ముహమ్మద్ యూనస్: షేక్ హసీనా బద్ధశత్రువు చేతికి బంగ్లాదేశ్.. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్న ఈయన ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జీ & జియాన్లూకా అవాగ్నినా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాకు దీర్ఘకాల రాజకీయ శత్రువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ ఆ దేశ తాత్కాలిక నేతగా ఎంపికయ్యారు.
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత 84 ఏళ్ల యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు.
సూక్ష్మరుణాల విషయంలో ఆయన ఎన్నో ప్రశంసలు పొందినా, హసీనా ఆయన విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. స్థానిక కోర్టు ఇటీవల ఆయనకు జైలు శిక్ష విధించగా.. ఆయన దీనిని రాజకీయ ప్రేరేపిత కేసుగా అభివర్ణించారు.
నిరసనలకు నాయకత్వం వహించిన విద్యార్థులు సైనిక ప్రభుత్వాన్ని అంగీకరించబోమని.. ప్రొఫెసర్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరారు.
అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్, సైనిక నేతలు, విద్యార్థి నేతల మధ్య జరిగిన సమావేశం అనంతరం ప్రొఫెసర్ యూనస్‌ను ప్రధాన సలహాదారుగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
"ఇంతటి త్యాగం చేసిన విద్యార్థులు ఈ క్లిష్ట సమయంలో నన్ను ఈ బాధ్యతను స్వీకరించమని అభ్యర్థిస్తున్నప్పుడు, నేను ఎలా తిరస్కరించగలను?" అని ప్రొఫెసర్ యూనస్ అన్నారు.
పారిస్‌లో చికిత్స చేయించుకుంటున్న ఆయన ఇప్పుడు ఢాకాకు తిరిగి వస్తున్నారని యూనస్ ప్రతినిధి తెలిపారు.

పేదల బ్యాంకరా? రక్తం పీల్చే వ్యక్తా?
1983లో ప్రొఫెసర్ యూనస్ గ్రామీణ్ బ్యాంకును ప్రారంభించారు. ఇది పేద ప్రజలు తమ సొంత, చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి సూక్ష్మ, దీర్ఘకాలిక రుణాలను అందజేస్తుంది. అప్పటి నుంచి ఈ మైక్రోఫైనాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
2006లో ప్రొఫెసర్ యూనస్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఆయనను అంతర్జాతీయంగా "పేదల బ్యాంకర్" అని పిలుస్తారు. అయితే హసీనా ఆయనను పేదల "రక్తం పీల్చే" వ్యక్తిగా అభివర్ణించి, ఆయన బ్యాంక్ అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తోందని ఆరోపించారు.
జనవరిలో, కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకు, దేశంలోని కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు, ప్రొఫెసర్ యూనస్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఆయన మద్దతుదారులు ఈ కేసును రాజకీయ కుట్రగా పేర్కొన్నారు.
ఆయనపై పన్ను ఎగవేత కేసులు.. పదవీ విరమణ వయస్సు దాటినా గ్రామీణ్ బ్యాంకుకు సేవలందించడంతో సహా ఇతర కేసులూ ఉన్నాయి. కానీ ప్రొఫెసర్ యూనస్, ఆయన న్యాయవాది ఇవి నిరాధారమైనవని కొట్టి పారేశారు.
జులై ప్రారంభంలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో బంగ్లాదేశ్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అది క్రమక్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది.
ప్రభుత్వ బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించినట్లు భావిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. వందలాది పోలీస్ స్టేషన్లు అగ్నికి ఆహుతయ్యాయి.
నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసంపై దాడి చేసి లూటీ చేయడంతో, దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో తల దాచుకుంటున్నారు. ఈ సంఘటనలతో సుమారు 15 ఏళ్ల ఆమె పాలన అంతమైంది.

ఫొటో సోర్స్, Reuters
జైళ్లలోని నేతల విడుదల
ప్రస్తుతం మాజీ ప్రధాని ఖలీదా జియా, యాక్టివిస్ట్ అహ్మద్ బిన్ క్వాసెమ్ సహా ఆమె పాలనలో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు.
ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అధ్యక్షత వహించారు. ఈ పార్టీ 2014లో, 2024లో జరిగిన ఎన్నికలను బహిష్కరించింది. హసీనా ఆధ్వర్యంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు సాధ్యం కాదని ఆ పార్టీ పేర్కొంది.
78 ఏళ్ల ఖలీదా 1991 నుంచి 1996 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. అయితే అవినీతి ఆరోపణలతో ఆమెకు 2018లో జైలు శిక్ష విధించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం అని ఖలీదా అన్నారు.














