ఇండియా నుంచి వచ్చిన కాకులను చంపేస్తున్న కెన్యా, అవి అంత డేంజరా?

- రచయిత, వైక్లిఫ్ మేనియ
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ఇన్వేజివ్ ఏలియన్ బర్డ్స్' అనే పదం భయానక హాలీవుడ్ సినిమా టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా కనిపించొచ్చు. కానీ కెన్యా తీరప్రాంత ప్రజలకు ఇది ఎంతమాత్రం సినిమా కథ కాదు.
భారత్ నుంచి వచ్చిన కాకులు సృష్టిస్తున్న ఉపద్రవం గురించి అక్కడి అధికారులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లక్షల సంఖ్యలో కాకులను హతమార్చే ప్రక్రియను కూడా వారు మొదలుపెట్టారు.
ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన హారర్ మూవీ 'ది బర్డ్స్'లో మాదిరిగా అవి మనుషులను లక్ష్యంగా చేసుకోలేదు. కానీ, దశాబ్దాలుగా వన్యప్రాణులను వేటాడడం, పర్యాటక ప్రాంతాలు, పౌల్ట్రీఫామ్‌లపై దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ క్రూరమైన కాకులను హతమార్చేందుకు వటాము, మలిండి పట్టణాల్లో ఇప్పుడు విష ప్రయోగం చేస్తున్నారు. కెన్యా రాజధాని నైరోబి వైపు రాకుండా ఈ కాకులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ విషప్రయోగానికి సిద్ధమయ్యారు.
తీరప్రాంతాల్లో 'కుంగురు' లేదా 'కురబు'గా పిలిచే ఈ కాకులు భారత్‌తోపాటు ఆసియాలోని ఇతర ప్రాంతాల నుంచి తూర్పు ఆఫ్రికాకు చేరాయి. వాణిజ్య నౌకల మీద చేరి, అలా ఇతర దేశాలకూ వ్యాపిస్తున్నాయి.

అయితే, 1890లలో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంజిబార్ ద్వీపసమూహంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కాకులను తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి తీసుకొచ్చినట్లు చెబుతారు. అక్కడి నుంచి అవి ప్రధాన భూభాగాలతో పాటు కెన్యా తీరం వరకూ వ్యాపించాయి.
తొలుత 1947లో మొంబాస పోర్టులో వీటిని గుర్తించారు. ఆ తర్వాత వాటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జనాభా పెరుగుదలతో పాటు చెత్త కుప్పలు కూడా పెరిగిపోవడం సహజంగానే ఈ పక్షులకు ఆహారం, సంతానోత్పత్తికి అనువైన వాతావరణంగా మారింది. అలాగే, వాటిని వేటాడి తినే జంతువులు కూడా లేవు.
ప్రపంచంలోనే అత్యంత హానికరమైన, విధ్వంసకరమైన పక్షులలో ఒకటిగా వీటిని పరిగణిస్తున్నారు.
''అవి కేవలం పక్షులను మాత్రమే కాదు, క్షీరదాలు, సరీసృపాలను కూడా చంపేస్తున్నాయి. జీవవైవిధ్యానికి ఇవి చాలా ప్రమాదకరమైనవి.'' అని కెన్యాలోని వటాము ప్రాంతాన్ని సందర్శించిన వచ్చిన డచ్ పక్షి నిపుణుడు జాప్ గిజ్‌బర్స్టెన్ బీబీసీతో అన్నారు.

పక్షుల గుడ్లు, పిల్లలే లక్ష్యంగా ఈ కాకులు గూళ్లపై దాడులు చేయడంతో స్థానిక పక్షి జాతులైన వీవర్స్ (గిజిగాడు పిట్ట), వాక్స్‌బిల్స్ (పిచ్చుక లాంటి చిన్న పక్షి) వంటి వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
''స్థానిక పక్షుల సంఖ్య క్షీణించిప్పుడు పర్యావరణం దెబ్బతినడం మొదలువుతుంది. పక్షులు తగ్గిపోవడం వల్ల అవి వేటాడి తినే హానికరమైన తెగుళ్లు, కీటకాలు పెరిగిపోతాయి.'' అని పర్యావరణ పరిరక్షణ గ్రూప్ 'ఏ రొచా కెన్యా'తో కలిసి పనిచేస్తున్న రీసెర్చ్ సైంటిస్ట్ లెనోక్స్ కిరావ్ చెప్పారు.
అవి పంటలు, పశువులు, కోళ్ల మీద కూడా దాడులు చేస్తున్నాయి.
''కోడిపిల్లలను దారుణంగా తింటాయి. అవి మామూలు పక్షులు కావు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తాయి.'' అని కిలిఫీ కౌంటీలోని టకాయే గ్రామానికి చెందిన యూనిస్ కటానా అన్నారు.
కిరావ్ చెప్పిన దాని ప్రకారం, అవి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఎర దొరికినప్పుడు ప్రత్యేకమైన శబ్దం చేస్తాయి.
మొంబాసలో గోడలు, పైకప్పులపై రెట్టలు వేస్తూ ఈ కాకులు ఇళ్లను కూడా పాడు చేస్తున్నాయి. చాలామంది ఇవి ఎక్కడ రెట్టలేస్తాయోనని చెట్ల కింద కూర్చోవడానికి కూడా వెనకాడుతున్నారు.
''కాకులు తెల్లవారుజామునే లేచి అరుస్తూ నిద్రను చెడగొడతాయి.'' అని మొంబాస వాసి విక్టర్ కిములీ బీబీసీతో చెప్పారు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారత్ నుంచి ఇక్కడకు చేరిన ఈ కాకుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు మంగళవారం నుంచి అధికారులు చర్యలు చేపట్టారు.
దీనిపై పర్యావరణ నిపుణులు, పర్యావరణ పరిరక్షకులు, కమ్యూనిటీ నేతలు, హోటల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) తెలిపింది.
''వాటిని నియంత్రించదగినంత తక్కువ సంఖ్యకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని కిరావ్ చెప్పారు.

ఈ హతమార్చే ప్రక్రియలో భాగంగా, అవి ఉండే ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నెలల తరబడి పక్షుల మాంసాన్ని వాటికి ఎరగా వేస్తారు.
''ఎర వేసేందుకు ఎంచుకున్న ప్రదేశాలకు ఎక్కువ సంఖ్యలో కాకులు వచ్చిన తర్వాత వాటిపై విషప్రయోగం చేస్తాం.'' అని రోచా కెన్యాకు చెందిన అధికారి ఎరిక్ కినోటి చెప్పారు.
అందుకోసం, ఇతర పక్షులు లేదా జంతువులపై ప్రభావం పడకుండా, కేవలం కాకులపై మాత్రమే ప్రభావవంతంగా పనిచేసే ‘స్టార్లిసైడ్’ అనే విషపదార్థాన్ని వాటి ఆహారంలో ప్రయోగిస్తారు.
ఆ విషం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు 2022లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 2000 కాకులు చనిపోయాయని ఆ విషాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి పొందిన కంపెనీ లిటిల్ కెన్యా గార్డెన్స్ యజమాని సీసిలియా రుటో తెలిపారు.
''నెమ్మదిగా పనిచేసే ఈ విషం కాకి చనిపోయే ముందే జీవక్రియలో కలిసిపోతుంది. అంటే, ఇలా చనిపోయిన కాకిని తినే ఇతర జాతులపై విషం ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ.'' అని రుటో చెప్పారు.
ప్రస్తుతం కెన్యా వద్ద 2 కేజీల విషం అందుబాటులో ఉంది. ఇది దాదాపు 20000 కాకులను చంపేందుకు సరిపోతుందని అంచనా. ఈ విషాన్ని న్యూజీలాండ్ నుంచి మరింత దిగుమతి చేసుకునే ప్రణాళికలు కూడా ఉన్నాయి.
అయితే, విషప్రయోగం చేసి కాకులను చంపడంపై జంతు, పక్షుల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకులకు విషం ఇవ్వడం అమానవీయమని, వాటి సంఖ్యను తగ్గించేందుకు హానికరం కాని పద్ధతులను అన్వేషించాలని వారు వాదిస్తున్నారు.
''పెద్దయెత్తున విషప్రయోగం చేయడం స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే. ఇది సమస్య మూలాలను పరిష్కరించలేదు.'' అని పర్యావరణవేత్త లియోనార్డో ఒన్యాంగో అన్నారు.
''కాకుల సంఖ్యను తగ్గించేందుకు కచ్చితమైన, మానవీయ విధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది'' అన్నారాయన.

కానీ, ఈ ప్రక్రియలో భాగస్వాములైన వారు స్థానిక జీవజాతులను రక్షించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు అవసరమని స్పష్టం చేస్తున్నారు.
''ఇప్పుడేమీ చేయకపోతే, ఆ తర్వాత నష్టం కోలుకోలేనంతగా ఉండొచ్చు'' అని కిరావ్ అన్నారు.
వినాశకర పక్షుల సంఖ్యను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేయడం ఇదే తొలిసారి కాదు.
గతంలో 20 ఏళ్ల కిందట ఇలాంటి ప్రయత్నం జరిగింది, అప్పుడు పక్షుల సంఖ్య తగ్గింది. అయితే, దీనికి అవసరమైన స్టార్లిసైడ్ దిగుమతులపై ప్రభుత్వం ఆ తర్వాత నిషేధం విధించింది.
కేవలం అవి ఉండే ప్రాంతాలు మాత్రమే కాకుండా, టూరిజం హోటళ్లు కూడా వాటికి ఇష్టమైన ప్రదేశాలుగా మారాయి. పర్యాటకులు భోజనం చేస్తున్నప్పుడు అక్కడికి వస్తాయి, వారు భోజనం చేసేప్పుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని హోటల్ యజమానులు కూడా ఫిర్యాదులు చేశారు.
''బీచ్‌ల వెంట ఉండే మా హోటళ్లకు వచ్చి భోజనాన్ని ఆస్వాదించాలనుకునే అతిథులకు ఈ కాకులు నిజంగా పెద్ద ఇబ్బందిగా మారాయి.'' అని కెన్యా అసోసియేషన్ ఆఫ్ హోటల్ కీపర్స్ అండ్ క్యాటరర్స్ చైర్‌పర్సన్ మౌరీన్ అవోర్ చెప్పారు.
కొన్ని హోటళ్లు కాకులను ట్రాప్ చేసే పనిలో ఉంటే, మరికొందరు వాటిని భయపెట్టేందుకు క్యాటాపుల్ట్(క్యాట్‌బాల్) వంటి వాటిని ఇచ్చి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నారు.
''అతిపెద్ద భయం ఏంటంటే మనం ఇప్పుడు ఏమీ చేయకపోతే ఈ కాకులు నైరోబీకి చేరతాయి. అది దేశంలోని పక్షులకు, మరీముఖ్యంగా నైరోబి నేషనల్ పార్కులో పక్షులకు పెనుముప్పుగా మారతాయి.'' అని కిరావ్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














