తులసేంద్రపురం: ఈ చిన్న గ్రామం కమలాహారిస్‌ను తమ సొంత మనిషిగా ఎందుకు భావిస్తోంది

కమలాహారిస్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ఫొటో సోర్స్, Janarthanan/BBC

ఫొటో క్యాప్షన్, గ్రామంలో కమలాహారిస్ ఫ్లెక్సీ
    • రచయిత, శారద.వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తులసేంద్రపురం, తమిళనాడు రాజధాని చెన్నైకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అమ్మమ్మ, తాతయ్యల స్వగ్రామం ఇది.

ఊరి మధ్యలో 59 ఏళ్ల కమలాహారిస్ ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం సాధించాలని కోరుతూ గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమలాహారిస్, ఆమె అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యుల పేరుతో గ్రామస్థులే అర్చన చేయిస్తున్నారు. మిఠాయిలు పంచుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకొన్న బైడెన్, తన స్థానంలో కమలాహారిస్‌ను నామినీగా ప్రకటించినప్పటి నుంచి మారుతున్న పరిణామాలను స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

‘ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా చెప్పే అమెరికాలో ఆమె ఈ స్థాయికి చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు" అని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి చెప్పారు.

"ఆమెను చూస్తే మాకు గర్వంగా ఉంది. ఒకప్పుడు విదేశీయులు భారతీయులను పరిపాలించారు. ఇప్పుడు భారతీయులు ప్రపంచంలో శక్తిమంతమైన దేశాలలో నాయకులుగా ఉన్నారు" అని ఆయన అన్నారు.

ఊళ్లోని మహిళలూ కమలాహారిస్‌ను తమలో ఒకరిగా భావిస్తున్నారు.

"ఆమె అందరికీ తెలుసు. పిల్లలకు కూడా. ఆమె మాకు సోదరి, మాకు అమ్మ అవుతుంది అంటూ ఊళ్లోవాళ్లు ఆమెను పిలుస్తున్నారు" అని గ్రామ నాయకుడు అరుళ్ మోళి సుధాకర్ చెప్పారు.

"ఆమె తన మూలాలను మర్చిపోలేదు. అది మాకు ఆనందంగా ఉంది" అని ఆయన చెప్పారు.

కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు అయినప్పుడు గ్రామంలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. గ్రామంలో టపాసులు కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోస్టర్లు, క్యాలెండర్లు పంచారు.

తమిళనాడు ప్రజలు బాగా ఇష్టంగా తినే ఇడ్లీ, సాంబారు తనకు కూడా బాగా ఇష్టమని కమల చెప్పినట్లు ఆమె బంధువుల్లో ఒకరు చెప్పారు.

కమలా హారిస్, చెన్నై, తమిళనాడు

ఫొటో సోర్స్, Janarthanan/BBC

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్ గెలుపు కోసం పూజ చేసి మిఠాయిలు పంచుతున్న గ్రామస్తులు

భారతీయ మూలాలు

కమలాహారిస్ తల్లి శ్యామల గోపాలన్, రొమ్ము క్యాన్సర్ పరిశోధకురాలు. 1958లో ఆమె తమిళనాడు నుంచి అమెరికా వెళ్లారు. శ్యామల గోపాలన్ తల్లిదండ్రులది తులసేంద్రపురం.

"మా అమ్మ శ్యామల, తనకు19 ఏళ్ల వయసున్నప్పుడు భారత్ నుంచి ఒంటరిగా అమెరికా వచ్చారు. ఆమె శాస్త్రవేత్త, మానవ హక్కుల కార్యకర్త , తల్లిగా తన పిల్లల్ని తీర్చిదిద్దారు" అని హారిస్ నిరుడు ఓ సోషల్ మీడియా పోస్టులో చెప్పారు.

తల్లి చనిపోయిన తర్వాత ఆమె అస్థికలను హిందూ సంప్రదాయం ప్రకారం సముద్రంలో కలిపేందుకు కమలాహారిస్ తన సోదరి మాయాతో కలిసి చెన్నై వచ్చారని ‘ద హిందూ’ పత్రిక తన కథనంలో పేర్కొంది.

కమల కుటుంబంలో పూర్వీకులు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ ఉన్నత విద్యావంతుడు. తాత పీవీ గోపాలన్ భారత ప్రభుత్వంలో ఉద్యోగిగా పని చేశారు.

1960లో ఆయన జాంబియా తొలి అధ్యక్షుడికి సలహాదారుగా పని చేశారు.

కమలా హారిస్, తమిళనాడు

ఫొటో సోర్స్, Janarthanan/BBC

ఫొటో క్యాప్షన్, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసేంద్రపురం

‘కమలాహారిస్ కుటుంబానికి చాలా కాలంగా మంచి గుర్తింపు ఉంది" అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్.రాజరామన్ చెప్పారు. ఆయన కమలాహారిస్ తల్లికి క్లాస్‌మేట్.

శ్యామలను చాలా కాలం కలవలేదని అయితే 1970ల మధ్యలో అమెరికాలోని బర్కిలీ వెళ్లినప్పుడు ఆమెను కలిశానని రామరాజన్ చెప్పారు.

"శ్యామల అప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆమె నాకు టీ ఇచ్చారు. అప్పుడక్కడ ఈ పిల్లలను ( కమల, మాయా) చూశాను. వాళ్లు నన్ను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లిద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కమల కూడా ఆమె తల్లిలాగే పాజిటివ్‌గా ఉండేవారు" అని ఆయన అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఇక తులసేంద్రపురం గ్రామానికి వస్తే, త్వరలోనే ఆమెను డెమొక్రాట్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారని ఆ ఊరివారంతా ఆకాంక్షిస్తున్నారు.

"కమల పెద్దమ్మ సరళ రోజూ ఆలయానికి వస్తున్నారు. 2014లో ఆమె కమలాహారిస్ తరఫున ఆలయానికి 5 వేల రూపాయలు విరాళం ఇచ్చారు" అని ఆలయ పూజారి నటరాజన్ చెప్పారు.

తమ పూజలు ఫలించి ఆమె ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

అమెరికాకు తమ గ్రామం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ప్రయాణంలో తాము ఆమెతోనే ఉన్నట్లు భావిస్తున్నట్లుగా గ్రామ ప్రజలు చెప్పారు. ఆమె ఏదో ఒక రోజు తమ గ్రామాన్ని సందర్శిస్తారని, లేదంటే తన ప్రసంగంలో పూర్వీకుల గ్రామం గురించి ప్రస్తావిస్తారని వారంతా ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, Kamala Harris: తులసేంద్రపురం అనే ఈ చిన్న ఊరికీ, అమెరికా రాజకీయాలకూ సంబంధమేంటి?

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)