భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న పెట్రాపోల్ చెక్ పోస్ట్ తూర్పు భారత దేశానికి చాలా ముఖ్యమైనది. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని ఈ సరిహద్దు మార్గం ద్వారానే రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతాయి.

పెట్రాపోల్, దాని సమీపంలోని బంగావ్‌లో ఎప్పుడూ సందడి కనిపిస్తుంటుంది. కోల్‌కతా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని కారణంగా ఇది తూర్పు భారత దేశానికి అత్యంత ముఖ్యమైన వాణిజ్య మార్గంగా మారింది.

సరిహద్దు పక్కనే బెనాపోల్ ఉంటుంది, ఇది బంగ్లాదేశ్‌లో ఉంటుంది.

బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో వైద్యం కోసం వచ్చే ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. వారు కోల్‌కతాకు వెళుతుండొచ్చు, లేదా భారత్‌లోని మరే ఇతర నగరానికైనా వెళుతుండొచ్చు.

అయితే గత నెల రోజులుగా పెట్రాపోల్ మార్గం దగ్గర దాదాపు నిశ్శబ్దం నెలకొంది. సాధారణ రోజుల్లో సందడిగా ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇప్పుడు కనిపించడం లేదు.

వాట్సాప్ చానల్
బంగ్లాదేశ్, భారత్, పశ్చిమబెంగాల్, షేక్ హసీనా
ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లా పెట్రాపోల్ వద్ద భారత్- బంగ్లాదేశ్ సరిహద్దు

సరిహద్దులో పరిస్థితి ఏమిటి?

సరిహద్దుకు సమీపంలోనే స్వపన్ మిత్ర హోటల్ ఉంది. మేము వెళ్లినప్పుడు ఆయన కౌంటర్ దగ్గర ఒంటరిగా కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నారు.

హోటల్ తెరిచే ఉన్నా, ఇక్కడ తినడానికి ఏమీ లేవు. బంగ్లాదేశ్‌లో నిరసనలు ప్రారంభమయ్యాక నెల రోజులు నుంచి పరిస్థితి ఇలాగే ఉందని ఆయన చెప్పారు.

“సరిహద్దు దాటడానికి ముందు లేదా సరిహద్దు నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రజలు నా హోటల్‌లో ఆగి తింటారు. నా హోటల్‌కు అంత ప్రజాదరణ ఉంది. అయితే గత నెల రోజులుగా లారీలు కదలకపోవడం, జనం రాకపోవడంతో మేం ఖాళీగా ఉండాల్సి వస్తోంది. అంతా ఒక రకమైన భయం అలుముకుంది." అని ఆయన వివరించారు.

సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రాపోల్‌లో అంతా నిశ్శబ్దంగా మారింది. రహదారిపై బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఏర్పాటు చేసిన ‘దారి లేదు’ అనే బారికేడ్లు కనిపించాయి.

భారతీయులు, బంగ్లాదేశ్ పౌరులు, సరిహద్దులు
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌ నుంచి భారత్ చేరుకున్న రాహుల్ హసన్

సరిహద్దుకు సమీపంలో అనేక ట్రక్కులు నిలబడి ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో పరిస్థితి మెరుగుపడుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు, కానీ చాలా రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితి దిగజారిన నాటి నుంచి సరిహద్దులలో నిఘా మరింత పెరిగింది.

మంగళవారం సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ దల్జీత్ చౌదరి పెట్రాపోల్‌ను సందర్శించి సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ, బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటుంది. తాజా పరిస్థితుల కారణంగా మేఘాలయ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.

బంగ్లాదేశ్, భారత్, పశ్చిమబెంగాల్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో పరిస్థితుల పట్ల ఆందోళన చెందుతున్న భారతీయులు

తిరిగి వచ్చిన ప్రజలు ఏం చెబుతున్నారు?

ఇటీవల బంగ్లాదేశ్‌‌లో హింసాకాండ చెలరేగినప్పుడు పెట్రాపోల్‌కు కొద్ది దూరంలో ఉన్న జెస్సోర్‌లో ఒక గుంపు ఒక ఐదు నక్షత్రాల హోటల్‌కు నిప్పుపెట్టింది.

ఆ సమయంలో హోటల్‌లో ఉన్న భారత వ్యాపారవేత్త రబీయుల్ ఇస్లాం, ఆయన భాగస్వామి అతి కష్టం మీద అక్కడి నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు.

మంగళవారం పెట్రాపోల్‌లో గొడవలు ప్రారంభమైన వెంటనే రబీయుల్ హసన్ భారత్‌లోకి అడుగుపెట్టారు. ఆయన గాయపడ్డారు, కానీ ఆయన భాగస్వామిని అంబులెన్స్‌లో తీసుకురావాల్సి వచ్చింది.

“ఆ మూక దాడి చేసినప్పుడు మేము ఏడవ అంతస్తులోని మా గదిలో ఉన్నాం. మేము కిందకు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. మేము ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి దూకాం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"నా శరీరంపై కొన్ని చోట్ల గాయాలయ్యాయి, నా భాగస్వామి కాలు విరిగింది. ఇది చాలా భయానక పరిస్థితి. బంగ్లాదేశ్ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది."

సరిహద్దుకు ఇటు వైపు నుంచీ చాలా మంది బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే వాళ్లు ఉన్నారు. వారిలో చాలా మంది చికిత్స కోసం భారత్‌కు వచ్చిన వారున్నారు.

వారిలో ఒకరు ఢాకా సమీపంలో నివసించే సుమిత్ర (పేరు మార్చాం). మనవడి చికిత్స కోసం ఇండియా వచ్చిన ఆమె కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్లారు.

తిరిగి వెళుతున్న ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో ప్రార్థనా స్థలాలు, మైనార్టీల ఇళ్లపై మూకుమ్మడి దాడులు జరగడమే ఇందుకు కారణం.

“మా వీసా గడువు ముగిసింది. నేను ఇంట్లో వాళ్లతో మాట్లాడడానికీ ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు పరిస్థితి చూస్తే భయమేస్తోంది. కానీ ఏం చేయాలి? మా ఇల్లు అక్కడే ఉంది, మా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. మేము వెళ్ళాల్సిందే” అని ఆమె అన్నారు.

భారత్- బంగ్లా సరిహద్దు, పశ్చిమబెంగాల్
ఫొటో క్యాప్షన్, పెట్రాపోల్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించిన సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ దల్జిత్ చౌదరి

పెట్రాపోల్ సరిహద్దులో బస్సు సర్వీసుల నిలిచివేత

కోల్‌కతా నుంచి ఢాకాకు రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయి. అల్లర్ల నేపథ్యంలో 'మైత్రి ఎక్స్‌ప్రెస్' రైలును జూలై 19 నుంచి నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమూ సోమవారం నుంచి ఢాకాకు బస్సులను నిలిపివేసింది.

గతంలో ఈ బస్సులు ఢాకా వరకు వెళ్లేవి. ఇప్పుడు పెట్రాపోల్ సరిహద్దుకు చేరుకోగానే, బంగ్లాదేశ్ వెళ్లే వాళ్లు అక్కడ దిగి, కాలినడకన సరిహద్దు దాటి అక్కడి నుంచి మరో బస్సులో ఢాకా వెళుతున్నారు.

భారత్ వైపు వచ్చే వారి పరిస్థితీ అలాగే ఉంది.

ప్రస్తుతం ఎవరికీ టూరిస్ట్ వీసా ఇవ్వడం లేదని పెట్రాపోల్ బోర్డర్ పోస్ట్ వద్ద ఉన్న భారత అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు మాత్రమే తిరిగి వస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో మారిన పరిస్థితుల కారణంగా పెట్రాపోల్, బంగావ్, ఇతర సరిహద్దు ప్రాంతాల ప్రజలు చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.

అయితే, సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించిన సరిహద్దు భద్రతా దళం, ఒక విధంగా సరిహద్దును మూసివేసింది.

ఇక్కడున్న అందరూ బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులు, వారి ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడుల గురించి అందరూ చర్చించుకోవడం కనిపిస్తుంది.

ఢాకా, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఫొటో క్యాప్షన్, భారత్ - బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న బస్సు సర్వీసు

కోల్‌కతాలో వాతావరణం ఎలా ఉంది?

గతంలో సరిహద్దుల్లో వ్యాపారవేత్తలు బంగ్లాదేశీయులకు ఘనంగా స్వాగతం పలికితే, ఇప్పుడు వారిని తప్పించుకోవడం కనిపిస్తుంది.

ఇదంతా గమనించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశమని, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దానిని సమర్థిస్తుందని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని హిందూ మత సంస్థలు, బంగ్లాదేశ్‌లో హింసను ఎదుర్కొంటున్న హిందువులను భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని, వారికి పౌరసత్వం ఇవ్వడానికి చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి.

పౌరసత్వ సవరణ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, అందువల్ల భారత ప్రభుత్వం దాని కింద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాయి.

నరేంద్రమోదీ, షేక్ హసీనా, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ( ఫైల్ ఫోటో)

భారతదేశం - బంగ్లాదేశ్ సంబంధాలు, వాణిజ్యం

బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి.

రెండు దేశాల మధ్య 4 వేల 96 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. రెండింటి భాషా, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు ఒకే రకంగా ఉంటాయి.

ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్‌గా పిలిచే బంగ్లాదేశ్ 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత ప్రత్యేక దేశంగా అవతరించింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ భారత్‌కు మద్దతు ఇచ్చింది.

బంగ్లాదేశ్ దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.

కోవిడ్-19 ఉన్నప్పటికీ, 2020-21 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 90 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది.

2021-22 సంవత్సరంలో, ఈ వాణిజ్యం 44 శాతం పెరిగి 152 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది.

2022-23 సంవత్సరం మధ్య మొత్తం భారతదేశం-బంగ్లాదేశ్ వాణిజ్యం 133 వేల కోట్ల రూపాయలు.

విద్యుత్, ఇంధన రంగంలో అనేక పెద్ద ప్రాజెక్టులపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రస్తుతం భారత్ నుంచి 1160 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకుంటోంది.

ఇది మాత్రమే కాదు, భారతదేశం-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ రెండు దేశాల మధ్య హైస్పీడ్ డీజిల్‌ను రవాణా చేయడానికి చాలా ముఖ్యమైనది.

రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల నిర్మాణానికి భారత్ గత దశాబ్దంలో బంగ్లాదేశ్‌కు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)