షేక్ హసీనా ఎవరు? బంగ్లాదేశ్ రాజకీయాలలో కీలక నాయకురాలిగా ఎలా ఎదిగారు

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనలతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయారు షేక్ హసీనా.
ఆమె బంగ్లాదేశ్ పాలక పార్టీ అవామీ లీగ్ నాయకురాలు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచే షేక్ ముజిబుర్ రెహ్మాన్ కుమార్తె.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా షేక్ హసీనా పేరొందారు.
షేక్ హసీనా1996 నుంచి 2001 మధ్య .. అనంతరం 2009 నుంచి తాజాగా రాజీనామా చేసేవరకు మరోసారి బంగ్లాదేశ్‌ను పరిపాలించారు.
1960ల్లో ఢాకా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పటికే హసీనా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 1968లో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను హసీనా పెళ్లాడారు.


ఫొటో సోర్స్, Getty Images
ముజిబుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని నెలలకే 1975 ఆగస్టు 15న ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురయ్యారు.
ఆయనతోపాటు హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు ఇంట్లోనే హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు ఆమె బంగ్లాదేశ్‌లో లేరు.
అప్పట్లో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉన్నారు. ఆ సమయంలోనే అవామీ లీగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.
1981లో ఆమె బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా మారారు. ఆ సమయంలో కొన్నిసార్లు గృహనిర్బంధానికి గురయ్యారు.
1990 డిసెంబర్‌లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు.
1991లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీకి మెజారిటీ లభించలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత ఐదేళ్లకు 1996లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించటంతో హసీనా తొలిసారి ప్రధానమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
2004లో గ్రనేడ్ దాడి నుంచి బయటపడి..
1996 జూన్ ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా, హసీనా ప్రధానమంత్రి అయ్యారు.
2001 అక్టోబరులో ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్‌పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాల చేతిలో అవామీ లీగ్ ఓడిపోయింది.
2004 ఆగస్టులో దేశ రాజధాని ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీపై గ్రెనేడ్ దాడిలో 22 మంది మృతి చెందారు. ఆ దాడి నుంచి హసీనా బయటపడ్డారు.
2008 డిసెంబరులో సార్వత్రిక ఎన్నికల్లో 300 స్థానాలకుగాను 250కి పైగా స్థానాల్లో హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ జయకేతనం ఎగరవేసింది.
2009 జనవరిలో మరోసారి ప్రధానిగా హసీనా ప్రమాణం చేశారు.
2014 జనవరిలో సార్వత్రిక ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది . ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం, సాధించడంతో హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
2024 జనవరిలో మళ్లీ బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా-భారత్ సంబంధాలు
అప్పట్లో దిల్లీలో షేక్ హసీనా కుటుంబం ఆశ్రయం పొందిన విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచారు. కానీ, షేక్ హసీనా కుటుంబం దిల్లీలో ఉన్న సంగతి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలుసని చరిత్రకారులు చెప్తారు.
తొలిసారి 1996లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడ్డాయి.
2022లో భారత్ వచ్చిన సమయంలో షేక్ హసీనా మాట్లాడుతూ, "బంగ్లాదేశ్ ఎన్నటికీ భారత్‌ను మర్చిపోదు" అని అన్నారు.
1971 స్వాతంత్య్రోద్యమ సమయంలో భారత ప్రభుత్వం, సైనికదళం, భారత ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు.
2009లో షేక్ హసీనా అధికారం చేపట్టాక.. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఈశాన్య భారత రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించే తిరుగుబాటు సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించారు. అలా తన నిర్ణయాలతో భారత్ నమ్మకాన్ని గెల్చుకున్నారు షేక్ హసీనా.
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














