వినేశ్ ఫొగాట్‌ ఒలింపిక్స్ ఫైనల్ ఆడకుండా అడ్డుకున్న నిబంధనలేంటి?

ఒలింపిక్స్, వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫొగాట్
    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తిరుగులేని విజయాలతో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్‌కు చేరి వినేశ్ ఫొగాట్ అందరి హృదయాలను గెలుచుకుంది. కానీ ఆ సంతోషం ఇప్పుడు గుండె పగిలే బాధగా మారిపోయింది. నిర్ణీత బరువు కంటే ఎక్కువ ఉండడంతో వినేశ్ ఫైనల్స్‌లో ఆడే అర్హత కోల్పోయింది.

విమెన్స్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేశ్ పోటీ పడుతోంది. కానీ అనుమతించిన బరువు కన్నా ఆమె బరువు ఎక్కువ ఉందని అధికారులు గుర్తించారు. క్రీడాకారుల బరువు తూచే సమయంలో ఇది తేలింది.

వినేశ్ విషయంలో ఇంకొంత సమయం కావాలని భారత బృందం కోరింది. కానీ వినేశ్ బరువు తగ్గలేకపోవడంతో ఆమెపై అనర్హత వేటు పడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఒలింపిక్స్. వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వంద గ్రాముల బరువు వల్ల పతకం గెలిచే అవకాశం కోల్పోయిన వినేశ్

బరువు ఎందుకంత ముఖ్యం

ఏ రెజ్లింగ్ ఈవెంట్‌లో అయినా, పోటీపడేవాళ్ల బరువును తెలుసుకుంటారు.

రెజ్లింగ్, బాక్సింగ్ వంటి పోరాట క్రీడల్లో ఇది ఎప్పటినుంచో అమలుచేస్తున్న విధానం. పోటీపడుతున్న రెజ్లర్లందరికీ సరైన అవకాశం కల్పించేందుకు ఈ విధానం అమలుచేస్తున్నారు.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనలను బీబీసీ పరిశీలించింది. ఈ నిబంధనలు ఎలా ఉంటాయనేది తెలుసుకునేందుకు మాజీ రెజ్లర్, కోచ్‌తో బీబీసీ మాట్లాడింది.

ఏ టోర్నమెంట్‌లో అయినా నిర్ణీత బరువు విభాగంలో రెండు రోజులు పోటీ నిర్వహిస్తారు.

ప్రతి రెజ్లర్‌ను ఒకే ఒక కేటగిరీలో ఆడేందుకు అనుమతిస్తారు. తొలిసారి అధికారికంగా బరువు చూసే సమయంలో అతడు లేదా ఆమె ఎంత బరువుంటారో...ఆ కేటగిరీకి వారు ప్రాతినిధ్యం వహిస్తారు.

రెజ్లింగ్ కోసం సింగ్లెట్ యూనిఫాం అనుమతిస్తారు. బరువు తగ్గట్టుగా కచ్చితమైన కొలతలతో సింగ్లెట్ ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం మినహాయింపు ఇవ్వరు.

పోటీ జరిగే రోజు ఉదయం వైద్యపరీక్షలు నిర్వహించి, బరువు చెక్ చేస్తారు.

పోటీలు ప్రారంభమయ్యే రోజు ఉదయం ముందుగా రెజ్లర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నిపుణులైన వైద్యులు నిర్వహించే పరీక్షల్లో ఎవరన్నా రెజ్లర్లకు అంటువ్యాధుల తీవ్రత ఉన్నట్టు గమనిస్తే వారిని పోటీ నుంచి తప్పించొచ్చు. పోటీలో పాల్గొనేవారు గోళ్లను కచ్చితంగా కట్ చేసుకోవాలి.

ఒలింపిక్స్, వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వినేశ్ ఫొగాట్

రెండుసార్లు బరువు తూకం

మొదటి సారి బరువు పరిశీలించడం, వైద్య పరీక్షలకు 30 నిమిషాల సమయం పడుతుంది. ఆ కేటగిరీకి సరిపడిన వారినే ఆడేందుకు అనుమతిస్తారు.

ఫైనల్స్‌కు అర్హత సాధించిన వారికి.. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయినప్పటికీ, పతకం కోసం మరో పోటీలో ఆడాల్సిఉన్నవారికి రెండోరోజు ఉదయం మళ్లీ బరువు చెక్ చేస్తారు. ఇది 15 నిమిషాల పాటు సాగుతుంది.

యూడబ్ల్యూడబ్ల్యూ నిబంధనల ప్రకారం రెండోసారి బరువు చెక్ చేసినప్పుడు.. ఏ మాత్రం బరువు ఎక్కువ ఉన్నా పోటీకి అనుమతించరు.

బరువు చూసే మొత్తం సమయంలో రెజ్లర్లు వాళ్ల కోరుకున్నన్నిసార్లు తమ బరువు చూసుకునేందుకు అవకాశం ఉంది. బరువు చెక్ చేసే బాధ్యత రిఫరీలదే. రెజ్లర్లు ఏ కేటగిరీలో పోటీలో పాల్గొంటున్నారో అందుకు తగిన బరువు ఉన్నారా లేదా అన్నది రిఫరీలు తప్పనిసరిగా పరిశీలించాలి. పోటీకి సరిపడా అన్ని విషయాలను వారు గమనించాలి. బరువు మొదలుకుని డ్రెస్ వరకు అన్ని విషయాల్లో రెజ్లర్లు ఎలాంటి స్థితిలో ఉన్నారనేది వారికి తెలియజేయాలి.

వైద్యపరమైన అవసరముంటే తప్ప.. ఎవరన్నా అథ్లెట్ మొదటి లేదా రెండోసారి బరువు చెక్ చేసుకోకపోయినా, అందులో విఫలమైనా వారిని పోటీ నుంచి తప్పించవచ్చు.

ఒలింపిక్స్. వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనలిస్ట్ అర్హత కోల్పోతే...

నిర్ణీత బరువు కంటే ఎక్కువ ఉన్న ఫైనలిస్ట్ ఎవరైనా పోటీలో పాల్గొనే అర్హత కోల్పోతే, సెమీ ఫైనల్‌లో పోటీ పడిన క్రీడాకారుడు/ క్రీడాకారిణి వారికి బదులుగా ఫైనల్‌లో పాల్గొంటారు. వినేశ్ కేసులో ఐఓసీ ఇదే చేసింది.

పోటీ కేటగిరీ బరువుకు తగ్గట్గుగా క్రీడాకారులు బరువు తగ్గించుకోవడాన్ని వెయిట్ కటింగ్ అని పిలుస్తారు.

టోర్నమెంట్‌కు కొన్ని వారాల ముందు నుంచి అథ్లెట్లు బరువు తగ్గడం ప్రారంభిస్తారు. నెమ్మదిగా బరువు తగ్గడం మంచి విధానం. అయితే ఇందులో కొంత ప్రమాదం ఉందని స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ చెప్పారు.

బరువు తూచే ముందు కొందరు అథ్లెట్లు బరువు తగ్గి.. మళ్లీ టోర్నమెంట్ ముందు బరువు పెరుగుతారని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

దీనికి కౌంటర్‌గా యూడబ్ల్యూడబ్ల్యూ 2017లో ఫార్మాట్ మార్చింది. అంతకుముందు బరువు కేటగిరీలో అన్ని మ్యాచ్‌లను ఒకే రోజు నిర్వహించేవారు.

ఇప్పుడు అమలు చేస్తున్న రెండు రోజుల విధానంతో అథ్లెట్లు ఒక్కరోజులో ఎక్కువ బరువు తగ్గితే.. రెండో రోజు కూడా అంతే బరువు ఉండాలి.

పారిస్ ఒలింపిక్స్, వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గతంలోనూ బరువు కారణంగా వినేశ్‌కు సమస్యలు

బరువు తగ్గడం ఎందుకు కష్టం?

మనుషుల శరీరాల్లో మార్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఒక్కరోజులోనే మార్పులు వస్తుంటాయి. అందుకే రెజ్లర్లు రెండు రోజుల పాటు ఒకే బరువు మెంటెయిన్ చేయడం చాలా ముఖ్యం.

ఓ విభాగంలో అథ్లెట్లు ప్రవేశించినప్పుడు...రెండు రోజులూ అవసరమైన బరువుతో ఉండాలి.

ఒలింపిక్స్‌లో క్వాలిఫై అయిన కేటగిరీలో ఆడాల్సి ఉంటుంది.

కొందరు రెజ్లర్లు తమ శరీర బరువు కన్నా తరువాతి ఎక్కువ బరువు కేటగిరీని ఎంచుకుంటారు.

తక్కువ బరువున్న కేటగిరీలో ఆడడం అంత తేలిక కాదు. ఎందుకంటే అథ్లెట్లు దానికి తగ్గట్టుగా తమ శరీర బరువు తగ్గించుకోగలగాలి. రెండురోజుల పాటు అదే బరువుతో ఉండాలి.

‘‘బరువు తగ్గాలనుకునేవారందరికీ ఇది చాలా కష్టమైన విషయం. ఇది వారందరికీ తెలుసు’’ అని మాజీ రెజ్లర్ ఒకరు బీబీసీకి చెప్పారు.

తక్కువ బరువు కేటగిరీని ఎంచుకున్న చాలా మంది రెజ్లర్లు తిండి తగ్గించుకోవాలి. తక్కువ నీళ్లు తాగాలి. ఇది కొంతమందిని బాగా నీరసపరుస్తుంది. వారు ఆకలితో అలమటించిపోతారు. శరీరంపై ప్రభావం పడుతుంది. పోటీలో దిగే సమయానికి వారు కోలుకోగలగాలి. కానీ కొన్నిసార్లు అలాంటి మార్పులు తీవ్రంగా ఉంటాయి. పోటీకి అవసరమైన కేటగిరీ బరువుకు అతిదగ్గరగా ఉన్న అథ్లెట్లు....ఆట ఆడే సమయంలో విపరతీమైన ఒత్తిడికి లోనవుతారు.

అంతకుముందు కూడా బరువు కారణంగా వినేశ్ ఎంతో బాధపడింది.

2016 ఒలింపిక్స్‌ కోసం జరిగిన తొలి ఆసియా క్వాలిఫయర్ మ్యాచ్‌లో 48కేజీల క్యాటగిరీలో ఆడేందుకు...తన బరువు తగ్గించుకోవడానికి వినేశ్ ఎంతో కష్టపడింది. తర్వాత ఆమె ఆ కేటగిరీలో ఆడేందుకు అర్హత సాధించింది. అదే కేటగిరీలో ఆడిన వినేశ్ తర్వాత గాయం కారణంగా ఆ ఒలిపింక్స్ నుంచి వైదొలిగింది.

టోక్యో ఒలింపిక్స్‌లో 53కేజీల కేటగిరీలో పోటీపడిన వినేశ్ క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుతిరిగింది. పారిస్ ఒలింపిక్స్‌లో తక్కువ బరువు కేటగిరీలో పోటీపడాలని ఆమె నిర్ణయించుకుంది. బరువు తగ్గాలని భావించింది. కానీ చివరకు కేవలం కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)