బంగ్లాదేశ్ పరిణామాల వెనక విదేశీ హస్తముందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, ఎడిటర్, బీబీసీ హిందీ
గత కొద్దికాలంగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ లేవు. దేశీయంగా ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు, ఒత్తిళ్లను ఎదుర్కొంది.
విదేశీపరంగా చూసినా, ఇటు భారత్, అటు చైనాతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆమె ప్రభుత్వ విధానం నెరవేరలేదు.
గత నెలలో చైనా పర్యటనకు వెళ్లిన షేక్ హసీనా, పర్యటన ముగియాల్సిన సమయం కంటే ముందే బంగ్లాదేశ్‌కు తిరిగొచ్చేశారు. హసీనా అనుకున్ననట్లుగా చైనా పర్యటన జరగలేదని తెలుస్తోంది.
చైనాలో షేక్ హసీనాకు తగిన గౌరవం లభించలేదని, జిన్‌పింగ్‌తో సమావేశం కూడా జరగలేదని బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషనర్ వీణా సీక్రి బీబీసీతో చెప్పారు.
''చైనా ప్రభుత్వం అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఎందుకంటే, అంతకుముందు వరకూ బంగ్లాదేశ్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లుగానే చైనా చెబుతూ వచ్చింది, అలాంటి ప్రకటనలే చేస్తూ వచ్చింది'' అని వీణా సీక్రి చెప్పారు.
ఆమె చైనా నుంచి తిరిగొచ్చిన వెంటనే భారత్‌ను ఉద్దేశించి ఒక పెద్ద ప్రకటన చేశారు. తీస్తా ప్రాజెక్టుపై భారత్, చైనా ఆసక్తిగా ఉన్నాయని, కానీ ఈ ప్రాజెక్టును భారత్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు హసీనా చెప్పారు.
మరోవైపు భారత్, చైనాలతో షేక్ హసీనా ప్రభుత్వ సంబంధాలపై బంగ్లాదేశ్‌లోనూ ప్రశ్నలు వచ్చాయి.
దీనిపై హసీనా మాట్లాడుతూ, ''చైనాతో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇంతకుముందు నేను భారత పర్యటనకు వెళ్లినప్పుడు దేశాన్ని భారత్‌కు అమ్మేశానని అన్నారు. చైనా పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇలాంటి మాటలు వస్తూనే ఉన్నాయి. అలాంటివారు మానసికంగా స్థిరంగా లేరని నేను భావిస్తున్నా'' అని ఆమె వ్యాఖ్యానించారు.


ఫొటో సోర్స్, Reuters
రాజకీయ అనిశ్చితి
భారత్, చైనాల గురించి ప్రకటన చేసి నెలరోజులు కూడా కాకుండానే షేక్ హసీనా అధికారం కోల్పోయారు.
2024 ఆగస్టు 5వ తేదీ బంగ్లాదేశ్ చరిత్రను మార్చేసింది.
అక్కడ కొద్దికాలంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా, దేశవ్యాప్త ఉద్యమంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు.
సైనిక విమానంలో దిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు ఆమె చేరుకున్నారు.
ఆ తర్వాత షేక్ హసీనాతో భారత జాతీయ సలహాదారు అజీత్ డోభాల్ భేటి అయినట్లు వార్తలొచ్చాయి.
మరోవైపు, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందులో విదేశీ కోణముందా?
బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఈ కల్లోలంపై తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, దీనంతటికీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలే కారణమా? లేక మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా?
బంగ్లాదేశ్ పరిణామాల వెనక విదేశీ శక్తుల హస్తముందా? అని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అయితే, విదేశీ ప్రమేయాన్ని బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేసిన వీణా సీక్రి ఖండించలేదు.
రిజర్వేషన్లలో సంస్కరణల కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ఎలా రూపాంతరం చెందుతుందో చూడాలని, ఈ మార్పు చాలా విషయాలను తెలియజేస్తుందని ఆమె అన్నారు.
బంగ్లాదేశ్‌లో పనిచేసిన భారత మాజీ హైకమిషనర్ హర్ష్ శృంగ్లా వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ''బంగ్లాదేశ్ విషయంలో విదేశీ శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. అలాగే, భారత్ భద్రతా ప్రయోజనాల విషయంలో కూడా..'' అని అన్నారు.
అయితే, ఈ మొత్తం పరిణామాలకు ఆర్థిక పరిస్థితులే కారణమని హర్ష్ శృంగ్లా భావిస్తున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత యక్రెయిన్ సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం, ఆహార ఉత్పత్తులు, ఎరువుల వంటి వాటిపై ఈ పెరుగుదల ప్రభావం పడిందన్నారు.
వీటి కారణంగా బంగ్లాదేశ్ ప్రజలు, ముఖ్యంగా యువత వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందని హర్ష్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
షేక్ హసీనా, ప్రజలు కోరుకున్నది ఒకటే: వీణా సీక్రి
బంగ్లాదేశ్ నిరసనలను పక్కాగా ప్లాన్ చేసిన వ్యూహంగా వీణా సీక్రి అభివర్ణించారు. రిజర్వేషన్ల విషయంలో విద్యార్థులు, ప్రభుత్వ విధానం ఒకటేనని ఆమె అన్నారు.
''ఈ రిజర్వేషన్ల ఉద్యమం 2018లో మొదలైంది. అప్పట్లో నిరసనకారుల అన్ని డిమాండ్లను షేక్ హసీనా ప్రభుత్వం ఆమోదించింది. కానీ, దీనిపై జూన్‌లో హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడంతో, కోర్టు రిజర్వేషన్లను సమర్థించింది. అయినప్పటికీ, విద్యార్థులు కోరుకున్నట్లుగా హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ల రద్దు కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లింది'' అని ఆమె అన్నారు.
ఆ తర్వాత, బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు రిజర్వేషన్ విధానాన్ని దాదాపుగా రద్దు చేసింది.
విద్యార్థులు కోరుకున్నదే జరిగింది, దీంతో ఆ తర్వాత విద్యార్థులు వెనక్కి తగ్గినట్లు వీణ చెబుతున్నారు.
''రిజర్వేషన్లకు సంబంధించిన నిరసనలు ముగిశాయని అనుకుంటున్నా. కానీ ఇప్పుడు జామాత్ ఇ ఇస్లామీ, బీఎన్‌పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా హింస జరిగింది'' అని ఆమె అన్నారు.
బీబీసీ ప్రతినిధి అక్బర్ హుస్సేన్ విశ్లేషణ ప్రకారం..
ప్రస్తుతం ఏ ప్రభుత్వం ఏర్పాటైనా శాంతిభద్రతల అంశం ఒక పెద్దసవాల్ అవుతుంది. చాలాచోట్ల దోపిడీలు జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడడం పెద్ద సవాలే.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో తాత్కాలిక ప్రభుత్వం కనుక విఫలమైతే, పరిస్థితి మరింత దిగజారుతుందని కొందరు రాజకీయ నిపుణులు అంటున్నారు.
అంతా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, పరిస్థితులను అర్థం చేసుకోవడంలో షేక్ హసీనా విఫలమయ్యారు. అసలేం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు, లేదంటే దేశంలోని యువత ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోయారు.
బంగ్లాదేశ్ యవతకు రాజకీయ అవగాహన ఎక్కువ. రిజర్వేషన్ల సమస్యకు న్యాయం చేయాలని వారు కోరారు.
ఇటీవల జరిగిన ఎన్నికల గురించి పాశ్చాత్య దేశాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఎందుకంటే, ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. మానవ హక్కుల అంశంలోనూ ప్రశ్నలే తలెత్తాయి. కానీ, హసీనా ఎవరి మాటా వినలేదు.
నిరుద్యోగం పెరిగిపోయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయింది. వాటితో పాటు యువతలో కోపం, భయం, నిస్పృహ అన్నీ కలిసి వీధికెక్కే పరిస్థితి దాపురించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రజాస్వామ్యం.. సైన్యం..
దేశంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఆర్మీ ప్రకటించింది. గతంలో బంగ్లాదేశ్‌లో సైన్యం ఆధిపత్యం నడిచింది. కానీ, దశాబ్దాలుగా సైన్యం అధికారంలో లేదు.
ఇప్పడు ఈ నిరసనల అనంతరం తలెత్తిన విపత్కర పరిస్థితుల సమయంలో దేశంలో స్థిరత్వం గురించి సైన్యం మాట్లాడుతోంది. వీటన్నింటిని చూస్తే, సైన్యం ఇలా ముందుకురావడం దేనికి సంకేతం? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అయితే, అధికారం చేజిక్కించుకోవాలని బంగ్లాదేశ్ ఆర్మీ భావిస్తోందని తాను అనుకోవడం లేదంటున్నారు వీణా సీక్రి.
''ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలరు కాబట్టే ఆయన ముందుకొచ్చారు. శ్రీలంకలోనూ అదే జరిగింది. అక్కడ కూడా నిరసనకారులు అధ్యక్షుడి నివాసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందు ఈ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ చెప్పారు. ఆ తర్వాత దేశంలో ఎన్నికలు జరుగుతాయి'' అన్నారామె.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లోనే ఉన్నారు. పొరుగు దేశంలో తలెత్తిన రాజకీయ ప్రకంపనల ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తుంది.
దీని ప్రభావం భారత్‌పై ఉంటుందని, భారత్ అక్కడ స్థిరత్వాన్ని కోరుకుంటోందని వీణా సీక్రి అభిప్రాయపడ్డారు.
''బంగ్లాదేశ్‌తోపాటు ఇరుగుపొరుగు దేశాలు స్థిరంగా ఉండాలని, ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. భారత్ ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది, స్థిరత్వం కోసం భారత్ ప్రయత్నిస్తుంది'' అని ఆమె అన్నారు.
రాజకీయంగానే కాకుండా బంగ్లాదేశ్‌తో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి. దక్షిణాసియాలో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్.
గత పదేళ్లలో బంగ్లాదేశ్‌లో రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల నిర్మాణానికి భారత్ వేల కోట్ల రూపాయలు ఇచ్చింది.
ప్రస్తుత అనిశ్చితితో, బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.
ఆగస్టు 5న ప్రధాని మోదీ తన అధికారిక నివాసంలో బంగ్లాదేశ్ విషయంపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














