వినేశ్ ఫొగాట్: లైంగిక వేధింపులపై పోరాటం, ఫుట్‌పాత్‌పై ‘ఖేల్‌రత్న’‌ను వదిలేయడం నుంచి పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ వరకు..

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

పారిస్ ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ (కుస్తీ) ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతక మ్యాచ్‌ (ఫైనల్)కు అర్హత సాధించారు. ఫలితంగా భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేశారు.

ఈ ఫైనల్ బౌట్‌లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా ఆమె చరిత్ర లిఖిస్తారు.

ఒకవేళ ఓడిపోయినా, రజత పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు పొందుతారు.

వినేశ్ ఫొగాట్, ఒలింపిక్స్ రెజ్లింగ్‌ క్రీడాంశంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్.

ఆమె మంగళవారం ఒక్కరోజే మూడు బౌట్‌లలో గెలుపొంది, అద్భుతం సృష్టించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫ్రీస్టయిల్ 50 కేజీల సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్‌తో తలపడుతున్న వినేశ్ ఫొగాట్

సెమీఫైనల్ బౌట్‌లో వినేశ్ 5-0తో క్యూబా రెజ్లర్ గుజ్మాన్ లోపెజ్‌పై గెలుపొందారు. ఈ పోరులో వినేశ్ ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ను కూడా కోల్పోలేదు.

వినేశ్ ఫైనల్ మ్యాచ్ బుధవారం రాత్రి జరుగుతుంది.

సెమీస్ కంటే ముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో యుక్రెయిన్ రెజ్లర్ ఓక్సానా లివాచ్‌ను ఆమె ఓడించారు. అంతకంటే ముందు ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన సుసాకీ యుయిపై గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.

సుసాకీ యుయి నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ర్యాంకింగ్‌లో నంబర్‌ వన్ రెజ్లర్.

25 ఏళ్ల సుసాకీ ఈ బౌట్‌కు ముందు తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క ఓటమిని కూడా చూడలేదు. పోటీపడిన 82 బౌట్‌లలోనూ సుసాకి విజేతగా నిలిచారు.

ఈ రికార్డుల పరంగా చూస్తే, మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌ కేటగిరీలో సుసాకీపై వినేశ్ సాధించిన విజయం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

వీడియో క్యాప్షన్, ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డుకు నామినీగా వినేశ్ ఫొగాట్ ఎంపికైనప్పుడు ఆమెపై బీబీసీ రూపొందించిన ప్రత్యేక వీడియో కథనం

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ద ఇయర్ నామినీ కూడా

వినేష్ ఫొగాట్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022'కి నామినీ కూడా.

భారత మహిళా అథ్లెట్లను, వారి విజయాలను గౌరవించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడం, వారి కథలను ప్రపంచానికి అందించడం 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లక్ష్యం.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Reuters

చివరి 20 సెకన్లలో మలుపు తిరిగిన మ్యాచ్

రెజ్లింగ్ ప్రపంచంలో సుసాకీ యుయి తిరుగులేని రెజ్లర్.

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆమెను వినేశ్‌కు అతిపెద్ద సవాలుగా చూశారు.

ఈ ఓటమి కంటే ముందు సుసాకీ తన కెరీర్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. వినేశ్‌తో మ్యాచ్‌లోనూ సుసాకీ ఆధిపత్యం ప్రదర్శించి 2-0తో ముందుకెళ్లింది.

ఆ తర్వాత, కుస్తీ ప్రపంచంలో అసాధ్యంగా పరిగణించే పనిని వినేశ్ చేసి చూపెట్టారు.

ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లో ఓటమి ముంగిట నిలిచిన వినేశ్ ఆఖరి 20 సెకన్లలో అద్భుతం చేశారు. అమాంతం దూకుడు పెంచిన ఆమె సుసాకీని కింద పడేసి మూడు పాయింట్లు సాధించి 3-2తో అనూహ్య విజయాన్ని అందుకున్నారు.

గెలిచిన తర్వాత వినేశ్, రెజ్లింగ్ మ్యాట్ మీద పడిపోయి సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె కళ్లలోని ఆనంద భాష్పాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ గెలుపు తర్వాత, గంటలోపే ఆమె క్వార్టర్స్ ఫైనల్ బౌట్‌లో తలపడ్డారు.

ఈ పోరులో వినేశ్ 7-5తో ఓక్సానా లివాచ్ (యుక్రెయిన్)పై గెలిచారు. బౌట్ ఆరంభంలోనే వినేశ్ 4-0తో ముందుకెళ్లారు. తర్వాత ఓక్సానా పుంజుకున్నప్పటికీ అప్పటికే ఆలస్యమైంది.

సెమీస్‌లో క్యూబా రెజ్లర్‌పై నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించారు. పతకాన్ని ఖాయం చేసుకున్నారు.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2023లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా వినేశ్ ఫొగాట్‌ దిల్లీలో ఆందోళన చేశారు

లైంగిక వేధింపులపై పోరాటం తర్వాత ఒలింపిక్ ఫైట్

ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అయిదుగురు మహిళా రెజ్లర్లలో వినేశ్ ఒకరు.

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడాని కంటే ముందు ఆమె భారత్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం చేశారు.

నిరుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

కొందరు భారత రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను బ్రిజ్‌భూషణ్ ఖండించారు.

2023లో బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఏడాది పొడవునా నిరసనలు జరిగాయి. ఆ సమయంలో క్రీడా చరిత్రలో ఎప్పుడూ చూడని దృశ్యాలను చూడాల్సి వచ్చింది.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతేడాది లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్

రెజ్లర్లు బజ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లు తమకు ప్రభుత్వం అందించిన ‘ఖేల్ రత్న’, ‘అర్జున’ పురస్కారాలను దిల్లీలోని ఫుట్‌పాత్‌పై వదిలేశారు. వాటిని ప్రధానమంత్రికి అప్పగించాలని పోలీసులకు వారిద్దరూ చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీకి వినేశ్ ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో తన వద్ద ఉన్న మెడల్స్ అన్నీ తిరిగి ఇచ్చేస్తానని పేర్కొన్నారు.

‘‘నా జీవితంలో ఇక ఈ పురస్కారాలకు ఎలాంటి అర్థం లేదు’’ అని లేఖలో రాశారు.

దీనికంటే ముందు రెజ్లర్ సాక్షి మలిక్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించారు. బజ్‌రంగ్ పూనియా కూడా తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు.

ఈ వ్యవహారంలో బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఆయనకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలున్నాయని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

సహచర రెజ్లర్లు, కుటుంబీకులు ఏమన్నారు?

వినేశ్ అద్భుత ప్రదర్శనను రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా, వినేశ్ చిన్నాన్న, కోచ్ అయిన మహావీర్ ఫొగాట్‌తో పాటు పలువురు ప్రశంసించారు.

వినేశ్ ఫొగాట్ భారత సివంగి అని బజ్‌రంగ్ అన్నారు. ‘‘బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు వరల్డ్ చాంపియన్, డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్‌ను వినేశ్ ఓడించారు. తర్వాత క్వార్టర్స్‌లో మాజీ వరల్డ్ చాంపియన్‌పై గెలిచారు. కానీ, ఈ అమ్మాయిని తన సొంత దేశంలో కాళ్లతో తొక్కారు. రోడ్లపై ఈడ్చేశారు. ప్రపంచాన్ని గెలిచే ఈ అమ్మాయి, సొంత దేశంలోని వ్యవస్థ చేతిలో ఓడిపోయింది’’ అని బజ్‌రంగ్ ట్వీట్ చేశారు.

వినేశ్ సోదరి గీతా ఫొగాట్ కూడా ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచం తల వంచుతుంది. కానీ, దాని తల వంచాలనే పట్టుదల మీలో ఉండాలంతే’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

వినేశ్ విజయంతో గ్రామంలో సంతోషం నెలకొందని మహావీర్ ఫొగాట్ అన్నారు.

‘‘2016 రియో ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ పతకం సాధిస్తుందని ఆశించాం. కానీ, తీవ్ర గాయం కారణంగా అలా చేయలేకపోయింది. 2020లో కూడా పతకాశలు ఉండేవి. అప్పుడు కూడా అది నెరవేరలేదు. ఇప్పుడు తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన శక్తిమంతమైన ప్లేయర్‌ను వినేశ్ ఓడించింది. ఇప్పుడు ఆమె స్వర్ణం సాధిస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని మహావీర్ ఫొగాట్ వ్యాఖ్యానించారు.

వినేశ్‌ను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ అభినందించారు.

‘‘శభాష్ వినేశ్ ఫొగాట్. ఇది మీకు ఒలింపిక్స్‌లో ఒక పోటీ మాత్రమే కాదనే విషయం నాకు తెలుసు. మైదానం లోపల, బయటా చేసిన పోరాటాలపై మీరు సాధించిన విజయం ఇది. మీరు ప్రపంచ నంబర్‌వన్ రెజ్లర్‌ను ఓడించారు. నేడు ప్రపంచమంతా మీ చేతుల్లో ఎగురుతోన్న త్రివర్ణ పతకాన్ని చూస్తోంది. మీరు ఈ దేశానికే గర్వకారణం’’ అని ట్వీట్‌లో ప్రియాంకా ట్వీట్ చేశారు.

వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images

ఒలింపిక్స్‌లో వినేశ్ ప్రయాణం

వినేశ్ తన కెరీర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఫొగాట్ కుటుంబ రెజ్లింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు.

రెండుసార్లు ఒలింపిక్స్ (2016 రియో, 2020 టోక్యో)‌లో పాల్గొన్న ఆమె కామన్వెల్త్ క్రీడల్లో మూడు స్వర్ణాలు, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

తొమ్మిదేళ్ల వయస్సులో వినేశ్ తండ్రిని కోల్పోయారు. పురుషాధిక్యం ఎక్కువగా ఉండే రెజ్లింగ్ క్రీడలో వినేశ్ దూసుకెళ్లారు.

పారిస్ ఒలింపిక్స్ ఆమె పాల్గొంటున్న మూడో ఒలింపిక్స్ క్రీడలు.

రియోలో ఆమె ప్రదర్శన సరిగా లేదు, గాయం కారణంగా టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగారు. టోక్యోలో ఆమె క్వార్టర్స్‌లో ఓడిపోయారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)