంది.

    ఇరానియన్ "క్వీర్ సాహిత్యం"పై దృష్టి సారించే 'గిల్గమిషాన్ బుక్స్‌'ను 2010లో గాహ్రెమన్ స్థాపించారు. సంపాదకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన గాహ్రెమన్ నాలుగు కవితా సంపుటాలు, అనేక వ్యాసాలు రాశారు. ఆమె రచనలు హెటెరోనార్మాటివిటీని సవాలు చేస్తాయి. హెటెరోనార్మాటివిటీ అంటే పుట్టుకతో వచ్చిన జెండరే నిజమైనదని, భిన్న లింగ సంపర్కమే (హెటెరోసెక్సువాలిటీ) సాధారణమనే ఆలోచన.

    *ప్రపంచాన్ని రీసెట్ చేస్తే అందులో అందరికీ భాగం ఉండాలి. ప్రపంచం కోవిడ్ రహితంగా మారాలంటే, ఎల్జీబీటీయేతర వ్యక్తులందరికీ ఎలాంటి అవకాశాలు అధికారాలు దక్కుతున్నాయో అవన్నీ క్వీర్ సమూహానికి కూడా దక్కాలి.

  • ఘౌఘా

    అఫ్గానిస్తాన్గాయని

    ప్రతిభావంతులైన గాయని, పాటల రచయిత, స్వరకర్త ఘౌఘా అయిదేళ్లకు పైగా సంగీత పరిశ్రమలో పనిచేశారు. అఫ్గానిస్తాన్‌లోని మహిళలు, బాలికల గురించి పాటలు పాడే ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్థుత పరిస్థితులకు వ్యతిరేకంగా తన పాటల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

    2019లో ‘తాలిబాన్ల సమక్షంలోనే నిన్ను ముద్దాడుతా’ అంటూ రామిన్ మజర్ రాసిన కవితకు ఆమె సంగీతాన్ని జోడించారు. అది వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇటీవల ఆమె పాడిన పాటను ‘‘యుద్ధం వల్ల తమ కలలను కోల్పోయిన చిన్నారులకు’’ అంకితం చేస్తున్నట్టు చెప్పారు.

    "నా దేశంలో ఎడతెగని యుద్ధాలు నాకు ప్రశాంతత లేకుండా చేశాయి. అందుకే పాటలు రాస్తున్నాను’’ అని ఘౌఘా చెప్పారు. ఆమె రాసే పాటలు ఆ క్షోభను ప్రతిబింబిస్తున్నాయి.

    *అనేక రంగురంగుల గాలిపటాలను ఎగిరేసినట్టుగా, నా దేశ గగనతలాన్ని మిస్సైళ్లతో అలంకరించారు. ప్రతి క్షణం నా ప్రజల గురించి, ముఖ్యంగా మహిళలు, చిన్నారుల గురించే ఆలోచిస్తున్నాను. వారి భద్రత పట్ల ఆందోళన నన్ను నిరంతరం వెంటాడుతోంది.

  • ఏంగెలా ఘయౌర్

    అఫ్గానిస్తాన్టీచర్, హెరాత్ ఆన్‌లైన్ స్కూల్ వ్యవస్థాపకురాలు

    ఏంగెలా ఘయౌర్ ప్రారంభించిన హెరాత్ ఆన్‌లైన్ స్కూలు ద్వారా దాదాపు 1,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 400 మందికి పైగా వలంటీర్ టీచర్లు పాఠాలు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో బాలికలు, యువతులు ఇళ్లలోనే ఉండాలని తాలిబాన్ ఆదేశించడంతో, ఆ బాలికలు చదువుకు దూరం కాకుండా ఏదో ఒకటి చేయాలని ఏంగెలా సంకల్పించారు. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ స్కూలు గణితం నుంచి మ్యూజిక్, కుకింగ్, పెయింటింగ్ వరకు 170కి పైగా క్లాసులను టెలీగ్రామ్, స్కైప్ ద్వారా విద్యార్థులకు అందిస్తోంది.

    1992లో అంతర్యుద్ధం మొదలైనప్పుడు ఏంగెలా కుటుంబంతో కలిసి అఫ్గానిస్తాన్ నుంచి ఇరాన్‌కు పారిపోయారు. తాత్కాలిక వీసా పరిమితుల కారణంగా ఆమె అయిదేళ్లపాటు చదువుకు దూరమయ్యారు.

    తర్వాత ఆమె సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసేందుకు అర్హత సాధించారు. చాలా దేశాలకు వలస వెళ్లారు, ప్రస్తుతం యూకేలో స్థిరపడ్డారు.

    *ఆ దుర్మార్గాన్ని నేను సమ్మతించను. ఇలాంటి దుష్ట శక్తులను ప్రపంచం కట్టడి చేయాలి. తాలిబాన్‌తో పాటు, మరే దుష్ట శక్తులనూ గుర్తించకూడదు. అప్పుడే శాశ్వత ఆనందాన్ని పొందుతాం.

  • జమీలా గార్డన్

    సోమాలియాలుమాచైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్

    కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రపంచంలో ప్రముఖ వ్యక్తి. లుమాచైన్ వ్యవస్థాపకురాలు. ప్రపంచ ఆహార సరఫరా గొలుసులలో తెగిపడిన లింకులను కలపడానికి ఏఐ ఉపయోగించే వేదిక లుమాచైన్.

    సోమాలియలోని ఒక గ్రామంలో జన్మించారు జమీలా గార్డన్. స్వదేశంలో అంతర్యుద్ధం నుంచి తప్పించుకోవడానికి జమీలాను యుక్తవయసులోనే ఆమె కుటుంబం కెన్యా పంపించేసింది. ఆ తరువాత ఆమె ఆస్ట్రేలియా చేరుకున్నారు. అక్కడ టెక్నాలజీ పట్ల ఆమెకు మక్కువ పెరిగింది. లుమాచైన్ స్థాపించడానికి ముందు ఆమె ఐబీఎంకు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్‌గా, క్వాంటాస్‌కు గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.

    2018 ఇంటర్నేషనల్ వుమెన్స్ ఎంటర్‌ప్రెన్యూరియల్ ఛాలెంజ్‌లో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవార్డు గ్రహీతగా నిలిచారు జమీలా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 2021 ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.

    *వెనుకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు సమాజంలో సముచిత స్థానాన్ని సంపాదించుకోవడానికి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి కృత్రిమ మేధస్సు సహాయపడుతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.

  • నాజీలా హబీబ్యార్

    అఫ్గానిస్తాన్వ్యాపారవేత్త

    అఫ్గానిస్తాన్ మహిళలు చేనేత వస్త్ర వ్యాపారాలు ప్రారంభించి, కమీషన్ల పేరుతో దోచుకునే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను విదేశాలలో అమ్ముకునేందుకు తోడ్పాటు అందించేందుకు నాజీలా హబీబ్యార్ బ్లూ ట్రెజర్ ఇంక్ అండ్ ఆర్క్ గ్రూప్‌ను స్థాపించారు. మహిళా సాధికారత, వాతావరణ మార్పులకు వ్యాపారాలకు మధ్య సంబంధం అనే అంశాలపై USAID, ప్రపంచ బ్యాంకులు చేపట్టిన ప్రాజెక్ట్‌లకు ఆమె నాయకత్వం వహించించారు.

    2012 నుంచి 2015 వరకు అఫ్గానిస్తాన్ నుంచి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ ఏజెన్సీకి హబీబ్యార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.

    ఆమె 13 ఏళ్లకు పైగా లాభాపేక్ష లేని సేవా రంగంలో పనిచేస్తూ బాలికలకు విద్య కోసం కృషి చేశారు. నిరాశ్రయులైన అఫ్గాన్లకు అండగా నిలిచేందుకు అఫ్గాన్ వెరాసిటీ కేర్ ఫర్ అన్‌షెల్టర్డ్ ఫ్యామిలీస్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు.

    *ఒక అఫ్గాన్ మహిళగా నేను అనుభవించిన కష్టాలను పక్కనపెట్టి, మా తరువాతి తరానికి వారసత్వంగా వచ్చిన యుద్ధాన్ని అంతం చేయడానికి నావంతు సాయం చేయగలుగుతానని అనుకుంటున్నాను.

  • లైలా హైదరి

    పాకిస్తాన్వ్యవస్థాపకురాలు- మదర్ క్యాంప్

    మాదకద్రవ్యాలకు బానిసలుగా మారినవారిని చేరదీసి, వారి ఆరోగ్యాన్ని బాగుచేసేందుకు లైలా హైదరి ‘మదర్ క్యాంప్’ పేరుతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కాబుల్ నగరంలో ఉన్న ఏకైక డ్రగ్ పునరావాస కేంద్రం ఇది. తాను సొంతంగా పొదుపు చేసుకున్న డబ్బులతో ఆ క్యాంపు ద్వారా 2010 నుంచి దాదాపు 6,400 మందికి ఆమె సాయం చేశారు. కాబుల్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆమె దానిని మూసివేయాల్సి వచ్చింది.

    హైదరి కుటుంబ స్వస్థలం అఫ్గానిస్తాన్‌లోని బమ్యాన్ పట్టణం. తన తల్లిదండ్రులు పాకిస్తాన్‌కు వలస వెళ్లడంతో ఆమె అక్కడే జన్మించారు. పన్నెండేళ్లకే ఆమెకు పెళ్లి చేశారు. ప్రస్తుతం మహిళల హక్కుల కోసం హైదరి గళమెత్తుతున్నారు.

    బెదిరింపులు, వ్యతిరేకతల నడుమ ఆ క్యాంపును కొనసాగించేందుకు ఆమె పడిన కష్టాలను ‘లైలా ఎట్ ది బ్రిడ్జ్ (2018)’ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

    *ప్రజల్లో అవగాహన ఇంకా వ్యాప్తి చెందుతుందని, తద్వారా మరింత నైతికతతో కూడిన మానవీయ ప్రపంచాన్ని మనం చూడగలుగుతామని ఆకాంక్షిస్తున్నాను. పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం, ఇందులో ఒక అమెరికా పౌరుడు వేసే ఓటు కూడా అఫ్గాన్ తలరాతను ప్రాథమికంగా మార్చేయగలదు.

  • జర్లాష్త్ హలైంజాయ్

    అఫ్గానిస్తాన్చీఫ్ ఎగ్జిక్యూటివ్- రెఫ్యూజీ ట్రామా ఇనిషియేటివ్

    గతంలో అఫ్గానిస్తాన్ నుంచి శరణార్థిగా వెళ్లిపోయిన జర్లాష్త్, రెఫ్యూజీ ట్రామా ఇనిషియేటివ్ (ఆర్‌టీఐ) సహవ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్. శరణార్థులకు మానసిక వైద్య సహాయం అందిస్తూ, వారు కుంగుబాటు నుంచి బయటపడేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది.

    ఆర్‌టీఐ ప్రారంభించక ముందు, ఆమె సిరియా టర్కీ సరిహద్దులో శరణార్థ చిన్నారులకు విద్య, వైద్యం అందేలా చేసేందుకు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి వలంటీర్‌గా పనిచేశారు.

    2018లో ఒబామా ఫౌండేషన్‌ ఫెలోషిప్‌కు ఎంపికైన 20 మందిలో హలైంజాయ్ ఒకరు. ఫెలోషిప్‌కు అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా స్పానర్ చేశారు.

    *అఫ్గానిస్తాన్ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న హింసకు ముగింపు పడాలన్నదే నా కోరిక.

  • షామ్సియా హస్సానీ

    ఇరాన్వీధి కళాకారిణి

    అఫ్గానిస్తాన్‌ మొట్టమొదటి మహిళా గ్రాఫిటీ ఆర్టిస్ట్ హమ్సియా హస్సానీ. కాబుల్ నగరంలో ఎవరూ పట్టించుకోని, ధ్వంసమైన భవనాల గోడలను ఆమె కాన్వాస్‌గా మార్చుకున్నారు. మహిళలను ఆత్మవిశ్వాసం నిండిన వ్యక్తులుగా, శక్తిమంతులుగా, గొప్ప కలలు కనే వనితలుగా చూపుతూ కుడ్య చిత్రాలు వేస్తున్నారు.

    ఇరాన్‌లో అఫ్గాన్ దంపతులకు జన్మించిని హస్సానీ.. కాబుల్‌లో విజువల్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేశారు. కాబుల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఆమె పాఠాలు కూడా చెప్పారు. 15 దేశాల్లో కుడ్య చిత్రాలు వేశారు. టాప్- 100 ప్రపంచ ఆలోచనాపరులలో ఒకరిగా ఆమె పేరును ఫారిన్ పాలసీ మ్యాగజైన్ పేర్కొంది.

    అఫ్గానిస్తాన్ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా, తాను వేసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

    *గత 15 ఏళ్లలో, నా దేశం బాగుపడాలని కోరుకున్నప్పుడల్లా పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారుతూ వచ్చాయి. ఇక అఫ్గానిస్తాన్ వెలిగిపోతుందనే ఆశలు నాకేమీ లేవు. ఆశపడి నిరాశ చెందడం కంటే, ఎలాంటి ఆశలు పెట్టుకోకపోవడమే మంచిది.

  • నస్రీన్ హుస్నేని

    అఫ్గానిస్తాన్పశువైద్యురాలు

    నస్రీన్ కాబుల్ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ కోర్సు చదువుకొనేటప్పుడు, క్లాసులో మొత్తం 75 మంది విద్యార్థులుండగా అందులో ఇద్దరే అమ్మాయిలు ఉండేవారు. చిన్నప్పుడు ఇరాన్‌లో శరణార్థిగా పెరిగిన ఆమె, చదువు కోసం అఫ్గానిస్తాన్‌కు తిరిగి వచ్చారు. గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయంలో పశువుల ఆరోగ్యంపై అధ్యయనం చేసేందుకు స్కాలర్‌షిప్‌తో కెనడాకు వెళ్లారు.

    నస్రీన్ ప్రస్తుతం ఇమ్యునాలజీ ల్యాబ్‌లో పని చేస్తున్నారు. ఖాళీ సమయంలో కెనడియన్ హజారా హ్యూమానిటేరియన్ సర్వీసెస్‌ కోసం వలంటీర్‌గా పని చేస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చి కెనడాలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న తన తోటి హజారాలకు, ఇతర పేదలకు ఆమె సాయం అందిస్తున్నారు.

    చదవం, రాయడం పట్ల అఫ్గాన్ చిన్నారుల్లో ఆసక్తి పెంచేందుకు ఆమె స్థానిక బుకీస్ యూత్ ప్రోగ్రామ్‌తో కలిసి పనిచేస్తున్నారు.

    *అఫ్గాన్ మహిళలు, బాలికలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. కానీ, ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. బాబ్ మార్లే చెప్పినట్టుగా, "ధైర్యంగా నిలబడటమే మీ ముందున్న ఏకైక మార్గం అయ్యేంత వరకూ.. మీరు ఎంత ధైర్యవంతులో మీకు తెలియదు."

  • మొమెనా ఇబ్రహీమి

    అఫ్గానిస్తాన్పోలీస్

    పోలీసు విభాగంలో చేరాక మూడేళ్ల తర్వాత మొమెనా ఇబ్రహీమి, తన సీనియర్ చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యారు. తనకు ఎదురైన ఆ చేదు అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడడంతో పాటు, అఫ్గాన్ పోలీస్ విభాగంలో వేధింపులకు సంబంధించి మరికొన్ని ఆరోపణల గురించి కూడా గళమెత్తాలని ఆమె నిర్ణయించుకున్నారు.

    అప్పటి నుంచి, తనకు న్యాయం కోసం పోరాడుతూ, ఇతర అత్యాచార, లైంగిక వేధింపుల బాధితుల తరఫున కూడా గళమెత్తారు. బెదిరింపులు వచ్చినా ఆమె లెక్కచేయలేదు. ‘‘ఎవరో ఒకరో బయటికొచ్చి మాట్లాడాల్సిందే, ఆ వ్యక్తిని నేనే అవ్వాలని, నా ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయొద్దని అనుకున్నాను’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

    అఫ్గానిస్తాన్‌ తాలిబాన్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆగస్టులో యూకేకు తరలించిన వేల మందిలో ఇబ్రహీమి ఒకరు.

    *అఫ్గానిస్తాన్‌లో ఏళ్ల తరబడి పోరాడి, చదువుకుని, తమ జీవితాలను మార్చుకున్న మహిళలందరూ తిరిగి ఉద్యోగాల్లో చేరాలని, ప్రజలపై అధికార బలాన్ని ప్రయోగిస్తున్న శక్తుల నుంచి వారికి విముక్తి లభించాలని కోరుకుంటున్నాను.

  • ముగ్ధ కాల్రా

    నాట్ దట్ డిఫరెంట్ సహ వ్యవస్థాపకురాలు

    ఆటిజం హక్కుల కార్యకర్త. 12 ఏళ్ల ఆటిజం చిన్నారికి తల్లి అయిన ముగ్ధ కాల్రా 'నాట్ దట్ డిఫరెంట్' ఉద్యమం సహ వ్యవస్థాపకులు. న్యూరోడైవర్సిటీపై అవగాహన పెంచేందుకు ప్రారంభించిన ఉద్యమం ఇది. పిల్లలందరూ ఆటిజంను అర్థం చేసుకోవడానికి, ఆటిజం చిన్నారులతో స్నేహం చేయడానికి తోడ్పడే ఒక కామిక్ సీరీస్‌ను రూపొందించడంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు.

    ప్రసార పరిశ్రమలో కాల్రాకు ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. టీవీ ప్రెజెంటర్‌గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ రచయితగా, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ కోచ్‌గా ఎంతో అనుభవం గడించారు.

    బ్యాక్‌స్టేజ్ అనే లైవ్ పాడ్‌కాస్ట్ యాప్‌లో ఆమె చీఫ్ కంటెంట్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

    *700 కోట్ల జనాభా ఒకే రకమైన బాధను అనుభవించేలా చేసింది ఈ కోవిడ్ మహమ్మారి. ఎవరి ప్రపంచాల్లో వాళ్లు ఒంటరిగా ఉన్నా, ఒకే రకమైన బాధను అనుభవిస్తూ జతపడే ఉన్నారు. ఈ అనుభవం సాటి మనుషుల పట్ల సహానుభూతి పెరిగేలా చేస్తుందని విశ్వసిస్తున్నాను.

  • ఫ్రెష్తా కరీం

    అఫ్గానిస్తాన్చార్మాగ్జ్ మొబైల్ లైబ్రరీ వ్యవస్థాపకురాలు

    బస్సులను సంచార గ్రంథాలయంగా మార్చేసింది కాబుల్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ చార్మాగ్జ్. ఈ సంచార గ్రంథాలయాలను కాబుల్ పరిసర ప్రాంతాల్లో తిప్పుతూ చిన్నారులకు పుస్తకాలను అందించారు.

    పబ్లిక్ పాలసీలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన బాలల హక్కుల కార్యకర్త ఫ్రెష్తా కరీం, 2008లో చార్మాగ్జ్ సంస్థను ప్రారంభించారు,

    ఆమె పన్నెండేళ్ల వయసు నుంచే బాలల హక్కుల కోసం పనిచేస్తున్నారు. చిన్నారుల టీవీ కార్యక్రమం వ్యాఖ్యాతగా పనిచేశారు. అఫ్గానిస్తాన్‌లో బాలల హక్కుల స్థితిపై నివేదికలు రూపొందించారు. అప్పటి నుంచి క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు.

    *చిన్నారులతో కలిసి పని చేస్తున్నాను ఎందుకంటే, వాళ్లు అఫ్గానిస్తాన్‌కు 'సైకిల్ బ్రేకర్స్' లాంటివారని నా అభిప్రాయం. అంటే, హింస, విధ్వంసం, అణచివేత పునరావృతం కాకుండా అడ్డుకుని, పాత గాయాలను మాన్పించి, కొత్త చరిత్రకు, నూతన రాజకీయాలకు బాటలు వేయగలిగేది వారే.

  • అమేనా కరిమ్యాన్

    అఫ్గానిస్తాన్ఖగోళ శాస్త్రవేత్త

    సివిల్ ఇంజనీర్, హెరాత్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో బోధకురాలు అమేనా కరిమ్యాన్. దేశంలో ఖగోళ శాస్త్రం అభివృద్ధిపై దృష్టి సారించిన మొదటి అఫ్గాన్ మహిళల్లో ఈమె ఒకరు.

    2018లో ప్రారంభమైన కయ్హానా ఆస్ట్రోనామికల్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఖగోళశాస్త్రం గురించి తెలుసుకునేలా యువతను ప్రోత్సహించేందుకు ఈ గ్రూపును ఏర్పాటు చేశారు.

    2021 జులైలో కరిమ్యాన్ నేతృత్వంలోని గ్రూపు (అందరూ బాలికలే), అంతర్జాతీయ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పోటీలో వరల్డ్ ఆస్ట్రానామికల్ యూనియన్ నుంచి అవార్డు అందుకుంది.

    *బాలికలకు విద్యాహక్కును తాలిబాన్లు నిరాకరించినందున, మేము గతంలో కంటే ఎక్కువగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే, కయ్హానా ఆస్ట్రోనామికల్ గ్రూప్ సభ్యులు రోజూ రాత్రి ఆన్‌లైన్‌లో కలుసుకుంటారు. నా దేశ యువతకు దారి చూపాలన్నదే నా ఏకైక కోరిక.

  • ఆలియా కాజిమీ

    అఫ్గానిస్తాన్బోధకురాలు

    కాబుల్‌ను తాలిబాన్లు కైవసం చేసుకోకముందు ఆలియా కాజిమీ మానవ హక్కుల పరిరక్షణ, అందరికీ విద్య అనే అంశాలపై పని చేస్తుండేవారు. రెడ్ క్రాస్ సంస్థలో వలంటీర్‌గా మూడేళ్లు పనిచేశారు. మహిళల కోసం మిఠాయిలు, బేకరీ వ్యాపారాన్ని ప్రారంభించారు. 2020లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పట్టా సాధించారు. ఓ విశ్వవిద్యాలయంలో బోధనలు చేసిన ఆమె, లెక్చరర్ కావాలని కలలు కన్నారు.

    2021లో అఫ్గానిస్తాన్‌ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత, ఆమె అమెరికాకు వెళ్లిపోయారు. ఇప్పుడు పీహెచ్‌డీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

    బీబీసీ కోసం ఆలియా ఒక లేఖ రాశారు. తమకు నచ్చింది ఎంచుకోవడంలో, ప్రత్యేకించి ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయంలో మహిళలకు స్వేచ్ఛ గురించి ఆ లేఖలో పేర్కొన్నారు.

    *అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొనాలన్నదే నా ఏకైక ఆశ. మనకు కావాల్సిన వాటిలో అన్నింటి కంటే ముఖ్యమైనది శాంతి.

  • బారోనెస్ హెలెనా కెనడి క్యూసీ

    బ్రిటన్ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ మానవ హక్కుల సంస్థ డైరెక్టర్

    మహిళలు, మైనారిటీ హక్కుల పరిరక్షణలో పేరుగాంచిన స్కాటిష్ న్యాయవాది బారోనెస్ హెలెనా కెనడి క్యూసీ 40 సంవత్సరాల పాటు క్రిమినల్ లాయరుగా ప్రాక్టీస్ చేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ మానవ హక్కుల సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ అఫ్గానిస్తాన్‌లో ప్రమాదంలో ఉన్న మహిళలకు సహాయం అందిస్తోంది.

    ఆమె చాలా సంవత్సరాలు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని మాన్స్‌ఫీల్డ్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. సంచలనాత్మకమైన 'బొనావెరో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌'ను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

    మహిళలపై న్యాయ వ్యవస్థ ప్రభావం అనే అంశంపై బారోనెస్ కెనడి అనేక పుస్తకాలు రాశారు. 1997లో ఆమె హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లేబర్ పీర్‌గా ఎంపికయ్యారు.

    *మన కేసులను వాదించడానికి న్యాయవాదులు, వాటిని విచారించడానికి స్వతంత్ర న్యాయమూర్తులు లేకపోతే మానవ హక్కులు అర్థరహితమైనవి.

  • హుదా ఖమూష్

    ఇరాన్పీరియడ్ క్యాంపెయినర్

    "ఋతుస్రావం నిషిద్ధం కాదు" అంటూ అఫ్గానిస్తాన్‌లోని పాఠశాలల్లో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించేందుకు మహిళా హక్కుల కార్యకర్త హుదా ఖమూష్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

    ఇరాన్‌కు వలస వెళ్లిన అఫ్గాన్ కుుటుంబంలో జన్మించిన ఖమూష్, చిన్నతనంలో అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చారు. అమ్మాయిలు చదువుకోవద్దనే మూస ధోరణితో ఉండే బంధువుల అభిప్రాయాలను పట్టించుకోకుండా తన తల్లి ప్రోత్సాహంతో ఆమె చదువుకున్నారు. పాత్రికేయ వృత్తిని ఎంచుకున్న ఆమె, 2015లో రేడియో ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపారు. తన సొంతూరిలోని మహిళలకు చదువు చెప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆమె 7వ తరగతితో పాటు, అంతకంటే పై తరగతుల బాలికల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే, ఆ బాలికలు బడికెళ్లి చదువుకునేందుకు తాలిబాన్లు అనుమతించడంలేదు.

    *అంతా అంధకారం అలముకున్నప్పటికీ.. 2021లో మహిళలు కొరడా దెబ్బలకు, బుల్లెట్లకు ఎదురొడ్డి, ఎవరైతే తమ హక్కులను కాలరాశారో వారి నుంచే నేరుగా తిరిగి ఆ హక్కులను పొందగలిగారు. అందుకే, 2021కి ‘ఇయర్ ఆఫ్ హోప్’ అని పేరు పెట్టాను.

  • మియా క్రిస్నా ప్రతివి

    ఇండోనేషియాపర్యావరణవేత్త

    పర్యావరణ కార్యకర్త అయిన మియా బాలి ద్వీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి లాభాపేక్షలేని గ్రియా లుహు సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. స్థానిక సమాజంతో కలిసి ఈ సంస్థ "డిజిటల్ వేస్ట్ బ్యాంక్"ను అభివృద్ధి చేసింది. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. వ్యర్థాలను మెరుగైన పద్ధతుల్లో సేకరించడానికి, ప్రాసెస్ చేయడానికి, వ్యర్థాల నిర్వహణలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా డాటాను సేకరించడంలో ఇది సహాయపడుతుంది.

    ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ బాండుంగ్ నుంచి ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన మియా క్రిస్నా ప్రతివి ఈ వ్యర్థాల బ్యాంకు ఆపరేషన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇందులో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు.

    ఇండోనేషియాలో డెన్‌పసర్ సిటీలోని పర్యావరణ సంస్థలో ఎన్విరాన్మెంట్ అనలిస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

    *బాలినీస్ తత్వమైన త్రి హిత కరణ స్ఫూర్తితో తల్లి లాంటి భూమికి సమతుల్యతను, సామరస్యాన్ని తిరిగి తీసుకువద్దాం. కాలుష్య సమస్యకు కారణం మనమే కావచ్చు. అయితే, పరిష్కారం కూడా మనమే కావాలి.

  • హెడీ జె లార్సన్

    అమెరికాది వ్యాక్సీన్ కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్

    లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ఆంత్రపాలజిస్ట్, వ్యాక్సీన్ కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్. ప్రజారోగ్య సమస్యలను ప్రభావితం చేసే సామాజిక, రాజకీయ అంశాలపై అధ్యయనాలకు నాయకత్వం వహిస్తారు ప్రొఫెసర్ హెడీ జే లార్సన్. ప్రస్తుతం ఆమె రిస్క్ అండ్ రూమర్ మేనేజ్‌మెంట్, వ్యాక్సీన్లపై ప్రజావిశ్వాసాన్ని పెంపొందించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

    స్టక్: హౌ వ్యాక్సీన్ రూమర్స్ స్టార్ట్ - అండ్ వై దే డోంట్ గో అవే పుస్తక రచయిత. గర్భధారణ సమయంలో వ్యాక్సీన్లు తీసుకోవడంపై జరుగుతున్న అంతర్జాతీయ అధ్యయనానికి ఆమె ప్రధాన పరిశోధకురాలిగా వ్యవహరిస్తున్నారు.

    తప్పుడు సమాచారం, అబద్ధపు ప్రచారాలు చేసే హానిపై ఆమె చేసిన శాస్త్రీయ పరిశోధనకు 2021 ఎడిన్‌బర్గ్ మెడల్ లభించింది.

    *ఇప్పటికే అసమానతలతో నిండి ఉన్న ప్రపంచంలో మహమ్మారి ప్రవేశించింది. మనందరినీ విభజిస్తున్న లోతైన అంశాలను ఏ వ్యాక్సీన్లూ రూపుమాపలేవు. వ్యక్తిగత, సంస్థాగత, సమూహ స్థాయిల్లో మనం తీసుకునే చర్యలే ఈ ప్రపంచాన్ని మార్చగలవు.

  • ఇమాన్ లె కైర్

    ఈజిప్ట్ట్రాన్స్ అసిలియాస్ వ్యవస్థాపకులు

    కైరో ఒపెరా హౌస్‌లో డాన్సర్, కొరియోగ్రాఫర్. ఎల్జీబీటీ క్వీర్ సముదాయానికి చెందిన కైర్ పోలీసుల వేధింపుల కారణంగా ఈజిప్ట్ నుంచి పారిపోయారు. 2008లో అమెరికాలో ఆశ్రయం పొందారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో కళాకారిణిగా, నటిగా జీవితం కొనసాగిస్తున్నారు. అలాగే, ఎల్జీబీటీ కార్యకర్తగా పనిచేస్తున్నారు.

    ట్రాన్స్‌ఎమిగ్రేట్ సంస్థలో అరబిక్ రిలేషన్స్ మేనేజర్‌గా, బోర్డు సభ్యురాలిగా లె కైర్ వ్యవహరిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లు సురక్షితమైన దేశాలకు తరలివెళ్లడంలో ఈ సంస్థ సహాయపడుతుంది.

    2021 మార్చ్‌లో 'ట్రాన్స్ అసిలియాస్' సంస్థను ప్రారంభించారు లె కైర్. "ట్రాన్స్ శరణార్థులను ట్రాన్స్ స్నేహిత ప్రాంతాలకు తరలించడం", వారికి కావలసిన మద్దతు అందించడం ఈ సంస్థ లక్ష్యాలు.

    *ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన స్థితిలో ఉన్న ట్రాన్స్‌జెండర్ సముదాయాన్ని కోవిడ్ 19 మహమ్మారి మరింత ప్రమాదంలో పడేసింది. కొన్నిసార్లు, ఏ మాత్రం సహానుభూతి లేని కుటుంబాల్లో ఒంటరి జీవితం గడిపే దుస్థితి కల్పించింది. లాక్‌డౌన్‌తో ప్రపంచమంతా మూతబడినప్పుడు సహాయం కోసం వారు చేసిన ఆర్తనాదాలను పట్టించుకున్నవారే లేరు. ఇప్పుడిక ప్రపంచం వారికి చేయూతనిచ్చి, కోలుకోవడానికి సహాయపడాలి.

  • సెవిడ్జెమ్ ఎర్నెస్టీన్ లెకేకి

    కామెరూన్వాతావరణ కార్యకర్త

    కార్చిచ్చులను నియంత్రించడానికి తేనెటీగల పెంపకం ఒక మంచి వ్యూహమని చెబుతూ, సెవిడ్జెమ్ ఎర్నెస్టీన్ లెకేకి స్థాపించిన సంస్థ 2,000 మందికి పైగా రైతులకు తేనె ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ, తేనెటీగల మైనం సంగ్రహణల్లో శిక్షణ ఇచ్చింది. అంతే కాకుండా, అటవీ నిర్మూలనపై పోరాడేందుకు 86,000 కంటే ఎక్కువ "తేనెటీగలను ఆకర్షించే" చెట్లను నాటింది.

    లెకేకి, కామెరూన్ జెండర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వాచ్ వ్యవస్థాపక సభ్యురాలు. ఈ సంస్థ ఆ దేశ పర్యావరణ సమస్యలు, అందులో మహిళల పాత్రపై దృష్తి సారిస్తుంది.

    సమాజాలు ప్రయత్నిస్తే అడవులను సంరక్షించవచ్చన్నది ఆమె విశ్వాసం. కామెరూన్ వాయువ్యంలో ఉన్న 20,000-హెక్టార్ల కిలం-ఇజిమ్ ఫారెస్ట్ ప్రాజెక్టే ఇందుకు ఉదాహరణ అని ఆమె అంటారు.

    *అటవీ సంరక్షణ, జీవనోపాధి కార్యక్రమాలలో మహిళల పర్యావరణ, సామాజిక, ఆర్థిక హక్కులను పూర్తిగా పరిగణించే ప్రపంచం నాకు కావాలి.

  • ఎలిసా లాంకన్ ఆంటిలియో

    చిలీకాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ ప్రెసిడెంట్

    చిలీలో 2021లో సరికొత్త రాజ్యాంగ రచనకు ఎంపికైన 17 మంది స్థానిక ప్రతినిధుల్లో ఎలిసా లాంకన్ ఆంటిలియో ఒకరు. ఉపాధ్యుయురాలు, భాషావేత్త అయిన ఎలిసా, కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. చిలీ మూలవాసులు ప్రభుత్వ రంగంలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి.

    చిలీలో అతి పెద్ద మూలవాసుల సముదాయం మపుచేకి చెందిన ఎలిసా లాంకన్, స్వదేశీయులకు స్వయంప్రతిపత్తి, హక్కులు కల్పించే, వారి సంస్కృతులు, భాషలను గుర్తించే "ప్లూరినేషనల్ స్టేట్"ను సమర్థిస్తారు.

    పేదరికంలో పుట్టి జాతి వివక్షను ఎదుర్కున్న ఎలిసా హ్యుమానిటీస్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం శాంటియాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

    *మహమ్మారిలో ప్రతి రోజూ మరణాన్ని దగ్గరగా చూసిన తరువాత, మనుషులకు, ఇతర జీవులకు కూడా సమాన హక్కులు కల్పించడం అత్యవసరమని తేలింది. మన జీవితాలు భూమి తల్లి వనరులపై ఆధారపడి ఉన్నాయి. నీరు, అడవుల నుంచి తేనెటీగలు, చీమల వరకు మనం అన్నింటిపైనా ఆధారపడి ఉన్నాం.

  • క్లోయి లోపెస్ గోమ్స్

    ఫ్రాన్స్బ్యాలె డాన్సర్

    2018లో క్లోయి లోపెస్ గోమ్స్, ప్రతిష్టాత్మకమైన 'స్టాట్స్‌బ్యాలెట్ బెర్లిన్‌'లో తొలి నల్లజాతి బ్యాలేరినాగా చేరారు. కానీ, అక్కడ ఆమె జాతి వివక్షను ఎదుర్కున్నారు. బ్యాలె ప్రపంచం సంకుచితమైనదని, ఉన్నత వర్గాల ఆధ్వర్యంలో నడుస్తుందని విమర్శించారు. అక్కడి వివక్షాపూరిత పద్ధతులను ఖండించారు. క్లోయి, మాస్కోలోని బోల్షోయ్ అకాడమీలో చదువుకున్నారు.

    క్లోయి బహిరంగంగా నిరసనలు తెలిపిన తరువాత, అనేకమంది నల్లజాతి, మిశ్రమ వారసత్వ బ్యాలె డాన్సర్లు ఆమెకు మద్దతు తెలిపారు.

    2020లో స్టాట్‌బ్యాలెట్ తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకపోవడంతో క్లోయి చట్టాన్ని ఆశ్రయించారు. ఫలితంగా, ఆ సంస్థ తన సిబ్బందిలో జాత్యహంకార ధోరణులపై అంతర్గత విచారణ జరిపింది. క్లోయికి క్షమాపణలు తెలుపుతూ, నష్టపరిహారం చెల్లింది కోర్టు బయట రాజీ చేసుకుంది.

    *దురదృష్టవశాత్తు మనమంతా పుట్టుకతో సమానం కాదు. మన విజయావకాశాలు జాతి, సామాజిక స్థితిపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోగలిగే అవకాశం ఉన్న ప్రపంచంలో నేను జీవించాలనుకుంటున్నాను.

  • మహేరా

    అఫ్గానిస్తాన్డాక్టర్

    డాక్టర్ మహేరా ఇప్పటికీ తాను పనిచేసే ప్రసూతి ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తూ బిజీగా ఉంటున్నారు.

    అఫ్గానిస్తాన్ తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లినప్పటి నుంచి వైద్య సేవలు నిలిచిపోయిన జిల్లాలకు వెళ్తూ, తన సేవలు అవసరం ఉన్న రోగులను పరీక్షించి, వైద్యం చేస్తున్నారు మహేరా.

    ఆమె గతంలో లింగ ఆధారిత హింస నుంచి బయటపడిన వారితో కలిసి పనిచేశారు. కానీ, తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఆమె అలాంటి పని చేసేందుకు వీలులేకుండా పోయింది.

    *పెద్దగా ఆశలు ఉండకపోవచ్చు, కానీ నేటి అఫ్గానిస్తాన్ మహిళలు 20 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా లేరు. ఇప్పటి మహిళలు తమ హక్కులను కొంతవరకు పరిరక్షించుకోగలరు. అయితే, ఈ దేశంలో బాలికలు ఇక ఎప్పటికీ పాఠశాలలకు వెళ్లి చదువుకోలేరన్నదే నా ఆందోళన.

  • మరల్

    అఫ్గానిస్తాన్ఉద్యమకారిణి

    మహిళా హక్కుల పోరాటాల్లో, పౌర సంఘాల ఉద్యమాల్లో మరల్ పాల్గొనాలని ఆమె కుటుంబం కోరుకోలేదు. ఆమె మహిళ కాబట్టి బయటకు వెళ్లి పని చేయకూడదని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ, ఆమె ఊరుకోలేదు.

    2004 నుంచి మరల్ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలతో మాట్లాడుతూ, వారు తమ హక్కుల గురించి తెలుసుకుని, బయటకు వెళ్లి పనులు చేస్తూ, ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలంటూ ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    గ్రామీణ ప్రాంతాల్లో గృహ హింస బాధిత మహిళల కోసం కూడా ఆమె పని చేస్తున్నారు. వారికి ఆశ్రయం లభించేలా చూస్తున్నారు. న్యాయం కోసం వారు పోరాడేందుకు సాయపడుతున్నారు.

    *మేము సర్వం కోల్పోయామని, నిస్పృహలోకి వెళ్లినట్టు అనిపించింది. కానీ, ఇప్పటివరకు మేము చేసిందంతా గుర్తు చేసుకున్నాక, మా పోరాటం కొనసాగించాలనే ధైర్యం మళ్లీ వచ్చింది. ఇక వెనకడుగు వేయను. శాంతి, మానవత్వం కోరుకునేవారిదే భవిష్యత్తు.

  • మసౌమా

    అఫ్గానిస్తాన్పబ్లిక్ ప్రాసిక్యూటర్

    అఫ్గానిస్తాన్‌లో మహిళా ప్రాసిక్యూటర్‌గా, లీగల్ కేసులకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడంలో కీలకంగా పనిచేశారు మసౌమా*. ఆమె లా గ్రాడ్యుయేట్. గత ఇరవై ఏళ్లలో విద్యావంతులైన అనేక మంది అఫ్గాన్ మహిళల్లో ఆమె ఒకరు. అటార్నీ జనరల్ కార్యాలయంలో మసౌమా అయిదేళ్లువిధులు నిర్వహించారు. తన ప్రజలకు సేవ చేయడం పట్ల తాను గర్వపడుతున్నానని ఆమె చెప్పారు.

    ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ చేజిక్కించుకున్న తర్వాత ఖైదీలను విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో వేలాది మంది కరడుగట్టిన నేరస్థులు, ఇస్లామిస్ట్ మిలిటెంట్లు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి హాని కలిగించబోమని తాలిబాన్ ప్రకటించినప్పటికీ, హత్యలు, అపహరణలు జరిగాయని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల నివేదికలు పేర్కొన్నాయి.

    ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మసౌమా, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు.

    *ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలు, బాలికలు ఉన్నారు. వారికి అవకాశాలు కల్పిస్తే, మహిళలు కూడా పురుషుల్లాగే తమ ప్రజలకు, దేశానికి సేవ చేయగలరు.

  • ఫియామె నవోమి మటాఫా

    సమోవాప్రధానమంత్రి

    సమోవా తొలి మహిళా ప్రధాన మంత్రి, ఫాస్ట్ పార్టీ నాయకురాలు. మటాఫా 27 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఉప ప్రధానమంత్రిగా, మహిళలు, కమ్యూనిటీ, సామాజిక అభివృద్ధి మంత్రిగా, న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

    ఆమె ఒక ఉన్నత మహిళా అధిపతి. రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకునే మహిళలకు స్ఫూర్తిదాత.

    గ్లోబల్ వార్మింగ్‌కు గురయ్యే అత్యంత బలహీనమైన ప్రాంతాల్లో సమోవా ఒకటి. ఆ దేశంలోని వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడడమే లక్ష్యంగా మటాఫా తన ఎజెండాలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తారు.

    *ఎక్కడ ఐకమత్యం ఉంటుందో అక్కడ మన భవిష్యత్తు తరాలకు ఆశ ఉంటుంది.

  • సలీమా మజారీ

    ఇరాన్రాజకీయ నేత, జిల్లా మాజీ గవర్నర్

    అఫ్గానిస్తాన్‌లోని ముగ్గురు మహిళా జిల్లా గవర్నర్లలో ఒకరు సలీమా మజారీ. ప్రభుత్వ అనుకూల మిలీషియా నాయకురాలిగా, ముందుండి తాలిబాన్లతో పోరాడుతూ ఈ ఏడాది పతాక శీర్షికల్లో నిలిచారు ఆమె.

    ఒక శరణార్థిగా, ఇరాన్‌లో డిగ్రీ వరకు చదువుకున్న మజారీ తర్వాత అఫ్గానిస్తాన్‌కు తిరిగొచ్చారు. 2018లో ఆమె బాల్ఖ్ ప్రావిన్స్‌లోని చార్కింట్ జిల్లాకు గవర్నర్ అయ్యారు. ఆమె దాదాపు వంద మందికి పైగా తాలిబాన్ తిరుగుబాటుదారులు లొంగిపోయేలా చేయడంలో సఫలమయ్యారు. 2021లో తాలిబాన్‌కు ఈ జిల్లాలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. కాబుల్ నగరం తాలిబాన్ చేతుల్లోకి వెళ్లేంతవరకూ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న అతికొద్ది జిల్లాల్లో చార్కింట్ ఒకటి.

    మజారీని తాలిబాన్లు బంధించారని భావించినప్పటికీ, ఆమె తప్పించుకొని అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఆమె పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు.

    *మహిళగా, హజారాగా, షియాగా, పర్షియన్ మాట్లాడే వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. ఇలాంటి గుర్తింపు కలిగి ఉండటాన్ని నా స్వదేశం అఫ్గానిస్తాన్‌లో నేరంగా చూడని రోజు వస్తుందని ఆశిస్తున్నాను.

  • డెపెల్షా థామస్ మెక్‌గ్రుడర్

    అమెరికామామ్స్ ఆఫ్ బ్లాక్ బాయ్స్ యునైటెడ్ వ్యవస్థాపకురాలు

    డెపెల్షా థామస్ మెక్‌గ్రూడర్ 'మామ్స్ ఆఫ్ బ్లాక్ బాయ్స్ యునైటెడ్' (ఎంఓబీబీ), దాని అనుబంధ సంస్థ 'ఎంఓబీబీ యునైటెడ్ ఫర్ సోషల్ ఛేంజ్' వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు. ఈ సంస్థల ద్వారా అమెరికావ్యాప్తంగా "నల్లజాతి పిల్లల తల్లుల ఆందోళనలను" ఒకచోట చేర్చే ప్రయత్నం చేస్తున్నారామె. నల్లజాతి బాలురు, పురుషులతో ప్రవర్తించే విధానాల్లో మార్పులు తీసుకొచ్చే అంశాలపై ఈ సంస్థలు దృష్టి సారిస్తాయి.

    ప్రస్తుతం ఆమె ఫోర్డ్ ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ట్రెజరర్‌గా వ్యవహరిస్తున్నారు. విధుల్లో భాగంగా గ్లోబల్ ఆపరేషన్స్, ఫైనాన్స్‌లను పర్యవేక్షిస్తారు.

    మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాల్లో మెక్‌గ్రుడర్‌కు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటీవీ, బ్లాక్ ఎంటర్‌టైన్మెంట్ టెలివిజన్‌లలో బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుగా, సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేశారు.

    *మహమ్మారి నుంచి బయటపడే ప్రయత్నంలో మనుషులు మరింత సహానుభూతిని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నారు. మనమంతా ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామని గ్రహిస్తూ, ఇతరుల కష్టాల పట్ల, వారు ఎదుర్కునే సవాళ్ల పట్ల మరింత సున్నితంగా వ్యవరిస్తారని ఆశిస్తున్నా.

  • ములు మెఫ్సిన్

    ఇథియోపియానర్స్

    పదేళ్లకు పైనే నర్స్‌గా అనుభవం సంపాదించిన ములు మెఫ్సినా ప్రస్తుతం మెకెల్లెలోని వన్ స్టాప్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఇది, ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతీయ రాజధాని. లైంగిక వేధింపులు, హింసకు గురైన వారికి ఈ కేంద్రం వైద్య, మానసిక ఆరోగ్య, న్యాయ సేవలను అందిస్తుంది.

    గత మూడేళ్లుగా మెఫ్సిన్, టిగ్రేలో యువతులు, మహిళలపై హింసను అంతం చేసే ప్రచారం నిర్వహిస్తున్నారు. 2020 చివర్లో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమస్య మరింత జటిలమైంది.

    స్వయంగా ట్రామా అనుభవిస్తున్నప్పటికీ, ఏదో ఒకరోజు శాంతి స్థాపన జరుగుతుందనే ఆశతో నర్స్ మెఫ్లిన్ తన సేవలను కొనసాగిస్తున్నారు.

    *ప్రపంచంలోని వివాదాలన్నింటికీ తెరపడాలి. ఆయుధాల అమ్మకాలపై చర్చలు కాకుండా శాంతి స్థాపన కోసం దేశాలు కృషి చేయాలి. యువతులపై, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడే రేపిస్టులను శిక్షించే చట్టాలను కచ్చితంగా అమలుచేయాలి. అప్పుడే ప్రపంచం సాధారణ స్థితికి వచ్చినటు లెక్క.

  • మొహదేసే మిర్జాయీ

    అఫ్గానిస్తాన్పైలట్

    అఫ్గానిస్తాన్‌లో కమర్షియల్ విమానం పైలట్‌గా ఎంపికైన మొట్టమొదటి మహిళ మొహదేసే మిర్జాయీ. అఫ్గాన్ చరిత్రలో సిబ్బంది అంతా మహిళలే ఉండే తొలి విమానం కామ్ ఎయిర్ బోయింగ్ 737ని ఈ ఏడాది ఆరంభంలో ఆమె తన నియంత్రణలోకి తీసుకున్నారు. 2020 సెప్టెంబర్‌లో కమర్షియల్ పైలట్ అయిన తర్వాత, ఆమె విమానం నడుపుతూ టర్కీ, సౌదీ అరేబియాతో పాటు భారత్‌కు కూడా వచ్చారు.

    తాలిబాన్‌లు కాబుల్‌లోకి ప్రవేశించినప్పుడు, ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంతో బయలుదేరేందుకు పైలట్ మీర్జాయీ సిద్ధమవుతున్నారు. కానీ, పరిస్థితులు చేయిదాటిపోడంతో ఆ విమానం అక్కడే ఉండిపోయింది. దాంతో, ఆమె ఒక ప్రయాణికురాలిగా తన దేశాన్ని వదిలి మరో విమానంలో వెళ్లిపోయారు. “మహిళలు, పురుషులు పక్కపక్కనే కలిసి పనిచేసుకునేలా, సమాజంలో సమానత్వం కోసం పాటుపడతాను" అని మిర్జాయీ చెప్పారు.

    ఆమె త్వరలో మళ్లీ విమానం నడుపుతాననే ఆశాభావంతో ఉన్నారు.

    *ఎవరో వస్తారని ఎదురు చూడకండి! మీరు గట్టిగా నిలబడకపోతే, ఎవరూ వచ్చి మీకు రెక్కలు ఇవ్వరు. నేను నా కోసం పోరాడాను, మీరు మీ కోసం పోరాడాలి. మనమంతా ఏకమైతే, ఎవరూ ఆపలేరు.

  • ఫాహిమా మీర్జాయ్

    అఫ్గానిస్తాన్సూఫీ నృత్యకారిణి

    ఇస్లామిక్ సూఫీ సామా వేడుకలో భాగమైన సంప్రదాయ నృత్యాన్ని ప్రాక్టీస్ చేసిన ఏకైక అఫ్గాన్ మహిళ ఫాహిమా. లింగ భేదం లేని సూఫీ నృత్య ప్రదర్శనల కోసం ‘షోహుడ్ కల్చరల్ అండ్ మిస్టికల్ ఆర్గనైజేషన్’‌ను ఆమె ప్రారంభించారు.

    ఇప్పటికీ స్త్రీ, పురుషులు కలిసి పనిచేయడం నిషిద్ధంగా భావించే అఫ్గానిస్తాన్‌ సంప్రదాయ, మతపరమైన సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకోవడానికి నృత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారామె. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అఫ్గానిస్తాన్‌లో సహనాన్ని పెంపొందించాలని ఆమె ఆకాంక్షించారు.

    గిరగిరా తిరుగుతూ చేసే ఈ సూఫీ నృత్యం చేయడం ఇస్లాం మత విశ్వాసాలకు, ఇస్లామిక్ చట్టానికి విరుద్ధమని తాలిబాన్లు ప్రకటించడంతో 2021లో ఫాహిమా అఫ్గానిస్తాన్‌ నుంచి పారిపోవాల్సి వచ్చింది.

    *ఆధ్యాత్మికతకు ప్రథమ స్థానం ఇస్తాను: మనలోనే శాంతిని వెతుక్కునేందుకు మనం ప్రయత్నించాలి, తర్వాత ఆ అంతర్గత శాంతిని ప్రపంచమంతా వ్యాపింపజేయాలి.

  • ట్లాలెంగ్ మొఫోకెంగ్

    దక్షిణాఫ్రికాఆరోగ్య హక్కులపై యూఎన్ రిపోర్టర్

    వైద్యురాలు, మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం హక్కుల కార్యకర్త అయిన ట్లాలెంగ్‌ను ఆప్యాయంగా డాక్టర్ టి అని పిలుస్తారు. సార్వత్రిక ఆరోగ్య సౌకర్యాలు, హెచ్ఐవీ సంరక్షణ, కుటుంబ-నియంత్రణ సేవలపై ఆమె దృష్టి సారిస్తారు.

    డాక్టర్ ట్లాలెంగ్ మొఫోకెంగ్ ప్రస్తుతం శారీరక, మానసిక ఆరోగ్య హక్కులపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. ఈ స్థానాన్ని పొందిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ ఆమె. ట్లాలెంగ్ రాసిన 'డాక్టర్ టి: ఏ గైడ్ టు సెక్సువల్ హెల్త్ అండ్ ప్లెజర్' పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

    కుటుంబ నియంత్రణ అంశంలో కృషి చేస్తున్న యువతకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అందించే '120 అండర్ 40' అవార్డు విజేతల్లో మోఫోకెంగ్ ఒకరు. ఈ అవార్డు ఆమెకు 2016లో లభించింది.

    *సమాజాన్ని ప్రేమించడమే నాకు స్వస్థత. ఈ ప్రపంచాన్ని ఇలా రీసెట్ చేయాలనుకుంటున్నాను.

  • తాన్యా ముజిందా

    జింబాబ్వేమోటోక్రాస్ అథ్లెట్

    పురుషాధిక్యం ఉన్న మోటోక్రాస్ లేదా ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ రేసింగ్‌లో తాన్యా ముజిందా తన సత్తా చాటుకున్నారు. జింబాబ్వే ఆఫ్-రోడ్ సర్క్యూట్‌ల ఛాంపియన్‌గా ఎదిగారు. మోటోక్రాస్ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న తొలి జింబాబ్వే మహిళ ఆమె.

    తాన్యా తండ్రి కూడా ఒకప్పుడు బైకరే. ఆయన్నుంచి ప్రేరణ పొందిన తాన్యా అయిదేళ్ల వయసులోనే శిక్షణ ప్రారంభించారు. ప్రస్తుతం 17 ఏళ్ల తాన్యా మహిళల మోటోక్రాస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకోబోయే తొలి నల్లజాతి ఆఫ్రికన్ కావాలని ఆశపడుతున్నారు. 2018లో ఆఫ్రికన్ యూనియన్ ఆమెకు జూనియర్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చి సత్కరించింది.

    తన మోటోక్రాస్ సంపాదనతో తాన్యా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. హరారేలో పాఠశాలకు వెళ్ళే దాదాపు 100 మంది విద్యార్థులకు ట్యూషన్ ఫీస్ చెల్లిస్తున్నారు.

    *నేను ప్రపంచాన్ని రీసెట్ చేయాలనుకోవడం లేదు. అది ఎప్పుడూ పరిపూర్ణంగా లేదు. ప్రపంచంలో ఎప్పుడూ కొంత మంచి, కొంత చెడు ఉంటూనే ఉంది. వర్తమానాన్ని సరిదిద్దుకుందాం. మనం ఎదుర్కుంటున్న సమస్యలు భవిషత్తు తరాలకు లేకుండా చేద్దాం.

  • చిమామందా ఎన్‌గోజి అడిచి

    నైజీరియారచయిత

    అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నైజీరియన్ రచయిత్రి, స్త్రీవాది. ఆమె రచనలను 30కి పైగా భాషల్లోకి అనువదించారు. చిమామందా అడిచి 19 ఏళ్ల వయసులో కమ్యూనికేషన్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ అభ్యసించడానికి అమెరికా వెళ్లారు.

    ఆమె తొలి నవల 'పర్పుల్ హైబిస్కస్' (2003)కు కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ లభించింది. 2013లో రాసిన 'అమెరికానా' నవల ది న్యూయార్క్ టైమ్స్ టాప్ 10 పుస్తకాలలో ఒకటిగా నిలిచింది.

    2012 టెడ్ టాక్స్‌లో ఆమె ఇచ్చిన ప్రసంగం "వియ్ షుడ్ ఆల్ బి ఫెమినిస్ట్స్" ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. స్త్రీవాదం గురించి చర్చలను లేవనెత్తింది. దాన్నే 2014లో పుస్తకంగా ప్రచురించారు. తన తండ్రి ఆకస్మిక మరణం తరువాత, ఆయనకు నివాళిగా ఇటీవలే ఆమె 'నోట్స్ ఆన్ గ్రీఫ్' (2021) పుస్తకం రాశారు.

    *ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణను మానవ హక్కుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. స్థాయి, స్థోమతలతో సంబంధం లేకుండా బతికున్న ప్రతీ మనిషికి అందవలసిన హక్కు అది.

  • లిన్ ఎన్‌గుగి

    కెన్యాజర్నలిస్ట్

    టుకో డిజిటల్ న్యూస్‌లో జర్నలిస్టుగా ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు.

    తొలుత ఆమె క్యాన్సర్ రోగులను చూసుకునే స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేశారు. 2011లో కివో చిత్రాలతో ఆమె మీడియా వృత్తిని ప్రారంభించారు. తరువాత, కొన్నాళ్లు ఖతార్ ఫౌండేషల్‌లో పనిచేశారు. స్వదేశంలో ఎన్‌గుగిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ప్రముఖ మీడియా వ్యక్తిగా పరిగణిస్తారు.

    తొలుత ఆమె క్యాన్సర్ రోగులను చూసుకునే స్వచ్ఛంద సేవకురాలిగా పనిచేశారు. 2011లో కివో చిత్రాలతో ఆమె మీడియా వృత్తిని ప్రారంభించారు. తరువాత, కొన్నాళ్లు ఖతార్ ఫౌండేషల్‌లో పనిచేశారు. స్వదేశంలో ఎన్‌గుగిని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ప్రముఖ మీడియా వ్యక్తిగా పరిగణిస్తారు.

    *అందరికీ భద్రత దొరికే విధంగా ప్రపంచం మారాలి.

  • అమందా ఎన్‌గుయెన్

    అమెరికాసామాజిక వ్యవస్థాపకురాలు

    అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురైన మహిళల హక్కులను పరిరక్షించే 'రైజ్' సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటిఫ్‌గా వ్యవహరిస్తున్నారు అమందా ఎన్‌గుయెన్.

    పౌర హక్కుల కార్యకర్త, సోషల్ ఎంట్రప్రెన్యూర్ అయిన అమంద ఎన్‌గుయెన్ రైజ్ సంస్థను స్థాపించారు. 2013లో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆమె అత్యాచారానికి గురయ్యారు. సంఘటన జరిగిన ఆరు నెలల లోపల కేసు వేయకపోతే సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేస్తారని ఆమెకు తెలిసింది. ఆ తరువాత, సాక్షాధారాలను భద్రపరచడం బాధితుల హక్కుగా తెలిపే 'అత్యాచార బాధితుల హక్కుల ' చట్టాన్ని రూపొందించడంలో ఆమె ముఖ్య పాత్ర పోషించారు.

    అమెరికాలో ఆసియా వ్యతిరేక ద్వేషపూరిత నేరాలపై 2021లో ఆమె చేసిన వీడియో వైరల్ అయింది. 'స్టాప్ ఆసియన్ హేట్' ఉద్యమానికి ఇది నాంది పలికింది.

    *మనమంతా కలిసికట్టుగా ఉంటే బలహీనులంటూ ఉండరు. మనం చూడాలనుకుంటే దేన్నైనా చూడొచ్చు.

  • బసీరా పైఘామ్

    అఫ్గానిస్తాన్లింగ వివక్షపై పోరాడే కార్యకర్త

    అఫ్గానిస్తాన్‌లో ఎల్‌జీబీటీ స‌భ్యుల హక్కుల కోసం పోరాడటమంటే సవాలుతో కూడిన పని. అయితే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా లింగ సమానత్వం, లింగపరమైన మైనార్టీల కోసం అయిదేళ్లుగా పనిచేస్తున్నారు బసీరా.

    లింగ సమానత్వం, లైంగికత గురించి ఆమె అవగాహన సదస్సులు నిర్వహించారు. బసీరా తన సహచరులతో కలిసి, సమాజంలో వివక్షకు గురవుతున్న ఎల్‌జీబీటీ సభ్యులకు వైద్య చికిత్సలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఎల్‌జీబీటీ సభ్యులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందనే విషయాన్ని గ్రహించిన ఆమె, వారికి మానసిక నిపుణుల సలహాలు అందేలా చూశారు.

    ప్రస్తుతం ఆమె ఐర్లాండ్‌లో ఉంటున్నారు. అఫ్గానిస్తాన్‌లోని ఎల్‌జీబీటీలకు గుర్తింపు కోసం, వారి హక్కులు, స్వేచ్ఛ కోసం ఆమె తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

    *అఫ్గానిస్తాన్ ప్రజలు తమ మతం, లింగం, లైంగికత గురించి ఆలోచించకుండా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలరని నేను ఆశిస్తున్నాను. మేము మౌనంగా కూర్చోం, చేయాల్సిందల్లా చేస్తాం, మనస్తత్వాలను మార్చడంలో విజయం సాధిస్తాం.

  • నటాలియా పాస్టర్నాక్ టాష్నర్

    బ్రెజిల్మైక్రోబయాలజిస్ట్, సైన్స్ కమ్యూనికేటర్

    కోవిడ్-19 మహమ్మారి సమయంలో, బ్రెజిల్‌లోని లక్షలాది ప్రజలకు కీలకమైన, ప్రాణాలను రక్షించే శాస్త్రీయ సమాచారాన్ని అందించారు నటాలియా పాస్టర్నాక్ టాష్నర్. వార్తాపత్రికల్లో కథనాలు రాసి, రేడియో, టీవీల్లో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషిచేశారు.

    నటాలియా పాస్టర్నాక్ ఒక సైన్స్ రచయిత, మైక్రోబయాలజిస్ట్. సావో పాలో విశ్వవిద్యాలయంలో బ్యాక్టీరియా జన్యుశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. ఆమె పరిశోధనలను మెచ్చుకుంటూ ప్రపంచ ప్రఖ్యాత న్యూరో సైంటిస్ట్, సైన్స్ రచయిత స్టువర్ట్ ఫైర్‌స్టెయిన్ ఆమెను న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు.

    పాస్టర్నాక్ 'క్వశ్చన్ ఆఫ్ సైన్స్ ఇనిస్టిట్యూట్' వ్యవస్థాపకురాలు, ప్రస్తుత అధ్యక్షురాలు కూడా. పబ్లిక్ పాలసీలలో శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించడానికి అంకితమైన లాభాపేక్షలేని సంస్థ ఇది.

    *హోలోకాస్ట్ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తిగా నిరంకుశ ప్రభుత్వాలు ప్రజలకు ఏ దుస్థితి కలిగించగలవో నాకు తెలుసు. మహమ్మారి సమయంలో బ్రెజిల్‌లో సైన్స్ పక్షాన మాట్లాడి, "ఎప్పుడు మర్చిపోకూడని" అంశాలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించాను.

  • మోనికా పౌలస్

    పాపువా న్యూ గినీక్షుద్రవిద్య సంబంధిత హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేసే యాక్టివిస్ట్

    మానవ హక్కుల కార్యకర్త అయిన మోనికా పౌలస్ 'హైలాండ్స్ వుమెన్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ నెట్‌వర్క్' సహ వ్యవస్థాపకురాలు. క్షుద్రవిద్య, చేతబడుల ఆరోపణలు ఎదుర్కుంటూ హింసకు గురవుతున్న వారికి ఈ సంస్థ సహాయం చేస్తుంది. చేతబడి చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కునే మహిళలకు ఆశ్రయం, న్యాయ సహాయం అందిస్తుంది. ఇలాంటి కేసులను ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకువెళుతుంది.

    ఈ సంస్థ ప్రయత్నాల ఫలితంగా పాపువాన్ ప్రభుత్వం ఇలాంటి హింసలపై దృష్టి సారించేందుకు కమిటీలను ఏర్పాటుచేసింది.

    2015లో పౌలస్ యూఎన్ 'వుమన్ ఆఫ్ అచీవ్మెంట్' పురస్కారాన్ని పొందారు. అలాగే, ఆమె చూపించిన ధైర్యసాహసాలకు 'ప్రైడ్ ఆఫ్ పాపువా న్యూ గినీ అవార్డు ఫర్ వుమెన్' అందుకున్నారు. ప్రపంచంలోని ధైర్యవంతులైన మహిళల్లో ఒకరిగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా ఆమెను ప్రశంసించింది.

    *ప్రపంచాన్ని రీసెట్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరం మానవ జాతిలో భాగమేనని గుర్తుంచుకోవాలి. జెండర్ కారణంగా ఎవరికీ ఎలాంటి అడ్డంకులూ ఎదురవ్వకూడదు.

  • రెహానా పోపాల్

    అఫ్గానిస్తాన్న్యాయవాది

    రెహానా పోపాల్ ఇమిగ్రేషన్, సివిల్ లా స్పెషలిస్టు. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన ఇంటర్‌ ప్రీటర్లకు, అనువాదకులకు, మరికొందరికి ఆమె అండగా నిలుస్తున్నారు.

    ఇంగ్లండ్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన మొదటి అఫ్గాన్ మహిళ పోపాల్. ఆమె ఐదేళ్ల వయసులో శరణార్థిగా బ్రిటన్‌కు వెళ్లారు. అంతర్జాతీయ రాజకీయాలను, చట్టాలను అధ్యయనం చేశారు. ఇప్పుడు మానవ హక్కుల న్యాయవాదిగా పనిచేస్తున్నారు.

    2019లో ‘ఇన్‌స్పిరేషనల్ ఉమెన్ ఇన్ లా అవార్డ్స్‌’లో బారిస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఆమె ఎంపికయ్యారు.

    *భవిష్యత్తులో అఫ్గానిస్తాన్‌లోని మహిళలు, బాలికలు చదువుకొని, ఉద్యోగాలు చేస్తూ, నిర్భయంగా జీవించగలిగే స్వేచ్ఛ లభిస్తుందని ఆశిస్తున్నాను.

  • మంజులా ప్రదీప్

    భారతదేశంమానవ హక్కుల కార్యకర్త

    భారతదేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే న్యాయవాది, ఉద్యమకారిణి. గుజరాత్‌లోని ఓ దళిత కుటుంబానికి చెందిన మంజులా ప్రదీప్ కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆమె నవసర్జన్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇది దళిత హక్కుల కోసం పనిచేసే సంస్థ.

    ఈ ఏడాది మంజుల 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ లీడర్స్' సంస్థను భాగస్వాములతో కలిసి స్థాపించారు. అలాగే, దేశంలోని అట్టడుగున వర్గాలకు చెందిన యువతను శక్తిమంతులుగా చేసేందుకు 'వైజ్ యాక్ట్ ఆఫ్ యూత్ విజనింగ్ అండ్ ఎంగేజ్‌మెంట్‌'ను స్థాపించారు.

    అంతర్జాతీయ దళిత సాలిడారిటీ నెట్‌వర్క్‌లో సభ్యురాలిగా యూఎన్ వరల్డ్ కాన్ఫరెన్స్‌ అగైన్స్ట్ రేసిజంలో దళిత హక్కుల గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.

    *సహానుభూతి, ప్రేమ పెంపొందే విధంగా ప్రపంచం మారాలి. అణగారిన వర్గాల మహిళలు శాంతియుతమైన, న్యాయమైన సమాజం వైపు అడుగులు వేసేందుకు దోహదపడే ప్రపంచం కావాలి.

  • రజ్మా

    అఫ్గానిస్తాన్సంగీత విద్వాంసురాలు

    ‘రజ్మా’ నిష్ణాతులైన సంగీత వాయిద్యకారిణి. పురుషులకే ప్రత్యేకం అనుకునే సంగీత వాద్యాన్ని ఆమె వాయిస్తారు. సంగీతకారుల కుటుంబానికి చెందిన ఆమె, మ్యూజిక్ అండ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అఫ్గానిస్తాన్‌తో పాటు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రముఖ కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చారు.

    తన సంగీతం ద్వారా ప్రపంచానికి అఫ్గానిస్తాన్‌కు సంబంధించి ఓ కొత్త కోణాన్ని చూపించాలనుకున్నానని, కానీ ఇది అఫ్గాన్ మహిళలకు "చీకటి సంవత్సరం”గా మిగిలిపోయిందని ఆమె అన్నారు. సంగీత విద్వాంసురాలిగా ఉండి కూడా ఇతరులతో కలిసి పాడలేకపోవడం, ప్రదర్శనలు ఇవ్వలేకపోవడం అత్యంత బాధాకరమని ఆమె చెప్పారు.

    1996 నుంచి 2001 వరకు అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ పాలించినప్పుడు సంగీతం నిషేధం విధించింది. అఫ్గాన్ సంగీతకారులకు చరిత్ర పునరావృతమవుతోందని 'రజ్మా' భయపడుతున్నారు.

    *సంగీతం, పాటలు లేని సమాజం గురించి ఆలోచనలు నన్ను ఎన్నడూ లేనంతగా కుంగదీస్తున్నాయి. మూగబోయిన మా దేశ మహిళల గొంతులు ఏకమై, హక్కుల కోసం నినదిస్తాయని ఆశిస్తున్నాను.

  • రోహిలా

    అఫ్గానిస్తాన్పాఠశాల విద్యార్థిని

    అఫ్గానిస్తాన్‌లో అధికారం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి సెకండరీ పాఠశాలల్లో బాలికలను అనుమతించడంలేదు. అలా బడికి దూరమైన అనేకమంది బాలికల్లో రోహిలా ఒకరు. ఆమెకు ఇష్టమైన సబ్జెక్టులు సైన్స్, ఇంగ్లీష్. తన సోదరులతో కలిసి తాను కూడా రోజూ బడికి వెళ్లాలని ఆమె కోరుకుంటున్నారు.

    తన స్నేహితుల్లో అతికొద్ది మంది అమ్మాయిలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని, టీచర్ లేకుండా చదువుకోవడం కష్టంగా ఉందని రోహిలా అంటున్నారు.

    సైకాలజీ చదవాలని, విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ సాధించాలన్నది ఆమె కల.

    *అఫ్గానిస్తాన్‌కు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి, ఉన్నత చదువులు చదవాలనే నా కల నెరవేరేలా లేదు. అంతర్జాతీయ సమాజం మమ్మల్ని మరచిపోదని, ఇన్నేళ్ల మన శ్రమ వృధాగా పోదని ఆశిస్తున్నాను.

  • అల్బా రుయెడా

    అర్జెంటీనాట్రాన్స్ యాక్టివిస్ట్

    అర్జెంటీనా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవిని పొందిన మొదటి ట్రాన్స్ వ్యక్తి అల్బా రుయెడా. వుమెన్, జెండర్, డైవర్సిటీ మంత్రిత్వ శాఖలో డైవర్సిటీ పాలసీస్ అండర్ సెక్రటరీగా ఉన్నారు.

    విద్యావేత్త, యాక్టివిస్ట్ అయిన రుయెడా 'ట్రాన్స్ వుమన్ అర్జెంటీనా'లో ప్రముఖులు. ట్రాన్స్‌జెండర్, ట్రాన్స్‌వెస్టైట్ వ్యక్తులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో 1% రిజర్వేషన్ కల్పించే ట్రాన్స్ లేబర్ కోటా బిల్లు కోసం ఈ సంస్థ పోరాటం చేసింది. ఈ సంచలనాత్మక బిల్లుకు కాంగ్రెస్‌లో అధిక మద్దతు లభించింది. 2021 జూన్‌లో చట్టంగా మారింది.

    2019లో, తన జాతీయ గుర్తింపు పత్రంలో ఉన్నట్లుగా పేరు, జెండర్‌ను చర్చి రికార్డులలో మార్చడానికి నిరాకరించిన క్యాథలిక్ ఆర్చ్‌బిషప్‌పై దావా వేశారు రుయెడా.

    *అసమానతలను పెంచడంలో ఆర్థిక విధానాల పాత్రను 2021వ సంవత్సరం మన కళ్ల ముందు ఉంచింది. సమాజ అభివృద్ధికి ట్రాన్స్‌ఫెమినిస్ట్ దృక్పథంతో కూడిన విధానాలను ప్రోత్సహించడం అవసరం.

  • రుక్సానా

    అఫ్గానిస్తాన్సర్జన్

    డాక్టర్ రుక్సానా ఒక సర్జన్, అసిస్టెంట్ ప్రొఫెసర్. సంఘర్షణ కారణంగా మిగతా ప్రావిన్సుల నుంచి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన రోగులకు అవసరమైన కనీస వైద్య సేవలు అందించేందుకు ఆమె ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

    సంఘర్షణ కొనసాగుతున్నప్పుడు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె పనిచేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న వారికి వైద్య సేవలు అందించారు. నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ కోసం వలంటీర్‌గా కూడా పనిచేసే రుక్సానా, ప్రస్తుతం బ్రెస్ట్-క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

    సర్జరీలు చేసేటప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపించే రుక్సానా, అఫ్గాన్ వైద్య విద్యార్థులకు తాను ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నారు.

    *ముఖ్యమైన మార్పు ఏదైనా సరే.. అది నాయకుల నిబద్ధత, అంకితభావం ఫలితమే అవుతుంది. నేను లీడర్ కాకపోవచ్చు, కానీ బలహీనమైన, అవినీతిమయమైన ఆరోగ్య వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు నేను అఫ్గానిస్తాన్‌లోనే ఉంటాను.

  • హలిమా సదాఫ్ కరిమీ

    అఫ్గానిస్తాన్రాజకీయ నాయకురాలు, మాజీ ఎంపీ

    అఫ్గానిస్తాన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు, జోవ్జాన్ ప్రావిన్సుకు చెందిన హలిమా సదాఫ్ కరిమీ చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు.

    అఫ్గానిస్తాన్‌లోని సుమారు 70 మంది మహిళా ఎంపీలు ఉండేవారు. వారిలో ఉజ్బెక్ మైనారిటీ సముదాయం నుంచి పార్లమెంటుకు వెళ్లిన ఏకైక మహిళ హలిమా. తన కమ్యూనిటీ హక్కుల కోసం పార్లమెంటు వేదికగా ఆమె పోరాడారు. పొలిటికల్ సైన్స్‌ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్న ఆమె, మహిళల హక్కుల కోసం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తాలిబాన్ల నుంచి పదేపదే బెదిరింపులు రావడంతో ఆమె పలుమార్లు ఇల్లు మారాల్సి వచ్చింది.

    యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆమె తమ్ముడిని 2020లో తాలిబాన్లు చంపేశారు.

    *ఎప్పుడైనా స్వార్థపూరిత పాలకులు ఆదిలోనే వైఫల్యాలను చవిచూస్తారు. అఫ్గాన్ మహిళలు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వ్యవహారాల్లో భాగస్వాములై, తమ హక్కులను సాధించుకుంటారని, తద్వారా మానవతా సంక్షోభాన్ని నివారించవచ్చని ఆశిస్తున్నాను.

  • రోయా సాదత్

    అఫ్గానిస్తాన్సినీ దర్శకురాలు

    తాలిబాన్ పాలనా కాలంలో అఫ్గానిస్తాన్‌లో ఉద్భవించిన మొట్టమొదటి మహిళా డైరెక్టర్ రోయా సాదత్. రెండు దశాబ్దాలుగా ఆమె రూపొందించిన చలన చిత్రాలు అఫ్గాన్ మహిళల గోడును, వారి బతుకు చిత్రాన్ని, వారు ఎదుర్కొంటున్న ఆంక్షలను ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపాయి.

    ఆమె 2017లో విడుదల చేసిన ‘ఎ లెటర్ టు ది ప్రెసిడెంట్’ చిత్రం ఆస్కార్ అవార్డ్స్‌కు ఉత్తమ విదేశీ- భాషా చిత్రం విభాగంలో అఫ్గాన్ ఎంట్రీగా ఎంపికైంది.

    ఆమె రోయా ఫిల్మ్ హౌజ్ సహవ్యవస్థాపకులు, అధ్యక్షురాలు. ఇంటర్నేషనల్ విమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ అఫ్గానిస్తాన్ (ఐడబ్ల్యూఎఫ్ఎఫ్)ను స్థాపించింది కూడా రోయానే. దానికి ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

    *తాలిబాన్ తొలి విడత పాలనా సమయంలో, వారి పాలనకు ముగింపు పడుతుందని, మూతపడ్డ స్కూలు గేట్లు నా కోసం మళ్లీ తెరుచుకుంటాయని ఆశించాను. ఇప్పుడు కూడా, స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం చేస్తున్న ప్రజల పోరాటం గెలుస్తుందని విశ్వసిస్తున్నాను.

  • షోగుఫా సఫి

    అఫ్గానిస్తాన్వాద్య బృందం నాయకురాలు

    అఫ్గానిస్తాన్‌లో అందరూ మహిళలే ఉండే మొట్టమొదటి వాద్య బృందం ‘జోహ్రా’కు నాయకురాలు షోగుఫా సఫి. ఆమె బృందంలో 13 నుంచి 20 ఏళ్ల వయసు వారున్నారు. వారిలో కొంతమంది నిరుపేద కుటుంబాలకు చెందినవారు, అనాథలు.

    పర్షియన్ సంగీత దేవత పేరు మీదుగా వీరి బృందానికి ‘జోహ్రా’ అని పేరు ‌‍పెట్టుకున్నారు. సంప్రదాయ అఫ్గాన్, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం కలగలిపి వీరు ప్రదర్శనలు ఇస్తుంటారు. 2014 నుంచి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఈ బృందం ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది.

    సఫి ఒకప్పుడు ప్రాక్టీస్ చేసిన అఫ్గానిస్తాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ (ఏఎన్ఐఎం)ని ఇప్పుడు తాలిబాన్ మూసివేసింది. ఆమెతో పాటు, ఆమె సహచరులు కొందరు స్వదేశాన్ని వదిలి దోహాకు పారిపోయారు. తమ వాయిద్య పరికరాలను అఫ్గానిస్తాన్‌లోనే వదిలివేయాల్సి వచ్చింది. వారంతా మళ్లీ కలిసి ప్రదర్శనలు ఇవ్వడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.

    *ఆశకు ఎప్పుడూ అపజయం ఉండదు. ఈ కటిక చీకటిలో, నా చేతిలోని బెత్తం అఫ్గానిస్తాన్‌కు ఆశాకిరణమై, వెలుగునిస్తుందని విశ్వసిస్తున్నాను.

  • సహర్

    అఫ్గానిస్తాన్ఫుట్‌బాల్ క్రీడాకారిణి

    అఫ్గానిస్తాన్‌లో ఫుట్‌బాల్ ఆడాలనుకునే అనేక మంది యువతుల్లో సహర్ ఒకరు. కానీ, తాలిబాన్ పాలనలో ఆమె ఇక ఆడలేరు. సహర్ గత కొన్నేళ్ల పాటు స్థానిక ఫుట్‌బాల్ జట్టు తరఫున ఆడారు. ఆట ద్వారా ఆమె చాలా మంది స్నేహితులను కలుసుకున్నారు.

    అఫ్గానిస్తాన్‌ తాలిబాన్ ఆధీనంలోకి వెళ్లగానే, ఆమె తన కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత స్వదేశాన్ని వీడి మరో దేశానికి వెళ్లిపోయారు.

    అఫ్గానిస్తాన్‌లోనే ఉండిపోయిన తన తోటి మహిళా క్రీడాకారుల గురించి ఆమె ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. అయితే, మళ్లీ ఫుట్‌బాల్ పిచ్‌పై అడుగుపెట్టాలన్న తన కల నెరవేరుతుందనే ఆశతో ఆమె ఉన్నారు.

    *నా చదువు కొనసాగించాలని, బాగా కష్టపడి నా లక్ష్యాలను సాధించి- నా కుటుంబం, నేను గర్వపడేలా చేయాలని ఉంది. నేను అనుకున్నది సాధించి, అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడలేరని అనేవాళ్ల నోళ్లు మూయించాలనుకుంటున్నాను.

  • సోమా సారా

    బ్రిటన్ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వైటెడ్ వ్యవస్థాపకురాలు

    ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వైటెడ్ అనేది ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయిన ఇన్స్టాగ్రాం అకౌంట్, వెబ్‌సైట్. లైంగిక వేధింపుల బాధితుల కోసం సోమా సారా దీన్ని 2020 జూన్‌లో ప్రారంభించారు. బాధితులు తమ పేర్లు బయటపెట్టకుండా తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఈ వేదికలపై పంచుకోవచ్చు. సెక్సిజంను ఖండించేందుకు, బ్రిటన్ స్కూళ్లు, యూనివర్సిటీల్లో "రేప్ కల్చర్"పై గొంతెత్తేందుకు ఈ వేదికలు అవకాశాన్ని కల్పిస్తాయి.

    ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన దగ్గర నుంచి 50,000లకు పైగా కథనాలు వెలువడ్డాయి. 2021 మార్చిలో సారా ఎవెరార్డ్‌ను ఒక లండన్ వీధి నుంచి కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఉదంతం తరువాత ఈ ప్రాజెక్ట్ మరింత ప్రాచుర్యం పొందింది.

    విద్యా సంస్థల్లోనే కాకుండా అన్ని చోట్లా వ్యాపించి ఉన్న పురుషాధిక్యాన్ని ఎదురించే దిశగా తమ ప్రచారాన్ని కొనసాగించాలని సారా ఆశిస్తున్నారు.

    *లైంగిక హింస బాధితుల కథలను ప్రపంచం వినాలని, వారిని నమ్మాలని, మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • మహబూబా సిరాజ్

    అఫ్గానిస్తాన్మహిళల హక్కుల ఉద్యమకారిణి

    26 ఏళ్లు అమెరికాలో ప్రవాస జీవితం గడిపిన తర్వాత, మహబూబా సిరాజ్ 2003లో తన స్వదేశమైన అఫ్గానిస్తాన్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి మహిళలు, బాలల హక్కుల కోసం పోరాడేందుకు అనేక సంస్థలకు నేతృత్వం వహించారు. కొన్నింటికి సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఇందులో బాగా పేరున్న అఫ్గాన్ ఉమెన్స్ నెట్‌వర్క్ (ఏడబ్ల్యూఎన్) కూడా ఒకటి. అఫ్గానిస్తాన్‌లో బలపడుతున్న మహిళా ఉద్యమానికి మూలస్తంభం ఈ సంస్థే.

    గృహ హింస బాధితులకు సాధికారత కల్పించడం, పిల్లల ఆరోగ్యం, విద్య కోసం పోరాడటం, అవినీతిపై యుద్ధం చేయడం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. 2021 ఆగస్టులో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, ఆమె తన ప్రజలకు అండగా నిలబడ్డారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో అఫ్గాన్ మహిళల ఆందోళనలను ధైర్యంగా వినిపించారు.

    2021లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది’ వ్యక్తులలో ఆమె ఒకరు అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.

    *నా దేశంలో శాంతి నెలకొనాలనేది నా మొదటి కోరిక. భవిష్యత్తు ఏమవుతుందోననే భయాన్ని నా అక్కాచెల్లెళ్లు, ఆడబిడ్డల కళ్లలో చూడకూడదనుకుంటున్నాను. జరిగింది చాలు!

  • ఎలిఫ్ షఫాక్

    ఫ్రాన్స్నవలా రచయిత

    టర్కిష్, బ్రిటిష్ రచయిత. మహిళలు, ఎల్జీబీటీ హక్కుల న్యాయవాది.

    ఎలిఫ్ షఫాక్ ఇప్పటివరకు 19 పుస్తకాలు రాశారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఆమె రాసిన '10 మినిట్స్ 38 సెకండ్స్ ఇన్ దిస్ స్ట్రేంజ్ వరల్డ్' బుకర్ ప్రైజ్‌కు షార్ట్ లిస్ట్ అయింది. బీబీసీ ఎంపిక చేసిన 'ప్రపంచాన్ని తీర్చిదిద్దిన 100 నవలలు' జాబితాలో షఫాక్ రాసిన 'ది ఫార్టీ రూల్స్ ఆఫ్ లవ్' చోటు సంపాదించుకుంది. ఆమె పుస్తకాలను 50 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించారు.

    పొలిటికల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన షఫాక్, టర్కీ, అమెరికా, బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో విద్యాబోధన చేశారు. "కథ చెప్పే కళను పునరుద్ధరించినందుకుగాను" ఆమెకు 2021లో హాల్డోర్ లాక్స్‌నెస్ ఇంటర్నేషనల్ లిటరరీ ప్రైజ్ లభించింది.

    *ప్రపంచంవ్యాప్తంగా మనం క్రాస్‌రోడ్స్‌లో నిలబడి ఉన్నాం. పాత ప్రపంచం ఇక లేదు. మళ్లీ పూర్వ స్థితికి చేరుకునేందుకు ప్రయత్నించే బదులు మెరుగైన, న్యాయమైన ప్రపంచాన్ని రూపొందించేందుకు కృషి చేయాలి. ఆ ప్రపంచంలో ఎవరూ వెనుకబడిపోకూడదు.

  • అనిసా షాహీద్

    అఫ్గానిస్తాన్పాత్రికేయురాలు

    అఫ్గానిస్తాన్‌లోని బాగా పేరున్న రిపోర్టర్లలో అనిసా షాహీద్ ఒకరు. ఆమె దాదాపు పదేళ్లకు పైగా మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయాలు, అవినీతి లాంటి అంశాలపై కథనాలు రాశారు. అఫ్గానిస్తాన్‌లోని అత్యంత ప్రభావవంతమైన న్యూస్ ఛానెళ్లలో ఒకటైన టోలో న్యూస్‌లో ఆమె పనిచేశారు. క్షేత్ర స్థాయి నుంచి ఎన్నో బ్రేకింగ్ న్యూస్‌లను కవర్ చేశారు.

    జర్నలిస్టుగా, మహిళగా ఉన్నందుకు ఆమెకు అనేక బెదిరింపులు వచ్చాయి. ఆగస్టు 15న అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆమె స్వదేశాన్ని వీడి పారిపోవాల్సి వచ్చింది. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో "ధైర్యవంతమైన" రిపోర్టింగ్‌ చేశారని మీడియా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేసే ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ సంస్థ ఆమెను ప్రశంసించింది.

    2021లో ఆమెను ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్’గా, ‘ది ఫేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’గా అఫ్గానిస్తాన్ ఫ్రీ స్పీచ్ హబ్ నెట్‌వర్క్ ప్రకటించింది.

    *పరాయి దేశానికి పారిపోయి, తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నేను శాంతియుతమైన అఫ్గానిస్తాన్‌ను చూడాలనుకుంటున్నాను. మహిళలు, బాలికల ముఖాల్లో నవ్వులను చూడాలని కోరుకుంటున్నాను. నేను నా స్వదేశానికి, నా ఇంటికి, నా ఆఫీసుకి తిరిగి రాగలనని ఆశిస్తున్నాను.

  • మీనా స్మాల్‌మాన్

    బ్రిటన్ప్రీస్ట్, విద్యావేత్త

    మీనా స్మాల్‌మాన్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఆర్చ్‌డీకన్ పదవి పొందిన తొలి నల్లజాతి మహిళ. 2013లో ఆమెకు ఈ పదవి లభించింది. ఆమె ఒక స్కూల్‌టీచర్ కూడా. పదవీ విరమణ పొందిన తరువాత మీనా స్మాల్‌మాన్ బ్రిటన్ వీధులను మరింత సురక్షితంగా మార్చే, పోలీసు వ్యవస్థను సంస్కరించే దిశగా ప్రచారం చేస్తున్నారు.

    ఆమె ఇద్దరు కుమార్తెలు నికోల్ స్మాల్‌మాన్, బిబా హెన్రీ 2020లో హత్యకు గురయ్యారు. వీరిని లండన్ పార్క్‌లో 19 ఏళ్ల యువకుడు కత్తితో పొడిచి చంపాడు. తన కుమార్తెలు కనిపించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుకు పోలీసులు సరిగ్గా స్పందించలేదని మీనా స్మాల్‌మాన్ విమర్శించారు. జాతి, వర్గ విద్వేషాలకు తన ఇద్దరు కుమార్తెలు బలైపోయారని ఆమె ఆరోపించారు.

    తన కూతుళ్లను చంపిన వ్యక్తిని క్షమించేశానని ఆమె చెప్పారు. "మనం ఒకరి పట్ల ద్వేషం పెంచుకున్నామంటే, మన ఆలోచనలన్నీ దాని చుట్టూ బందీలైపోతాయి. ఆ వ్యక్తి మన ఆలోచనలను శాసిస్తాడు. ఆ అధికారం నా బిడ్డలను చంపిన వ్యక్తికి ఇవ్వను" అని ఆమె అన్నారు.

    *ఒక ఉపాధ్యాయురాలిగా, ప్రీస్ట్‌గా సమాజం చిన్న చూపు చూసిన అబ్బాయిలను, అమ్మాయిలను పెంచేందుకు నా జీవితాన్ని అంకితం చేశాను. వివక్ష ఎదురైనప్పుడల్లా దానికి వ్యతిరేకంగా గొంతెత్తమని మీ అందరినీ కోరుకుంటున్నాను. మనం ఈ పరిస్థితిని మార్చగలం.

  • బార్బరా స్మోలిన్స్కా

    పోలండ్రీబోర్న్ షుగర్ బేబీస్ వ్యవస్థాపకురాలు

    అచ్చం ప్రాణమున్న చిన్నారుల్లాగే కనిపించే బొమ్మలు (రీబోర్న్ డాల్స్) పిల్లలను పోగొట్టుకున్న మహిళలకు ఊరట కలిగిస్తాయి. ఆందోళన, డిప్రెషన్, సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి. పోలండ్ కళాకారిణి బార్బరా స్మోలిన్స్కా ఇలాంటి బొమ్మలకు రూపకర్త.

    సంగీత విద్వాంసురాలైన ఆమె కాస్మటాలజీలో కూడా శిక్షణ తీసుకున్నారు. రీబోర్న్ షుగర్ బేబీస్ సంస్థను స్థాపించారు. ఆమె చేతితో తయారుచేసిన బొమ్మలను సినిమాల్లో, డాక్టర్లు, నర్సులకు శిక్షణ ఇవ్వడంలో ఉపయోగిస్తుంటారు.

    స్మోలిన్స్కా తన వృత్తిని ఎంతో ప్రేమిస్తారు. ఆమె తయారుచేసిన బొమ్మలు బాధలో ఉన్న మహిళల మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడతాయని ఆశిస్తున్నారు.

    *భిన్నమైన వాటి పట్ల మనుషులు మరింత సహానుభూతి, సహనంతో వ్యవహరించారని కోరుకుంటున్నాను. రీబోర్న్ డాల్స్ థెరపీ విషయంలో కూడా ఇలాగే ఉంటారని ఆశిస్తున్నాను. ఈ బొమ్మలు ఎంతోమంది మహిళలకు ఉపశమనం కలిగిస్తాయి.

  • ఐన్ సోయ్ మే

    మియన్మార్ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్త

    ఐన్ సో మే (ఆమె అసలు పేరు కాదు)ను మియన్మార్ మిలటరీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఆరు నెలల కారాగారవాసం తరువాత ఇటీవలే ఆమె క్షమాభిక్ష కింద విడుదలయ్యారు. ఆమెను పలు మిలటరీ విచారణ కేంద్రాల్లోనూ, ఎంతో అపఖ్యాతి గాంచిన ఇన్సైన్ జైల్లోనూ నిర్బంధించారు. జైలు జీవితం అత్యత దుర్భరంగా ఉంటుందని, తనను శారీరకంగా, మానసికంగా హింసించారని ఆమె తెలిపారు.

    సోయ్ మే విద్యార్థి దశ నుంచీ యాక్టివిస్టుగా అనేక ప్రచారాల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న మియన్మార్‌ను మిలటరీ స్వాధీనం చేసుకున్న తరువాత, మిలటరీ వ్యతిరేక ఉద్యమాల్లో ఆమె చురుకుగా పాల్గొన్నారు. ఫిబ్రవరిలో జరిగిన "పాట్స్ అండ్ పాన్స్", మార్చిలో జరిగిన "సైలెన్స్ స్ట్రైక్" నిరసనల్లో భాగం పంచుకున్నారు.

    జైలు నుంచి విడుదల అయిన తరువాత, ఆమె తన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.

    *ప్రపంచాన్ని రీసెట్ చేయగలిగితే, మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవాలని, శాంతియుత సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలోని అన్ని నియంతృత్వాలు కూలిపోయి, నిజమైన, శాంతియుతమైన ప్రజాస్వామ్య స్థాపన జరుగుతుందని మేం ఆశిస్తున్నాం.

  • పైపర్ స్టీజ్ నెల్సన్

    అమెరికాది సేఫ్ అలయన్స్‌లో పబ్లిక్ స్ట్రాటజీస్ ఆఫీసర్

    టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో సేఫ్ అలయన్స్‌లో చీఫ్ పబ్లిక్ స్ట్రాటజీస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు పైపర్ స్టీజ్ నెల్సన్. పిల్లలపై లైంగిక వేధింపులు, గృహ హింస, లైంగిక అక్రమ రవాణాను నిరోధించేందుకు సమాజంతో కలిసి పనిచేస్తారు.

    చిన్న వయసులోనే అత్యాచారాలకు గురైన బాధితులకు ఈ సంస్థ కౌన్సిలింగ్ ఇస్తుంది. టెక్సాస్ ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం గర్భం దాల్చిన ఆరు వారాలలోపు అబార్షన్‌ను రద్దు చేసింది. అందువల్ల ఈ అత్యాచార బాధితులు గర్భం దాల్చినా అబార్షన్‌కు వీలు పడదు.

    మహిళలు, బాలికల హక్కుల కోసం స్టీజ్ నెల్సన్ తన జీవితాన్ని అంకితం చేశారు. మిషెల్ ఒబామా ప్రారంభించిన 'లెట్ గర్ల్స్ లెర్న్' కార్యక్రమంలోనూ, రాజకీయాల్లో మహిళల సంఖ్య, విజయాలను పెంచడానికి అంకితమైన రాజకీయ కార్యాచరణ కమిటీ 'అన్నీస్ లిస్ట్'తోనూ కలిసి పనిచేశారు.

    *కోవిడ్ 19 ఇప్పటికే సామాజిక మార్పులకు దారితీసింది. ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రతీ పురుషుడికీ, మహిళకూ, బిడ్డకూ మానవ శరీర నిర్మాణం గురించి అవగాహన కలిగించడం, సమ్మతి (కన్సంట్) ప్రాముఖ్యతను తెలియజెప్పడం ప్రస్తుతం మన ముందున్న సవాళ్లు.

  • ఫాతిమా సుల్తానీ

    అఫ్గానిస్తాన్పర్వతారోహకురాలు

    2019లో పర్వతారోహణను తన అభిరుచిగా మార్చుకున్నారు ఫాతిమా సుల్తానీ. ఆ తర్వాత పర్వతారోహణ పట్ల అఫ్గాన్ అమ్మాయిల్లో ఆసక్తిని పెంపొందించడాన్ని తన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

    18 ఏళ్ల వయసులోనే ఆమె, అప్గానిస్తాన్‌లోని అత్యంత ఎత్తైన నోషాఖ్ పర్వత శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. ఆమె తొమ్మిది మంది యువ అఫ్గాన్ పర్వతారోహకుల బృందంలో సభ్యురాలిగా ఉండేవారు. వారిలో ముగ్గురు మహిళలు.

    ఫాతిమాకు క్రీడల పట్ల కూడా ఆసక్తి ఉంది. గత ఏడేళ్లుగా బాక్సింగ్, తైక్వాండో, జియు జిట్సు జాతీయ జట్టులో ఆమె సభ్యురాలుగా ఉన్నారు.

    *అఫ్గానిస్తాన్ మహిళలు తమ స్వేచ్ఛ, హక్కుల కోసం 20 ఏళ్లు పోరాడారు. ఎత్తైన పర్వతాలను అధిరోహించి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ దేశం లోపల, బయట మళ్లీ ఎత్తైన పర్వతాలను అధిరోహించే స్వేచ్ఛ వారికి రావాలని ఆశిస్తున్నాను.

  • అడిలైడ్ లాలా టామ్

    చైనాడిజైనర్

    అడిలైడ్ లైలా ఒక ఆర్టిస్ట్, ఫుడ్ డిజైనర్. ఆధునిక కాలంలో ఆహారంతో మానవులకు ఉన్న సంబంధాలను పురస్కరించుకుని వారి జీవనశైలి, ఎంపిక ఎలా మారుతున్నాయో పరిశీలిస్తారామె.

    చైనాలో జన్మించిన అడిలైడ్ లైలా, తరువాత హాంగ్‌కాంగ్ వెళ్లి సెటిల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె నెదర్లాండ్స్‌లో నివాసముంటున్నారు. ఆమె తన కళ ద్వారా పారిశ్రామిక ఆహార ఉత్పత్తిని విమర్శనాత్మ ధోరణిలో విశ్లేషిస్తారు. తాము తింటున్న ఆహారాన్ని, దాని ఉత్పత్తిలో వారి పాత్రను పునఃపరిశీలించమని వినియోగదారులను కోరుతున్నారు.

    2018లో ఆమె ఫ్యూచర్ ఫుడ్ డిజైన్ అవార్డ్స్‌లో జ్యూరీ, పబ్లిక్ ప్రైజ్‌లు రెండింటినీ గెలుచుకున్నారు. గోవధను కళ్లకు కట్టినట్టు చూపించే మిక్స్డ్ మీడియా ఇన్‌స్టాలేషన్‌ను ఆమె పరిచయం చేశారు. 2021 సంవత్సరానికిగానీ "50 నెక్స్ట్" జాబితాలో చోటు సంపాదించుకున్నారు. గ్యాస్ట్రోనమీ భవిష్యత్తును రూపొందించే ప్రముఖ వ్యక్తులను ఈ జాబితాలో పేర్కొన్నారు.

    *2021లో ప్రపంచం చాలా మారిపోయింది. మనం తీసుకునే ఆహారం పట్ల మనకు మరింత సహానుభూతి అవసరం. మనం ఏం తింటున్నాం, అది మన కంచంలోకి రావడానికి ఏ జరుగుతోంది అనే విషయాలను పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

  • సిస్టర్ ఆన్ రోజ్ ను తాంగ్

    మియన్మార్కాథలిక్ నన్

    మియన్మార్ సైనిక తిరుగుబాటుపై వెల్లువెత్తిన నిరసనలకు చిహ్నంగా మారారు సిస్టర్ ఆన్ రోజ్ ను తాంగ్. తన చర్చిలో ఆశ్రయం పొందుతున్న నిరసనకారులను రక్షించడానికి పోలీసుల ముందు మోకరిల్లారు.

    2021 మార్చిలో సాయుధులైన పోలీసు అధికారుల ముందు చేతుల చాచి మోకరిల్లిన సిస్టర్ ఆన్ రోజ్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి.

    సిస్టర్ ఆన్ రోజ్ ను తాంగ్ పౌరులను, ముఖ్యంగా పిల్లలను రక్షించడం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఆమె, పురుడు పోసే మంత్రసానిగా 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఈమధ్య కాలంలో, మియన్మార్‌లోని కచిన్ రాష్ట్రంలో కోవిడ్ రోగుల బాగోగులు చూస్తున్నారు.

    *మియన్మార్‌లో జరిగిన దారుణాలను కళ్లారా చూశాను. నాకే కనుక అవకాశమొస్తే నిష్కారణంగా జైల్లో బంధించిన వారందరినీ విడుదల చేస్తాను. వివక్షకు తావు లేకుండా సమానత్వం పెంపొందించే ప్రయత్నం చేస్తాను.

  • ఎమ్మా థియోఫెలస్

    నమీబియారాజకీయ నాయకురాలు

    ఆఫ్రికాలో అతి చిన్న వయసులోనే క్యాబినెట్ మంత్రి పదవిని దక్కించుకున్న వారిలో థియోఫెలస్ ఒకరు. గత ఏడాది సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ డిప్యూటీ మంత్రిగా ఎన్నికయ్యారామె. కోవిడ్ 19 గురించి అధికారిక సమాచారం అందించడం ఆమె బాధ్యత.

    అంతకుముందు, ఆమె జెండర్ సమానత్వం, బాలల హక్కులు, సుస్థిరాభివృద్ధి ప్రచారాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. యూత్ పార్లమెంట్‌లో స్పీకర్‌గా, స్వస్థలం విండ్‌హోక్ సిటీ జూనియర్ మేయర్‌గా వ్యవహరించారు.

    ఎమ్మా థియోఫెలస్ యూనివర్సిటీ ఆఫ్ నమీబియా నుంచి లా డిగ్రీ, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నుంచి ఆఫ్రికన్ ఫెమినిజం, జెండర్ స్టడీస్‌లో డిప్లొమా పొందారు.

    *వేగాన్ని పెంచడం ద్వారా ప్రపంచాన్ని రీసెట్ చేయవచ్చు. ఏళ్ల తరబడి పైప్‌లైన్‌లో ఉన్న అన్ని ప్రణాళికలనూ వేగంగా అమలు చేయాలి. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదు. ఇప్పటికే సమయం మించిపోయింది.

  • సారా వహేది

    అఫ్గానిస్తాన్సీఈవో- ఎహ్తేసాబ్

    అఫ్గానిస్తాన్‌లో ఎహ్తేసాబ్ అనే టెక్నాలజీ స్టార్టప్ సంస్థను సారా ప్రారంభించారు. ఈ సంస్థ రూపొందించిన మొబైల్ యాప్, కాబుల్ వాసులకు ఎప్పటికప్పుడు భద్రత, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ అలర్ట్‌లు పంపుతుంది. బాంబు దాడులు, సామూహిక కత్తిపోట్లు, ఇళ్లపై దాడులు జరగొచ్చనే విశ్వసనీయ సమాచారాన్ని చేరవేస్తూ ఈ యాప్ ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తోందని నిరూపితమైంది.

    గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ సేవలు అందించేందుకు 2022లో ఎస్ఎంఎస్ అలర్ట్ ఫీచర్‌ తీసుకురావాలని సారా అనుకుంటున్నారు.

    టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 2021 "నెక్స్ట్ జనరేషన్ లీడర్స్” జాబితో చోటు దక్కించుకున్న ఆమె, ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో మానవ హక్కులు, డేటా సైన్స్ కోర్సులు చేస్తున్నారు.

    *మన దేశాన్ని పునర్నిర్మించుకునేందుకు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం అఫ్గాన్లంతా ఐక్యంగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే, బాలబాలికలందరికీ సార్వత్రిక విద్య, ఆరోగ్యం కోసం గట్టిగా పోరాడటం అత్యవసరం.

  • వెరా వాంగ్

    అమెరికాఫ్యాషన్ డిజైనర్

    ప్రముఖ పెళ్లి దుస్తుల డిజైనర్. 1970ల నుంచి ఫ్యాషన్‌ రంగంలో దూసుకుపోతున్నారు. వెరా ఎలెన్ వాంగ్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ ఫ్రాగ్నన్స్, పబ్లిషింగ్, హోం డిజైన్‌తో సహా మరిన్ని రంగాల్లోకి అడుగుపెట్టారు.

    న్యూయార్క్‌లోని చైనా కుటుంబంలో జన్మించిన వెరా వాంగ్ వోగ్‌లో సీనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఆ తరువాత రాల్ఫ్ లారెల్‌లో డిజైన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమెకు ఫిగర్ స్కేటింగ్‌లో కూడా మంచి నైపుణ్యం ఉంది. చిన్న వయసులో అనేక ఫిగర్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్నారు.

    వెరా వాంగ్ అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక కౌన్సిల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో సభ్యురాలు. 2005లో ఆమెను 'వుమెన్స్‌వేర్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్‌'గా ఈ కౌన్సిల్ సత్కరించింది.

    *మనందరం ఒకేలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నాం. భూమిని కాపాడేందుకు మనమందరం మరింత మేధస్సుతో సంయుక్తంగా కృషి చేయాలి. ఎంత తొందరగా మనం ప్రయత్నిస్తామో అంత తొందరగా మన జీవితాలు మెరుగుపడతాయి.

  • నాన్ఫు వాంగ్

    చైనాఫిల్మ్ మేకర్

    చైనాలోని మారుమూల ప్రాంతానికి చెందిన నాన్ఫు వాంగ్ ఫిల్మ్ మేకర్‌గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ప్రస్తుతం వాంగ్ అమెరికాలో నివసిస్తున్నారు.

    2016లో నాన్ఫు తొలి చిత్రం హూలిగన్ స్పారో "ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్" కింద అకాడమీ అవార్డుకు నామినేట్ అయింది. ఆమె దర్శకత్వం వహించిన వన్ చైల్డ్ నేషన్ (2019), ఇన్ ది సేమ్ బ్రెత్ (2021) చిత్రాల్లో కోవిడ్ 19 మహమ్మరిని చైనా, అమెరికాలు ఎలా ఎదుర్కున్నాయో చూపించారు.

    పేదరికంలో పుట్టి పెరిగిన వాంగ్, షాంఘై, ఒహియో, న్యూయార్క్ యూనివర్సిటీల నుంచి మూడు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. "నిరంకుశ పాలన, అవినీతి, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాల ప్రభావాలను అధ్యయనం చేసే విధంగా పాత్రలను రూపొందించినందుకు" ఆమెకు 2020లో మాక్‌ఆర్థర్ జీనియస్ గ్రాంట్ లభించింది.

    *ప్రపంచం మొత్తం సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తోంది. కానీ, మనం ఇన్నళ్లూ సాధారణ స్థితి అనుకున్నదే ప్రస్తుత సంక్షోభానికి దారితీసింది.

  • రోషనక్ వర్దాక్

    అఫ్గానిస్తాన్గైనకాలజిస్ట్

    మాజీ పార్లమెంటు సభ్యులు, గైనకాలజిస్టు డాక్టర్ రోషనక్ వర్దాక్ రెండున్నర దశాబ్దాలకు పైగా మహిళలకు వైద్య సేవలు అందించారు. మైదాన్ వర్దాక్ ప్రావిన్సులో ఉన్న ఏకైక మహిళా డాక్టర్ ఆమె. మొదటి విడత తాలిబాన్ల పాలనా కాలంలోనూ ఆమె పనిచేశారు.

    2001లో తాలిబాన్ల ఓటమి తర్వాత ఆమె పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆమె జిల్లా దాదాపు 15 ఏళ్ల పాటు తాలిబాన్ నియంత్రణలో ఉంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే, ఆ జిల్లాలోనూ నాటో బలగాలకు, తాలిబాన్లకు మధ్య భీకర పోరు జరిగింది.

    దేశం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లడం, యుద్ధం ముగియడం ఒక కలలా అనిపించిందని ఆమె బీబీసీతో చెప్పారు. ‘‘అవినీతిపరులను గద్దె దించిన ఆ రోజు కోసం ఎదురు చూశాను.’’ అని ఆమె అన్నారు. అయితే, కొంతకాలంగా ఆమె పాఠశాలలను తిరిగి తెరిపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాలిబాన్ తన వాగ్దానాలను విస్మరించడంతో ఆమె బాలికల విద్య కోసం గళమెత్తుతున్నారు.

    *గత 40 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న నాయకులను, ఈ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వారు చేసిన పనులకు జవాబుదారులను చేయాలన్నదే నా ఏకైక కోరిక.

  • మింగ్-నా వెన్

    మకావునటి

    ఏనిమేషన్ సినిమాలైన ములన్ (1998), ములన్ II (2004)లో ఫా ములన్‌కు డబ్బింగ్ చెప్పారు. పాపులర్ అమెరికన్ మెడికల్ డ్రామా 'ఈఆర్‌'లో, 'ఇంకన్సీవబుల్‌'లో నటించారు. ఆసియన్ అమెరికన్ నటి ప్రధాన పాత్రలో నటించిన అతి కొద్ది టీవీ సీరీస్‌లో ఇవి రెండు.

    ప్రస్తుతం ఆమె డిస్నీ+ సిరీస్ 'ది మాండలోరియన్‌'లో ఫెన్నెక్ షాండ్‌గా నటిస్తున్నారు. రాబోయే కొత్త సీరీస్ 'ది బుక్ ఆఫ్ బోబా ఫెట్‌'లో కూడా కనిపించనున్నారు. 2019లో మింగ్-నా వెన్‌కు "డిస్నీ లెజెండ్" అని పేరు పెట్టారు.

    2022లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేంలో స్టార్ అందుకోనున్నారు.

    *ప్రపంచాన్ని రీసెట్ చేయడం సరైన పని కాదు. ఎందుకు మనం వెనక్కి వెళ్లాలి? అన్నింటికీ ఏదో ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. ప్రతి రోజూ ఓ కొత్త ఆరంభమే. కాబట్టి కృతజ్ఞతతో ఈరోజును బాగా జీవిద్దాం.

  • రెబెల్ విల్సన్

    ఆస్ట్రేలియానటి, రచయిత, నిర్మాత

    హాలీవుడ్ మెగాస్టార్. నటి, రచయిత, నిర్మాత. రెబెల్ విల్సన్ న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఆమె నటనా జీవితం సిడ్నీ వేదికలపై ప్రారంభమైంది. చాలావరకు కథలను ఆమే రాసుకునేవారు. ఆస్ట్రేలియన్ కామెడీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో అమెరికా వెళ్లిపోయారు.

    బ్రైడ్స్‌మెయిడ్స్ (2011) అనే కామెడీ సినిమాతో హాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఆస్కార్ పొందిన జోజో రాబిట్‌ సినిమాలో ఓ పాత్ర పోషించారు. కానీ, బాక్సాఫీస్ హిట్ కొట్టిన మ్యూజికల్ ట్రయాలజీ 'పిచ్ పర్ఫెక్ట్‌'లో ఫ్యాట్ అమీ పాత్ర రెబెల్ విల్సన్‌కు ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది.

    2020లో విల్సన్ దర్శకురాలిగా తొలి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

    *వైవిధ్యం, గౌరవం, చేర్పు(ఇంక్లూజన్) జీవితంలోని అన్ని రంగాల్లో ఉండాలి. వీటిపై రాజీ పడే పరిస్థితి ఉండకూడదు.

  • బెనాఫ్షా యాకూబీ

    అఫ్గానిస్తాన్వికలాంగ ఉద్యమకారిణి

    యాకూబీ, ఆమె భర్త ఇద్దరూ అంధులు. అఫ్గానిస్తాన్‌లోని అంధులకు ఆశ్రయం కల్పించి, చదువు చెప్పించేందుకు రహ్యాబ్ సంస్థను స్థాపించారు. మానవహక్కుల కార్యకర్త బెనాఫ్షా యాకూబీ.. దేశంలోని స్వతంత్ర మానవ హక్కుల సంఘం కమిషనర్‌గా కూడా పనిచేశారు.

    తాలిబాన్ల పునరాగమనం తరువాత ఆమె స్వదేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చినా.. వికలాంగుల హక్కుల కోసం ఇంకా గళమెత్తుతూనే ఉన్నారు. తాలిబాన్ పాలనలో వికలాంగులు తీవ్ర వివక్షకు గురవుతారన్నది ఆమె ఆందోళన.

    ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వికలాంగులు ఉన్న దేశాల్లో అ‌‍ఫ్గానిస్తాన్‌ ఒకటి. ఈ దేశంలో వికలాంగులకు సదుపాయాల లేమి, వివక్ష అనేవి తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. ఈ పరిస్థితులకు దశాబ్దాలపాటు కొనసాగిన సంఘర్షణ కొంతమేర కారణంగా చెప్పొచ్చు.

    *నా దేశాన్ని మరింత స్వేచ్ఛాయుత వాతావరణం కలిగిన దేశంగా మళ్లీ చూడాలనుకుంటున్నాను. అభివృద్ధిలో మా అందరి భాగస్వామ్యం మరింత పెరగాలని ఆశిస్తున్నాను.

  • మలాలా యూసఫ్‌జాయ్

    పాకిస్తాన్మలాలా ఫండ్ సహ వ్యవస్థాపకురాలు

    నోబెల్ శాంతి బహుమతి పొందిన అతి పిన్న వయస్కురాలు మలాలా యూసఫ్‌జాయ్. ఆమె, పాకిస్తాన్ బాలికల విద్యా హక్కుల కార్యకర్త. అలాగే, యూఎన్ శాంతి దూత. మలాలా తన 11వ ఏట నుంచి యువతుల విద్యా హక్కుల కోసం పోరాడుతున్నారు.

    మలాలా బీబీసీకి బ్లాగ్ రాయడం ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించారు. పాకిస్తాన్‌లో తాలిబాన్ పాలనలో జీవితం, బాలికల విద్యా హక్కుపై నిషేధం గురించి తన కథనాల్లో వివరించారు. 2012 అక్టోబర్‌లో ఒక సాయుధుడు మలాలా ప్రయాణిస్తున్న బస్సు ఎక్కి ఆమెను తలపై కాల్చాడు.

    ఆ గాయం నుంచి కోలుకున్న తరువాత, ఆమె మలాలా ఫండ్ సహ వ్యవస్థాపకురాలిగా తన పనిని కొనసాగించారు. ఆడపిల్లలందరూ చదువుకుంటూ, ధైర్యంగా జీవితంలో నిలబడగలిగే ప్రపంచాన్ని సృష్టించడమే ఈ సంస్థ లక్ష్యం.

    *కోట్లమంది ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. ప్రతీ ఆడపిల్ల 12 సంవత్సరాల ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని చూడాలన్నదే నా కోరిక.

  • యుమా

    తుర్క్మెనిస్తాన్సైకోథెరపిస్ట్

    గత ఆగస్టులో యుమా కుటుంబమంతా ఒక స్వలింగ సంపర్కుల వేడుకలో పాల్గొన్నట్లు చూపించిన ఓ సూపర్‌మార్కెట్ ప్రకటన రష్యాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. యుమాపై భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో, ఆమె రష్యా విడిచి పారిపోవాల్సివచ్చింది. సైకోథెరపిస్ట్, ఎల్జీబీటీ కార్యకర్త అయిన యుమా ప్రస్తుతం స్పెయిన్‌లో నివసిస్తున్నారు.

    "మైనర్లను సాంప్రదాయేతర లైంగిక సంబంధాల వైపు ప్రోత్సహించడాన్ని" నిషేధిస్తూ 2013లో రష్యా "గే ప్రోపగాండా" చట్టాన్ని తీసుకువచ్చింది. దాంతో, యుమా (తన ఇంటి పేరును రహస్యంగా ఉంచమని కోరారు) యాక్టివిస్ట్‌గా మారారు.

    చెచ్న్యాకు చెందిన ఎల్జీబీటీ వ్యక్తులకు మానసికారోగ్య సంబంధ సహాయాన్ని అందిస్తారు యుమా. 2017-2018లలో రష్యా పోలీసుల చేతిలో తీవ్ర హింసలకు గురయ్యామని వారు చెబుతున్నారు.

    *బలవంతపు ఒంటరితనం సన్నిహిత సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసింది. ప్రపంచంలో మనం ఏమి చేస్తున్నామో తరచి చూసుకుంటే, మనకిష్టమైన వారి కోసం మనం ఏమి చేయాలనుకుంటున్నామో అర్థమవుతుంది.

  • జాలా జజాయ్

    అఫ్గానిస్తాన్పోలీస్

    అప్గానిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌ పోలీసు నేర పరిశోధనా విభాగం డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన మొట్టమొదటి మహిళ జజాయ్. తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలతో తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొన్న ప్రాంతాల్లో ఖోస్ట్ ప్రావిన్స్ ఒకటి. ఈ దేశంలోని 4,000 మంది మహిళా పోలీసు అధికారుల్లో జాలా జజాయ్ ఒకరు. ఆమె టర్కీ పోలీసు అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందారు.

    ఆమె ఉద్యోగం చేసే సమయంలో తన సహోద్యోగుల నుంచి కూడా బెదిరింపులను ఎదుర్కొన్నారు. చంపేస్తామంటూ తిరుగుబాటుదారులు బెదిరించినా ఆమె ధైర్యంగా పనిచేశారు.

    2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత, జజాయ్ తన దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. అఫ్గానిస్తాన్‌లోనే అజ్ఞాతంలో గడుపుతున్న మహిళా పోలీసుల భద్రత గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    *సాంప్రదాయ, పితృస్వామ్య సమాజాన్ని సవాలు చేస్తూ మళ్లీ పోలీస్ యూనిఫాం వేసుకోవాలన్నది నా కల. మహిళలకు పని చేసే హక్కు లేని అఫ్గానిస్తాన్‌లోని మారుమూల ప్రాంతంలో మహిళల కోసం మళ్లీ పని చేయాలన్నది నా ఆకాంక్ష.

Short presentational grey line

100 మంది మహిళల ఎంపిక ఎలా జరిగింది?

బీబీసీ వరల్డ్ సర్వీసెస్‌కు చెందిన వివిధ భాషల బృందాలు సూచించిన పేర్లను 'బీబీసీ 100 మంది మహిళా మణులు' టీమ్ పరిశీలించి తుది జాబితాను రూపొందించింది. గత 12 నెలల్లో వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ముఖ్యమైన కథనాలకు ప్రేరణగా నిలిచిన వారి కోసం మేం అన్వేషించాం. అలాగే, వార్తల్లోకి ఎక్కకపోయినప్పటికీ తమ విశిష్ట కృషి ద్వారా ఇతరులను ప్రభావితం చేసి, స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలు ఎవరెవరన్నది కూడా పరిశీలించాం.

అలా ఎంపిక చేసిన పేర్లను, 'ప్రపంచ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న మహిళలు' అనే ఈ ఏడాది అంశంతో కలిపి చూశాం. తుది జాబితా రూపొందించే ముందు నిష్పాక్షికంగా ఉండేందుకు ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సరి చూసుకున్నాం.

ఈ సంవత్సరం 'బీబీసీ 100 మంది మహిళల' జాబితాలో అఫ్గానిస్తాన్ మహిళలకు సగభాగం కేటాయించాలనే అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నాం.

ఇటీవల అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు వార్తల్లో ముఖ్యాంశాలుగా మారడమే కాకుండా లక్షలాది అఫ్గాన్ ప్రజల భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారాయి. తాలిబాన్ పాలనలో స్త్రీల హక్కులకు, స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే భయాన్ని హక్కుల సంఘాలు వ్యక్తం చేశాయి.

ఈ జాబితాలో సగభాగాన్ని అఫ్గాన్‌కు చెందిన లేదా ఆ దేశంలో పనిచేస్తున్న మహిళలకు కేటాయించడం ద్వారా, వీరిలో ఎంతమంది మహిళలు ప్రజా జీవితం నుంచి బలవంతంగా కనుమరుగవుతున్నారో ప్రస్ఫుటంగా తెలియజేయాలనుకున్నాం. అలాగే, ఏ మహిళల స్వరం వినిపించకుండా గొంతు నొక్కి పెడుతున్నారో వారి గళాలను వినిపించాలనుకున్నాం.

మరోవైపు, మహిళా హక్కుల విషయంలో "గట్టి చర్యలు తీసుకోవాలని" తాలిబాన్ ప్రభుత్వం డిసెంబర్ 3న మంత్రిత్వ శాఖలకు ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ మేరకు మహిళల వివాహం, ఆస్తి హక్కుల విషయాల్లో కొన్ని నిబంధనలను ప్రవేశపెట్టింది. మహిళలకు బలవంతపు వివాహాలు జరిపించకూడదని, వారిని "ఆస్తి"గా భావించకూడదని వెల్లడించింది.

అయితే, ఈ ఉత్తర్వులో బాలికల విద్య, మహిళల ఉపాధి హక్కుల గురించి ప్రస్తావించలేదని అనేకమంది విమర్శించారు.

బీబీసీ ఎడిటోరియల్ పాలసీ, భద్రతా మార్గదర్శకాలను అనుసరించి, '100 మంది మహిళల' జాబితాలో చోటు దక్కించుకున్న కొందరు అఫ్గాన్ మహిళల పేర్లను అజ్ఞాతంగా ఉంచాం. ఇది వారి సమ్మతితో, వారికి, వారి కుటుంబాలకు భద్రత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం.

Short presentational grey line

క్రెడిట్స్:

ప్రొడక్షన్, ఎడిటింగ్: వలేరియా పెరసో, అమీలియా బటర్లీ, లారా ఒవెన్, జార్జినా పియర్స్, కావూన్ ఖామూష్, హనియా అలీ, మార్క్ షియా.

బీబీసీ 100 వుమెన్ ఎడిటర్: క్లెయిర్ విలియమ్స్.

ప్రొడక్షన్: పాల్ సార్జెంట్, ఫిలిప్పా జాయ్, అనా లూసియా గొన్జాలెజ్.

డెవలప్‌మెంట్ : అయు వైడ్యనింగ్సి ఇడ్జాజా, అలెగ్జాండర్ ఇవనోవ్

డిజైన్: డెబీ లోయిజు, జోయ్ బార్తోలెమ్యూ

ఇలస్ట్రేషన్: జిలా దస్త్మల్చి

Short presentational grey line

ఫొటోల కాపీరైట్స్: Fadil Berisha, Gerwin Polu/Talamua Media, Gregg DeGuire/Getty Images, Netflix, Manny Jefferson, University College London (UCL), Zuno Photography, Brian Mwando, S.H. Raihan, CAMGEW, Ferhat Elik, Chloé Desnoyers, Reuters, Boudewijn Bollmann, Imran Karim Khattak/RedOn Films, Patrick Dowse, Kate Warren, Sherridon Poyer, Fondo Semillas, Magnificent Lenses Limited, Darcy Hemley, Ray Ryan Photography Tuam, Carla Policella/Ministry of Women, Gender and Diversity (Argentina), Matías Salazar, Acumen Pictures, Mercia Windwaai, Carlos Orsi/Questão de Ciência, Yuriy Ogarkov, Setiz/@setiz, Made Antarawan, Peter Hurley, Jason Bell, University of Sheffield Hallam, Caroline Mardok, Emad Mankusa, David M. Benett/Getty, East West Institute Flickr Gallery, Rashed Lovaan, Abdullah Rafiq, RFH, Jenny Lewis, Ram Parkash Studio, Oslo Freedom Forum, Kiana Hayeri/Malala Fund, Fatima Hasani, Nasrin Raofi, Mohammad Anwar Danishyar, Sophie Sheinwald, Payez Jahanbeen, James Batten.

line
100 women BBC season logo

100 మంది మహిళలు... అంటే ఏంటి?

బీబీసీ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతంగా, స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన 100 మంది మహిళలను గుర్తించి జాబితా రూపొందిస్తుంది. వారి సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంలోని వైవిధ్యాల గురించి ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు అందిస్తుంది. ఈ విజేతల కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తుంది.

( #BBC100Women హ్యాష్‌ట్యాగ్ వాడి మీరూ ఈ చర్చలో భాగం కావొచ్చు.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)