కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్‌కు భారత్ ఎంతవరకు సాయం చేయగలదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బంగ్లాదేశ్‌కు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనా నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేసిన వెంటనే భారత్ బయలుదేరడం...రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం.
17కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ను షేక్ హసీనా సుదీర్ఘకాలం పరిపాలించారు.
సివిల్ సర్వీసు ఉద్యోగాల్లో కోటాను ఎత్తివేయాలంటూ మొదలైన ఆందోళనలు విసృత రూపం దాల్చి.. ప్రభుత్వ వ్యతిరేక హింసాత్మక ఉద్యమంగా మారేంతవరకు హసీనా పాలన సాగింది.
పోలీసులకు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 280 మందికి పైగా మరణించారు.


ఫొటో సోర్స్, Getty Images
జూన్‌లో రెండు సార్లు భారత్‌కు హసీనా
హసీనా పదవీచ్యుతురాలు కావడానికి ముందు ఈ ఏడాది జూన్‌లో రెండు సార్లు భారత్‌లో పర్యటించారు. అది కూడా రెండు వారాల వ్యవధిలోనే ఆమె దిల్లీకి రెండు సార్లు వచ్చారు.
తొలి పర్యటనలో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హసీనా హాజరయ్యారు.
తర్వాత ఆమె రెండోసారి భారత్‌కు వచ్చినప్పుడు రెండు రోజుల పాటు పర్యటించారు.
మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అయిన తరువాత భారత్‌లో పర్యటించిన తొలి విదేశీ పాలకులు హసీనాయే.
‘‘గత ఏడాది కాలంలో మేం 10 సార్లు సమావేశమయ్యాం. ఈ సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత తొలి అతిథి షేక్ హసీనా కావడం ఇందుకు కారణం’’ అని ప్రధాని మోదీ అప్పటి సంయుక్త మీడియా సమావేశంలో అన్నారు.
రెండు దేశాల మధ్య సంతోషకరమైన స్నేహబంధం ఉంది. ‘‘భారత్‌తో సంబంధాలకు బంగ్లాదేశ్ ఎంతో విలువ ఇస్తుంది. మేం ఏం చేశామో, ఏం చేయబోతున్నామో చూడడానికి బంగ్లాదేశ్ రండి’’ అని షేక్ హసీనా ఆ సంయుక్త సమావేశంలో అన్నారు.
బంగ్లాదేశ్‌తో భారత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. రెండు పొరుగు దేశాలు 4,096కిలోమీటర్ల మేర సరిహద్దును కలిగి ఉన్నాయి.
భాష, సాంస్కృతిక, ఆర్థిక అంశాల్లో గట్టి సంబంధాలున్నాయి. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.
పాకిస్తాన్ నుంచి విడిపోకముందు బంగ్లాదేశ్ ప్రాంతాన్ని తూర్పు పాకిస్తాన్‌గా పిలిచేవాళ్లు. ఆ యుద్ధంలో భారత్ బెంగాలీలకు మద్దతుగా నిలిచింది. రెండు దేశాల మధ్య దాదాపు 1600 కోట్ల డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది.
ఆసియాలో బంగ్లాదేశ్ ఎగుమతులకు ప్రధాన గమ్య స్థానం భారత దేశమే.

ఫొటో సోర్స్, Getty Images
విభేదాలూ ఉన్నాయి
అయితే రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో అంతా బాగుందని చెప్పడానికి లేదు.
బంగ్లాదేశ్‌కు చైనాతో ఉన్న దగ్గరి సంబంధాలపై గతంలో రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి.
సరిహద్దు భద్రత, వలసదారుల సమస్యలు వంటివాటితో పాటు మోదీ హిందూ జాతీయవాద రాజకీయాలపై కొందరు బంగ్లాదేశ్ నాయకులు, అధికారుల్లో అసంతృప్తి ఉంది.
షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పిన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌కు భారత్‌తో సంబంధాలు లేవు.
తాజా పరిణామలకు ముందు.. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లను ఆ దేశ అంతర్గత సమస్యలుగా భారత్ అభివర్ణించింది.
షేక్ హసీనా రాజీనామా చేయడం, బంగ్లాదేశ్‌ను వీడడం భారత్‌కు అంత మంచి పరిణామం కాదని.. ఆమెకు, ఆమె పార్టీకి అక్కడ ప్రత్యామ్నాయం రావడం తమకు ఏమాత్రం అనుకూలం కాదన్నట్లుగా భారత్ చాలాకాలంగా చూస్తోందని అమెరికన్ థింక్-టాంక్ విల్సన్ సెంటర్‌కు చెందిన మైఖేల్ కుగల్‌మాన్ విశ్లేషించారు.
తమ ఆందోళనలు గురించి భారత్ బంగ్లాదేశ్ ఆర్మీకి తెలియజేయొచ్చని, మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో భారత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న ఆకాంక్ష కనబరచొచ్చని మిస్టర్ కుగల్‌మ్యాన్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
బీఎన్‌పీపై భారత్ అభిప్రాయం ఏంటంటే...
‘బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తుంది.
దేశంలో స్థిరమైన పరిస్థితులు ఏర్పడేందుకు వీలుగా స్వేఛ్చగా, పారదర్శకంగా ఎన్నికలు జరపడానికి సహకరిస్తుంది.
కానీ బీఎన్‌పీ అధికారంలోకి రావాలని భారత్ కోరుకోకపోవచ్చు. బీఎన్‌పీ బలహీనపడినప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి రావాలని భారత్ కోరుకోదు. సుదీర్ఘకాలం మధ్యంతర ప్రభుత్వం కొనసాగడాన్ని కూడా దిల్లీ వ్యతిరేకించకపోవచ్చ’ అని ఆయన చెప్పారు.
షేక్ హసీనా రాజకీయ జీవితం అకస్మాత్తుగా తలకిందులు కావడం ఆమె అనుయాయులను ఆత్మరక్షణలో పడేసింది.
బంగ్లాదేశ్ పితామహుడి కూతురైన షేక్ హసీనా, ఓ దేశానికి ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన మహిళా నాయకురాలు. 20 ఏళ్లకు పైగా ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా బంగ్లాదేశ్‌ను ఆమె నిలిపారు. దక్షిణాసియాలో జీవన ప్రమాణాల పెంపులో కీలకంగా వ్యవహరించారు.
అయితే ఆమె పాలనపై అనేక విమర్శలున్నాయి.
ప్రభుత్వాన్ని వ్యతిరేకించినవారిలో చాలామంది అదృశ్యమవడం, ‘రహస్య హత్యలు’, ప్రతిపక్షంపై అణచివేత వంటి ఆరోపణలున్నాయి.
షేక్ హసీనా, ఆమె పార్టీ ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు.
దేశంలో ఆందోళనలను పెంచి పోషిస్తున్నారని విమర్శలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై హసీనా ప్రభుత్వం ఎదురుదాడి చేసింది.

ఫొటో సోర్స్, AFP
వివాదాస్పదంగా నాలుగోసారి ఎన్నిక
జనవరిలో జరిగిన వివాదాస్పద ఎన్నికలో వరుసగా నాలుగోసారి హసీనా గెలుపొందారు. ప్రతిపక్ష బీఎన్‌పీ ఓటింగ్‌ను బహిష్కరించింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించింది. బీఎన్పీ నేతలు, మద్దతుదారుల అరెస్టులు భారీస్థాయిలో జరిగాయి.
బంగ్లాదేశ్ ఆందోళనల్లో భారత్ వ్యతిరేక అభిప్రాయం కనిపించడంతో హసీనా ప్రభుత్వానికి భారత్ మద్దతిచ్చిందని, ఆ దేశ అంతర్గత రాజకీయాల్లో ఇది జోక్యం చేసుకోవడమేనని విమర్శకులు విశ్లేషించారు.
ఆరోపణలు అతిగా వ్యాపించడం, చారిత్రక విషాదాలు కూడా కొంత వ్యతిరేక భావన కలగజేస్తాయి.
‘14 ఏళ్లగా హసీనా ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా ఉండి.. ఆ దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించడంలో కొంత పాత్ర పోషించిన భారత్ ఇప్పుడిలా మౌనంగా ఉండడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడంలేదు’ అని ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్శిటీలో బంగ్లాదేశ్-అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అలీ రియాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడేం చేయాలి..?
బంగ్లాదేశ్ ప్రతిపక్షాన్ని, దాని మిత్రపక్షాలను ప్రమాదకర ఇస్లాంశక్తులుగా భారత్ భావిస్తోంది.
బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే భారత వ్యతిరేక తీవ్రవాద గ్రూపులను హసీనా సమర్థంగా అణచివేశారు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఉన్న ఐదు రాష్ట్రాలకు వాణిజ్యపరంగా భద్రమైన పరిస్థితులు కల్పించేందుకు రవాణా అనుమతులు మంజూరుచేశారు.
‘‘భారత్ ఉద్దేశం ప్రకారం శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన బంగ్లాదేశ్ ఉండాలి. అలాంటి పరిస్థితులు ముఖ్యంగా శాంతి, సుస్థిరత ఉండడానికి భారత్ ఏమైనా చేయాల్సిందే’’ అని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, బంగ్లాదేశ్ హై కమిషనర్ హర్షవర్ధన్ ష్రింగ్లా..హసీనా రాజీనామా చేయడానికి కొన్ని గంటలముందు బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం హసీనాకు ఆశ్రయం కల్పించడానికి మించి భారత్ ఏం చేసినా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్నట్లు అవుతుంది.














