జో బైడెన్ ప్రసంగం: నిజం చెప్పే అవకాశాన్ని ఆయన చేజేతులా వదులుకున్నారా..

S President Joe Biden delivers a prime-time address to the nation in the Oval Office of the White House in Washington, DC, US, on Wednesday

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆంథోనీ జుర్‌చెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చరిత్ర తనను ఎలా గుర్తు పెట్టుకోవాలో నిర్ణయించేందుకు జో బైడెన్‌కు ఇది మంచి అవకాశం

ఓవల్ ఆఫీస్ నుంచి అమెరికన్లను ఉద్దేశించిన బైడెన్ చేసిన టెలివిజన్ ప్రసంగంలో.. తన పాలన కాలంలో సాధించిన విజయాలపై మాట్లాడారు. అందులో తన మూలాల గురించి ప్రస్తావించారు.

అమెరికన్లపై ప్రశంసలు కురిపించారు. దేశంలో ప్రజాస్వామ్యం భవిష్యత్ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.

తాను ఎప్పుడూ అమెరికన్లతో కలిసే ఉన్నానని చెప్పినప్పటికీ, ప్రస్తుతం ఆయన ముందున్న అతి పెద్ద ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.

మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో తాను హఠాత్తుగా పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నాననే విషయం ఆయన నేరుగా చెప్పలేదు.

ఆయన దాని గురించి సంకేతాలిచ్చారు. ఆ అంశం చుట్టూ మాట్లాడారు. కానీ నేరుగా దాని గురించి ప్రస్తావించలేదు.

అలా ఎందుకు జరిగిందనే దాన్ని దేశ ప్రజల ఇష్టానికి వదిలేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఓవల్ ఆఫీసు నుంచి ప్రసంగిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

"ఇటీవలి కొన్ని వారాలుగా.. నా పార్టీని ఏకతాటిపైకి తీసుకు రావల్సిన అవసరం ఉందని నాకు స్పష్టంగా అనిపించింది" అని బైడెన్ చెప్పారు.

ఆ తర్వాత ఆయన "కొత్త తరానికి బాధ్యతలు అప్పగించడానికి ఇదే సరైన తరుణం" అని చెప్పారు.

తన పదవీ కాలంలో సాధించిన విజయాలు తాను రెండోసారి పోటీ చేసేందుకు తనకు అర్హత కల్పించాయని బైడెన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో తన మార్గంలో ఏదీ అడ్డు రాలేదని, అది తన వ్యక్తిగత ఆశయం కూడా అని అన్నారు.

నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను డోనల్డ్ ట్రంప్‌పై ఓడిపోతానని తెలిసినందుకే పోటీ నుంచి వైదొలిగాననే కఠినమైన చేదు నిజాన్ని ఆయన చెప్పకుండా వదిలేశారు.

డోనల్డ్ ట్రంప్‌‌తో అధ్యక్ష ఎన్నికల డిబేట్‌లో భాగంగా జో బైడెన్ ప్రదర్శన తేలిపోయింది. ఇది డెమొక్రటిక్ పార్టీ నేతలను ఆందోళనలో పడేసింది. దీంతో వారంతా ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బైడెన్ గెలిచేందుకు ఎలాంటి అవకాశాలు కనిపించలేదు.

ఈ అంశం గురించి జో బైడెన్ మాట్లాడకపోయినా, ఆయన ప్రత్యర్థికి అలాంటి సంకోచాలు ఏమీ లేవు

"ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతానని తెలిసే బైడెన్ పోటీ నుంచి తప్పుకొన్నారు" అని డోనల్డ్ ట్రంప్ అన్నారు. జో బైడెన్ ఓవల్ ఆఫీసు నుంచి టీవీలో మాట్లాడటానికి కొన్ని గంటల ముందు చార్లొటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచార సభలో ట్రంప్

తర్వాత ఆయన కమలా హారిస్‌పై విమర్శలతో విరుచుకుపడ్దారు. ‘ఆ పార్టీ కొత్త నామినీ బైడెన్ సృష్టించిన ప్రతి విపత్తు వెనుక ఉన్న మహిళ’ అని ట్రంప్ అన్నారు.

అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన గట్టి పోటీ ఉండే కీలక రాష్ట్రాలలో రిపబ్లికన్లు కమలాహారిస్‌ గురించి తమ కోణంలోంచి ప్రజలకు వివరిస్తున్నారు.

అధ్యక్షుడు జో బైడెన్ ‘స్పష్టమైన మానసిక క్షీణత’ను కప్పిపుచ్చడంలో కమలాహారిస్ సహకరిస్తున్నారు అని రిపబ్లికన్లు తమ ఎన్నికల ప్రకటనల్లో ప్రచారం చేస్తున్నారు.

బైడెన్ ప్రసంగాన్ని దేశ ప్రజలంతా టీవీల్లో చూశారు. తన ఉపాధ్యక్షురాలిపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టడానికి, అధ్యక్షుడిగా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు తనకున్న సామర్ధ్యాల గురించి చెప్పడానికి బైడెన్‌కు ఇది అద్భుతమైన అవకాశం.

కానీ ఆయన ఈ అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్నారు.

కమలా హారిస్, జో బైడెన్, ట్రంప్, అధ్యక్ష ఎన్నికలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్ల ప్రచార వ్యూహాన్ని తిప్పి కొట్టడం కమలాహారిస్ ముందున్న పెద్ద సవాలు

ప్రసంగం ముగింపు సమయంలో ఆయన కమలాహారిస్ గురించి మాట్లాడారు "ఆమె అనుభవజ్ఞురాలు, స్థిరమైన, సమర్థమైన వ్యక్తి, నాకు అత్యద్భుతమైన భాగస్వామి, దేశానికి గొప్ప నాయకురాలు" అని అన్నారు.

అవి కచ్చితంగా చాలా బలమైన మాటలు. కానీ ఇంకా అందులో చాలా మాటలు లేవు. బైడెన్ తన ఉపాధ్యక్షురాలి గురించి మాట్లాడటం కంటే ఎక్కువగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి మాట్లాడారు.

కమలాహారిస్ గురించి బైడెన్ నామమాత్రంగా మాట్లాడడంతో ముందుముందు దీనిపై రిపబ్లికన్లు చేయబోయే దాడిని ఎలా తిప్పికొట్టాలో కమల, ఆమె బృందం నిర్ణయించుకోవాలి.

ఆగస్టులో షికాగోలో జరగనున్న డెమొక్రటిక్ సదస్సులో ట్రంప్ గురించి చెప్పడానికి జో బైడెన్‌కు మరో అవకాశం లభించవచ్చు.

అయితే కొత్త నామినీ కమలాహారిస్‌కు ఇది చాలా కీలక సమయం. ఆమె ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అమెరికన్లు ఆమె గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది.

ఓవల్ ఆఫీస్ నుంచి తన ప్రసంగంలో ఎక్కువ భాగం రాజకీయాలు మాట్లాడాల్సి రావడం అధ్యక్షుడు జో బైడెన్‌కు అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ ఆయన నిజంగా తన రాజకీయ వారసత్వం గురించి ఆలోచించి ఉంటే, కమలాహారిస్ గెలుపైనా, ఓటమైనా, ఆయన ఇక్కడ నుంచి మొదలు పెట్టి ఉండేవారు.

జో బైడెన్ పార్టీ కోసం అత్యున్నత త్యాగం చేశారా లేక అధికారంలో కొనసాగేందుకు పార్టీని ప్రమాదంలోకి నెట్టారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)