యూకే అల్లర్లు: చిన్నారుల హత్యకు తీవ్రవాద లింకులు లేవని పోలీసులు చెప్పినా ఈ ఆందోళనలు హింసాత్మకంగా ఎందుకు మారాయి?

ఇంగ్లండ్ ఉత్తర ప్రాంతంలోని సముద్రతీర పట్టణం సౌత్‌పోర్ట్‌లో, ఒక డ్యాన్స్ క్లాస్‌లో ముగ్గురు బాలికల హత్య యూకేలో దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతగా తీవ్ర హింసకు దారితీసింది.
ఇంగ్లండ్‌తో పాటు ఉత్తర ఐర్లాండ్‌లోని పట్టణాలు, నగరాల్లో చెలరేగిన హింసకు అతివాద, వలసవాద వ్యతిరేక భావజాలం ఆజ్యం పోశాయి.
బుధవారం (ఆగస్టు 7) ఈ అల్లర్లకు వ్యతిరేకంగా వేలాది మంది ఒకచోటుకి చేరి ర్యాలీలు నిర్వహించారు.

చిన్నారుల హత్య ఎందుకు హింసకు దారితీసింది?
జూలై 29న సౌత్‌పోర్ట్‌లో జరిగిన టేలర్ స్విఫ్ట్ థీమ్డ్ డ్యాన్స్, యోగా పార్టీలో కత్తితో దాడి చేయడంతో బెబే కింగ్(6), ఎల్సీ డాట్ స్టాన్‌కోంబ్(7), ఎలైస్ డా సిల్వా అగ్వియర్(9) చనిపోయారు. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మరుసటి రోజు, సమీపంలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిని తీవ్రవాదంతో సంబంధమున్న ఘటనగా పరిగణించడం లేదని పోలీసులు చెప్పారు.
దాడి జరిగిన కొద్దిసేపటికే నిందితుడు 2023లో సముద్రమార్గం ద్వారా యూకేకి వచ్చిన శరణార్ధి అని, అతని పేరు ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానితోపాటు నిందితుడు ముస్లిం అంటూ పుకార్లు కూడా వచ్చాయి.

ఫొటో సోర్స్, Handout
వాస్తవానికి, అనుమానితుడు వేల్స్‌లో రువాండా తల్లిదండ్రులకు జన్మించిన వ్యక్తిగా బీబీసీ సహా ఇతర మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
''తప్పుడు సమాచారం, నిర్ధారించని విషయాలను'' ప్రచారం చేయొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆ మరుసటి రోజు, సౌత్‌పోర్ట్ బాధితులకు సంతాప సూచికంగా వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. అనంతరం స్థానిక మసీదు సమీపంలో హింస చెలరేగింది. అక్కడకు వచ్చిన వారు మసీదుపై, అక్కడున్న పోలీసులపై రాళ్లు, బాటిళ్లు, టపాసులు విసిరేశారు. పోలీస్ వ్యాన్‌ను తగలబెట్టడంతో 27 మంది ఆస్పత్రి పాలయ్యారు.
ఈ హింసపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. చిన్నారుల మరణాలను ''తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు దుండగులు అక్కడికి వెళ్లారు'' అని స్థానిక ఎంపీ ప్యాట్రిక్ హర్లీ చెప్పారు. అయితే, ''సౌత్‌పోర్ట్ పట్టణంలో అల్లరిమూకల దోపిడీ''ని ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్ ఖండించారు.

ఫొటో సోర్స్, Leanne Brown / BBC
హింస ఎలా వ్యాప్తి చెందింది?
టెలిగ్రాం మెసేజింగ్ యాప్‌లో వలస వ్యతిరేక రీజనల్ చానెళ్లలో ర్యాలీ గురించి చర్చ జరిగింది. ఈ హింసాత్మక ఘటనల్లో ప్రస్తుతం నిషేధంలో ఉన్న అతివాద గ్రూపు ఇంగ్లిష్ డిఫెన్స్ లీగ్ (ఈడీఎల్) మద్దతుదారులు పాల్గొన్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
సౌత్‌పోర్ట్ అల్లర్లు జరిగిన మరుసటి రోజు, లండన్, హార్టిల్‌పూల్, మాంచెస్టర్‌లలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. సౌత్‌పోర్ట్ అల్లర్ల తరహాలోనే ఇవి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల పాటు ఇవి కొనసాగాయి. చాలామంది మసీదులు, శరణార్థులు ఉండే హోటళ్లను లక్ష్యంగా చేసుకున్నారు.
వీటివెనక ప్రత్యేకించి ఎలాంటి సంస్థ లేనప్పటికీ, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆ దిశగా సంకేతాలు పంపినట్లు ప్రధాన సోషల్ మీడియా గ్రూపులు, చిన్నచిన్న పబ్లిక్ గ్రూపులపై బీబీసీ చేసిన విశ్లేషణ తెలియజేస్తోంది.
ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న చాలామంది ఇన్‌ఫ్లూయెన్సర్లు అతివాదులతో పాటు అతివాదులతో ఎలాంటి సంబంధం లేని సామాన్యుల గ్రూపుల్లోనూ నిందితుడి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు.
ఈడీఎల్ వ్యవస్థాపకుడు, అతివాద కార్యకర్త, దోషిగా తేలిన నేరస్తుడు టామీ రాబిన్సన్ (అసలు పేరు స్టీఫెన్ యాక్స్‌లీ లెన్నాన్) తన లక్షల మంది ఫాలోయెర్లకు ఉద్రేకం కలిగించే సందేశాలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఎక్స్‌లో యాక్స్‌లీ లెన్నాన్‌తో సంబంధమున్న మరో ఇన్‌ఫ్లూయెన్సర్ మొదటగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఆయన లార్డ్ సిమన్' పేరుతో పోస్టులు చేస్తుంటారు.

ఫొటో సోర్స్, Reuters
అల్లర్లు ఎక్కడెక్కడ జరిగాయి?
సౌత్‌పోర్ట్ దాడి తర్వాత దక్షిణ తీరంలోని ప్లైమౌత్ నుంచి ఈశాన్య ప్రాంతంలోని సండర్‌ల్యాండ్ వరకు ఇంగ్లండ్ అంతటా అల్లర్లు చెలరేగాయి. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లో కూడా అల్లర్లు జరిగాయి.
మసీదులపై మూకుమ్మడి దాడులు చేశారు. శరణార్థుల వసతి గృహాలపై దాడి చేశారు. కార్లు, భవనాలతో పాటు లైబ్రరీకి నిప్పుపెట్టారు. దుకాణాల్లో చొరబడి దోపిడీలు చేశారు.
దక్షిణ బెల్ఫాస్ట్‌లో వలస వ్యతిరేక నిరసనకారులు, జాత్యంహకార వ్యతిరేక నిరసనకారులు ప్రదర్శనకు దిగడంతో సిటీ హాల్ బయట ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇందులో రేసిస్ట్ ఎలిమెంట్స్( జాత్యహంకార భావజాలం ఉన్నవారు) పాల్గొన్నట్లు ఒక జడ్జి చెప్పారు. తలపై దాడి చేసిన ఘటనను జాతివిద్వేషంతో చేసిన నేరంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు 8, గురువారం వరకూ ఈ అల్లర్లలో వంద మందికిపైగా పోలీసులు గాయపడినట్లు పోలీస్ ఫెడరేషన్ హెడ్ టిఫనీ లించ్ అంచనా వేశారు. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ హింసాకాండ యూకే వెలుపల కూడా ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్, మలేషియా, నైజీరియా వంటి దేశాలు ప్రయాణ మార్గదర్శకాలను (ట్రావెల్ అడ్వైజరీ) జారీ చేశాయి. ప్రజలు నిరసనలకు దూరంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

ఫొటో సోర్స్, Shutterstock
యూకే ప్రభుత్వ స్పందన..
అల్లర్లకు సంబంధించి ఆగస్టు 6 నాటికి 400 మందికి పైగా అరెస్టు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అరెస్టైన వారిలో 11 ఏళ్లలోపు పిల్లలు కూడా ఉన్నారు.
''అతివాద దుండగులు'' అంటూ ప్రధాని సర్ కీర్ ఖండించారు. దీనికి కారణమేదైనా ఈ హింసలో పాల్గొన్నవారు, ఆన్‌లైన్‌లో రెచ్చగొట్టిన వారికి శిక్షలు పడేలా చేస్తామని, ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు వారు చింతించాల్సి వస్తుందని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు.
స్పెషలిస్ట్ ఆఫీసర్ల ''స్టాండింగ్ ఆర్మీ'' ఈ అల్లర్లను అదుపులోకి తెస్తుందని, పోలీసు బలగాలు హింసాత్మక ఘటనలకు పాల్పడిన గ్రూపులకు సంబంధించిన నిఘా వివరాలను పంచుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఆన్‌లైన్‌లోని తప్పుడు సమాచారాన్ని తొలగించేందుకు, తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా సోషల్ మీడియా కంపెనీలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నవారికి శిక్ష పడేలా చేస్తామని, వారికోసం మరో 500 జైళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.
కొందరు అనుమానితులపై తీవ్రవాద సంబంధిత అభియోగాలతో పాటు విదేశాల్లో ఉండి హింసకు ప్రోత్సహించారనే ఆరోపణలు వచ్చిన ఇన్‌ఫ్లూయెన్సర్లను రప్పించడం వంటి విషయాలను పరిశీలిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ బీబీసీకి తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














