తెలంగాణ బడ్జెట్ 2024: ఏ రంగానికి ఎంత కేటాయించారు, వేటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు?

- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇందులో మొత్తం 2 లక్షల 91 వేల కోట్ల రూపాయల పద్దు ప్రతిపాదనలు చేసింది.
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న రూ.75,577 కోట్ల అప్పు, గతేడాది డిసెంబర్ నాటికి రూ.6,71,757 కోట్లకు చేరింది. గత పాలకులు ప్రభుత్వాన్ని సొంత జాగీరులా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడిపారు’’ అన్నారు భట్టి.
తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఉద్యోగ నియామకాలు, జీతాలు మొదటి తారీఖున ఇవ్వడం, ప్రజావాణి, రుణ మాఫీ, రైతు భరోసా, రైతు కూలీ సాయం, ధరణి లోపాలు, ఇందిరమ్మ ఇళ్ళు తదితర విషయాల గురించి కూడా వివరంగా చెప్పారు.


ఫొటో సోర్స్, I&PR/Telangana
జాతీయ సగటు కంటే తక్కువ వృద్ధి రేటు
2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుత ధరల ఆధారంగా రూ.14,63,963 కోట్లు. గతేడాదితో పోలిస్తే 11.9 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, జాతీయ స్థాయిలో ఇది 9.1 శాతంగా ఉంది.
ఆర్థిక రంగం వృద్ధిలో దేశ సగటు 7.6 శాతం కాగా, తెలంగాణ 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తరచూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ ముందున్న విషయాన్ని చెబుతూ వస్తే, అదే అంశంలో తెలంగాణ జిల్లాల మధ్య తలసరి ఆదాయ తేడాలు ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని కాంగ్రెస్ ఎత్తి చూపింది. జాతీయ తలసరి ఆదాయం రూ.1,83,236. కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, జిల్లాల మధ్య తీవ్ర అంతరం ఉందని బడ్జెట్‌లో భట్టి చెప్పారు.
‘‘రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 కాగా, వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241 మాత్రమే. ఈ ఆదాయ అంతరాలు తగ్గించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని భట్టి అన్నారు.

ఫొటో సోర్స్, Naveen/BBC
‘ట్రాఫిక్ తగ్గిస్తాం, మెట్రో విస్తరిస్తాం’
మంత్రి భట్టి విక్రమార్క చెప్పిన విషయాలు..
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వైద్య, పోలీసు విభాగాలు కలిపి 31,768 ఉద్యోగాలు ఇచ్చాం.
- జీతాలు, పెన్షన్లు సమయానికి ఇస్తున్నాం.
- ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం.
- రూ.లక్ష లోపు రుణ మాఫీ చేశాం, రూ.2 లక్షల లోపు రుణాలు త్వరలో మాఫీ చేస్తాం
- రైతు భరోసా అర్హులకు మాత్రమే ఇస్తాం, రైతు కూలీలకు కూడా సాయం అందిస్తాం
- ధరణి సమస్యలు పరిష్కరిస్తాం
- ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 68 కోట్ల 60 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ ఉచిత టికెట్ల విలువ సుమారు రూ.2351 కోట్లు.
- పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరలోనే ఇస్తాం, పూర్తికాని వాటిని పూర్తి చేస్తాం.
- ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.6 లక్షలు ఇస్తాం.
- నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లు ఇస్తాం.
- ధాన్యం సేకరణ బకాయిలు చెల్లిస్తాం.
- మిషన్ భగీరథ అంతా భ్రమే. లక్షల మందికి ఇప్పటికీ కుళాయి లేదు. మేం ఇస్తాం.
- స్వయం సహాయక సభ్యులు మరణిస్తే జీవిత బీమా రూ.10 లక్షలు అందిస్తాం.
- స్కూలు యూనిఫాంలు కుట్టే పని స్వయం సహాయక మహిళలకు ఇస్తాం.
- శిల్పారామం దగ్గర డ్వాక్రా బజార్ ఏర్పాటు చేస్తాం.
- హైదరాబాద్‌లో కాలుష్యం, ట్రాఫిక్ తగ్గించే ప్రయత్నం, నగరం చుట్టుపక్కల టౌన్‌షిప్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెంపు, కొత్తగా ఐదు కారిడార్లలో మెట్రోతో పాటు ప్రస్తుత మెట్రోను పొడిగిస్తాం.
- హైదరాబాద్‌లో విపత్తు నివారణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా అనే కొత్త సంస్థ ఏర్పాటు.
- 110 కి.మీ. మేర మూసీ పునరుజ్జీవనం కోసం సర్వే చేస్తాం.
- లండన్ థేమ్స్ తరహాలో మూసీ అభివృద్ధి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ వేర్వేరుగా కాకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు.
- 8 కులాలకు కొత్త కార్పొరేషన్లు ఇచ్చాం.
- ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచుతాం, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇస్తాం.
- ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం.
- స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం.
- హైదరాబాద్‌లో ఏఐకి సంబంధించిన భారీ సమావేశం నిర్వహించబోతున్నాం
- మారుమూల ప్రాంతాలకు ఫైబర్ గ్రిడ్ విస్తరిస్తాం.
- కాళేశ్వరంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల అనుగుణంగా చర్యలు. వివిధ చిన్న ప్రాజెక్టులు నిర్మిస్తాం.
- విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు
- సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక శ్రద్ధ

ఫొటో సోర్స్, GETTY IMAGES
వ్యవసాయ రంగానికి పెద్దపీట
- రుణ మాఫీ – రూ.31 వేల కోట్లు
- వ్యవసాయ రంగం – రూ.72,659 కోట్లు (బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపు)
- ఉద్యాన పంటలు – రూ.737 కోట్లు
- పశు సంవర్ధకం – రూ.1,980 కోట్లు
- రూ.500 గ్యాస్ సిలెండర్ – రూ.723 కోట్లు
- గృహ జ్యోతి – రూ.2,418 కోట్లు
- ప్రజా పంపిణీ – రూ.3,836 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.29,816 కోట్లు
- హైదరాబాద్ నగర అభివృద్ధి – రూ.10,000 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్ – రూ.1,525 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమం – రూ.2,736 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ.33,124 కోట్లు
- ఎస్టీ సంక్షేమం – రూ.17,056 కోట్లు
- మైనార్టీ సంక్షేమం – రూ.3,003 కోట్లు
- బీసీ సంక్షేమం – రూ.9,200 కోట్లు
- వైద్య ఆరోగ్యం – రూ.11,468 కోట్లు
- విద్యుత్ – రూ.16,410 కోట్లు
- అడవులు, పర్యావరణం – రూ.1,064 కోట్లు
- పరిశ్రమలు – రూ.2,762 కోట్లు
- ఐటీ – రూ.774 కోట్లు
- నీటి పారుదల – రూ.22,301 కోట్లు
- విద్య – రూ.21,292 కోట్లు
- హోం – రూ.9,564 కోట్లు
- రోడ్లు, భవనాలు – రూ.5,790 కోట్లు
- మొత్తం వ్యయం – రూ.2,91,159 కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ.2,20,945 కోట్లు
- మూలధన వ్యయం – రూ.33,487 కోట్లు
భరోసా కల్పించలేని బడ్జెట్: కేసీఆర్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ పూర్తయిన తరువాత మీడియా పాయింట్‌కి వచ్చి బడ్జెట్‌పై స్పందించారు.
కేసీఆర్ సభకు రావడంతో అంతటా ఆసక్తికర వాతావరణం నెలకొంది.
‘‘ఈ బడ్జెట్ ఎవరికీ కూడా భరోసా కల్పించేలా లేదు. డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు. కొత్త సంక్షేమ పథకాలు కూడా ఏమీ లేవు. కొత్త ప్రభుత్వం తర్వాత ఆరు మాసాల సమయం ఇవ్వాలని అనుకున్నాం. ఇది రైతు శత్రు ప్రభుత్వం. ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీరు సరఫరా చేయడం లేదు. ఇండస్ట్రియల్ పాలసీ లేదు. కథలు చెప్పారు తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదు. దీనికి వ్యతిరేకంగా మేం పోరాడతాం’’ అని కేసీఆర్ అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















