జీఎస్టీ స్కామ్: రూ.1000 కోట్ల కుంభకోణంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై ఆరోపణలు ఏంటి?

ఫొటో సోర్స్, twitter/SomeshKumarIAS
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది.
ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ5గా పోలీసులు చేర్చారు.
ఇదే కేసులో ఏ1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.
ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేశారు.


ఫొటో సోర్స్, UGC
అసలేంటీ కేసు?
వ్యాపారుల నుంచి వాణిజ్య పన్నుల శాఖ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్‌లో భాగంగా సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, సెస్ వసూలు చేస్తూ ఉంటుంది.
బిగ్ లీఫ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మానవ వనరులను సరఫరా చేస్తుంటుంది. ఈ సంస్థ పన్ను చెల్లించకుండానే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుందనేది ఆరోపణ.
వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం...
2023 డిసెంబరులో ఆ కంపెనీ పన్నుల చెల్లింపుపై చేసిన ఆడిట్‌లో రూ. 22.51 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నట్టు తేలింది. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులూ చెల్లించకుండానే ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖాధికారులు తేల్చారు.
దీని మీద విచారణ ప్రారంభించిన వాణిజ్య పన్నుల విభాగం, మరి కొన్ని కంపెనీలు కూడా ఈ తరహాలోనే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొంది భారీ కుంభకోణానికి పాల్పడినట్టు గుర్తించారు.
కొందరు వ్యాపారులు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను వివిధ రకాలుగా క్లెయిమ్ చేసుకుని మోసానికి పాల్పడ్డారని వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి బీబీసీకి చెప్పారు.
‘‘వ్యాపారులు ఏదైనా వస్తువు కొన్నప్పుడు తమ పెట్టుబడిపై కొంత పన్ను కడతారు. ఆ వస్తువును ప్రాసెస్ చేసి.. మరొక రాష్ట్రానికి విక్రయించినప్పుడు మళ్లీ అమ్మకం పన్ను చెల్లిస్తారు. దీంతో కొనుగోలు పన్నును ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు వ్యాపారులు వస్తువుల కొనుగోలు, అమ్మకాలను కేవలం కాగితాలపైనే చూపించి ఇన్‌పుట్ క్రెడిట్‌ను పొందినట్టు తేలింది’’ అని రవి కానూరి చెప్పారు.
ఇలా మొత్తం 11 కేసులకు సంబంధించి రూ. 400 కోట్ల కుంభకోణం జరిగినట్టు గుర్తించినట్టు సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందులో తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. ఈ సంస్థ కూడా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ విషయంలో అవకతవకలకు పాల్పడిందని అధికారులు వెల్లడించారు.
మరింత లోతుగా విచారణ చేయగా.. దాదాపు రూ. 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘సాఫ్ట్‌వేర్‌లో మార్పులు’
బోగస్ క్లెయిమ్‌లకు పాల్పడకుండా ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాణిజ్యపన్నుల శాఖ సమకూర్చుకుంది.
తెలంగాణలో వ్యాపారుల ట్యాక్స్ రిటర్న్స్‌లో ఏమైనా తేడాలుంటే ఈ సాఫ్ట్‌వేర్ పసిగడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించే ఐఐటీ హైదరాబాద్ వెంటనే ఆ సమాచారాన్ని వాణిజ్యపన్నుల శాఖకు అందిస్తుంది.
అయితే, బిగ్ లీఫ్ టెక్నాలజీస్ కంపెనీకి సంబంధించి ఆడిట్‌లో ఇన్‌పుట్ ట్యాక్స్ అదనంగా తీసుకున్నట్టు తేలినా.. ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లోని ‘స్క్రూటినీ మ్యాడ్యూల్’ రికార్డు చేయలేదు.
ఈ విషయంపై రవి కానూరి బీబీసీతో మాట్లాడారు.
‘‘వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారి 2023 డిసెంబర్ 26న ఐఐటీలో విచారణ చేశారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పరంగా చేస్తున్న మోసాలు బయటకు రానివ్వకుండా చేసినట్లు ఆ విచారణలో తేలింది’’ అని చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌లో మార్పులకు అప్పటి వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా ఉన్న సోమేశ్ కుమార్‌తోపాటు అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్ నుంచి వచ్చిన సూచనలే కారణమని, ఆ మేరకు స్క్రూటినీ రిపోర్ట్స్‌లో ఐజీఎస్టీలో అవకతవకలు రికార్డు కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తేలింది’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రవి కానూరి.

ఫొటో సోర్స్, UGC
సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే చేశాం
ఈ వ్యవహారంపై 2024 జనవరి 8న కాశీ విశ్వేశ్వరరావు, శివరామ్ ప్రసాద్‌కు వాణిజ్య పన్నుల శాఖ మెమో జారీ చేసింది.
‘‘ఈ మెమోకు వారిద్దరూ సమాధానం ఇచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించామని... ఐజీఎస్టీ, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, సెస్ లోటుపాట్లు కప్పిపుచ్చేలా ఒక ఫార్మాట్ ఇచ్చామని వాళ్లు తెలిపారు’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు రవి కానూరి.
ఈ వ్యవహారంపై ఆడిట్ విభాగంతోపాటు సీడ్యాక్ (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్)తో పూర్తిస్థాయి ఆడిట్ చేయించింది వాణిజ్య పన్నుల శాఖ.
జనవరి 30న ఆడిట్ వివరాల మీద చర్చించేందుకు సీడ్యాక్, ఐఐటీ హైదరాబాద్, వాణిజ్య పన్నుల శాఖాధికారులు సమావేశమయ్యారు.
‘‘సోమేశ్ కుమార్, కాశీ విశ్వేశ్వరరావు, శివరామ్ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్‌గా ఉన్న శోభన్‌బాబుతో స్పెషల్ ఇనీషియేటివ్స్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. గ్రూపులో వచ్చే ఆదేశాలను శోభన్ బాబు పాటించేవారు’’ అని మా విచారణలో తేలిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాశారు రవి కానూరి.
ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన నోటీసుకు కాశీ విశ్వేశ్వరరావు సమాధానం ఇచ్చారు.
‘‘స్పెషల్ చీఫ్ సెక్రటరీ పర్యవేక్షణలో వాట్సాప్ గ్రూప్ పనిచేసిందని, 2022 డిసెంబర్ నుంచి గ్రూప్ యాక్టివ్‌గా లేదు’’ అని సమాధానం ఇచ్చారు.
ఫొటోలు, ఇతర వివరాల్లేకుండా వాట్సాప్ చాట్ హిస్టరీని ఇచ్చారు. దీంతో అన్ని వివరాలు ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ మరో మెమో ఇచ్చింది.
వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చేసిన విచారణలో మాత్రం 2024 ఫిబ్రవరిలోనూ వాట్సాప్ గ్రూపులో చాట్ నడిచినట్లు చెప్పారు.
‘‘వాట్సాప్ చాట్ హిస్టరీని పరిశీలించినప్పుడు ఐజీఎస్టీ నష్టం గురించి రిపోర్టులు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. అక్రమ కేసులు గుర్తించినా రిజిస్ట్రేషన్లు రద్దు చేయవద్దని ఆదేశాలు ఉన్నట్లు తేలింది’’ అని ఫిర్యాదులో చెప్పారు రవి కానూరి.
దీని ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు, శివరామ్ ప్రసాద్‌ల మొబైల్ ఫోన్లను జీఎస్టీ అదనపు కమిషనర్ ఎన్.సాయి కిశోర్ సీజ్ చేశారు. దీనిపై వారిద్దరూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్ తిరస్కరణకు గురైంది.
‘‘కావాలనే దాచారు’’
సీడ్యాక్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. 75 మంది పన్ను చెల్లింపుదారుల వివరాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చారు. కొందరు అధికారుల, ఉద్యోగుల ఐడీలను కూడా కనిపించకుండా చేశారు.
ఐఐటీ హైదరాబాద్, వాణిజ్య పన్నుల శాఖ డాటాబేస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం నుంచి థర్డ్ పార్టీ నిర్వహించినట్లు తేలింది.
దీనికి ఐపీ 103.168.83.131 గా ఉంది.
పాస్‌వర్డ్ ప్లియాంటో గా ఉన్నట్లు తేలింది.
ఐఐటీ హైదరాబాద్ తయారు చేసిన అప్లికేషన్ సర్వర్‌లోని వివరాలు స్పెషల్ ఇనీషియేటివ్స్ వాట్సాప్ గ్రూప్‌లోకి వెళ్లాయని తేలింది.
వాణిజ్య పన్నుల శాఖలో చాలా అక్రమాలు జరిగినట్లుగా అల్గారిథమ్ గుర్తించిన విషయం ప్రొఫెసర్ శోభన్ బాబుకు తెలుసు.
ఆ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ఎన్నిసార్లు అడిగినా చేయలేదు.
‘‘ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఫిబ్రవరి 8న మెయిల్లో స్పందిస్తూ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలనే వాణిజ్య పన్నుల శాఖాధికారులు అనుసరిస్తున్నట్లు చెప్పారు’’ అని రవి కానూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CID TELANGANA/X
సీఐడీకి కేసు బదిలీ
ఈ కేసులోని తీవ్రత కారణంగా దీని విచారణ బాధ్యతను జులై 29న సీఐడీ (క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్)కి బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఐడీ చీఫ్ శిఖా గోయల్ సారథ్యంలో కేసు దర్యాప్తు సాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
వారం రోజుల క్రితమే ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందని, ఇప్పుడే దీనిపై ఏమీ మాట్లాడలేమని బీబీసీతో శిఖా గోయల్ చెప్పారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమేశ్ కుమార్ స్పందన కోసం రెండు రోజుల పాటు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఆయన ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు.
సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఐఐటీ హైదరాబాద్ పాత్రకు సంబంధించి దాని డైరెక్టర్ బీఎస్ మూర్తిని బీబీసీ ఫోన్‌లో సంప్రదించింది. కానీ ఆయన కూడా అందుబాటులోకి రాలేదు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ లీఫ్ టెక్నాలజీస్, తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయాలను బీబీసీ ఫోన్‌లో సంప్రదించింది.
ఆ కార్యాలయాల నుంచి ఇంకా ఎవరూ అందుబాటులోకి రాలేదు.
ప్రభుత్వాలు మారాక కేసులు
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆయన్ను ఏపీకి కేటాయించగా.. తెలంగాణలోనే ఉన్నారు. దీనిపై క్యాట్ సహా వివిధ న్యాయస్థానాల్లో కేసులు నడిచాయి. చివరకు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆయన తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లారు.
ప్రస్తుతం జీఎస్టీ అవకతవకల వ్యవహారంలో ఆయనపై కేసు నమోదైంది.
ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు మారిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు చుట్టుముడుతున్నాయి.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఐపీఎస్ అధికారి ప్రభాకరరావుపై ఇప్పటికే కేసు నమోదైంది.
ఏపీలోనూ టీడీపీ అధికారం చేపట్టాక ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. 2021లో తనను అరెస్టు చేసినప్పుడు, ‘‘హింసించి, హత్యాయత్నం చేశారు’’ అంటూ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. చివరకు కోర్టు ఆదేశాలతో ఆయన్ను పదవీ విరమణ చేసే రోజు విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














