తెలంగాణ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి ఆదివాసీలను ఎలా తరలిస్తున్నారు?

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ ప్రతినిధి
అర్క లచ్చు అడుగులు భారంగా పడుతున్నాయి.
చేతిలోని సంచీలో కొబ్బరికాయ, అగరవత్తులు, చక్కెర, అడవి పువ్వులున్నాయి. భార్య, రెండేళ్ల మనవడు గూడెం చివరి వరకు ఆయనకు తోడుగా నడిచారు.
గూడెం పొలిమేరలోని పూర్వీకుల సమాధుల దగ్గరికి లచ్చు ఒక్కరే వెళ్లారు. ఇది ఏటా జరిగే తంతు. కానీ, ఈసారి అర్క లచ్చు గుండె బరువెక్కింది.
పుట్టి పెరిగిన గూడెంలో పూర్వీకులను పూజించడం ఆయనకు ఇదే చివరిసారి కావచ్చు.
కొన్ని తరాల జ్ఞాపకాలను నింపుకొని ఉన్న ఆ గూడెం, మరో ఏడాది కల్లా నిర్మానుష్యంగా మారుతుంది.
అర్క లచ్చుకు అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇకపై ఆయన తాను పుట్టి పెరిగిన గూడెం, తన పూర్వీకుల సమాధులను చూడలేరు.
నిర్మల్ జిల్లా మైసంపేట్‌కు చెందిన అర్క లచ్చు ఆరు ఎకరాల రైతు.
ఇలా అర్క లచ్చు మాదిరిగా 485 మంది ఆదివాసీలు తాము పుట్టిన పెరిగిన ప్రాంతానికి దూరమవుతున్నారు. పులుల సంరక్షణలో భాగంగా వీరంతా తమ గూడేలను ఖాళీ చేయాల్సి వస్తోంది.

పులుల సంరక్షణ కోసం...
తెలంగాణలోని కవ్వాల్ పులుల సంరక్షణ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉండే ఆదివాసీ కుటుంబాలను బయటకు తరలిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్, రాంపూర్ గూడెలను తొలి విడతగా ఖాళీ చేయిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి రక్షిత అటవీప్రాంతంలో ఉండే ఆదివాసీలకు పునరావాసం కల్పించి బయటకు తరలించే ప్రయోగాత్మక ప్రాజెక్ట్ కొనసాగుతోంది.
కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను కేంద్ర ప్రభుత్వం 2012లో ప్రకటించింది.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ అటవీ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత, కడెం నదులు ఉన్నాయి.
జాతీయ పులుల సంరక్షణ అథారిటి (ఎన్టీసీఏ) ప్రకారం ఈ రక్షిత అటవీ ప్రాంతం మొత్తం విస్తీర్ణం 1015.35 చదరపు కిలోమీటర్లు. అందులో 892 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా పులుల నివాసానికి ప్రధాన ప్రాంతం.
ఈ కోర్ ఏరియాలో మొత్తం 15 జనావాసాలున్నాయి. ఇందులో నివసిస్తున్న వారిలో మెజార్టీ ప్రజలు వివిధ తెగలకు చెందిన ఆదివాసీలు.
ఇక్కడి నుంచి వారిని బయటకు తరలిస్తున్నారు. తొలి విడతలో భాగంగా మైసంపేట్, రాంపూర్ గూడెం ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. వీరికి అడవికి దూరంగా పునరావాసం కల్పిస్తున్నారు.
పులుల శాశ్వత ఆవాసానికి కవ్వాల్ అభయారణ్యం ఎంతో అనుకూలంగా ఉన్నట్లు ఎన్టీసీఏ భావిస్తోంది.

పెరుగుతున్న పులులు
మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య పరిమితి మించింది. ప్రస్తుతం తాడోబాలో 319 పులులు ఉన్నాయి.
ఆహారం లభ్యత తగ్గిపోవడంతో పులుల మధ్య సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి.
దీంతో పులులు అడవి నుంచి బయటకు వస్తున్నాయి. దాంతో మనుషులు-పులుల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది.
ఈ క్రమంలో అవి తరచూ పక్కనే ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చి వెళ్తున్నాయి. నగ్జీరా-నవేగావ్, పేంచ్, చత్తీస్‌గడ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లతో కవ్వాల్ అడవికి లింక్ కారిడార్ ఉంది.
దీంతో మూడు రాష్ట్రాల మధ్య పులుల సంచారానికి కవ్వాల్ ఫారెస్ట్ కీలకమైన కారిడార్ గా మారింది. పులులు కవ్వాల్‌లో శాశ్వత నివాసం ఏర్పర్చుకోవడానికి చర్యలు చేపట్టాలని ఎన్టీసీఏ తన రిపోర్టులలో తెలిపింది.
పులుల రక్షణ, నివాస ప్రాంతాల మెరుగుదల కోసం నిరంతర పెట్రోలింగ్, అటవీ చట్టాల అమలు, పులికి ఆహారం అయ్యే శాఖాహార జంతువుల సంఖ్య పెంపు కోసం నీటి వనరులు, గడ్డి భూముల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టడంతోపాటు కోర్ ఏరియాలో నివసించే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చేలా ప్రోత్సహించాలని ఎన్టీసీఏ సూచించింది.
‘ప్రాజెక్ట్ టైగర్’ కింద గత కొన్నేళ్లుగా ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు.
అందులో భాగంగానే నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడగ పునరావాస కాలనీకి మైసంపేట్, రాంపూర్ గ్రామాలను తరలిస్తుండటంతో అక్కడికి వెళ్లేందుకు అర్క లచ్చు కుటుంబం సిద్ధమైంది.
“మొదట అడవిని వదిలి వెళ్లకూడదనుకున్నాం. కానీ, ఇక్కడ వైద్య సౌకర్యాలు లేవు. వర్షాకాలం రెండు వాగులు దాటి రోడ్డుకు చేరాలంటే గర్భిణులకు కష్టమవుతోంది. పిల్లల చదువుల కోసం మెరుగైన సౌకర్యాల కోసం ఈ అడవిని విడిచిపోవాలని గూడెం పెద్దలంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. విడిచి పోవడం దుఖఃమే కానీ, తప్పడంలేదు’’ అని అర్క లచ్చు బీబీసీతో అన్నారు.
‘‘గూడెం ఖాళీ చేస్తుండటంతో ఆఖరు సారి మా చేనులో కుటుంబ సమాధులకు మొక్కులు చెల్లించాం. మీరు బాగుండండి, మాకు దీవెనలివ్వండని మా పూర్వీకులను వేడుకున్నా” అని జీరబోయిన కంఠంతో చెప్పారు అర్క లచ్చు.

పునరావాస ప్యాకేజీ
కవ్వాల్ ఫారెస్ట్ కోర్ ఏరియా నుంచి మైసంపేట్, రాంపూర్ గూడల నుండి 142 కుటుంబాలకు చెందిన 485 మంది, ఆయా కుటుంబాల వద్ద ఉన్న 1009 పశువుల్ని తరలిస్తామని నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారులు చెప్పారు.
దీంతో 239 ఎకరాల అటవీప్రాంతం అందుబాటులోకి వస్తుంది.
నిర్వాసిత ఆదివాసీలకు అటవీశాఖ రెండు రకాల పునరావాస ప్యాకేజీలను ప్రకటించింది.
‘’మొదటి రకం ప్యాకేజీ కింద 15 లక్షల రూపాయల నగదు పరిహారం, రెండో రకం ప్యాకేజీలో భాగంగా పునరావాస కాలనీలో డబుల్ బెడ్రూం ఇంటితో పాటు సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తున్నాం’’ అని కడెం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనిత వివరించారు.
మొదటి ప్యాకేజీని 48 కుటుంబాలు, రెండో ప్యాకేజీని 94 కుటుంబాలు కోరుకున్నాయి. తరలింపు మొదలైంది, మరికొద్ది రోజుల్లో పూర్తవుతుందని ఆమె చెప్పారు.
అడవికి బయట పునరావాసాన్ని ఆదివాసీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలో ఆదివాసీలను అటవీశాఖ నచ్చచెబుతూ వస్తోంది.
తొలి విడతలో మైసంపేట్, రాంపూర్ ప్రజలు ఒప్పుకున్నారు. ఇది స్వచ్ఛందంగా వారు తీసుకున్న నిర్ణయమని తెలంగాణ అటవీశాఖ చెబుతోంది.
“ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం అన్న ధోరణి లో వారు ఉండేవారు. అయితే మహరాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ లో ఇలా అడవిని ఖాళీ చేసిన వారికి కల్పించిన సౌకర్యాలను ఫీల్డ్ విజిట్‌లో భాగంగా చూపించాం. పునరావాసంలో భాగంగా విద్య, వైద్యం, ఉపాధి, ఇతర అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వివరించాం. మా ప్రతిపాదనలపై వారు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత వారు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు’’ అని ఉడుంపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పృథ్వీవర్మ బీబీసీకి వివరించారు.
ఈ గ్రామాలు ఖాళీ కావడం వల్ల లభించే 239 ఎకరాల స్థలాన్ని గడ్డి భూములు, నీటివనరులు అభివృద్ధి చేసి ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణాన్ని పులులకు కల్పించాలని అటవీశాఖ ప్రయత్నిస్తోంది.
“కోర్ అటవీప్రాంతం నుంచి ఆదివాసీల తరలింపు ప్రయత్నాలు ఇప్పటికి కొలిక్కివస్తున్నాయి. కొద్ది రోజుల తర్వాత ఇక్కడి వస్తే ఇక్కడ ఒక గ్రామం ఉండేదని, అది నా కాలంలో ఖాళీ అయిందని కచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఈ అనుభవం భవిష్యత్తులో నాకు, డిపార్ట్మెంట్ కు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని బీట్ ఆఫీసర్ పృథ్వీ అన్నారు.
ఈ తరలింపు పై ఆదివాసీ సంఘాలు సానుకూలంగా లేవు.
తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సంఘం-తుడుం దెబ్బ కార్యనిర్వాహణ అధ్యక్షుడు గొడం గణేష్ బీబీసీతో మాట్లాడారు.
‘‘టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్‌ల పేరుతో ఆదివాసీలను వెళ్లగొట్టడం సరైంది కాదని ప్రభుత్వాలకు చెబుతూ వస్తున్నాం. అడవి నుంచి ఆదివాసీలను వేరు చేయడం మంచిది కాదు. ఇది చెరువు నుంచి చేపను వేరు చేసినట్టే. అడవి నుంచి వేరు పడటానికి ఏ ఆదివాసీ మనస్ఫూర్తిగా ఒప్పుకోడు. మాయమాటలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. పునరావాసం పేరుతో నాసిరకం భూములు ఇస్తున్నారు’’ అని గణేష్ ఆరోపించారు.
‘‘అడవిలో కొన్ని తరాలుగా ఆదివాసీలు, పులులు ఎవరి స్థానంలో వారు జీవించారు. పులుల సంరక్షణ అని అంటున్నారు. ఇప్పుడు అవి కొత్తగా పుట్టుకొచ్చాయా? అటవీ అధికారులు, నాయకులు కలిసి అడవులను నాశనం చేశారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అంత కలప ఎక్కడిది? పులి సాకు చెప్పి ఆదివాసీలను అడవి నుంచి తరలించడం వారిని జంతువుల కంటే హీనంగా చూడటమే’’ అని ఆయన అన్నారు.

పునరావాస కాలనీల్లో సమస్యలు
కడెం మండలం మద్దిపడగ దగ్గర మంచిర్యాల-నిర్మల్ రహదారికి సుమారు కిలోమీటర్ లోపల పునరావాస కాలనీ ఏర్పాటైంది.
పునరావాస కాలనీ సందర్శించిన బీబీసీ అక్కడున్న ఆదివాసీలు,వారి తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఫారెస్ట్ అధికారులతో మాట్లాడింది.
రెండో ప్యాకేజీ ఎంచుకున్న మొత్తం 94 కుటుంబాల్లో అప్పటికే (ఏప్రిల్ 18 నాటికి) 54 కుటుంబాలు పూర్తిస్థాయిలో తరలివచ్చాయని అటవీశాఖ అధికారులు చెప్పారు.
కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తైంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉంది. అదనంగా తాగునీటి కోసం నాలుగు చేతిపంపులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మైసంపేట్ నుంచి పునరావాస కాలనీకి వచ్చిన కోవ జీవన్ ముప్పై ఏళ్ల యువకుడు.
గూడెంలో సొంత భూమిలో వ్యవసాయం తో పాటు అతనికి ఒక ట్రాక్టర్ ఉంది.
అడవి నుంచి బయటకు రావడం పట్ల సానుకూల దృక్పథంతో ఆయన ఉన్నారు. అయితే, పునరావాస కాలనీలో ఏర్పాట్లపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘’అడవి లో ఉంటే బయటి వివరాలు తెలిసేవి కావు. ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. రోడ్డుకు దగ్గరగా వచ్చాం కాబట్టి కూలీ కోసం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లొచ్చు. గతంలో బయట కూలీకి వెళ్లి చీకటిపడ్డాక గూడెం కు తిరిగి వస్తూ ఎలుగుబంటి దాడిలో గాయపడ్డవారు ఉన్నారు. పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం బాగానే ఉంది కానీ తాగునీటికి ఇబ్బంది ఉంది. మిషన్ భగీరథ నల్లాలు సరిగా పనిచేయడం లేదు. మెయిన్ రోడ్డుకు కాలనీని కలుపుతూ తారురోడ్డు వేయాలి. అంగన్వాడీ కేంద్రం ఉంది కానీ స్కూలు, గ్రామ పంచాయతీ త్వరగా ఏర్పాటు చేయాలి’’ అని అన్నారు.

ఆదివాసులు... అటవీహక్కులు
ఆదివాసీల ఆహార, సాంస్కృతిక, ఇతర అవసరాలు అడవితో ముడిపడి ఉంటాయి. పునరావాస కాలనీలకు చేరిన వారి అటవీహక్కుల గురించి ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
‘’అటవీ ఫలసహాయం వారికి ఆధారం అయ్యేది. ఇక్కడ వంట గ్యాస్, ఇతర పదార్థాలు వారు కొనుగోలు చేయాల్సి ఉంటుంది’’ అన్నారు తుడుందెబ్బ సంఘానికి చెందిన గొడం గణేష్.
‘’ఇక్కడితో పోలిస్తే అక్కడ తేడా కచ్చితంగా ఉంటుంది. వంట చెరకు, పశువుల మేత కోసం కొంచెం కష్టంగా ఉంటుంది’’ అన్నారు అర్క లచ్చు.
తరలింపు, పునరావాస ప్రక్రియల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి.
ఈ కమిటీల్లో పర్యావరణం పై పనిచేస్తున్న కొన్ని స్వచ్చంద సంస్థల ప్రతినిధులు మెంబర్లుగా ఉన్నారు.
‘‘బాహ్య ప్రపంచంలోకి వస్తున్న ఆదివాసులపై బయటి ప్రభావం పడకుండా, వారి సంస్కృతి పరిరక్షించేలా పునరావాస కాలనీని ఇతరుల నుంచి దూరంగా ఏర్పాటుచేశాం. వారి తెగల పూజా తంతుల నిర్వహణ కోసం ప్రత్యేక్యంగా మూడు ఎకరాల భూమి అధికారులు కేటాయించేలా సమన్వయం చేశాం. పునరావాసం కింద ఇచ్చిన భూముల చదును, పత్తి, కందులు వంటి పంటల స్థానంలో పండ్ల తోటల పెంపకం,యువతకు కుట్టు మిషన్ ,కంప్యూటర్ శిక్షణ ఏర్పాటు ఆలోచనలున్నాయి’’ అని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఫీల్డ్ ఆఫీసర్ రాజేశ్వర్ అన్నారు.

మహారాష్ట్ర లో ఏం జరిగింది?
తాడోబా టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో జరిగిన ఐదు ఆదివాసీ గ్రామాల తరలింపు, పునరావాస కార్యక్రమాల పై పనిచేసిన చంద్రపూర్ జిల్లాకు చెందిన కొన్ని ఎన్జీవోలు, జర్నలిస్టులతో బీబీసీ మాట్లాడింది.
తాడోబా పరిధిలో మొత్తం 5 జనావాసాలను ఖాళీ చేశారు.
చివరగా ఖాళీ చేస్తున్న ‘రాంతలోది’ గ్రామం పునరావాసం కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇక్కడ ఆదివాసీలు ఖాళీ చేస్తుండగా లభిస్తున్న అటవీ భూమి కంటే వారిని రీసెటిల్మెంట్ చేసేందుకు ఎక్కువ భూమి ఇవ్వాల్సి రావడంతో మహారాష్ట్ర అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈకో-ప్రో ఆర్గనైజేషన్ అనే ఎన్జీవోను బండు ధోత్రే జంతు పరిరక్షణ ఉద్యమకారుడు నడుపుతున్నారు. అడవులు, వన్యప్రాణులు, పర్యావరణం అంశాలపై ఈ సంస్థ పనిచేస్తోంది.
‘’తాడోబాలో 2007లో మొదటిసారి మూడు గ్రామాలను రీలొకేట్ చేసే ప్రయత్నం జరిగింది. అందులో బోటేఝరి అనే గ్రామం పూర్తిగా ఖాళీ చేయగా, పలస్ గావ్ మాత్రం ఈ రిలొకేషన్‌ను వ్యతిరేకించింది.
కోడ్సా గ్రామం వారు సగం మంది మాత్రమే వెళ్లారు. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద 10 లక్షల రూపాయల నగదు, రెండో రకం ప్యాకేజీ కింద ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు ఇచ్చారు.
‘‘రిలొకేషన్ ప్యాకేజీల వల్ల గతంలో భూములు లేని వారు భూమి యజమానులు అయ్యారు. విద్య, వైద్యం, ఉపాధి వారికి అందుబాటులోకి వచ్చాయి. అడవుల్లో ఉన్నప్పుడు కనీస సౌకర్యాలకు వారు ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామాల్లో 7వ తరగతి కంటే ఎక్కువ చదివిన వారు కనిపించలేదు.

ఫొటో సోర్స్, SANTOSH KUMAR
గ్రామాల తరలింపు తర్వాత అప్పుడు మేము అటవీశాఖ కు ఆదివాసీలకు మధ్య ఘర్షణ వాతావరణ నెలకొన్నప్పుడు మేం వారి మధ్య సమన్వయం కోసం పనిచేశాం’’ అని బండు ధోత్రే అన్నారు.
గ్రీన్ ప్లానెట్ సొసైటీ సంస్థకు చెందిన సురేష్ చోపానే మాట్లాడుతూ ...‘’చాలా కాలం పట్టింది. కోడ్సా గ్రామంలో పోలీస్ కేసులు కూడా అయ్యాయి. ఆందోళనలు జరిగాయి. మూల్ తాలుకాలో ఏర్పాటుచేసిన భగవాన్ పూర్ రిలోకేషన్ కాలనీలో భాగంగా సారం లేని భూములు, నాసిరక నిర్మాణ ఇళ్లు ఇచ్చారని సగం మంది తిరిగి వెళ్లిపోయారు. రాంతలోది గ్రామం సమస్యలు ఇప్పుడే పరిష్కారం అయి రీలొకేషన్ చివరి అంకంలో ఉంది’’.
‘’ఆదివాసీల ఆచార వ్యవహారాల్లోనూ మార్పులు వస్తున్నాయి. గోండ్ జాతి బయటి ప్రాంతంతో పూర్వం నుంచి సంపర్కంలోనే ఉంది. రీలొకేషన్ జరిగినా జరగకపోయినా మార్పు అనివార్యం, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఆదివాసీలు కూడా మార్పును కోరుకుంటున్నారు. అడవి వ్యవసాయంలో పంటలను వన్యప్రాణులు,పక్షులే సగం తినేసేవి. అడవి నుంచి బయటకు వచ్చి వన్యప్రాణులకు వారు ఉపకారమే చేశారు కదా, అలాంటి వారు బయటకొచ్చాక గాలికి వదిలేయడం సరికాదు. పునరావాస ప్యాకేజీల్లో అవినీతి ఉంటుంది. దీంతో నాసిరకం పనులు జరుగుతాయి. ఎన్జీవోలు, ప్రభుత్వ శాఖల మధ్య సరైన సమన్వయం కుదిరితే సాఫీగా తరలింపు ప్రక్రియలు జరుగుతాయి. అటు వన్యప్రాణులు, ఇటు ఆదివాసీలు ఇద్దరికి లాభం జరుగుతుంది’’ అని అన్నారు.

ఆదివాసీల అభివృద్దికి కట్టుబడి ఉన్నాం -అటవీశాఖ
’వారిని అడవికి దూరం చేయలేదు. కోర్ ఏరియా నుండి అడవి అంచుల వద్దకు తీసుకొచ్చి పునరావాసం కల్పించాం. కాలనీకి చుట్టుపక్కల ఆదివాసీ జనాభా ఉంది. గతంలో వారు నివసించిన పరిస్థితులే ఇక్కడ కూడా ఉంటాయి. విద్య, వైద్యం, ఉపాధి వారికి అందుబాటులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో రెండేళ్ల వరకు కావాల్సిన సహాయం అందిస్తాం. వారి భవిష్యత్తు బాగుంటుంది. వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి’’ అని నిర్మల్ జిల్లా అటవీశాఖ అధికారి రాంకిషన్ అన్నారు.
ఈ పైలెట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా కవ్వాల్ కోర్ ఫారెస్ట్ నుంచి మరో 12 గ్రామాలను త్వరలో తరలించేందుకు సిద్ధం అవుతున్నామని రాంకిషన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- బ్రాయిలర్ చికెన్ సంతాన సమస్యలకు దారితీస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- ఎర్త్ రైజ్: 1968 నాటి ఈ ఫోటో ప్రపంచాన్నే మార్చేసింది..
- హెపటైటిస్: మొత్తం కేసులలో 11 శాతం భారత్‌లోనే.. అసలేమిటీ వ్యాధి, ఎందుకొస్తుంది, చికిత్స లేదా?
- కంటి చికిత్సకు వెళ్లాలనుకున్న వీరప్పన్‌ను సినీ ఫక్కీలో పోలీసులు ఎలా బోల్తా కొట్టించారు? ఆఖరి క్షణాల్లో జరిగిన డ్రామా ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














