సయామీస్ క్రోకోడైల్: అంతరిస్తున్న జాతి మొసలి 60 గుడ్లు పెట్టింది..

ఫొటో సోర్స్, Hor Leng/Fauna & Flora
కంబోడియాలో అంతరించే పోయే ప్రమాదంలో ఉన్న సయమీస్ మొసళ్ల విషయంలో అద్భుతం జరిగింది. ఒక మొసలి తన గుడ్ల నుంచి ఒకేసారి ఏకంగా 60 పిల్లలను పొదిగింది.
అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఈ సయమీస్ మొసలి జాతిలో, ఒకేసారి ఇన్ని మొసలి పిల్లలను పొదగడం గతంలో ఎన్నడూ జరగలేదని వాటి సంరక్షకులు అంటున్నారు.
కంబోడియాలో మారుమూలన ఉన్న కార్డమమ్ మౌంటెన్స్‌లో సయమీస్ మొసళ్ల సంఖ్యను పెంచడానికి 20 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు.

ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మంచినీటి మొసళ్లు 3 మీటర్లు లేదా దాదాపు 10 అడుగుల వరకు పెరుగుతాయి.
స్థానికులకు మే నెలలో మొసళ్లు ఏర్పాటు చేసుకున్న ఐదు గూళ్లు కనిపించగా, జూన్ చివరిలో ఈ సయమీస్ మొసలి పిల్లలు జన్మించాయని సంరక్షకులు తెలిపారు.
సయమీస్ మొసళ్లు ఒకప్పుడు ఆగ్నేయాసియాలోని చాలా ప్రాంతాలలో కనిపించేవి.
కానీ దశాబ్దాల పాటు కొనసాగిన మొసళ్ల వేట, వాటి ఆవాసాల నిర్మూలన కారణంగా వాటిని "అంతరించిపోతున్న" జాతులలో చేర్చారు.
ప్రపంచంలో ఈ సయమీస్ మొసళ్లు కేవలం 400 మాత్రమే మిగిలి ఉండగా, వాటిలో ఎక్కువ భాగం కంబోడియాలో ఉన్నాయి.
వాటి జనాభా తగ్గిపోతున్న సమయంలోనే ఆ జాతి మొసలి ఏకంగా 60 పిల్లలకు జన్మనివ్వడం చాలా ఆనందాన్ని కలిగించిందని కంబోడియా ప్రోగ్రామ్ ఆఫ్ కన్జర్వేషన్ గ్రూప్ ఫౌనా అండ్ ఫ్లోరా కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న పాబ్లో సినోవాస్ అన్నారు.
సయమీస్ మొసళ్ల పరిరక్షణ ప్రయత్నాలలో జంతు పరిరక్షకులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, కంబోడియన్ ప్రభుత్వం సంయుక్తంగా పాల్గొన్నాయి.

ఫొటో సోర్స్, Bros Pov/Fauna & Flora
2000 సంవత్సరం ముందు వరకు ఈ మొసళ్లు కంబోడియాలో చాలాకాలం కనిపించలేదు. దీంతో అవి అంతరించిపోయాయని అనుకున్నారంతా.
అప్పటి నుంచి ఫౌనా అండ్ ఫ్లోరా సిబ్బంది, స్థానిక అధికారులతో కలిసి వాటిని మానవ సంరక్షణలో గుడ్లు పొదిగేలా చేసి, అనంతరం కార్డమమ్ కొండల్లోని వాటి సహజ ఆవాసాలలో వదిలేపని పెట్టుకున్నారు.
అలా విడుదల చేసిన తర్వాత ఆ మొసళ్లు సురక్షితంగా ఉన్నాయని నిర్ధరించుకోవడానికి స్థానిక కమ్యూనిటీ వార్డెన్‌లు పెట్రోలింగ్ నిర్వహించేవారు.
2012 నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా 196 సయమీస్ మొసళ్లను తిరిగి అడవులలో వదిలిపెట్టారు.
మే నెలలో స్థానికులకు ఇంతకు ముందు తాము మొసళ్లను విడుదల చేయని ప్రాంతంలో గూళ్లు కనిపించాయి. దీంతో అవి వాటి సహజ ఆవాసాలలోనే గుడ్లు పెడుతున్నాయని గుర్తించారు.
మొసళ్ల పరిరక్షణ బృందం అన్ని గుడ్లు పొదిగే వరకు ఆ గూళ్ళపై నిరంతరం నిఘా ఉంచడంతో, 60 సయమీస్ మొసలి పిల్లలు సురక్షితంగా గుడ్లు పగలగొట్టుకుని బైటకు వచ్చాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














