షేక్ హసీనా రాకతో భారత్‌లో ఏం జరుగుతోంది? పార్లమెంటులో జైశంకర్ ఏం చెప్పారు

ఫొటో సోర్స్, Sansad TV
రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు షేక్ హసీనా అత్యవసరంగా రావడం, ఆ దేశంలో పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ మంగళవారం (ఆగస్ట్ 6) పార్లమెంటులో మాట్లాడారు.
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య అనేక దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని జై శంకర్ అన్నారు. అయితే, బంగ్లాదేశ్‌లో ఇటీవలి హింస, అస్థిరతపై రాజకీయ వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన తెలిపారు.
జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో క్రమంగా నిరసనలు ఎక్కువయ్యాయని జైశంకర్ అన్నారు.
"ఆగస్టు 5న షేక్ హసీనా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడి ఉన్నత స్థాయి భద్రతా అధికారులతో చర్చించిన తర్వాత, హసీనా అత్యవసరంగా భారత్ రావడానికి అనుమతిని కోరారు. ఆమె సోమవారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు" అని ఆయన తెలిపారు.
అయితే, బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల వ్యాపారాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళ కలిగిస్తోందన్నారు. భారత సరిహద్దుల్లో అదనపు నిఘా ఉందని కేంద్రమంత్రి చెప్పారు.
అక్కడి భారతీయుల పరిస్థితి ఏంటి?
‘’బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 19 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో 9 వేల మంది విద్యార్థులున్నారు. అయితే, జులైలోనే చాలామంది భారతదేశానికి వచ్చారు, మరికొంతమంది అక్కడే ఉన్నారు’’ అని జై శంకర్ తెలిపారు.
‘’దౌత్య సాయం కోసం ఢాకాలోని హైకమిషన్‌తో పాటు, చిట్టగాంగ్, రాజ్‌షాహి, ఖుల్నా, సిల్హెట్‌లలో భారత అసిస్టెంట్ హైకమిషన్లు ఉన్నాయి. వీటికి అవసరమైన భద్రతను బంగ్లాదేశ్ ప్రభుత్వం అందిస్తుందనుకుంటున్నాం. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత సాధారణ కార్యకలపాలు కొనసాగిస్తాం’’ అని అన్నారు.
‘’మైనారిటీల స్థితిగతులను కూడా మేం పర్యవేక్షిస్తున్నాం. వారి రక్షణ, శ్రేయస్సును నిర్ధరించడానికి వివిధ గ్రూపులు, సంస్థల నివేదికలు ఉన్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సరిహద్దు కాపలా దళాలకు కూడా ఆదేశాలు ఇచ్చాం’’ అని జైశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, @DrSJaishankar
అఖిలపక్షం భేటీ
బంగ్లాదేశ్ సంక్షోభంపై భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో చర్చించింది.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా దీని వివరాలు వెల్లడించారు.
"ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులపై పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో చర్చించాం. బంగ్లాదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత నిర్ణయాలకు ఎంపీల పూర్తి మద్దతు లభించినందుకు మేం సంతోషిస్తున్నాం"అని ఒక పోస్టులో తెలిపారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో గంటగంటకు పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడి ప్రెసిడెంట్ ప్రతిపక్షాలు, మిలటరీలతో భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు
బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను రద్దు చేసినట్లు ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
ప్రెసిడెంట్ మహ్మద్ షహబుద్దీన్‌తో త్రివిధ సాయుధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి ఉద్యమ నాయకులు సమావేశమై పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
2024 జనవరి 7న జరిగిన ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్ ఏర్పడింది.
స్టూడెంట్ ప్రొటెస్ట్ కోఆర్డినేటర్స్ కీలక డిమాండ్‌లలో పార్లమెంట్ రద్దు కూడా ఒకటి. మంగళవారం మధ్యాహ్నం 2:30లోపు పార్లమెంట్ రద్దు చేయాలని నిరసనకారులు కోరారు. అంతేకాదు, మిలిటరీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అంగీకరించబోమని నిరసనకారులు తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉండటానికి అంగీకరించారని తెలిపారు.
అంతేకాదు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాతో పాటు పలువురు నేతలను గృహనిర్బంధం నుంచి విడుదల చేస్తూ ప్రెసిడెంట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బంగ్లాదేశ్ ప్రతిపక్షానికి చెందిన కార్యకర్త, న్యాయవాది అహ్మద్ బిన్ క్వాసెమ్ నిర్బంధం నుంచి విడుదలయ్యారని ఆయన న్యాయవాది మైఖేల్ పోలాక్ ఎక్స్ వేదికగా తెలిపారు. 2016లో ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారని రైట్ వింగ్స్ తెలిపాయి.

ఫొటో సోర్స్, FB/NarendraModi
మోదీ అత్యున్నత స్థాయి సమావేశం
బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ కమిటీ సమావేశం సోమవారం రాత్రి జరిగింది.
ఈ కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీకి వారు వివరించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














