పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు.
80 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్య చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం (ఆగస్టు 8న) కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఆయన 2000 నుంచి 2011 వరకు వరుసగా 11 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీపీఎంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఆయన నాకు దశాబ్దాలుగా తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అప్పుడు చాలాసార్లు వారి ఇంటికి వెళ్ళాను" అని మమతా బెనర్జీ చెప్పారు.
బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబానికి, ఆయన పార్టీకి, ఆయన మద్దతుదారులకు మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
బుద్ధదేవ్ భట్టాచార్య కొన్నేళ్లుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
2021లో ఆయన కోవిడ్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కోలుకున్నా, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని పలుమార్లు వార్తలు వచ్చాయి.
పద్మభూషణ్‌ను తిరస్కరించిన భట్టాచార్య
2022లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కానీ, బుద్ధదేవ్ భట్టాచార్య ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
‘‘పద్మభూషణ్ పురస్కారం గురించి నాకేమీ తెలియదు. దాని గురించి నాకు ఎవరూ చెప్పలేదు. నాకు ఒకవేళ వాళ్లు ఆ అవార్డు ఇస్తే, దానిని తిరస్కరిస్తా’’ అని ఆయన అన్నారని సీపీఎం నేత సీతారాం ఏచూరీ అప్పుడు చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














