100 గ్రాములు ఒక కలను చెరిపేసింది, తప్పెవరిది? వినేశ్‌తో పాటు అనర్హత వేటు పడిన రెజ్లర్లు ఎవరు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినాయక్ దాల్వి
- హోదా, పారిస్ నుంచి బీబీసీ ప్రతినిధి
ఫైనల్‌కు ముందు బరువు కారణంగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం భారత అభిమానులను నిరాశకు గురిచేసింది.
కుస్తీ(రెజ్లింగ్)లో వివిధ బరువు కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి. క్రీడాకారులు తాము రాణిస్తామనుకునే బరువు కేటగిరిలో పోటీ పడతారు. అందుకోసం బరువు తగ్గించుకోవడమో, పెంచుకోవడమో చేస్తుంటారు. ఇది క్రీడాకారులు అందరూ పాటించే సాధారణ పద్ధతి.
తక్కువ బరువు ఉన్న ప్రత్యర్థులపై గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొందరు క్రీడాకారులు బరువు తగ్గించుకుని పోటీ పడతారు. ఇక్కడ వైద్య బృందం పాత్ర చాలా ముఖ్యమైనది.
ఈసారి, భారతదేశం తరపున 13 మంది నిపుణుల బృందం పారిస్ వెళ్లింది. వీళ్లు పోషకాహారం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం వంటి రంగాలలో నిపుణులు.
భారత జట్టు చీఫ్, పారిస్ ఒలింపిక్స్‌లో భారత చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్‌షా పార్దివాలా మాట్లాడుతూ “పోటీ తర్వాత వినేశ్ బరువు మామూలు కంటే ఎక్కువగా ఉంది. డీహైడ్రేషన్‌ను నివారించడానికి, వినేశ్‌కు కొంచెం నీరు ఇచ్చాం. ఎప్పుడూ వినేశ్‌తో కలిసి చేసే సాధారణ వెయిట్-కట్ ప్రక్రియను కోచ్ చేపట్టారు’’ అన్నారు.
"ఇది చాలా కాలం నుంచి ఆమె విషయంలో పని చేస్తూ వచ్చింది. దీన్ని సాధిస్తామని ఆయన నమ్మకంగా ఉన్నారు. మేం రాత్రంతా ఇలా బరువు తగ్గించే ప్రక్రియను కొనసాగించాం’’
“అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫైనల్ పోటీ ఉదయం నాటికి, ఆమె బరువు పరిమితికి మించి 100 గ్రాములు ఎక్కువగా ఉంది. మేం జుట్టు కత్తిరించడం, దుస్తులు పొట్టిగా చేయడం లాంటి అన్ని ప్రయత్నాలూ చేశాం” అని డాక్టర్ దిన్‌షా తెలిపారు.
చివరికి ఆమె బరువు పరిమితికి మించి ఉండడంతో టోర్నమెంట్‌కు అనర్హురాలిగా ప్రకటించారు.
కానీ డీహైడ్రేషన్‌కు గురైన వినేశ్ ఈ క్రమంలో శరీరంలోని చాలా నీటిని కోల్పోయారు. దీంతో ఆమెకు వెంటనే వైద్య చికిత్స అందించారు.
ముందు జాగ్రత్తగా ఆమెకు రక్తపరీక్షలు నిర్వహించగా అంతా బాగానే ఉందని తేలింది.
భారత జట్టు తరపున విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: “వినేశ్ ఐఓఏ ప్రెసిడెంట్ పీటీ ఉషతో సంభాషించారు. ఆమె శారీరకంగా, మానసికంగా సాధారణంగా ఉన్నప్పటికీ, ఇది తన మూడవ ఒలింపిక్స్ అని, ఈ అనర్హత వేటుతో తాను చాలా నిరాశ చెందానని పేర్కొన్నారు.’’

ఫొటో సోర్స్, Getty Images
1952 ఒలింపిక్స్‌లో ఏమైందంటే..
రెజ్లింగ్, బాక్సింగ్ వంటి క్రీడలలో ఆటగాళ్ళకు వాళ్ల బరువు, వాళ్లు ఎంత తింటున్నారు అన్నది చూసుకోవడం చాలా ముఖ్యం.
ఖషబా జాదవ్ భారతదేశానికి కాంస్యం సాధించిన 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో, భారతదేశానికి చెందిన మరో రెజ్లర్ కేశవ్ మంగావే హెవీ వెయిట్ విభాగంలో పోటీ పడ్డారు.
ఆ రోజుల్లో ఫార్మాట్ వేరు. మంగావే ఐదు రౌండ్లలో ఆడాల్సి ఉంది, కానీ ఆయన పతకాన్ని పొందలేకపోయారు. దానికి కారణం ఆయన ముందు రోజు రాత్రి చాలా ఎక్కువ తినడంతో పోటీలో చురుకుగా కదలలేకపోయారు.
కానీ ఆయనను అనర్హునిగా చేసింది బరువు కాదు – ఆయన అమెరికాకు చెందిన జో హెన్సన్ చేతిలో ఓడిపోయారు.
ఆటగాళ్లు బరువును తగ్గించుకున్నా లేదా పెంచుకున్నా - రెండూ ప్రమాదకరమైనవి. ఇది వారి సామర్థ్యం, నైపుణ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
భారత బాక్సర్ మేరీ కోమ్ 2012 లండన్‌లో కాంస్యం గెలుచుకున్నారు. ఆమె అప్పట్లో లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో పోటీ పడ్డారు. ఆమె 2010లో అదే వెయిట్ గ్రూప్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నూ గెలుచుకున్నారు.
కానీ 2012లో లండన్‌లో మహిళల రెజ్లింగ్‌ను ప్రవేశపెట్టినప్పుడు, కేవలం మూడు గ్రూపులే ఉన్నాయి. వాటిలో మేరీ కేటగిరీ లేదు.
దీంతో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం కోసం మేరీ బరువు పెరగాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
వినేశ్‌కు ఏమైంది?
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో వినేశ్ 53 కిలోల విభాగంలో పోటీపడి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. టోర్నమెంట్ బయట ఆమె సాధారణ బరువు దీని కంటే ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో ఆడేందుకు ఆమె బరువు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఆమె క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో మొదటిసారి 50 కేజీల గ్రూప్‌లో పోటీ పడ్డారు.
బరువును 53-55 కిలోల నుంచి 50 కిలోల కంటే తక్కువకు తీసుకురావడానికి ఆమె చాలా కృషి చేశారు.
పారిస్‌లో వినేశ్ ఆహారం, నీరు తీసుకోవడం తగ్గించారు. దీంతో ఆమె ఈ విభాగంలో టోర్నమెంట్‌లో మొదటి రోజు ఉదయం అర్హత సాధించారు.
కానీ బుధవారం (ఆగస్టు 7) రెండో రోజు ఉదయం ఆమె తన బరువు పరిమితికి లోబడి ఉండేలా మెయింటెయిన్ చేయలేకపోయారు.
వినేశ్ తన బరువు కేటగిరీని 53 కిలోల నుంచి 50 కిలోలకు మార్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె బరువు పరిమితికి అటుఇటు ఉంటే, ఆమె సహాయక సిబ్బంది దాన్ని నిశితంగా పరిశీలించి ఉండాలి.
గతంలో భారత బృందంతో కలిసి పనిచేసిన ఒక వైద్యుడు, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు ఇలా అన్నారు: “ముఖ్యంగా ఫైనల్ రోజున, వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆమె ఆహారం తీసుకోకుండా లేదా మరేదైనా పద్ధతిలో తన బరువును తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉండాలి.’’
“కానీ వాళ్లు ఒక విషయం మరిచిపోయి ఉండొచ్చు - వినేశ్ అంతకు ముందు రోజు వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత, ఆటగాళ్లకు బయటి నుంచి కనిపించని అంతర్గత గాయం అయ్యే అవకాశం ఉంది’’
"కండరాలకు అయ్యే అలాంటి కనిపించని గాయాలు కొన్నిసార్లు ఆటగాళ్ల బరువును 100 నుంచి 200 లేదా కొన్నిసార్లు 300 గ్రాములు పెంచుతాయి. బరువును తూచే ముందు ఇలా జరిగితే, ఆమె బరువులో అకస్మాత్తుగా పెరుగుదల కనిపిస్తుంది, దానిని నియంత్రించడం అసాధ్యమవుతుంది.’’
సహాయ సిబ్బంది అలాంటి ఆకస్మిక మార్పును గుర్తించలేకపోయారని ఆయన భావిస్తున్నారు.
ఈసారి క్రీడా మంత్రిత్వ శాఖ సరైన వైద్య సిబ్బందినే పంపింది. వాళ్లు ఆటగాళ్ల బరువును పర్యవేక్షించగలరు, ఇతర విషయాలపైనా శ్రద్ధ తీసుకోగలరు.
మరైతే ఎక్కడ తప్పు జరిగింది? వినేశ్‌పై ఎందుకు అనర్హత వేటు పడింది? ఒక క్రీడాకారిణి సంవత్సరాల తరబడి పడిన శ్రమ వృథా అయితే దానికి బాధ్యులు ఎవరు?
ఏం జరిగిందనే దానిపై విచారణ అవసరం, ఎందుకంటే దాని నుంచి నేర్చుకున్న పాఠాలు మరొక అథ్లెట్ విషయంలో అలాంటి తప్పు జరగకుండా సహాయపడతాయి.
వినేశ్ ఒక్కరే కాదు
అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడింది వినేశ్ ఒక్కరిపై మాత్రమే కాదు. దానికి ఒక రోజు ముందు, ఇటాలియన్ రెజ్లర్ ఎమాన్యుయేలా లియుజీనూ పోటీకి అనర్హురాలిగా ప్రకటించారు. జులై 29న జరిగిన బౌట్‌లో అల్జీరియన్ జుడోకా మెసౌద్ రెదువాన్ డ్రిస్‌పైనా ఇదే కారణంతో అనర్హత వేటు పడింది.
అథ్లెట్లకు, ప్రాథమిక రౌండ్‌లో ఓడిపోవడం లేదా అనర్హులు కావడం బాధాకరం కాదు. కానీ మీరు పతకానికి దగ్గరగా వచ్చి, ఆ తర్వాత పోటీ పడడానికి అనుమతి లభించకపోవడం చాలా బాధిస్తుంది.
బరువు విషయంలో నిబంధనలు ఇంత కఠినంగా ఉండాలా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు.
అమెరికాకు చెందిన మాజీ ఒలింపియన్ రెజ్లర్, లండన్ 2012లో గోల్డ్ విజేత అయిన జోర్డాన్ బరో, వినేశ్‌కు రజతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆయన సోషల్ మీడియాలో "రెండో రోజు ఒక కిలో బరువు మినహాయింపు, బరువు తూచే సమయం ఉదయం 8:30 నుంచి 10:30 కు మార్చాలి" అని ప్రతిపాదించారు.
సెమీఫైనల్ విజయం తర్వాత, రెండవ రోజు బరువులో తేడా ఉన్నా, ఫైనల్‌కు చేరిన ఇద్దరికీ పతకాలు ఇవ్వాలని, రెండో రోజు పరిమితికి లోబడి బరువు ఉన్న రెజ్లర్‌కు మాత్రమే స్వర్ణం గెలిచే అవకాశం ఉండాలని ఆయన సూచించారు.
కానీ అది భవిష్యత్ తరాల కోసం.
ప్రస్తుతానికి, ఈ మొత్తం సంఘటనపై అనేక భావోద్వేగ స్పందనలు కనిపిస్తున్నాయి. కానీ క్రీడలలో ఒక నియమం ఉందంటే, దాన్ని పాటించాల్సిందే. ఒక క్రీడాకారిణి ఆ నియమాలకు లోబడి ఉండకపోవడం వల్ల భారతదేశం ఒక రజతం కోల్పోయింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














