పశ్చిమబెంగాల్, ఒడిశా మధ్య బంగాళాదుంపల యుద్ధం

మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమ బెంగాల్ వంటకాలలో బంగాళాదుంప పాత్ర చాలా ముఖ్యమైనది. అది ఫేమస్ కోల్‌కతా బిర్యానీ కావచ్చు, ఇతర మాంసాహార లేదా శాకాహార వంటకమైనా కావచ్చు. పానీపూరి నుంచి వడలు, కూరల వరకు బెంగాలీ వంటకాల్లో బంగాళాదుంపలు లేకుంటే రుచినివ్వదని అక్కడి భోజనప్రియులు భావిస్తుంటారు.

బిర్యానీలోనూ బంగాళదుంపలు కలిపి వండే నగరం కోల్‌కతా. ఫుడ్ డెలివరీ పోర్టల్స్‌లో బిర్యానీ ఆర్డర్ చేసేటపుడు అందులో అదనంగా బంగాళదుంపల ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

ఆ బిర్యానీలో అదనపు బంగాళాదుంప ధర ఎంత ఉంటుందో తెలుసా? ఒక్క ముక్కకు కొందరు 30 రూపాయలు, మరికొందరు 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

ఇదే బంగాళాదుంప ఇపుడు తూర్పు భారతదేశంలో రాజకీయాలను కూడా వేడెక్కించింది. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలకు అంటే ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్‌లకు బంగాళాదుంపల రవాణా‌ను నిషేధించింది. గత 15 రోజులుగా ఇది కొనసాగుతోంది.

వాట్సాప్
మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఒడిశా ప్రభుత్వం ఏం చెప్పింది?

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా కోల్‌కతాలో బంగాళదుంపల ధరలు ఆకాశాన్నంటుతున్నందున ఎగుమతులపై నిషేధం విధించినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. సాధారణంగా ఈ సీజన్‌లో బంగాళదుంపలు కిలో రూ.20 పలుకుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్కసారిగా దీని ధర కిలో రూ.50కి చేరింది.

ఎగుమతుల నిషేధంతో ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్‌కు వెళ్లే బంగాళదుంప సరుకులను అధికారులు బెంగాల్ సరిహద్దుల్లోనే నిలిపివేశారు.

దీంతో ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 'వెస్ట్ బొంగో ప్రోగ్రెసివ్ పొటాటో మర్చంట్స్ కమిటీ' ఆందోళన చేపట్టింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో నిరసన విరమించుకుంది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఝార్ఖండ్‌ , ఒడిశా రాష్ట్రాలలో బంగాళాదుంపల ధరలు భారీగా పెరగడానికి కారణమైంది. అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లలోనూ ప్రభావం చూపింది.

ఈ నెల 2న ఒడిశా ప్రభుత్వం అక్కడి వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బంగాళదుంపల ధరలను ఎలా నియంత్రించాలనే అంశంపై చర్చించింది. ప్రస్తుతం ఒడిశాలో బంగాళదుంపలు కిలో రూ.35 నుంచి రూ.50కి అమ్ముతున్నట్లు ఆ సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర తెలిపారు.

జులై 27న నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా బంగాళదుంపల సమస్యపై చర్చించారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా మమతకు ప్రత్యేకంగా లేఖ రాశారు. బంగాళదుంపల సరఫరాను పునరుద్ధరించాలంటూ కోరారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు.

ఒడిశా అసెంబ్లీలో కూడా బంగాళదుంపల సమస్యపై చర్చ జరిగింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. బంగాళదుంపల కోసం పశ్చిమ బెంగాల్‌పై, ఉల్లిపాయల కోసం మహారాష్ట్రలపై ఒడిశా ఆధారపడుతోందని సభలో పాత్రా వివరించారు.

‘’పశ్చిమ బెంగాల్‌పై ఆధారపడకుండా ఉత్తరప్రదేశ్‌ నుంచి బంగాళదుంపలను దిగుమతి చేసుకోవడానికి ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.’’ అని ఆయన తెలిపారు.

బంగాళదుంపలు

ఫొటో సోర్స్, Getty Images

22.97 శాతం బంగాళదుంపలు బెంగాల్ నుంచే..

దేశంలో బంగాళాదుంప ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, మొత్తం ఉత్పత్తిలో 30 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. పశ్చిమ బెంగాల్ 22.97 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.

పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, రాష్ట్రం ఏటా 110 లక్షల టన్నుల బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తోంది. అందులో 5 లక్షల టన్నులు పశ్చిమ బెంగాల్‌లోనే వినియోగిస్తున్నారు.

ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్, హుగ్లీ, ఈస్ట్ బుర్ద్వాన్, బంకుడా, బీర్భమ్, జల్‌పాయ్‌గుడి జిల్లాల్లో బంగాళాదుంప పంట ఎక్కువగా పండుతుంది.

బంగాళదుంపలు సేకరిస్తున్న కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పొలంలో బంగాళదుంపలు సేకరిస్తున్న కార్మికులు

బెంగాల్ ప్రభుత్వం ఏమంటోంది?

‘’ఇక్కడ ధరలు ఆకాశాన్నంటుతున్నందునే బంగాళదుంపలను రాష్ట్రం నుంచి బయటకు పంపకుండా నిషేధం విధించాం’’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి బెచారం మన్నా బీబీసీతో అన్నారు.

‘’బెంగాల్‌లోనే బంగాళాదుంపలు పండుతున్నా ధర కిలో రూ. 50కి ఎందుకు పెరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే స్థానిక రిటైల్ మార్కెట్‌లో వాటి ధరలను నియంత్రించాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రం వెలుపలకు అమ్మకాలను అంగీకరించబోం.’’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 606 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయని, వాటిలో 40 లక్షల టన్నుల బంగాళదుంపలు నిల్వ ఉన్నాయని మన్నా చెప్పారు.

బంగాళదుంపలు

ఫొటో సోర్స్, Getty Images

వ్యాపారులు ఏమంటున్నారు?

పశ్చిమ బెంగాల్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం బంగాళాదుంపలను ఇక్కడ వినియోగించలేమని, అందుకే ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నామని 'వెస్ట్ బొంగో ప్రోగ్రెసివ్ పొటాటో మర్చంట్స్ అసోసియేషన్' కార్యదర్శి లాలూ ముఖర్జీ ఓ ప్రకటనలో తెలిపారు.

స్థానిక మార్కెట్‌లో బంగాళాదుంపల ధరలు నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.

వర్షాకాలం కావడంతో రాష్ట్ర సరిహద్దుల్లో లారీల్లో నిలిచిన సరుకులు కుళ్లిపోతాయని, దీంతో హోల్‌సేల్ వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం తప్పదని వ్యాపారులు ఆందోళన పడుతున్నారు.

"మేం పశ్చిమ బెంగాల్ నుంచి బంగాళాదుంపలను కొనుగోలు చేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలనుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్ నుంచి మాత్రమే కొనుగోలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఒడిశాలోని హోల్‌సేల్ వ్యాపారులను వేధిస్తున్నారు.’’ అని మంత్రి కృష్ణ పాత్ర చెప్పినట్లు పీటీఐ తెలిపింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)