వైద్య విద్య: ఇంటర్మీడియట్ ఆంధ్రలో చదివిన తెలంగాణ విద్యార్థులు సొంత రాష్ట్రంలో ‘నాన్ లోకల్’ అవుతున్నారా?

తెలంగాణ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో వైద్య విద్యార్థుల స్థానికతపై వివాదం ఏర్పడింది.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.33పై తల్లిదండ్రులు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో పుట్టి.. పదో తరగతి వరకు అక్కడే చదివి.. తర్వాత ఏదైనా కారణంతో ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదివితే.. ఆ విద్యార్థి ఇకపై నాన్ లోకల్ కిందకు వస్తారు. అంటే, పదేళ్లపాటు తెలంగాణలో చదువుకున్నప్పటికీ, కొత్త జీవో కారణంగా తెలంగాణేతరులుగా మారిపోతారని అంటున్నారు తల్లిదండ్రులు.

ఈ జీవో అమల్లో లేనప్పుడు చదివిన విద్యార్థులకు కూడా వర్తింపజేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై మణికొండకు చెందిన జనగ శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడారు. ''మా అబ్బాయి శ్రీనాథ్. హైదరాబాద్‌లో పుట్టాడు. పదో తరగతి వరకు ఇక్కడే చదివాడు. తర్వాత ఇంటర్ గుంటూరులో చదివించాం. కేవలం రెండేళ్లు పక్క రాష్ట్రంలో చదివించినందుకు మెడికల్ సీటుకు స్థానికేతరుడని చెబుతున్నారు. మా అబ్బాయికి నీట్‌లో 457 మార్కులు వచ్చాయి. బీ కేటగిరీలో తెలంగాణలో తప్పకుండా సీటు వస్తుంది. కానీ, ఇప్పుడు స్థానికేతరుడు అని చెప్పడంతో సీటు వచ్చే అవకాశం లేకుండా పోతోంది'' అని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోలో ఆప్షన్లు ఉండేవని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు
Students

ఫొటో సోర్స్, Getty Images

గతంలో వచ్చిన జీవోలో ఏముందంటే..

2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోటాకు సంబంధించి జీవో నం.114 తీసుకువచ్చింది.

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కోటాను దీని ద్వారా నిర్దేశించింది ప్రభుత్వం. ఆ జీవో ప్రకారం, కులాల వారీగా రిజర్వేషన్లు పరిశీలిస్తే.. 15 శాతం ఎస్సీ విద్యార్థులకు సీట్లు కేటాయించగా, 6 శాతం ఎస్టీ విద్యార్థులకు కేటాయించింది. 29 శాతం బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. మిగిలినవి అన్‌రిజర్వుడ్ సీట్లుగా నిర్ణయించింది.

నాన్-స్టేట్‌వైడ్ ఇనిస్టిట్యూషన్స్‌లోని సీట్లలో 85 శాతం లోకల్ విద్యార్థులకు కేటాయించగా.. 15 శాతం అన్‌రిజర్వుడ్ కేటగిరీ కిందకు తీసుకొచ్చారు.

(నాన్‌స్టేట్‌‌వైడ్ ఇనిస్టిట్యూషన్స్ అంటే, రాష్ట్ర అజమాయిషీలో లేని విద్యాసంస్థలు. వీటి పరిధిలో 85% కోటా స్థానికులకు, 15% స్థానికేతరులకు ఉంటాయి. అదే రాష్ట్ర అజమాయిషీలోని స్టేట్‌వైడ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో 85% సీట్లు ఆయా జోన్లకు, 15% సీట్లు ఇతర జోన్ల వారికి ఉంటాయి.)

వైద్య విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

లోకల్‌గా పరిగణించే విషయంలో అర్హత పరీక్షకు హాజరయ్యే ఏడాదికి ముందు నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలి. లేదా క్వాలిఫయింగ్ పరీక్షకు హాజరయ్యే ఏడాది నుంచి మొదలుకుని ఏడు సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలోని విద్యా సంస్థల్లో చదివి ఉంటే లోకల్ విద్యార్థిగా పరిగణించాలని జీవోలో పేర్కొన్నారు.

దీనివల్ల పదో తరగతిలోపు ఏవైనా నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివిన విద్యార్థులను కూడా ఇక్కడ లోకల్ విద్యార్థులుగా పరిగణించేవారు. ఆ తర్వాత ఇంటర్ విద్య వేరొక రాష్ట్రానికి వెళ్లి చదువుకున్నా.. లోకల్, నాన్ లోకల్ విషయంలో ఇబ్బంది ఉండేది కాదు.

ప్రస్తుత ప్రభుత్వం చేసిన మార్పులేమిటి?

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు 2017లో తీసుకొచ్చిన నిబంధనల్లో మార్పులు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. ఈ మేరకు జులై 19న జీవో 33 తీసుకువచ్చింది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 95 ప్రకారం పదేళ్లపాటు తెలంగాణలోని ఉన్నత, సాంకేతిక, మెడికల్ విద్యలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రవేశాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉన్న కోటా ఈ ఏడాది జూన్ 2తో ముగిసింది.

సెక్షన్ 95 కాలపరిమితి ముగియడంతో మెడికల్ సీట్ల కోటా నిబంధనల్లో మార్పులు చేసినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

మెడికల్ సీట్లలో ప్రవేశాలకు నిర్వహించే క్వాలిఫయింగ్ పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్లపాటు లోకల్ ఏరియా (తెలంగాణ)లో చదివి ఉండాలి.

అంటే, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులనే లోకల్‌గా పరిగణిస్తారు. దాని ప్రకారమే లోకల్ కోటా కింద అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు అర్హులవుతారు.

ఈ విషయంపై తెలంగాణ వైద్య విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు బీవీవీ రవిశంకర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రభుత్వం జీవో ఇవ్వడంపై మాకు అభ్యంతరం లేదు. కానీ, ఇప్పటి నుంచి అది వర్తించేలా ఉండాలి, అంతేకానీ గతంలో చదివిన విద్యార్థులకు జీవో వర్తింపజేస్తామంటే ఎలా?.. అప్పట్లో ఈ నిబంధన లేకపోవడంతో మేం వేరొకచోట చదివించాం. దానివల్ల మా పిల్లలు ఇప్పుడు నష్టపోతున్నారు. కటాఫ్ తేదీ ప్రకటించి.. అప్పట్నుంచి నాలుగేళ్ల స్థానిక నిబంధన వర్తింపజేయాలి’’ అని కోరారు.

విద్యార్థుల తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన అభ్యంతరాలు..

నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, తెలంగాణలో మొత్తం 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉండగా.. 8,515 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నీట్ 2024 మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో స్థానిక కోటాలో కౌన్సెలింగ్‌కు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.

సాధారణంగా, ప్రభుత్వం ఏదైనా జీవో తీసుకొస్తే, ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చేలా తీసుకొస్తారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో కారణంగా రెండేళ్ల కిందట మరో రాష్ట్రంలో ఇంటర్‌‌‌లో చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

‘‘మా అబ్బాయిని రెండేళ్ల కిందట ఇంటర్మీడియెట్‌ గుంటూరులో చేర్పించాం. అప్పటికి స్థానికత విషయంలో పాత జీవోనే ఉంది. అప్పటికే కొత్త జీవో వచ్చి ఉంటే, మేం గుంటూరులో చేర్పించేవాళ్లం కాదు కదా! ఇప్పటికిప్పుడు జీవో తీసుకువచ్చి గతంలో చదివిన విద్యార్థులకు వర్తిస్తుందంటే ఎలా? ఇక నుంచి ఇంటర్మీడియెట్ కూడా తెలంగాణలో చదివితేనే లోకల్‌గా పరిగణిస్తామని చెప్పాలి కదా’’ అంటున్నారు శ్రీనివాసరావు.

విద్యార్థులు, తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, Getty Images

తాజా జీవో నిబంధనలు తమకు వర్తింపజేయకుండా, తాము కౌన్సెలింగ్‌‌కి హాజరయ్యే అవకాశం కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 55 మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వం ఏదైనా జీవో తీసుకొస్తే నిర్దేశిత కటాఫ్ డేట్ పెట్టాల్సి ఉంటుందని బీబీసీతో చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి.

‘‘నిర్దేశిత తేదీ చెప్పి, ఆ తేదీ నుంచి జీవో వర్తిస్తుందని చెబితే.. ఆ ప్రకారమే ఉంటుంది. అలా కానిపక్షంలో సాధారణంగా జీవో జారీ చేసిన తేదీ నుంచి వర్తిస్తుంది. ఈ జీవో అమల్లో లేని సమయంలో చదివిన పిల్లలకు ఈ జీవో నిబంధనలు అమలు చేస్తామనడం సమంజసం కాదు’’ అని పద్మనాభరెడ్డి చెప్పారు.

‘‘అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు గతంలో స్థానికత విషయంలో బోగస్ పత్రాలు తీసుకువచ్చి సమర్పించిన ఘటనలు కూడా వెలుగుచూశాయి. బహుశా దాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ కొత్త జీవో తీసుకుని వచ్చి ఉండవచ్చు’’ అని పద్మనాభ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమంటున్నాయి..

స్థానికత విషయంపై వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి టి.హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రభుత్వం కొత్త నిబంధనలు తయారు చేయకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఒక పేరా పెట్టి మిగిలిన నిబంధనలు తొలగించారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియెట్ వేరొక రాష్ట్రంలో చదివితే తెలంగాణలో ఎంబీబీఎస్ చేసేందుుకు అర్హత కోల్పోతారు. ఆ ప్రభావం పీజీ వైద్య మీద కూడా ఉంటుంది. తెలంగాణ విద్యార్థులు ఇంటర్ రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే, లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు వెళ్తే నాన్ లోకల్ అయిపోరా? తెలంగాణ పిల్లలకు అడ్మిషన్ల కోసం స్థానికతను నిర్ధారించుకోడానికి తమిళనాడు, కర్ణాటక, కేరళ తరహాలో కొత్త సమగ్ర విధానం రూపొందించుకోవాలి’’ అన్నారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, trspartyonline/facebook

ఈ వివాదంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ‘ఎక్స్’లో స్పందించారు.

‘‘మెడికల్ సీట్లలో స్థానికత విషయంలో గత ప్రభుత్వం జీవో నం.114 తీసుకువచ్చింది. అందులో చెప్పినట్లే.. తొమ్మిది నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వరకు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు. ఆ నిబంధననే మేం కొనసాగించాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.33తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం కాదు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6 నుంచి 12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులు అవుతారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్లుగా ఆ నిబంధన కొనసాగుతోంది. ఆ చట్టం గడువు ముగిసినందున ఇకపై నిబంధన కొనసాగించడం సాధ్యం కాదు’’ అని రాశారు.

అయితే, ఇంటర్మీడియట్ వేరే రాష్ట్రంలో చదివిన తెలంగాణ విద్యార్థుల స్థానికత విషయంలో మంత్రి రాజనర్సింహ స్పష్టతనివ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టతనిస్తామని వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)