ల్యాండ్‌ స్లైడ్స్: కొండచరియలు విరిగిపడతాయని భారత్‌లో ఎందుకు అంచనా వేయలేరు, జపాన్‌లో ఎలా సాధ్యమవుతోంది?

వయనాడ్‌లో కొండ చరియలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా చనిపోయారు.
    • రచయిత, శుభ‌గుణం.కె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన అందరినీ కలిచివేసింది. జులై 30వ తేదీ రాత్రి ఈ ప్రమాదం జరగడంతో మెప్పాడి, ముండక్కై, చూరల్మల, అట్టమాల వంటి వివిధ ప్రాంతాలలో 300 మందికి పైగా చనిపోయారు.

విపత్తుపై జులై 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామని, వాళ్లు పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. అయితే హోంమంత్రి ఆరోపణలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు.

దీంతో ఈ వాదనలు దేశంలో ల్యాండ్ స్లైడ్స్ ఎర్లీ వార్నింగ్ ‌సిస్టమ్ మీద చర్చకు దారితీశాయి.

దేశంలో భారత వాతావరణ శాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలు భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలపై హెచ్చరికలను జారీ చేస్తుంటాయి. అయితే ఆ అంచనాలు అంత కచ్చితంగా లేవని నిపుణులు అంటున్నారు.

జులైలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోల్‌కతాలో ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇది కొండచరియల స్థితిని అంచనా వేయడానికి వర్షపాతం, రియల్ టైమ్ శాటిలైట్ చిత్రాల గత రికార్డులతో పాటు, కొండ ప్రాంతాల నేల తీరుకు సంబంధించిన డేటాను వినియోగిస్తుంది.

ఇప్పటివరకైతే కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ అంచనా కేంద్రాలు, 2030 నాటికి భారతదేశం అంతటా సేవలు ప్రారంభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

అయితే, వీటికి కొండచరియలను కచ్చితంగా అంచనా వేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇంతకీ శాస్త్రవేత్తలకు ఎదురయ్యే సమస్యలేంటి? కొండచరియల విషయంలో జపాన్ లాగా భారత్‌లో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?

బీబీసీ వాట్సాప్ చానల్
వయనాడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నది నీటిమట్టం పెరగడం వయనాడ్‌ వరదలకు కారణమైంది.

జీఎస్ఐ హెచ్చరించిందా?

2020 నుంచి తమిళనాడులోని నీలగిరి, పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్, డార్జీలింగ్‌లలో ప్రయోగాత్మకంగా ఈ అంచనా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

"ఈ అంచనా కేంద్రాలను కేరళలోని వయనాడ్‌లో గల వైత్తిరి, మనంతవాడి వద్ద కూడా ఏర్పాటుచేశాం. వర్షకాలం ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు ఒకసారి ప్రయోగాత్మకంగా ప్రాంతీయ కొండచరియల స్థితిని ఆ కేంద్రం అందిస్తోంది." అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ-మెయిల్ ద్వారా తెలిపింది.

వయనాడ్ పరిస్థితిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జులై 26 నుంచి 30 వరకు (28వ తేదీ మినమా) రోజువారీ బులెటిన్‌లను విడుదల చేసింది. జులై 28న సర్వర్ డౌన్ కావడంతో వెల్లడించలేదు.

"జులై 26న వైత్తిరి తాలూకాలో, జులై 30న వైత్తిరి, మనంతవాడి తాలూకాలలో ఒక మోస్తరు సూచన తప్ప, కొండచరియలు విరిగిపడే ప్రమాదం తక్కువగా ఉంది" అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్స్ సూచించింది.

వయనాడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముండక్కై, చూరల్మల గ్రామాలు కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి

'డేటా లేదు'

వయనాడ్ విషయానికొస్తే ముండక్కై, చూరల్మల గ్రామాలు కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. అక్కడి పర్వత శిఖరాల నుంచి వచ్చే వాగు చూరల్మల మీదుగా దిగి ఇరువంజిప్పుళ నదిలో కలుస్తుంది. ఈ నది, అనేక ఇతర ఉపనదులతో కలిసి చలియార్ నదిగా ప్రవహిస్తుంది.

జులై 30తో పాటు అంతకుముందు కురిసిన భారీ వర్షాలకు ఈ నది ఉప్పొంగింది. నదిలో నీటిమట్టం పెరగడంతో వరదకు దారితీసింది. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. వీటి ధాటికి ముండక్కై గ్రామం ధ్వంసమైంది.

తరచూ వరదలు రావడంతో నది వెడల్పు 2011లో ఉన్న దాని కంటే ఎక్కువైందని చెన్నై ఐఐటీ పరిశోధక విద్యార్థి కృతికా మురుగేశన్ చెప్పారు. కృతికా భూగర్భ శాస్త్రం, అభివృద్ధి చెందని నగరాలపై పరిశోధనలు చేస్తున్నారు.

"కొండచరియలు ఏదైనా ఒకచోట విరిగిపడితే, అది వ్యాపిస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతుంది, మరొక ప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే కొండచరియలు విరిగిపడటం వలన ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయో చెప్పడం కష్టం." అని కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్త సజిన్ కుమార్ అన్నారు.

వీటితో పాటు నేల స్వభావం, దాని సాంద్రత, వర్షపాతం, తేమపై రియల్ టైమ్ డేటా పూర్తిగా అందుబాటులో లేదని సజిన్ చెప్పారు.

వయనాడ్ బ్రిడ్జి
ఫొటో క్యాప్షన్, వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యల కోసం బ్రిడ్జి నిర్మించారు.

ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

దేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. అయితే కొండచరియలు ఎప్పుడు, ఎక్కడ విరిగిపడతాయని అంచనా వేయడానికి కావాల్సిన సాంకేతికత భారత్‌లో ఇంకా ప్రారంభ దశలోనే ఉందని కృతిక చెప్పారు.

ఈ సాంకేతికతలు పరిశోధనా స్థాయిలో విజయవంతమైనప్పటికీ, భారత్‌లో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వర్షపాతం, నేలలోని తేమ రెండూ కొండచరియలు విరిగిపడటంలో ప్రధాన తక్షణ కారకాలు.

‘‘సరిగ్గా ఇదే స్థలంలో కొండచరియలు విరిగిపడతాయని చెప్పడం కష్టం. వర్షపాతం ఆధారంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని అంచనా వేయలేం. అలాంటి సూచనలు చేసినా కచ్చితంగా జరుగుతుందనే హామీ లేదు." అని కృతిక అంటున్నారు.

వయనాడ్

ఫొటో సోర్స్, Getty Images

భారత భూభాగమే సవాలు

ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసే క్రమంలో భారత భూభాగం కూడా ఒక సమస్యేనని అని హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళా వెంకట ఉదయ్ అన్నారు. ఆయన కొండచరియల ఉత్పాతాన్ని అంచనా వేసే సెన్సార్లను రూపొందించారు.

“దేశంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పరిమాణం ఇటలీ మొత్తం భూభాగానికి సమానం. ఈ అధునాతన ల్యాండ్‌స్లైడ్ ప్రెడిక్షన్ టెక్నాలజీలను ఉపయోగించే ఇటలీ, హాంకాంగ్, జపాన్ వంటి చిన్న దేశాలకు వాటిని అమలు చేయడంలో పెద్ద సమస్యలు లేవు. కానీ భారతదేశంలో పరిస్థితి వేరు.” అని ప్రొఫెసర్ ఉదయ్ చెప్పారు.

''ఏదైనా ప్రకృతి వైపరీత్యం ముందుగా అంచనా వేయాలంటే, అది ఎప్పుడు, ఏ స్థలం, ఏ సమయంలో జరుగుతుందో అంచనా వేయగలగాలి. కానీ కొండచరియలు విరిగిపడటం విషయానికొస్తే, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న సాంకేతికతలతో ఏదైనా ఒక ప్రాంత పరిధిలో, ఈ సమయం నుంచి ఈ సమయంలో కొండచరియలు విరిగిపడే అవకాశాలను మాత్రమే అంచనా వేయగలం. కానీ, కచ్చితమైన సమయం, కచ్చితమైన ప్రాంతం చెప్పలేం'' అని ఆయన అన్నారు.

కొండచరియలను ముందుగానే అంచనా వేయడం సవాలు మాత్రమే కాదని, దేశంలో అందుబాటులో ఉన్న డేటాబేస్, సాంకేతికతలతో వెంటనే సాధ్యం కాదని ప్రొఫెసర్ టీపీ శుక్లా అభిప్రాయపడ్డారు. ఆయన ఐఐటీ మండీలో విపత్తు సాంకేతికతలను అధ్యయనం చేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్.

శుక్లా అభిప్రాయంతో ఉదయ్ ఏకీభవిస్తున్నారు. భారత్‌లో కొండచరియలు విరిగిపడటాన్ని అంచనా వేసే (ల్యాండ్‌స్లైడ్ ఫోర్‌కాస్టింగ్) కేంద్రాలు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయని అభిప్రాయపడ్డారు.

"విపత్తుల నష్టాలను తగ్గించడానికి దీనిని తక్షణమే దేశవ్యాప్తంగా అమలు చేయడం సులువు కాదు. కాబట్టి, అవసరాన్ని బట్టి ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు వచ్చే సంవత్సరంలో ఏ ప్రాంతంలో కొండచరియల ప్రభావం ఉంటుందో వాటికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు" అని ఆయన సూచించారు.

అంచనా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?

ల్యాండ్‌స్లైడ్ పర్యవేక్షణలో రెండు అంశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒకటి భూ ఉపరితల కదలికలను అంచనా వేయడానికి సెన్సార్లను ఇన్‌స్టాల్ చేయడం, మరొకటి ప్రాంతీయ వర్షపాతం, అక్కడి భూమి ఎంత నీటిని తీసుకుంటుందనే దానిపై డేటా సేకరణ.

హిమాచల్ ప్రదేశ్ విషయానికొస్తే “రాష్ట్ర ప్రభుత్వం మేం అందించిన సెన్సార్లను 60 చోట్ల అమర్చింది. వీటిలో 45 సెన్సార్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఈ సెన్సార్‌లను వాడినా కూడా పూర్తి ప్రాంతీయ డేటా ఉండటం లేదు, అందుకే కొండచరియలు విరిగిపడటాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టంగా ఉంది." అని ఉదయ్ చెప్పారు.

ఈ సదుపాయాన్ని దేశంలో చాలా ఆలస్యంగా ప్రారంభిస్తున్నామని ఉదయ్ అన్నారు. ముందుగా ప్రాంతీయ డేటాబేస్ మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని తెలిపారు.

“ఇటువంటి సూచన కేంద్రాల ద్వారా సేకరించిన డేటా భవిష్యత్తులో కొండచరియలను అంచనా వేయడం సులభం చేస్తుంది. వాటితో పాటు సెన్సార్లను ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ విధానం కచ్చితత్వాన్ని పెంచుతుంది." అని ఉదయ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు...

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)