వందేళ్ల లెనిన్ సమాధి గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఆండ్రేయి కొజెంకో
- హోదా, బీబీసీ ప్రతినిది
2024 ఆగస్టు 1న మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌లో ఉన్న లెనిన్ సమాధి 100వ వార్షికోత్సవాన్ని జరుపుకొంది. వందేళ్లుగా లెనిన్ సమాధి వద్ద అనేక ఉత్సవాలు, సైనిక కవాతులను నిర్వహిస్తున్నారు.
రసాయనాలతో భద్రపరిచిన లెనిన్ మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి, కొన్నేళ్ల తర్వాత తిరిగి మళ్లీ అక్కడే ఉంచారు.
జోసెఫ్ స్టాలిన్ మృతదేహాన్నీ కొన్నాళ్లు అక్కడే ఉంచినా, తరువాత దానిని తొలగించారు.
1970లలో దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాల నుంచి రక్షించడానికి లెనిన్ శవపేటికపై బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను అమర్చారు.
1990వ దశకంలో లెనిన్ మృతదేహాన్ని ఖననం చేయాలన్న డిమాండ్‌లు వచ్చాయి.
లెనిన్ సమాధి గురించి 5 ముఖ్యమైన విషయాలను చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
అది ఎవరి ఆలోచన?
లెనిన్ మృతదేహాన్ని భద్రపరచాలనే ఆలోచన మొదటిసారి జోసెఫ్ స్టాలిన్‌కు 1923లో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ సమయంలో, సోవియట్ చెకా (కేజీబీ, ఎఫ్‌ఎస్‌బీ భద్రతా సంస్థలకు ముందున్న సంస్థ) నాయకుడు, ఖార్కియెవ్‌లో విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణించగా, వ్లాదిమిర్ వొరొబయోవ్ అనే యువ శాస్త్రవేత్త ఆయన శరీరాన్ని రసాయనాలతో భద్రపరిచారు. ఆ మృతదేహాన్ని అంత బాగా సంరక్షించడం మాస్కోలోని కమ్యూనిస్టు నేతలకు నచ్చింది.
అదే సంవత్సరం నవంబర్‌లో లెనిన్ అనారోగ్యంతో సజీవంగా ఉన్నప్పుపడే, ఆయన మరణం గురించి చర్చించడానికి స్టాలిన్ తన పార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
లెనిన్ మృతదేహాన్ని భద్రపరచాలని స్టాలిన్ వాదించారు. ఈ ఆలోచనను వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలందరినీ తర్వాత 1930లలో చంపేశారు. మార్క్సిజంలో అవశేషాలకు స్థానం లేదని లియాన్ ట్రాట్క్సీ పేర్కొన్నారు. విప్లవ నాయకుడి మృతదేహాన్ని ఇలా పదిలపరచడం ఆయనను అవమానించడమేనని నికోలాయ్ బుఖారిన్ అన్నారు.
లెనిన్ భార్య నదేజ్దా క్రుపస్కయా సైతం లెనిన్ మృతదేహాన్ని పూజించే వస్తువుగా మార్చవద్దని కోరారు.
అయినప్పటికీ, సంపూర్ణ అధికారం కోసం పరితపిస్తున్న స్టాలిన్ దీనిపై పట్టుబట్టారు. కార్మాికుల నుంచి తనకు వచ్చిన లేఖలను ఆయన ఉదహరించారు. లేఖలను చూపించారు. అయితే అవి నిజమైనవా లేక స్టాలిన్ మనుషులే వాటిని సృష్టించారా అన్నది గుర్తించడం ఇప్పుడు సాధ్యం కాదు. లెనిన్ ఎప్పుడూ తమతో ఉండాలన్న ఆకాంక్షను కార్మికులు ఆ లేఖల్లో వ్యక్తపరిచారు.

ఫొటో సోర్స్, EPA
ఎవరు నిర్మించారు?
మొదట లెనిన్ సమాధిని కేవలం మూడు మీటర్ల ఎత్తు నిర్మించారు. దీనిని ఆయన అంత్యక్రియలకు ముందు, మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలో నిర్మించారు. వాస్తుశిల్పి అలెక్సీ షుసేవ్ ఈ సమాధికి రూపకల్పన చేశారు. తర్వాత చేసిన మార్పులూ ఆయన సూచించినవే.
లెనిన్ 1924 జనవరి 21న మరణించగా, ఆయన వీడ్కోలు కార్యక్రమాలు మార్చి చివరి వరకు కొనసాగాయి. ఆ సమయంలో ఆయన సమాధిని లక్షల మంది ప్రజలు దర్శించుకున్నారని చెబుతారు.
1924 వేసవి నాటికి, భద్రపరచిన లెనిన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ప్రదర్శించాలనే ఆలోచన పూర్తిగా రూపుదిద్దుకుంది. షుసేవ్ ఇందుకోసం కొత్త భవనాన్ని డిజైన్ చేయడం ప్రారంభించగా, శాస్త్రవేత్తలు అలెక్సీ వొరొబయోవ్, బోరిస్ జబర్స్కీ మృతదేహాన్ని భద్రపరిచే పని చేశారు.
1924 ఆగస్ట్ 1న, ఆయన సమాధిని సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. దాన్ని చెక్కతో తయారు చేశారు, కానీ పరిమాణం, ఆకృతిలో అది ప్రస్తుత రూపాన్నే పోలి ఉంటుంది. గ్రానైట్ సమాధి 1930 అక్టోబరు నాటికి పూర్తయింది. అది స్టాలిన్ ఆకాంక్షలకు అనుగుణంగా సోవియట్ యూనియన్ ప్రత్యేకతను, గొప్పదనాన్ని చాటిచెప్పే విధంగా ఉంటుంది.
ప్రజలు పొడవాటి క్యూలలో నిలబడి ప్రపంచ శ్రామికవర్గ నాయకుడి మృతదేహాన్ని దర్శించుకుంటారు.

ఫొటో సోర్స్, Reuters
ఒకే చోట లెనిన్, స్టాలిన్ సమాధులు
1953లో స్టాలిన్ మరణించిన తరువాత, లెనిన్ సమాధి వద్దే ఆయననూ సమాధి చేయాలని నిర్ణయించారు.
అయితే, దీనికి ప్రారంభం నుంచే సమస్యలు ఎదురయ్యాయి. స్టాలిన్ శరీరంపై చర్మం, ముఖ్యంగా ఆయన ముఖం మీద చర్మం, సరైన స్థితిలో లేకపోవడంతో, దాన్ని భద్రపరచడం కష్టంగా మారింది.
సోవియట్ నాయకత్వం స్టాలిన్ వ్యక్తిత్వ ఆరాధనను, ఆయన యుగంలో జరిగిన సామూహిక అణచివేతలను నిర్మూలించాక, స్టాలిన్ మృతదేహాన్ని 1961లో ఆ సమాధి నుంచి తొలగించి, క్రెమ్లిన్ గోడకు సమీపంలో ఖననం చేశారు.
1982లో లియోనిడ్ బ్రెజ్నేవ్ మరణించినప్పుడు, సమాధిపై ఉన్న " LENIN" అన్న అక్షరాల స్థానంలో "LЁNIN" (బ్రెజ్నేవ్ పేరుతో ఉన్న ఒక నాటకం) అనే అక్షరాలతో భర్తీ చేస్తారనే జోక్ చాలా ఎక్కువగా వినిపించేది.

ఫొటో సోర్స్, Getty Images
సైద్ధాంతిక ఆరాధనకు, విధ్వంసానికి పేరొందిన ప్రదేశం
యుద్ధం తరువాత, యూఎస్‌ఎస్‌ఆర్ పతనం వరకు, ప్రజలు తీర్థయాత్రలాగా ఆ సమాధిని దర్శించుకునేవారు. విదేశీ ప్రముఖులు, సోవియట్‌లో స్కూలు పిల్లలు దాన్ని సందర్శించేవారు.
1945 మేలో విక్టరీ పరేడ్ సందర్భంగా, రెండో ప్రపంచ యుద్ధంలో యూఎస్‌ఎస్‌ఆర్ విజయాన్ని సూచిస్తూ జర్మన్ సైన్యానికి చెందిన నాజీ జెండాలను సమాధి ముందు నేలపై విసిరేశారు.
ప్రపంచంలోని మొట్టమొదటి కాస్మోనాట్, యూరి గగారిన్‌కు ఆనాటి సోవియట్ నేత నికితా కృశ్చేవ్, ఈ సమాధి వద్ద ఉన్న వేదికపైనే స్వాగతం పలికారు.
1950ల నుంచి 1970ల చివరి వరకు, లెనిన్ మృతదేహంపై రాళ్ళు, సుత్తి, కొన్నిసార్లు మోలోటోవ్ కాక్టెయిల్ వంటి అనేక వస్తువులతో దాడులు జరిగాయి. ఈ దాడులు చేసిన వాళ్లను పట్టుకుని, నిర్బంధ మానసిక చికిత్స కోసం పంపేవాళ్లు.
1973లో జరిగిన ఒక పేలుడులో అనేక మంది సందర్శకులు మరణించారు. అప్పుడే లెనిన్ సమాధికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో భద్రతను పెంచారు.

ఫొటో సోర్స్, Getty Images
లెనిన్ అవశేషాలు
సోవియట్ యూనియన్ పతనం తరువాత, కమ్యూనిస్ట్ ఆలోచనలను తృణీకరించిన ప్రెసిడెంట్ బోరిస్ ఎల్సిన్, రెడ్‌స్క్వేర్‌లో లెనిన్ సమాధి నుంచి కాకుండా, సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి తన ప్రసంగాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
1990ల ప్రారంభంలో, లెనిన్ మృతదేహం పాడవకుండా చూసే లేబరేటరీకు నిధులను నిలిపేశారు.
అప్పటి నుంచి, రష్యన్ టెలివిజన్ ఛానెల్‌లలో లెనిన్ మృతదేహ సంరక్షణ, ఆయన సమాధిపై అనేక డాక్యుమెంటరీలు ప్రసారం చేయడం ప్రారంభించారు. వీటిలో, లెనిన్ అసలు శరీరంలో కేవలం 23% మాత్రమే మిగిలి ఉందని, మిగిలిదాన్ని కృత్రిమంగా భర్తీ చేశారని పేర్కొన్నారు.
నేటి వరకు, లెనిన్ సమాధి రష్యాలో ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా ఉంది. గూగుల్ మ్యాప్స్, టూరిస్ట్ వెబ్‌సైట్ ట్రిప్ అడ్వైజర్‌లో ఐదు నక్షత్రాలలో దీనికి సగటున నాలుగు కంటే ఎక్కువ రేటింగ్‌లు ఉన్నాయి. దాని సమీక్షలలో, "మా పిల్లవాడు ఆ పసుపు ముఖాన్ని చూసి భయపడ్డాడు" నుంచి "సోవియట్ శకం గురించి విన్న ఎవరైనా, ఈ స్థలాన్ని సందర్శించడం గొప్ప అనుభవం" అనేవరకు ఉన్నాయి.
తూర్పు, ఆగ్నేయాసియాలోని కమ్యూనిస్ట్ దేశాలలో మాత్రమే నాయకుల మృతదేహాలతో కూడిన సమాధులు ఉన్నాయి. వాటిలో చైనా కమ్యూనిస్ట్ నాయకుడు మావో జెడాంగ్, వియత్నాంకు చెందిన హో చి మిన్ మృతదేహాలు ఉన్నాయి. ఉత్తర కొరియా దివంగత నాయకుడు కిమ్ ఇల్ సంగ్, ఆయన వారసుడు కిమ్ జోంగ్ ఇల్ మృతదేహాలనూ సమాధుల్లో భద్రపరిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















