బ్రిటన్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు, 90 మంది అరెస్ట్

ఫొటో సోర్స్, Leanne Brown / BBC
- రచయిత, అలెక్స్ బిన్‌లే, డాన్ జాన్సన్
- హోదా, లివర్‌పూల్ నుంచి బీబీసీ న్యూస్ ప్రతినిధులు
బ్రిటన్‌లోని పట్టణ ప్రాంతాలు, నగరాల్లో ఫార్ - రైట్ గ్రూపులు శనివారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు అల్లర్లకు దారితీశాయి. దీంతో పోలీసులు సుమారు 90 మందిని అరెస్ట్ చేశారు.
హల్, లివర్‌పూల్, బ్రిస్టల్, మాంచెస్టర్, స్టోక్-ఆన్-ట్రెంట్, బ్లాక్‌పూల్, బెల్‌ఫాస్ట్ వంటి నగరాల్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి.
మిస్సైల్స్‌ను విసరడం, దుకాణాలను లూటీ చేయడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసులపైనా దాడులు జరిగాయి.
మిగిలిన చోట్ల చిన్నచిన్న ప్రదర్శనలు మినహా పరిస్థితి అదుపులోనే ఉంది.
''ద్వేషాన్ని చిమ్మేందుకు'' యత్నిస్తున్న తీవ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు.
మెర్సీసైడ్‌లోని సౌత్‌పోర్ట్‌లో సోమవారం జరిగిన టేలర్ స్విఫ్ట్ థీమ్‌డ్ డ్యాన్స్ పార్టీలో ముగ్గురు యువతుల హత్య తర్వాత యూకే నగరాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.


ఫొటో సోర్స్, Reuters
నిరసనకారులు లివర్‌పూల్‌లో పోలీసుల పైకి రాళ్లు, సీసాలు విసిరేశారు. కుర్చీ విసరడంతో ఒక అధికారి తలకు తగిలింది. మరొకరు ఆయన బైక్‌ను తన్నుతూ కిందపడేశారు.
ఇస్లామోఫోబిక్ నినాదాలు చేస్తున్న సుమారు వెయ్యి మంది వలస వ్యతిరేక నిరసనకారులతో వారికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారు తలపడ్డారు.
వందల మంది ఫాసిస్ట్ వ్యతిరేక నిరసనకారులు మధ్యాహ్న భోజన సమయంలో లివర్‌పూల్‌లోని లైమ్ స్ట్రీట్ స్టేషన్ దగ్గర గుమిగూడారు. అందరికీ సహనం, ఐక్యత అవసరమని వారు పిలుపునిచ్చారు.
''శరణార్థులకు స్వాగతం, కానీ నాజీ సంతతి.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి'' అంటూ నినదించారు.
రెండు వర్గాలు ఒకరితో ఒకరు తలపడకుండా వారిని వేరు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పకుండా అదనపు బలగాలను రప్పించారు.
ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ ఆందోళనలు కొనసాగాయి, పోలీసు అధికారులపైకి కొందరు నిరసనకారులు టపాసులు విసిరేశారు.
నగరంలోని వాల్టన్ ప్రాంతంలో ఒక లైబ్రరీకి నిప్పు పెట్టారు. ఆ మంటలను ఆర్పకుండా అగ్నిమాపక సిబ్బందిని అడ్డుకునేందుకు అల్లరిమూకలు ప్రయత్నించాయని మెర్సీసైడ్ పోలీసులు తెలిపారు.
దుకాణాలు కాలిపోయాయని వారు చెప్పారు.
''శాంతిభద్రతలకు తీవ్రవిఘాతం''గా దీనిని వారు అభివర్ణించారు. ఈ హింసలో చాలామంది అధికారులు గాయపడ్డారని, వారిలో ఇద్దరిని ఆస్పత్రికి తరలించినట్లు బలగాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
''మెర్సీసైడ్‌లో అశాంతి, హింస, విధ్వంసానికి చోటు లేదు'' అని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ జెన్నీ సిమ్స్ అన్నారు.

ఫొటో సోర్స్, PA
అంతకుముందు శనివారం జరిగిన మంత్రుల సమావేశంలో సర్ కీర్ స్టార్మర్ ప్రతినిధి మాట్లాడుతూ, ''భావప్రకటన స్వేచ్ఛ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం రెండూ వేర్వేరు విషయాలు'' అని ప్రధాన మంత్రి చెప్పారని అన్నారు.
''ఇక్కడ ఎలాంటి హింసకూ తావులేదని, నగర వీధులు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం పోలీసులకు పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు'' అని ఆయన తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారు ఎవరైనా జైలు శిక్ష, ప్రయాణాలపై నిషేధంతో పాటు ఇతర శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని శనివారం హోం మంత్రి కూడా హెచ్చరించారు. అందుకు అవసరమైనన్ని జైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
''నేరపూరిత హింస, అశాంతికి బ్రిటన్ వీధుల్లో చోటులేదు'' అని హోం మంత్రి ఇవెట్ కూపర్ అన్నారు.

ఫొటో సోర్స్, PA
బ్రిస్టల్‌లో నిరసనకారులు, వారికి వ్యతిరేక ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
వారిలో ఒక సమూహం ‘రూల్ బ్రిటానియా’, ''ఇంగ్లండ్, 'టిల్ ఐ డై'', ''వుయ్ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్'' అంటూ పాడడం వినిపించింది.
యాంటీ రేసిజం గ్రూప్‌పై బీర్ డబ్బాలు విసిరేశారు, వారి ప్రత్యర్థి నిరసనకారులపై అధికారులు లాఠీచార్జి చేశారు.
నగరంలో 14 మందిని అరెస్టు చేసినట్లు ఎవాన్ అండ్ సోమర్‌సెట్ పోలీసులు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయని చీఫ్ ఇన్‌స్పెక్టర్ విక్స్ హేవార్డ్ మెలెన్ భావిస్తున్నారు.
మాంచెస్టర్‌లో పోలీసులతో ఘర్షణలు జరిగాయి, అక్కడ ఇద్దరిని అరెస్టు చేశారు.
బెల్‌ఫాస్ట్‌లో కేఫ్‌లోని కిటికీలను పగలగొట్టారని భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
హల్‌లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఒక హోటల్ కిటికీ పగలగొట్టడంతో పాటు పోలీసులపై గుడ్లు, సీసాలు విసిరేశారు.
బ్రిటిష్ చెస్ చాంపియన్‌షిప్ జరుగుతుండడంతో సిటీ హాల్‌ను లాక్‌డౌన్‌లో ఉంచారు.
సిటీ సెంటర్‌లో దుకాణాలను లూటీ చేయడంతో పాటు కొన్ని వస్తువులను తగలబెట్టారని, ఆ ప్రాంతంలో అశాంతికి కారణమైన 20 మందిని అరెస్టు చేసినట్లు హంబర్‌సైడ్ పోలీసులు తెలిపారు. ముగ్గురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Shutterstock
స్టోక్-ఆన్-ట్రెంట్‌లో అధికారులపై కొందరు రాళ్లు విసిరారు. ఇద్దరిని కత్తితో పొడిచినట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోందని, నిజానికి ఒక వస్తువుతో వారిని కొట్టారని, వారికి పెద్ద గాయాలేమీ కాలేదని స్టాఫోర్డ్‌షైన్ పోలీసులు చెప్పారు.
ఇప్పటివరకూ 10 మందిని అరెస్టు చేశామని, ముగ్గురు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవైపు, లీసెస్టర్ సిటీ సెంటర్‌లో ఇద్దరిని లీసెస్టర్‌షైర్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, సిటీ సెంటర్ వైపు వెళ్లే హెడ్రో వద్ద పెద్దగా ఇబ్బంది లేకుండానే భారీ నిరసన కొనసాగింది, అక్కడ వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
కొన్నిప్రాంతాల్లో సాయంత్రానికి నిరసనకారులను చెదరగొట్టారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














