షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది?

- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నిరసనలు పెల్లుబుకడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయిన కొద్దిగంటలకు రాజధాని ఢాకాలో ఉంటున్న అవిరూప్ సర్కార్‌కు ఆమె సోదరి నుంచి ఫోన్ వచ్చింది.
దాదాపు 90 శాతం ముస్లిం జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువుల్లో అవిరూప్ ఒకరు.
భర్త చనిపోవడంతో అవిరూప్ సోదరి ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆమె ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని నేత్రోకోనాలో నివసిస్తున్నారు.
ఆ ఫోన్ కాల్ గురించి అవిరూప్ సర్కార్ చెబుతూ, ''మా సోదరి భయపడుతున్నట్లు అర్థమైంది. తమ ఇంటిపై ఒక గుంపు దాడి చేసిందని, ఇంటిని దోచుకుపోయారని ఆమె నాతో చెప్పారు'' అని అన్నారు.
సుమారు 100 మంది దాకా ఉన్న ఓ గుంపు కర్రలతో వాళ్ల ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్, టీవీ, ఇంటి తలుపులతో పాటు బాత్రూమ్‌లోని వస్తువులను కూడా పగలగొట్టినట్లు అవిరూప్ సోదరి ఆయనకు చెప్పారు.
ఇంట్లోని డబ్బు, నగలను దోచుకెళ్లారు. అయితే, ఆ ఇంట్లోని వారిపై వారు ఎలాంటి దాడి చేయలేదు. ఆ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా 18 మంది ఉంటున్నారు.
దోచుకున్న వస్తువులతో వెళ్తూ.. ''మీరు అవామీ లీగ్ వారసులు. మీ వల్లే ఈ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. మీరు వెంటనే దేశం వదిలి వెళ్లిపోండి'' అని హెచ్చరికలు చేసి వెళ్లారు.


బంగ్లాదేశ్‌లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసినా, తనకేమీ ఆశ్యర్యంగా అనిపించలేదని అవిరూప్ సర్కార్ తెలిపారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులను సాధారణంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులుగా భావిస్తారని, అందుకే ఆ పార్టీ ప్రత్యర్థులు హిందువులపై దాడి చేస్తుంటారని ఆయన అన్నారు.
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత హిందువుల ఆస్తులు, దేవాలయాలపై దాడులకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
ఆగస్టు 6న భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, "ఇబ్బందికరమైన అంశమేంటంటే చాలాచోట్ల మైనారిటీలు నివసిస్తున్నారు. వారి దుకాణాలు, దేవాలయాలపై దాడులు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందలేదు" అన్నారు.
అయితే, ఇలాంటి పరిస్థితుల్లోనూ హిందువుల ఇళ్లు, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడానికి చాలామంది ముస్లిం యువకులు ముందుకొస్తున్నారు.
''బంగ్లాదేశ్‌లోని హిందువులు చాలా సులభంగా ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అవుతారు. అవామీ లీగ్ అధికారం కోల్పోయిన ప్రతిసారీ హిందువులపై దాడులు జరుగుతాయి'' అని అవిరూప్ అన్నారు.
అవిరూప్ సోదరి ఇంటిపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 1992లో భారత్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలోనూ బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ అవిరూప్ సోదరి ఇల్లు ధ్వంసమైంది.
ఆ తర్వాత సైతం హిందువులపై అనేక దాడులు జరిగాయి.

ఫొటో సోర్స్, Castaway On The Moon
హిందువులను కాపాడుతున్న ముస్లింలు
ఎయిన్.ఓ. సలిష్ కేంద్ర అనే మానవ హక్కుల సంఘం గణాంకాల ప్రకారం, 2013 జనవరి నుంచి 2021 సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్‌లో హిందువులపై 3,679 దాడులు జరిగాయి.
''గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస పెరిగింది. మైనారిటీల ఇళ్లు, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేస్తున్నారు. మైనారిటీల రక్షణ బాధ్యతలో ఆ దేశం విఫలమైనట్లు ఇది స్పష్టం చేస్తోంది'' అని మానవ హక్కుల కోసం పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2021లో విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఆ ఏడాది దుర్గాపూజ సందర్భంగా హిందూ మైనారిటీల ఇళ్లు, దేవాలయాలపై దాడులు జరిగిన సమయంలో ఆ సంస్థ ఆ నివేదిక ఇచ్చింది.
అవిరూప్ సర్కార్ కుటుంబంలోని మరికొంతమంది కూడా సోమవారం ఇలాంటి దాడుల బారినపడ్డారు.
ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిషోర్‌గంజ్‌లో ఉంటున్న ఆయన తల్లిదండ్రులు ఈ దాడుల నుంచి తప్పించుకున్నారు. ''మా కుటుంబానికి అక్కడ మంచి పేరుంది, ఇరుగుపొరుగు వాళ్లందరికీ మేం తెలుసు. అదే కారణం'' అని ఆయన అన్నారు.
తన తల్లి అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారని అవిరూప్ తెలిపారు.
తన వ్యాపార భాగస్వామి నుంచి అవిరూప్‌కి ఫోన్ వచ్చింది. ''ఎవరెవరి ఆస్తులపై దాడులు చేయాలనే విషయంలో కొందరు జాబితా తయారు చేస్తున్నారు. ఆ జాబితాలో నీ పేరు లేదు కానీ, కొంచెం జాగ్రత్తగా ఉండు'' అని ఆయన్ను తన భాగస్వామి హెచ్చరించారు.
ఆ తర్వాత, తమ ఇంటి బయట గేటు దగ్గర కొద్దిమంది గుమిగూడి ఉండడం చూసిన అవిరూప్ తండ్రి తన కుటుంబ సభ్యులను లోపలకు లాక్కెళ్లిపోయారు.
''అటు వెళ్లాల్సిన పనిలేదు, అక్కడ ఏమీ లేదు అని ఎవరో అరవడం మా నాన్న విన్నారు'' అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ గుంపు చెదిరిపోయింది.
కానీ, అక్కడికి సమీపంలోని కిషోర్‌గంజ్ పరిధిలోని నోగువా ప్రాంతంలో హిందువుల ఇళ్లను దోచుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
"అక్కడ దాదాపు 20-25 ఇళ్లపై దాడి జరిగిందని విన్నా. నా స్నేహితుడి బంగారం దుకాణం తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడి నగలన్నింటినీ దోచుకెళ్లారు. అయితే, బీరువాను మాత్రం పగలగొట్టలేకపోయారు'' అని శంకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
తర్వాత ఏం జరగబోతోంది?
అవిరూప్ భార్యది ఢాకాకు ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేర్పూర్ జిల్లా. వాళ్ల ఇల్లు కూడా ప్రమాదంలోనే ఉంది.
వాళ్ల ఇంటిపై దాడి జరగకపోయినా, వారి పక్కనే ఉన్న హిందువుల ఇంటిని అల్లరిమూక దోచుకుంది. హింస చెలరేగినట్లు సమాచారం వ్యాప్తి చెందడంతో స్థానిక ముస్లింలు హిందువుల ఇళ్లు, దేవాలయాల చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
"ఇది బంగ్లాదేశ్ అంతటా జరుగుతోంది. ముస్లింలు హిందువుల ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారు'' అని ఆయన అన్నారు.
అక్కడితో అయిపోలేదు, ఢాకాలో అవిరూప్ సర్కార్ నివాసముంటున్న 10 అంతస్తుల అపార్ట్‌మెంట్ బయట సోమవారం రాత్రి జనం గుమిగూడడం మొదలైంది.
ఆ అపార్ట్‌మెంట్లో అవిరూప్, తన భార్య, కూతురుతో కలిసి ఉంటున్నారు. తమ అపార్ట్‌మెంట్‌లో ఉండే అవామీ లీగ్ కౌన్సిలర్ కోసం వాళ్లు వచ్చారని అవిరూప్ భావించారు.
''నేను ఆరో అంతస్తు బాల్కనీలోకి వచ్చి చూసేప్పటికి, వాళ్లు బిల్డింగ్‌పైకి రాళ్లు విసురుతున్నారు. తలుపులు బద్దలుకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తలుపులు గట్టిగా ఉండడంతో లోపలికి రాలేకపోయారు. కేవలం పార్కింగ్‌లోని వాహనాలు, కిటికీల అద్దాలు మాత్రమే దెబ్బతిన్నాయి'' అని అవిరూప్ చెప్పారు.
మున్ముందు ఇంకా దాడులు జరుగుతాయేమోనని తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నట్లు అవిరూప్ సర్కార్ సోదరి ఆయనతో అన్నారు. దీంతో అవిరూప్ ఆర్మీలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి ఆ పరిసరాల్లో ఆర్మీ పెట్రోలింగ్ పెంచాలని కోరారు.
''ఇది చాలా ఇబ్బందికరమైన సమయం. శాంతిభద్రతలు అదుపులో లేవు. వాళ్లు మళ్లీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు'' అని ఆయన అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














