పారిస్ ఒలింపిక్స్ నిరాశ్రయులను కష్టాల్లోకి నెట్టిందా?

- రచయిత, పీటర్ బాల్ , లారా గార్సియా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఒలింపిక్స్ వేళ పారిస్‌లోని నిరాశ్రయులు, వలసదారులను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పారిస్‌లోని కాలువ దగ్గరున్న వంతెన కింద పదుల సంఖ్యలో కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
"ఈ రోజు వీధుల్లో ఎవరూ లేరు" అని పారిస్ సాలిడారిటీ బార్‌కు చెందిన ఆరేలియా హుట్ అన్నారు.
సాలిడారిటీ బార్ ఒక లీగల్ అడ్వొకసీ గ్రూప్. సామాజిక, మానవతా అంశాలకు సంబంధించిన కేసులలో ఉచిత న్యాయ సహాయం అందిస్తుంటుంది.
వంతెనల వద్ద బారికేడ్‌లను చూపిస్తూ.. ‘’ఈ అడ్డంకులను చూడండి. పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో వలసదారులు మళ్లీ ఇక్కడికి రాలేరు, శిబిరాలను ఏర్పాటు చేసుకోలేరు" అని ఆరేలియా చెప్పారు.
ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి నెలల ముందు నుంచి తొలగించిన మురికివాడలు, శిబిరాలలో అదొకటి. అంతేకాదు వారం రోజుల ముందే నిరాశ్రయులను ఇక్కడి నుంచి పంపించారు.


'అదొక పీడకల'
ఫారిస్ అల్ ఖలీ యూసఫ్ రాజకీయ వేధింపుల కారణంగా సెంట్రల్ ఆఫ్రికాలోని చాద్ దేశాన్ని విడిచి ఫ్రాన్స్‌కు వచ్చారు.
పారిస్ ఒలింపిక్ విలేజ్‌కు కొన్ని వందల మీటర్ల దూరంలో గల ఒక భవనంలో నివసించినట్లు యూసఫ్ చెప్పారు. అక్కడ ఆయనతో పాటు కొన్ని వందల మంది ఉన్నట్లు తెలిపారు. అయితే, ఏప్రిల్‌లో పోలీసులు అందరినీ ఖాళీ చేయించారని యూసఫ్ చెప్పారు.
ఖాళీ చేసే సమయంలో అక్కడ నివసిస్తున్న వారికి పారిస్‌లో లేదా టౌలౌస్ నగరంలో తాత్కాలిక వసతి కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
శరణార్థులకు ఆ రోజు పీడకలలాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.
“చాద్ నుంచి వచ్చిన వాళ్లందరిదీ ఇప్పుడు ఇదే పరిస్థితి. మెట్రో టిక్కెట్లు కొనడానికి వెళితే నిర్బంధ కేంద్రాలకు తరలిస్తున్నారు. శరణార్థులను ఇబ్బందిపెడుతున్నారు’’ అని యూసుఫ్ అన్నారు.

13 వేల మందిని తరలించారు: పాల్
వంతెన కింద ఉన్న శరణార్థుల శిబిరాన్ని ఖాళీ చేయించి, కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేయడంపై స్థానిక సామాజిక కార్యకర్త పాల్ అల్లౌజ్ స్పందించారు.
'లె రివర్స్ డి లా మెడెల్లె' అనే ఫ్రెంచ్ గ్రూప్ కోసం పాల్ పనిచేస్తున్నారు. 'లే రివర్స్ డి లా మెడెల్లె' అంటే 'చిత్రానికి మరో వైపు' అని అర్థం.
వంతెన దగ్గర ఉన్న శిబిరాలను పాల్ చూపిస్తూ.. "ఈ డేరా కొన్నేళ్ల నుంచి ఉంది. కొందరు మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అంతటా శిబిరాలున్నాయి. వాటిలో వందల మంది నివసించేవారు" అని చెప్పారు.
ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో దాదాపు 13 వేల మంది వలసదారులను ఫ్రాన్స్ వీధుల నుంచి తరలించారని పాల్ ఆరోపించారు.
సామాజిక కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, తరలింపు అనేది ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళిక, ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో ఆ పనిని వేగంగా అమలు చేశారు. నిరాశ్రయులకు ప్రభుత్వం వసతి కల్పిస్తున్నప్పటికీ, వారు పారిస్‌కు దూరంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు.
"ప్రజల్ని పారిస్ నుంచి దూరంగా ఉన్న చిన్న పట్టణాలకు పంపినప్పుడు, వారికి అక్కడ అంత ఆదరణ లభించదు" అని పాల్ అన్నారు.
'నిరాశ్రయులను తరలించే ప్రక్రియలో వారి కోసం దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే, వారి సమస్యను ఎప్పటికీ పరిష్కరించలేరు' అని పాల్ అభిప్రాయపడ్డారు.
"పారిస్‌లోని శరణార్థులు వారి ప్రాథమిక అవసరాలు, హెల్త్ కేర్ పొందడానికే కష్టపడుతున్నారు" అని పాల్ గుర్తుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారులు ఏమంటున్నారు?
గతంలో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. జపాన్‌లోని టోక్యోలో నిరాశ్రయులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అదేవిధంగా రియో డి జెనీరోలో మురికివాడలను ఖాళీ చేయించారు.
కాగా, నిరాశ్రయులకు సహాయం చేయడం తమ ప్రాధాన్యతలో భాగంగా ఉందని పారిస్ మేయర్ అన్నే హిడాల్గో చెప్పారు. మరోవైపు పారిస్‌లో ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి వారిని వీధుల నుంచి తరలించాలని అధికారులు చెబుతున్నారు.
"నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణమనేది చర్చల్లో ఉన్నది. ఆర్థిక వనరులే అడ్డంకి. ప్రభుత్వం దీనిని పరిష్కరించగలదని అనుకుంటున్నాను" అని మేయర్ అన్నే హిడాల్గో అన్నారు.
"ఒలింపిక్స్ సన్నాహకాల సమయంలోనే నిరాశ్రయుల సమస్య మా ప్రణాళికలో ఉంది. గేమ్స్ సమయంలో వారికి వసతి కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం" అని పారిస్ అధికారులు బీబీసీతో చెప్పారు.
కాంక్రీట్ బారీకేడ్‌లపై స్పందిస్తూ నిరాశ్రయులను అడ్డుకునేందుకు వాటిని ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. ఆ కాంక్రీట్ బారికేడ్‌ల ప్రాంతం తమ పరిధిలోకి రాదని, పొరుగు మునిసిపాలిటీకి చెందినదని అధికారులు తెలిపారు. వలసదారులు, డ్రగ్స్ బానిసలు రాకుండా నిరోధించడానికే ఈ బారికేడ్‌లను ఏర్పాటు చేశారని చెప్పారు.
అధికారులు స్పష్టంగా చెప్పినప్పటికీ, చాలామంది సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఇది ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని తరిమేస్తున్నట్లు ఉంది. మీ దుస్థితిని దాచడానికి వారిని నగరం నుంచి పంపించేస్తున్నారు, తిరిగి రాకుండా ఆపుతున్నారు. అయితే, ఇది స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే’’ అని పాల్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














