కార్గిల్ వార్: తొలి నెలరోజుల పాకిస్తాన్ ఆధిపత్యాన్ని భారత్ వ్యూహాత్మకంగా ఎలా తిప్పికొట్టిందంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
25 ఏళ్ల కిందట, కార్గిల్ పర్వతాలపై భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. కార్గిల్‌లోని ఎత్తైన కొండల్లోకి పాకిస్తానీ సైనికులు చొరబడి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది.
పాకిస్తాన్ 6వ నార్తర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ కెప్టెన్ ఇఫ్తెఖార్, లాన్స్ హవల్దార్ అబ్దుల్ హకీమ్‌లు 12 మంది సైనికులతో కార్గిల్‌లోని ఆజం పోస్టు వద్ద కూర్చుని ఉన్నారు. దూరంగా కొంతమంది భారతీయ గొర్రెల కాపరులు తమ పశువులను మేపుకుంటూ ఉండడాన్ని వారు గమనించారు.
ఈ గొర్రెల కాపరులను బంధించాలా? వద్దా? అని పాకిస్తానీ సైనికులు తమలో తాము చర్చించుకున్నారు. వాళ్లను బందీలుగా తీసుకుంటే తమకే సరిపోతుందో లేదో తెలియని రేషన్ (ఆహార పదార్ధాలు)ను వాళ్లే తినేస్తారని పాకిస్తానీ సైనికుల్లో ఒకరు అన్నారు. వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోనిచ్చారు.
అయితే, సుమారు గంటన్నర తర్వాత, భారత సైన్యానికి చెందిన ఆరేడుగురు జవాన్లతో కలిసి గొర్రెల కాపరులు అక్కడికి వచ్చారు.

భారత సైనికులు తమ బైనాక్యులర్లతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక హెలికాప్టర్ అక్కడికి వచ్చింది.
హెలికాప్టర్ ఎంత తక్కువ ఎత్తులో ఎగిరిందంటే పైలట్ బ్యాడ్జిని కూడా పాకిస్తానీ కెప్టెన్ ఇఫ్తేఖార్ చూడగలిగారు. కార్గిల్ కొండల్లో పెద్దసంఖ్యలో పాకిస్తానీ సైనికులు జమ అయినట్లు భారత సైనికులకు సూచన రావడం అదే తొలిసారి.

ఫొటో సోర్స్, Getty Images
కార్గిల్‌పై 'విట్‌నెస్ టు బ్లండర్ - కార్గిల్ స్టోరీ అన్‌ఫోల్డ్స్' (Witness To Blunder: Kargil Story Unfolds) అనే పుస్తకం రాసిన పాకిస్తాన్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్ అష్ఫాక్ హుస్సేన్ బీబీసీతో మాట్లాడుతూ, ''నేనే ఇఫ్తెఖార్‌తో మాట్లాడా. మరుసటి రోజు భారత లామా హెలికాప్టర్లు ఆజం, తారిఖ్, తష్ఫీన్ పోస్టులపై ఫైరింగ్ చేసినట్లు ఆయన చెప్పారు.
భారత హెలికాప్టర్లపై కాల్పులు జరిపేందుకు కెప్టెన్ ఇఫ్తెఖార్ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ అనుమతి కోరారు. కానీ అనుమతి రాలేదు. ఎందుకంటే అలా చేస్తే భారతీయులకు ఇవ్వాలనుకున్న సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అన్నది లేకుండా పోతుంది.'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దేశ నాయకత్వానికి సమాచారం లేదు..
అప్పట్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిఫెన్స్ కరస్పాండెంట్‌గా పనిచేసిన జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ ఆనాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ...
''అప్పట్లో నా స్నేహితుడొకరు ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసేవారు. ఫోన్ చేసి కలవాలన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్లా. ఏదో చొరబాట్లు జరిగినట్లున్నాయి, వాటిని ఎదుర్కోవడానికి అనుకుంటా మొత్తం ప్లటూన్‌ను హెలికాప్టర్‌లో పంపించారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం నేను మా నాన్నకు చెప్పా. ఆయన వెంటనే అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌కు ఫోన్ చేశారు. మరుసటి రోజు ఆయన రష్యా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వెంటనే ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. అప్పుడే ఈ చొరబాటు గురించి ప్రభుత్వానికి మొదటిసారి తెలిసింది.'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సియాచిన్ నుంచి భారత్‌ను వెనక్కు పంపడమే లక్ష్యం...
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ వేద్‌ప్రకాశ్ మాలిక్ కూడా పోలండ్, చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. సైనికాధికారుల ద్వారా కాకుండా, అక్కడి భారత రాయబారి ద్వారా ఆయనకు మొదట ఈ విషయం తెలిసింది.
లాహోర్ సమ్మిట్ తర్వాత, పాకిస్తాన్ సైనికులు ఇంత రహస్యంగా కార్గిల్ పర్వతాలపైకి ఎందుకొచ్చారనే ప్రశ్న తలెత్తింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ అసోసియేట్ ఎడిటర్ సుశాంత్ సింగ్ మాట్లాడుతూ, ''భారత్‌కు ఉత్తరాన దూరంగా ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రధాన భూభాగానికి, నేషనల్ హైవే 1డీతో సంబంధాన్ని తెంచేసి, దానిపై నియంత్రణ సాధించాలన్నదే వారి ఉద్దేశం. వాళ్లు ఎక్కడి నుంచైతే లద్దాఖ్ వైపు మిలిటరీ కాన్వాయ్‌లు వెళ్లకుండా నియంత్రించగలరో ఆ కొండలపైకి రావాలని అనుకున్నారు. దానివల్ల భారత్ సియాచిన్ నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది.'' అన్నారు.

1984లో సియాచిన్‌ను భారత్ స్వాధీనం చేసుకోవడంపై ముషారఫ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, ఆ సమయంలో ఆయన పాకిస్తాన్ కమాండో ఫోర్స్‌లో మేజర్‌గా ఉన్నారని సుశాంత్ సింగ్ అన్నారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని ఆయన ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'రా’ పసిగట్టలేకపోయింది'
ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నా భారత నిఘా సంస్థలు కనీసం పసిగట్టలేకపోవడం.
భారత డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ మాజీ అడ్వైజర్, పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్, ఆ తర్వాత కార్గిల్ విచారణ కమిటీ సభ్యులై సతీశ్ చంద్ర ఇలా అన్నారు. ''దీన్ని 'రా' అసలు పసిగట్టలేకపోయింది. అయితే, వారు దానిని పసిగట్టగలరా అన్న సందేహం కూడా ఉంది. ఎందుకంటే, పాకిస్తాన్ అప్పటికి ఎలాంటి అదనపు బలగాలను మోహరించలేదు. పాకిస్తాన్ బలగాలను మోహరింపు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు మాత్రమే ‘రా‘కి తెలిసేది'' అని సతీశ్ చంద్ర అన్నారు.

పాకిస్తాన్ పక్కా ప్లాన్
ఈ పరిస్థితుల్లో భారత సైన్యం వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. కార్గిల్‌లో పోస్టింగ్ పొందిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్‌చరణ్‌జీత్ సింగ్ పనాగ్ మాట్లాడుతూ..''అది పాకిస్తాన్ పక్కా ప్లాన్ అని నేను చెప్పగలను. వాళ్లు ముందుకు చొచ్చుకొచ్చి చాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. లేహ్ - కార్గిల్ రహదారిపై నియంత్రణ సాధించారు. అది వారికి పెద్ద విజయం.'' అన్నారు.
''మే 3 నుంచి జూన్ తొలి వారం వరకూ మన సైన్యం పనితీరు ఆశించినంత స్థాయిలో లేదు. మొదటి నెలరోజుల పాటు మా పనితీరు సిగ్గుచేటని కూడా చెబుతా. అనంతరం, 8వ డివిజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసలు ఆ ప్రాంతంలో ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని అర్థం చేసుకోగలిగాం. అప్పటి నుంచి పరిస్థితి మెరుగుపడడం మొదలైంది. ఎందుకంటే, మీరు కొండల కింద లోయ ప్రాంతంలో ఉన్నారు, వాళ్లు కొండపైన ఉన్నారు.'' అని లెఫ్టినెంట్ పనాగ్ చెప్పారు.
''అదెలా ఉంటుందంటే, ఒక వ్యక్తి పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటే, మీరు అతన్ని పట్టుకుని కిందకు లాగినట్లు ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే, అంత ఎత్తులో ఆక్సిజన్ అందకపోవడం. పర్వత ప్రాంతాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో సైన్యానికి సరైన శిక్షణ లేకపోవడం మూడోది.'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
జనరల్ ముషారఫ్ ఏమన్నారంటే..
భారత సైన్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన ఈ ప్లాన్.. చాలా మంచి ప్లాన్ అని అప్పట్లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా పదే పదే చెప్పేవారు.
తన ఆత్మకథ 'ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్'లో ఆయన ఇలా రాశారు. ''కేవలం ఎనిమిది, తొమ్మిది మంది సైనికులు మాత్రమే మోహరించిన పోస్టుపై భారత్ ఏకంగా మొత్తం బ్రిగేడ్‌తో దాడి చేసింది. జూన్ మధ్య వరకూ వాళ్లకు చెప్పుకోదగ్గ విజయమేమీ దక్కలేదు. దాదాపు 600 మంది సైనికులు చనిపోగా, 1500 మందికి పైగా గాయపడ్డారని స్వయంగా భారతీయులే అంగీకరించారు. మాకున్న సమాచారం ప్రకారం ఆ సంఖ్య దాదాపు రెట్టింపు. నిజానికి, భారత్ వైపు ఎక్కువ మంది చనిపోవడంతో శవపేటికలకు కొరత కూడా ఏర్పడింది. ఆ తర్వాత శవపేటికల కుంభకోణం కూడా బయటపడింది.'' అని ముషారఫ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
తోలోలింగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో తల్లకిందులు
జూన్ రెండోవారం చివరినాటికి పరిస్థితి భారత సైన్యం అదుపులోకి రావడం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో కీలక మలుపు ఏంటని నేను అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్‌ప్రకాశ్ మాలిక్‌ను అడిగినప్పుడు, ఆయన సమాధానం ఏంటంటే.. '''తోలోలింగ్‌లో విజయం. మేం సమన్వయంతో చేసిన మొదటి దాడి. అది మాకు పెద్ద విజయం. ఆ యుద్ధం నాలుగైదు రోజులపాటు కొనసాగింది. ఈ యుద్ధంలో ఇరుదేశాల సైనికులు అత్యంత దగ్గరగా పోరాడారు. ఎంత దగ్గరగా అంటే తిట్లు కూడా ఒకరివి ఒకరికి వినిపించేంత దగ్గరగా.''
''మేం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఏం జరుగుతుందోనని మేం కూడా ఆరు రోజులపాటు ఆందోళనకు గురయ్యాం. కానీ, అక్కడ గెలిచిన తర్వాత వాళ్లని నియంత్రించగలమన్న నమ్మకం పెరిగింది.'' అని మాలిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కో పాకిస్తానీ సైనికుడికి 27 మంది భారత సైనికులు
సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో జరిగిన ఈ యుద్ధంలో, సుమారు 1700 మంది పాకిస్తానీ సైనికులు 8, 9 కిలోమీటర్ల మేర భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చారు. ఈ యుద్ధంలో భారత సైనికులు 527 మంది చనిపోగా, 1363 మంది సైనికులు గాయపడ్డారు.
సీనియర్ జర్నలిస్ట్ సుశాంత్ సింగ్ వివరిస్తూ, ''పర్వతాలు సైన్యాన్ని తినేస్తాయని సైన్యంలో ఒక సామెత ఉంది. అంటే, పర్వతాలు సైన్యాన్ని బలితీసుకుంటాయి. మామూలు భూభాగంలో దాడి జరిగితే, దాడికి దిగిన సైన్యాన్ని ఎదుర్కొనేందుకు కనీసం మూడురెట్లు సైనికులు అవసరమవుతారు. అదే పర్వత ప్రాంతాల్లో అయితే కనీసం 9 రెట్లు ఉండాలి. కానీ, కార్గిల్ లాంటి ప్రాంతాల్లో కనీసం 27 రెట్లు అవసరం. అంటే, అలాంటి పర్వతాల మీద ఉండే ఒక్కో సైనికుడి కోసం కనీసం 27 మందిని మోహరించాల్సి ఉంటుంది. భారత్ తొలుత ఒక డివిజన్ మొత్తాన్ని మోహరించింది. ఆ వెంటనే, చాలా తక్కువ సమయంలో అదనపు బలగాలను కూడా పంపించింది'' అన్నారు.
రెండు జెట్లు, హెలికాప్టర్‌ను కూల్చేసిన పాకిస్తాన్
పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం తనకు మద్దతిచ్చి ఉంటే, కథ మరోలా ఉండేదని ముషారఫ్ చివరి వరకూ చెబుతూనే ఉన్నారు.
''భారత్ తన వైమానికి దళాన్ని కూడా మోహరించడం ద్వారా అతిగా స్పందించింది. వాళ్లు ముజాహిదీన్ల రహస్య స్థావరాలకే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటొచ్చి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై కూడా బాంబులు వేయడం మొదలుపెట్టారు. దీంతో మేం భారత్‌కు చెందిన రెండు జెట్ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చేశాం.'' అని ఆయన తన ఆత్మకథలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీన్ మార్చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, బోఫోర్స్ గన్స్
మొదట్లో భారత్ తన రెండు మిగ్ విమానాలు, హెలికాప్టర్లను కోల్పోయిన మాట వాస్తవమే. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, బోఫోర్స్ గన్స్ దాడులు పాకిస్తాన్‌ను ఘోరంగా దెబ్బతీశాయి.
నసీమ్ జహ్రా తన పుస్తకం 'ఫ్రమ్ కార్గిల్ టు ది కూ'లో ఇలా రాశారు. ''ఇవి చాలా భయంకరమైన దాడులు. గురితప్పని కచ్చితమైన దాడులు. ఈ దాడులతో పాకిస్తానీ స్థావరాలు నేలమట్టమయ్యాయి. పాకిస్తాన్ సైనికులు ఆయుధ సామగ్రి లేకుండా పోరాడుతున్నారు. సరైన నిర్వహణ లేక వారి తుపాకులు కూడా కర్రల్లా మారాయి.''
ఒక చిన్న ప్రాంతంపై వందలాది తుపాకులతో గుళ్లవర్షం కురిపించడం, ఒక వాల్‌నట్‌ను పెద్దసుత్తితో పగలగొట్టినట్లుగా ఉందని స్వయంగా భారత అధికారులే అంగీకరించారు.
యుద్ధంలో పాకిస్తాన్‌పై మానసికంగా ఒత్తిడి కలిగించడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకపాత్ర పోషించిందని కార్గిల్ యుద్ధంలో కమాండర్‌గా పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ మొహిందర్ పూరీ అభిప్రాయపడ్డారు. పైనుంచి దూసుకుపోతున్న భారత జెట్ విమానాల శబ్దానికి పాకిస్తాన్ సైనికులు అటూ, ఇటూ పరిగెత్తేవారని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నవాజ్ షరీఫ్‌కి సూటిగా చెప్పేసిన క్లింటన్
జూన్ రెండోవారంలో పాకిస్తాన్ మీద పైచేయి సాధించినప్పటి నుంచి జూలై చివరి వరకూ భారత సైన్యం జోరు కొనసాగింది. చివరకు, కాల్పుల విరమణ కోసం నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లాల్సి వచ్చింది. షరీఫ్ అభ్యర్ధనతో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజు, 1999 జూలై 4న, చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఆయన క్లింటన్‌ను కలిశారు.
వారి సమావేశానికి హాజరైన క్లింటన్‌కు దక్షిణాసియా వ్యవహారాల సహాయకులు బ్రూస్ రీడెల్ తన నివేదిక 'అమెరికాస్ డిప్లొమసీ అండ్ 1999 కార్గిల్ సమ్మిట్'లో ఇలా రాశారు. 'నవాజ్ షరీఫ్‌కు క్లింటన్‌ను ఒంటరిగా కలవాలని అడగాల్సిన సమయం వచ్చింది. అయితే, అది సాధ్యం కాదు. బ్రూస్ అన్ని విషయాలు నమోదు చేస్తున్నారు. మన మధ్య ఏం జరిగినా అధికారికంగా నమోదు కావాలని అనుకుంటున్నా’' అని క్లింటన్ సమాధానమిచ్చినట్లు రాశారు.
రీడెల్ తన నివేదికలో ఇలా రాశారు. ''మీరు మీ సైన్యాన్ని బేషరతుగా ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉంటేనే ఇక్కడకు రావాలని నేను మీకు ముందే చెప్పాను. అలా చేయకపోతే, కార్గిల్ సంక్షోభానికి పాకిస్తాన్ మాత్రమే కారణమని చెప్పే ప్రకటన నా దగ్గర సిద్ధంగా ఉందని క్లింటన్ అన్నారు.''
పాకిస్తాన్ ప్రతినిధి బృందంలో ఒకరైన తారిఖ్ ఫాతిమి, 'ఫ్రమ్ కార్గిల్ టు కూ' పుస్తక రచయిత నసీమ్ జహ్రాతో మాట్లాడుతూ ''క్లింటన్‌ను కలిసివచ్చిన తర్వాత షరీఫ్ ముఖం వాడిపోయింది. ఆయన మాటలను బట్టి, ఇక గట్టిగా నిరసన తెలిపే పరిస్థితి ఆయనకు లేదని అర్థమైంది. షరీఫ్ క్లింటన్‌తో మాట్లాడుతున్న సమయంలోనే భారత్ టైగర్ హిల్‌ను ఆక్రమించుకుందన్న వార్తలు టీవీలో కనిపిస్తున్నాయి.'' అన్నారు.
విరామ సమయంలో, ఇది నిజమేనా? అని ముషారఫ్‌కు నవాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ముషారఫ్ దానిని ఖండించలేదు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














