హైడ్రా: ఈ కొత్త వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశారు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు ఏమిటి?

హైదరాబాద్, హైడ్రా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చెరువు స్థలాల్లో ఆక్రమణలను తొలగించడం హైడ్రా బాధ్యత.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై పోలీసు కేసు నమోదైంది. తెలంగాణలో అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ ఎమ్మెల్యేపై పోలీసు కేసు పెట్టడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ‘హైడ్రా’ అధికారులపై దానం నాగేందర్ విమర్శలు చేశారు. నేరుగా పేరు చెప్పకపోయినా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.

‘‘కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనులు (ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం) చేస్తే ఇక్కడ నుంచి తప్పించి మరో మంచి ఉద్యోగం ఇస్తారని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసులు పెట్టారేమో..! ఇలాంటి ఆఫీసర్లను ఇంతమందిని (తలలో వెంట్రుకలు చూపిస్తూ) చూశాను. ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలో పర్యటిస్తుంటే నన్ను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఈ అధికారులపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా’’ అని దానం నాగేందర్ మీడియాతో చెప్పారు.

ఈ వివాదం కారణంగా తెలంగాణలో హైడ్రా వ్యవస్థ పనితీరు ఏమిటనే విషయంపై అందరికీ ఆసక్తి పెరిగింది. అధికార పార్టీకి అనుబంధ ఎమ్మెల్యే అయినా సరే, లెక్కచేయకుండా ‘హైడ్రా’ కేసులు పెట్టిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు

అసలేం జరిగింది?

జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్ - గురుబ్రహ్మనగర్ ప్రాంతంలో సుమారు 1500 గజాల స్థలంపై వివాదం మొదలైంది. ఆ స్థలం పార్కు‌కు చెందిన గ్రీన్ బెల్ట్ ఏరియాగా పేర్కొంటూ అందులోని షాపులు, కొన్నిషెడ్లను హైడ్రా సిబ్బంది, అధికారులు గత వారం తొలగించారు.

అయితే అది బస్తీకి చెందిన స్థలమని, అక్కడ గుడిసెలు తొలగించారని గురుబ్రహ్మనగర్‌కు చెందిన కొందరు ఆందోళనకు దిగారు. అయినా అధికారులు ఆ స్థలాన్ని చదును చేసి ప్రహరీ నిర్మించారు. దీన్ని కొందరు స్థానికులు ఈ నెల 10న కూల్చివేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడే ఉన్నారనేది ఆరోపణ.

దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇన్‌చార్జి పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఏ3గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పేర్కొన్నారు.

‘‘10వ తేదీన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోద్భలంతో ఆయన సమక్షంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు లే అవుట్ ఓపెన్ స్థలానికి నిర్మించిన ప్రహరీ తొలగించారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది’’ అని పాపాయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దానం నాగేందర్, హైదరాబాద్

ఫొటో సోర్స్, Telangana Assembly

ఫొటో క్యాప్షన్, దానం నాగేందర్

‘నా ప్రమేయం లేదు’

నందగిరి హిల్స్ - గురుబ్రహ్మనగర్ ఘటన విషయంలో తన ప్రమేయం లేదని తర్వాత మీడియా సమావేశంలో చెప్పారు దానం నాగేందర్.

దానం నాగేందర్ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు పాపయ్యను బీబీసీ సంప్రదించగా, తానేమీ మాట్లాడలేనని చెప్పారు పాపయ్య.

నాలాల ఆక్రమణ, పార్కుల్లో నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకునేందుకు ‘హైడ్రా’ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందే తప్ప పేదల బస్తీల్లోని గుడిసెలు కూలగొట్టేందుకు కాదని విమర్శించారు దానం నాగేందర్.

దీంతో అసలేమిటీ హైడ్రా, దీని విధివిధానాలు ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఈ వ్యవస్థను ఎందుకు తీసుకువచ్చారనే విషయాన్ని ఓసారి చూద్దాం.

రేవంత్ రెడ్డి, హైడ్రా చైర్మన్

ఫొటో సోర్స్, telangana.gov.in

ఫొటో క్యాప్షన్, హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు

ఏమిటీ ‘హైడ్రా’?

హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. 2024 జులైలో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది.

ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న హైదరాబాద్ పరిధిలో ఇది పనిచేస్తుంది.

సుమారు 2050 చ.కి.మీ. విస్తీర్ణంలో హైడ్రా విధులు నిర్వర్తిస్తుందని కమిషనర్ రంగనాథ్ వివరించారు.

‘‘హైదరాబాద్ నగరం అంటే... జీహెచ్ఎంసీ పరిధి సుమారు 650 చ.కి.మీ. జీహెచ్ఎంసీతోపాటు హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలు, గ్రామాలనూ హైడ్రా పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా ప్రధాన విధి’’ అని చెప్పారు రంగనాథ్.

‘‘మూడు దశల్లో చెరువులను పరిరక్షిస్తాం. మొదటి ఫేజ్‌లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలను కట్టడి చేస్తాం. రెండో దశలో ఇప్పటికే నిర్మించిన వాటిని కూల్చివేస్తాం. మూడో దశలో చెరువుల్లో పూడిక తీయించడం చేస్తాం. భవిష్యత్తులో ఆక్రమణలు రాకుండా చూస్తాం’’ అని రంగనాథ్ మీడియాకు వివరించారు.

రానురానూ హైదరాబాద్ పరిధి విస్తృతమవుతోంది. శివార్లలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు 19 మున్సిపాలిటీలు దాదాపు ఆరున్నరేళ్ల క్రితం ఏర్పాటయ్యాయి. జనావాసాలు పెరుగుతున్న కొద్దీ చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలూ పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్ పరిధిలో 40 ఏళ్ల కిందటితో పోల్చితే చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురైనట్లు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటా తెలియజేస్తోంది.

కొన్ని చెరువుల్లో పది శాతం నుంచి 90 శాతం వరకు ఆక్రమణలు ఉన్నట్లు తేలింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చింది. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్‌లోని విభాగాలకు చెందిన కొన్ని బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది.

ఇకపై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (విపత్తుల నిర్వహణ)ను కూడా హైడ్రానే పర్యవేక్షించనుంది.

ప్రకృతి విపత్తులు, ఇతర ఆపద సమయాల్లో భద్రతా చర్యల బాధ్యత హైడ్రా పరిధిలోకే వస్తుంది.

ఇందుకు వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

విజిలెన్స్ విభాగాన్ని మాత్రం ప్రభుత్వం జీహెచ్ఎంసీ వద్దనే ఉంచింది.

ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్

ఫొటో సోర్స్, telangana.gov.in

ఫొటో క్యాప్షన్, ఏవీ రంగనాథ్

హైడ్రా ఏం చేస్తుంది?

విపత్తుల నిర్వహణతోపాటు చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా చూడటం , ఆక్రమణలను తొలగించడం హైడ్రా విధుల్లో భాగం.

ఇందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతోపాటు వేర్వేరు ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాల్సి ఉంటుంది.

‘‘పోలీస్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, జలమండలి, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ నదీ పరివాహక అభివృద్ధి సంస్థ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, విపత్తు నిర్వహణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ హైడ్రా పనిచేయాలి. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ జారీ చేసే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల విషయంలో భవనాలను తనిఖీ చేయవచ్చు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ నియంత్రణకు పనిచేయవచ్చు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగే నిర్మాణాల విషయంలో ప్రైవేటు భవనాలను కూడా పరిశీలించే అధికారం హైడ్రాకు ఉంది’’ అని ప్రభుత్వం జులైలో జారీ చేసిన జీవో నం.99లో స్పష్టం చేసింది.

హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారు.

కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు.

మున్సిపల్, రెవెన్యూ శాఖల మంత్రులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ దీనిలో సభ్యులుగా ఉంటారు.

‘‘హైడ్రాకు దాదాపు 3500 మంది సిబ్బంది అవసరం. ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులతోపాటు వివిధ స్థాయి సిబ్బంది కావాల్సి ఉంది. 72 టీములు ఏర్పాటు చేసి చెరువులు, లే అవుట్లలోని సామాజిక అవసరాలకు కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తాం. హైడ్రాకు ప్రత్యేకంగా ఓ స్టేషన్ ఉండాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని చెప్పారు రంగనాథ్.

హైదరాబాద్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఆక్రమణల తొలగింపు

హైడ్రాలో మరో కమిటీ ఉంటుంది. ఇది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తుంది.

మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

హైడ్రా ఏర్పాటు తర్వాత వరుసగా హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలను సిబ్బంది తొలగిస్తున్నారు.

రాజేంద్రనగర్ శివరాంపల్లి చెరువులో భారీ భవనాలను నిర్మించారనే ఆరోపణలపై వాటిని కూలగొట్టారు.

ఇప్పుడు జూబ్లీహిల్స్ నందినగర్ సమీపంలో షెడ్లు, దుకాణాల తొలగింపు కారణంగా చెలరేగిన వివాదంలో దానం నాగేందర్‌పై కేసు నమోదైంది.

దానం నాగేందర్ వ్యాఖ్యల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ఆర్య, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత బీబీసీతో మాట్లాడారు.

‘‘హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయి. వర్షాలు వస్తే వరదనీరు పారే దారి లేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చారు. ఇదో స్వతంత్ర వ్యవస్థ. దీనిపై ఎవరి ఒత్తిళ్లూ లేకుండా, ప్రభుత్వం నిజాయతీగా వ్యవహరిస్తూ కబ్జాలను తొలగించాలని ప్రయత్నిస్తోంది'' అన్నారు.

కాంగ్రెస్ పార్టీ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కాల్వ సుజాత

''చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అనేది ముఖ్యం కాదు, ప్రజలకు నష్టం జరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. పార్టీలో ఉన్న వారైనా, లేనివాళ్లైనా, సామాన్యులైనా ప్రభుత్వ నిర్ణయం ఒకే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు.

తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారనే ఆరోపణలపై దానం నాగేందర్ స్పందన కోసం బీబీసీ ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు.

'పక్షపాతం లేదు'

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను బీబీసీ ఫోన్ లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

అంతకుముందు మీడియాతో రంగనాథ్ మాట్లాడారు.

‘‘చెరువులు, నాలాలు, పార్కు స్థలాలను కాపాడుకోవడం మా ప్రధాన లక్ష్యాలు. నందగిరిహిల్స్ ప్రాంతంలో అది పార్కు ప్రాంతమే. దాన్ని కాపాడాలనేది మా లక్ష్యం.పార్కు మధ్యలోంచి ఎక్కడా రహదారి ఉండదు. ఈ విషయంలో మేం ఎవరితోనూ పక్షపాతంతో వ్యవహరించడం లేదు. జేసీబీతో కూల్చివేసిన సమయంలో.. అక్కడ ఎమ్మెల్యేనో.. కార్పొరేటర్ ఉన్నంతమాత్రాన చట్టం మారదు.’’ అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)