బంగ్లాదేశ్‌లో క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని తగలబెట్టారా? అసలేం జరిగిందంటే..

లిటన్ దాస్ | Liton Das

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లిటన్ దాస్

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు గంటగంటకూ మారిపోయాయి. విద్యార్థులు రోడ్డెక్కడం, భద్రతా బలగాల కాల్పుల్లో వందల మంది చనిపోవడం, ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం, ఆమె స్వదేశాన్ని వీడి భారత్‌కు రావడం.. ఇలా ఎన్నో నాటకీయ పరిణామాలు జరిగాయి.

ఆందోళనకారులు ప్రధాని అధికారిక నివాసంలోకి చొరబడి అక్కడి సామగ్రి ఎత్తుకెళ్లిపోయారు. ప్రధాని నివాసం వద్ద ఉన్న హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ భారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఇదే సమయంలో అక్కడి మైనారిటీ వర్గాల దుకాణాలపై, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా పార్లమెంటులో ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన అన్నారు.

అయితే, తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటిని తగలబెట్టారని సోషల్ మీడియాలో పలు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

ఎక్స్ స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, X/Screenshot

ఫొటో క్యాప్షన్, లిటన్ దాస్ ఇల్లు కాలిపోతున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ యూజర్ పెట్టిన ఒక పోస్టు

లిటన్ దాస్ ఇంటిని తగలబెట్టారా?

'బంగ్లాదేశ్ హిందూ క్రికెటర్ లిటన్ దాస్ ఇంటికి నిప్పు పెట్టారు' అంటూ పలువురు ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో పోస్టులు పెట్టారు.

ఆ పోస్టులలో ఓ ఇల్లు కాలిపోతున్న ఫోటో, పక్కన లిటన్ దాస్ ఫోటోనూ పెట్టారు. అయితే ఆ ఇల్లు వాస్తవానికి లిటన్ దాస్‌ది కాదని స్థానిక ఫ్యాక్ట్ చెకర్స్ తెలిపారు.

అది మష్రఫే బిన్ మోర్తజా ఇల్లు అని చెప్పారు. మోర్తాజా ఒక ముస్లిం. ఆయన ఇప్పటివరకూ అక్కడ అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కూడా.

ఆ పోస్టులలో లిటన్ దాస్ ఇల్లుగా చెప్తున్న ఫోటోను బీబీసీ పరిశీలించింది. ఆ ఇల్లు మూడేళ్ల కిందటి మోర్తజా ఇంటి ఫోటోలతో సరిపోలింది.

2019లో నరైల్-2 డిస్ట్రిక్ట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మోర్తాజా అవామీ లీగ్ పార్టీ తరఫున గెలిచారు. అదే పార్టీ తరఫున 2014లోనూ విజయం సాధించారు.

అయితే, బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువులపై దాడులు జరుగుతున్నట్లు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మేం పరిశీలించిన ఒక వీడియోలో కొందరు తాము హిందువులమని, తమ ఇళ్లపై దాడి జరుగుతోందని చెప్పడం కనిపించింది.

ప్రధాని నివాసం నుంచి సామగ్రి ఎత్తుకెళుతున్న నిరసనకారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రధాని నివాసం నుంచి వస్తువులను తీసుకెళ్తున్న నిరసనకారులు

ఏది దొరికితే అది ఎత్తుకెళ్లారు

షేక్ హసీనా రాజీనామా అనంతరం అందోళనకారులు సోమవారం బంగ్లాదేశ్ జెండాలు ఊపుతూ ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసమైన గణభవన్‌ను చుట్టుముట్టారు.

ఈ సందర్భంగా నిరసనకారులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అధికార నివాసంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు, ఆ ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. దుస్తులతో సహా చాలా వస్తువులను తీసుకెళ్లారు.

కొంతమంది ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన కుర్చీలు, మంచాలపై సెల్ఫీలు దిగారు.

ప్రధాని నివాసంలో నిరసనకారులు

ఫొటో సోర్స్, Reuters

మరికొంత మంది అప్పుడే కిచెన్‌లో ఆహారం రెడీగా ఉండటంతో అదంతా తినేశారు.

కొందరు కూర్చీల్లో కూర్చోని ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు వీడియోలు తీసుకున్నారు.

బంగ్లాదేశ్ పార్లమెంటును కూడా నిరసనకారులు చేరుకున్నారు.

వీడియో క్యాప్షన్, Bangladesh Protest: Sheikh Hasina ఇంట్లో ఆందోళనకారులు చొరబడినప్పుడు ఏమేం జరిగాయో చూశారా?

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)