బంగ్లాదేశ్: మూడు వైపులా భారత దేశం, ఒక వైపు బంగాళాఖాతం - ఇండియా సాయంతోనే పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం

నదులు, సారవంతమైన భూములున్న ప్రాంతం బంగ్లాదేశ్. ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్నదేశాలలో బంగ్లాదేశ్ ఒకటి.
అయితే, ఇటీవల కాలంలో ఆ దేశంలో జనాభావృద్ధి తగ్గింది. అదే సమయంలో ఆరోగ్యం, విద్యారంగంలో ప్రగతి సాధించింది.
ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచే ఈ ప్రాంతం 1971లో బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. అధికారికంగా ఈ దేశం పూర్తి పేరు ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్’.
బంగ్లాదేశ్‌లో 15 ఏళ్ల పాటు సైనిక పాలన సాగిన తరువాత 1990లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
ఈ దేశాన్ని తరచూ తుపాన్లు తాకుతుంటాయి. నదులు ఎక్కువగా ఉండడంతో వరదల ప్రభావం కూడా ఎక్కువే.
నదులలో బోట్లు, పడవలు, లాంచీలలో ప్రయాణాలు చేస్తుంటారు, సరకు రవాణాలోనూ ఇక్కడి నదీమార్గాలు కీలకం.


ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ – 5 ఫ్యాక్ట్స్
రాజధాని: ఢాకా
విస్తీర్ణం: 1,48,460 చదరపు కిలోమీటర్లు
జనాభా: 16.5 కోట్లు
ప్రధాన భాష: బెంగాలీ
సగటు జీవిత కాలం: 71(పురుషులు), 74 (మహిళలు)

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌తోనే భారత్‌కు అత్యంత పొడవైన సరిహద్దు
బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు భారతదేశం ఉంది. బంగ్లాదేశ్‌కు దక్షిణాన బంగాళాఖాతం ఉండగా పశ్చిమ, ఉత్తర, తూర్పు.. మూడు వైపులా భారతదేశం ఉంది. ఆగ్నేయాన కొద్ది దూరం మియన్మార్‌తో సరిహద్దు ఉంది.
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఉంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య 4,096.7 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉండగా అందులో ఒక్క పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్యే సుమారు 2,200 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
భారత్ అత్యధిక దూరం సరిహద్దు పంచుకుంటున్న దేశం కూడా బంగ్లాదేశే.
బంగ్లాదేశ్ తరువాత అత్యధికంగా చైనాతో 3,488 కిలోమీటర్లు, ఆ తరువాత పాకిస్తాన్‌తో 3,323 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
మొఘల్‌లు, బెంగాల్ నవాబులు, బ్రిటిష్‌వాళ్లు, పాకిస్తానీ పాలకులు.. చివరకు భారత్ సాయంతో స్వాతంత్ర్యం.. ఇదీ 800 ఏళ్ల చరిత్ర
1204: బెంగాల్‌ను ముస్లిం పాలకులు పాలించారు.
14వ శతాబ్దం: సోనార్‌గావ్, సత్‌గావ్, లఖ్‌నవుతి పేరుతో మూడు నగర రాజ్యాలు ఏర్పడ్డాయి.
1352: ఈ మూడు నగర రాజ్యాలను శంసుద్దీన్ ఇల్యాస్ ఏకం చేసి బెంగాల్ రాజ్యంలో విలీనం చేశాడు. 14,15, 16వ శతాబ్దాలలో బెంగాల్ సుల్తానుల పాలన సాగింది.
17వ శతాబ్దం: బెంగాల్‌ను మొఘల్‌లు పాలించారు.
18వ శతాబ్దం: మొఘల్ సామ్రాజ్యంలో భాగంగానే బెంగాల్ నవాబులు ఈ ప్రాంతానికి స్వతంత్ర పాలకులుగా ఉండేవారు.
1757: ప్లాసీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్ధౌలాను బ్రిటిషర్లు చంపేశారు. ఈ యుద్ధం తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ఉప ఖండంలో స్వాధీనం చేసుకున్న తొలి ప్రాంతం ఇదే.
1947: భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసింది. ముస్లింలు ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ ఏర్పడింది. ప్రస్తుత బంగ్లాదేశ్ కూడా అందులో భాగంగా ఉండేది. ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. భారతదేశానికి పశ్చిమ వెపు ఉన్న పాకిస్తాన్‌ను వెస్ట్ పాకిస్తాన్ అని, తూర్పున ఉన్న భాగాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు.
1971: వెస్ట్ పాకిస్తాన్‌తో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ వేరు పడి స్వతంత్ర దేశం బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఈ యుద్దంలో ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్)కు భారత్ సహకారం అందించింది.
1973: తొలిసారి అక్కడ పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ భారీ విజయం సాధించింది.
1975: సైనిక తిరుబాటు జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్, ఆయన కుటుంబంలో చాలామంది ఈ తిరుగుబాటులో ప్రాణాలు కోల్పోయారు. దాంతో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం పతనమై సైనిక పాలన వచ్చింది. ఈ తిరుగుబాటులో పదవీచ్యుతుడై, ప్రాణాలు కోల్పోయిన ముజిబుర్ రెహ్మాన్ కూతురే ప్రస్తుతం భారత్‌ను ఆశ్రయం కోరి వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా.
1979: రెండోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆర్మీ మాజీ చీఫ్ జియాఉర్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
1981: సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం జరిగింది. కానీ, అధ్యక్షుడు జియాఉర్ రెహ్మాన్‌ను చంపేశారు.
1982: సైనిక తిరుగుబాటు జరిగి జనరల్ హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ అధికారం చేజిక్కించుకున్నారు.
1991: పార్లమెంట్ ఎన్నికలు జరిగి మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
2006-2008: రెండు ప్రధాన పార్టీల నాయకులు నిర్బంధాలకు గురయ్యారు. రాజకీయ సంక్షోభం.
2014-17: ఇస్లామిస్ట్ గ్రూపులు పెరిగి హింసాత్మక ఘటనలు పెరిగాయి.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














