పారిస్ ఒలింపిక్స్: రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగాట్

ఫొటో సోర్స్, Getty Images
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయమైంది. మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ ఫైనల్ చేరారు. దీంతో వినేశ్ ఖాతాలో స్వర్ణం లేదా రజతం చేరనుంది.
50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ సెమీఫైనల్లో వినేశ్ ఫొగాట్ క్యూబాకు చెందిన గుజ్మాన్ లోపెజ్ యుస్నీలిస్‌పై 5-0తో విజయం సాధించారు.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినేశ్ 7-5తో యుక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను ఓడించారు. ఒక్సానా 2019 యూరో ఛాంపియన్.
అంతకుముందు వినేశ్ జపాన్‌కు చెందిన యుయి సుసాకిని 3-2తో ఓడించి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సుసాకి టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ కూడా.


ఫొటో సోర్స్, Getty Images
2022లో బీబీసీ ISWOTY నామినీ
వినేశ్ ఫొగాట్ 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022'కి నామినీ కూడా.
భారత మహిళా అథ్లెట్లను, వారి విజయాలను గౌరవించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడం, వారి కథలను ప్రపంచానికి అందించడం 'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాటం
ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఐదుగురు మహిళా రెజ్లర్లలో వినేశ్ ఫొగాట్ ఒకరు.
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి ముందు, ఆమె భారత్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన వినేశ్
వినేశ్ 1994 ఆగస్టు 25న పుట్టారు. తల్లి పెంపకంలోనే ఆమె పెరిగారు. వినేశ్ చిన్నతనంలోనే ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య తల్లి ఆమెను పెంచి పెద్ద చేశారు.
గత ఐదేళ్లుగా ఆమె సాగిస్తున్న ప్రయాణాన్ని గమనిస్తే.. అందులో కఠోర శ్రమ, అంకిత భావం, పట్టుదల, అనేక విజయాలతో పాటు బోలెడు కన్నీళ్లు కూడా కనిపిస్తాయి.
2014 కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారు పతకం గెలవడంతో ఆమె కెరీర్ కీలక మలుపు తిరిగింది. టీనేజీలో ఉండగానే తానో అంతర్జాతీయ స్టార్‌నని ఆమె ప్రపంచానికి నిరూపించారు.
ఆమె కజిన్స్.. గీతా ఫొగాట్, బబితా ఫొగాట్ కూడా కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు గెలుచుకున్నారు.
క్రమంగా భారత రెజ్లింగ్‌కు వినేశ్ పోస్టర్ గాళ్‌గా మారిపోయారు. 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్ ఆమెపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడుతూ ఆమె ఎరీనా నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అలా ఆమె ఒలింపిక్స్ పతకం కలలు ఆవిరయ్యాయి. తరువాత ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.
తన కెరీర్‌లో అత్యంత చీకటి రోజులు అవేనని, తాను తిరిగి స్టేడియంలో అడుగుపెడతానో లేదోనన్న భయంతో ఉండేదాన్నని వినేశ్ చెప్పారు.
ఒలింపిక్స్‌లో గాయం నుంచి కోలుకున్నాక వినేశ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. 2018 ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారత్ తరఫున మొట్టమొదటి బంగారు పతకాన్ని ఆమె గెలుచుకున్నారు.
మధ్యలో ఆమె కొన్ని ఓటములను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోతున్నందుకు విమర్శలకూ గురయ్యారు.
కానీ, ఆమె అంకితభావం, కొత్త కొచ్, కొత్త శిక్షణ మెలకువలు.. ఇలా అన్ని అంశాలూ ఆమెకు అద్భుతంగా కలిసొచ్చాయి. దాంతో 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తన మొట్టమొదటి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














