ముక్కుపుడక స్క్రూ ఊడి ఊపిరితిత్తుల్లోకి చేరిన ఘటన, చివరకు ఎలా బయటకు తీశారంటే...

- రచయిత, గీతాపాండే
- హోదా, బీబీసీ న్యూస్
రెండు నెలల కిందట వర్షా సాహు అనే మహిళకు ముక్కుపుడక కింది భాగంలో ఉండే స్క్రూ (దిమ్మ) గొంతులోకి వెళ్లిపోయింది.
ఊడిపోయిన దిమ్మ ఆమె గాలి పీల్చడంతో గొంతులోకి జారిపోయింది. మొదట ఆమె దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు.
అది కడుపు లోపలకు వెళ్ళిపోయి ఉంటుందని, సహజమైన మార్గంలో బయటకు వచ్చేస్తుందని ఆమె అనుకున్నారు.
కానీ ఆ స్క్రూ ఆమె ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోవడంతో వారాల తరబడి ఆమెకు ఆయాసానికి గురయ్యారు. డాక్టర్లు ఆ స్క్రూను బయటకు తీయడంతో ఆమె హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు.
భారత్‌లో ముక్కుపుడకను వివాహానికి చిహ్నంగా చూస్తారు. చాలామంది పెళ్ళయిన భారతీయ మహిళల్లానే 35 ఏళ్ళ వర్షా కూడా తనకు పెళ్ళయిన గుర్తుగా 16,17 ఏళ్ళ కిందట ముక్కుపుడక ధరించారు.
‘‘ముక్కుపుడక స్క్రూ వదులైన విషయం నాకు అర్ధం కాలేదు.’’ అని వర్షా అన్నారు. ఆమె ఫోన్ ద్వారా బీబీసీతో మాట్లాడారు.
‘‘నేను ఫోన్‌లో చాటింగ్ చేస్తూ గట్టి ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ స్క్రూ లోపలకు వెళ్ళిపోయింది. అది నా శ్వాస నాళాల్లోకి వెళ్ళిన విషయం నాకు అర్ధం కాలేదు. పొట్టలోకి వెళ్ళిపోయి ఉంటుందనుకున్నా’’ అని వర్ష చెప్పారు.

అరుదైన కేసు
‘‘ఇది చాలా అరుదైన కేసు’’ అని డాక్టర్ దేవ్‌రాజ్ జాష్ చెప్పారు. ఆయన మెడికా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో ఊపిరితిత్తుల వైద్యుడిగా పనిచేస్తున్నారు.
వర్ష ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న స్క్రూను ఆయనే బయటకు తీశారు.
ఇప్పటిదాకా గడిచిన దశాబ్దకాలంలో ఇలాంటి కేసులను భారతీయ మీడియా రెండింటినే పేర్కొంది.
‘‘కొన్ని సందర్భాలలో డ్రై ఫ్రూట్స్, వక్కపలుకులు ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న కేసులు వస్తుంటాయి. ఇలాంటి కేసులు ఎక్కువగా పిల్లల్లో లేదా 80 ఏళ్ళ దాటిన పెద్దల్లోనో వస్తుంటాయి. కానీ 35 ఏళ్ళ వయసున్న మహిళ ఇలాంటి ఫిర్యాదుతో రావడం అరుదు’’ అని డాక్టర్ వివరించారు.
వర్షా స్క్రూను లోపలికి పీల్చిన ఒక నెల తరువాత దగ్గు, ఆయాసంతో బాధపడుతూ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
గతంలో ముక్కుకు జరిగిన గాయం కారణంగా తాను ఊపిరి తీసుకోలేకపోతున్నట్టు ఆమె భావించారు.
అయితే ఆమెకు మందులు పనిచేయకపోవడంతో ఊపిరితిత్తుల డాక్టర్‌ని సంప్రదించగా, ఆయన సీటీ స్కానింగ్ చేయించడంతో ఆమె ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న వస్తువు కనిపించింది. ఎక్స్‌రేలో ఆ వస్తువు ఏమిటో తేలింది.
దీంతో ఆ డాక్టర్ ఫైబర్‌ఆప్టిక్ బ్రాంకోస్కోప్ అనే చిన్నపాటి పటకారు ఉన్న కెమెరాను ఆమె వాయునాళాల్లోకి పంపి ఆ వస్తువును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, ఉపయోగం లేకపోయింది. తరువాత ఆమెను డాక్టర్ జాష్ వద్దకు పంపారు.

‘‘ముందు మేం పేషెంట్‌కు అవగాహన కల్పించాం. మరోసారి బ్రాంకోస్కోప్‌ను లోపలకు పంపుతామనేసరికి భయపడ్డారు. కానీ మానవ శరీరంలో బయటి వస్తువులు ఉండటం కుదరదని ఆమెకు వివరించాం’’ ఆయన తెలిపారు.
‘‘దీనిని అంగీకరించడం మినహా వేరే దారి లేదు. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఆమె ఊపిరి తీసుకోవడం మరింత కష్టంగా మారుతుందని చెప్పాం’’ అని డాక్టర్ తెలిపారు.
ఆమె ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించే ఇన్వాసివ్ సర్జరీ చేయాల్సి వస్తుందని కూడా ఆమెకు చెప్పినట్టు డాక్టర్ జాష్ తెలిపారు.
అయితే దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయని భావించడంతో మరోసారి బ్రాంకోస్కోప్‌తోనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.
‘‘బ్రాంకోస్కోప్‌తో పదునైన వస్తువును బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పనే. పైగా రెండు వారాలకు పైగా ఆ వస్తువు ఆమె ఊపిరితిత్తుల్లో ఉండిపోయింది. దాని చుట్టూ కణజాలం పెరగడం కూడా మొదలైంది. దానిని బయటకు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇరుకైన వాయునాళాల్లోంచి దానిని బయటకు తీసుకువచ్చేటప్పుడు నాళాలు గాయపడి ప్రమాదంగా మారొచ్చు’’ అని జాష్ చెప్పారు.
కానీ అరగంటసేపు సాగిన ఈ ప్రక్రియలో విజయవంతంగా స్క్రూను బయటకు తీసుకురాగలిగారు. నాలుగు రోజుల తరువాత వర్షను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.
‘ఆమె ఫాలో అప్ కోసం వస్తున్నారు. ఇప్పడామెకు ఎటువంటి ఇబ్బంది లేదు’’ అని డాక్టర్ జాష్ చెప్పారు.
మళ్ళీ ముక్కుపుడక ధరిస్తారా అంటే వర్షా నవ్వారు.
‘‘వామ్మో...ఇలా కూడా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ జరిగిపోయింది. మరోసారి అది జరగాలని నేను కోరుకోవడం లేదు’’ అన్నారు వర్షా.
ఇవి కూడా చదవండి:
- లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి, దీన్ని తాగితే శరీరానికి ఏమవుతుంది?
- నెజాక్ యూడా: ఇజ్రాయెల్ ఆర్మీలో అమ్మాయిలకు దూరంగా మసలే ఈ సైనికుల పటాలంపై అమెరికా ఆంక్షలు విధిస్తుందా?
- బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? కొన్ని అపోహలు, వాస్తవాలు
- కంటి చికిత్సకు వెళ్లాలనుకున్న వీరప్పన్‌ను సినీ ఫక్కీలో పోలీసులు ఎలా బోల్తా కొట్టించారు? ఆఖరి క్షణాల్లో జరిగిన డ్రామా ఏంటి?
- ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలలో సమస్య ఉన్నట్లే..
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














