నీరజ్ చోప్రా: చదువును మధ్యలోనే మానేసిన ఈ కుర్రాడు, జావెలిన్ త్రోలో ఎలా రాటు దేలాడు?

ఫొటో సోర్స్, Reuters
పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో పురుషుల విభాగంలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా రజతాన్ని గెలిచి భారత్ ఖాతాలో అయిదో పతకాన్ని చేర్చాడు.
వరుసగా రెండో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలవాలనుకున్న నీరజ్ కల నెరవేరలేదు.
పాకిస్తాన్ అథ్లెట్ల్ అర్షద్ నదీమ్ పారిస్‌లో స్వర్ణం గెలవడమే కాకుండా కొత్త ఒలింపిక్ రికార్డ్ నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో అర్షద్ నదీమ్ ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు.
అదే సమయంలో నీరజ్ చోప్రా నిర్ణీత 6 ప్రయత్నాల్లో అత్యుత్తమంగా 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు.
నీరజ్ 5 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 89.45 మీటర్లు దూరం విసిరాడు.
2020 టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణంతో నీరజ్ చరిత్ర లిఖించాడు.
తాజాగా నదీమ్, పాకిస్తాన్ తరఫున స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు.
గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ జావెలిన్‌ను 88.54మీ. దూరం విసిరి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.


నీరజ్‌పై ప్రశంసల వెల్లువ
నీరజ్ చోప్రా సాధించిన ఈ విజయంతో, హరియాణాలోని సోనిపత్‌కు సమీపంలోని నీరజ్ స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి.
‘‘మాకైతే నీరజ్ సాధించిన రజతమే బంగారం. స్వర్ణం సాధించిన ఆ అబ్బాయి (అర్షద్ నదీమ్) కూడా నాకు కొడుకులాంటి వాడే. ఇక్కడివరకు చేరాలంటే చాలా కష్టపడాలి’’ అని వార్తా సంస్థ ఏఎన్‌ఐతో నీరజ్ చోప్రా తల్లి అన్నారు.
నీరజ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
‘‘నీరజ్ చోప్రా అద్భుతమైన వ్యక్తి. మళ్లీ మళ్లీ తన ప్రతిభను చాటుకున్నారు. నీరజ్ మరో మెడల్ సాధించినందుకు భారత్ గర్వంతో ఉప్పొంగుతోంది. రజతం గెలిచిన నీరజ్‌కు నా అభినందనలు. తమ కలలు నెరవేర్చుకుంటూ దేశానికి గర్వకారణంగా నిలవాలనుకునే అసంఖ్యాక భవిష్యత్ అథ్లెట్లకు నీరజ్ స్ఫూర్తి’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పానిపత్‌లో మొదలైన నీరజ్ కథ..
బీబీసీ న్యూస్ ప్రతినిధి వందన 2021లో నీరజ్ చోప్రాతో మాట్లాడి ఒక కథనాన్ని రూపొందించారు. అందులో నీరజ్ చోప్రా తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు.
పానిపత్‌లోని ఒక చిన్న గ్రామంలో నీరజ్ ప్రయాణం మొదలైంది. చిన్నతనంలో నీరజ్ బొద్దుగా ఉండేవాడు. అప్పట్లో అతడి బరువు 80 కేజీలు ఉండేది. కుర్తా, పైజామా వేసుకునే నీరజ్‌ను గ్రామంలోని అందరూ సర్పంచ్ అంటూ ఆటపట్టించేవారు.
బరువు తగ్గి, ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు పానిపత్‌లోని ఒక స్టేడియానికి వెళ్తుండేవాడు. ఎవరో ఇచ్చిన సలహా మేరకు జావెలిన్‌ను చేతిలోకి తీసుకున్నాడు. అక్కడి నుంచి అతడి ప్రయాణం మొదలైంది.
నీరజ్ మెరుగైన సౌకర్యాల కోసం పంచకుల పట్టణానికి వెళ్లాడు. అక్కడ మొదటిసారి ఆయనకు జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎదురయ్యారు. పంచకులలో అతడికి మెరుగైన వసతి, సదుపాయాలు లభించాయి.
జాతీయ స్థాయిలో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి నీరజ్ నాసిరకం కాకుండా మంచి నాణ్యమైన జావెలిన్‌ను వాడటం మొదలుపెట్టాడు. క్రమంగా, నీరజ్ ఆటలో మార్పు రావడం మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
తొమ్మిదో తరగతిలో చదువు మానేశాడు
పన్నెండేళ్ల వయసులో జావెలిన్ త్రో ఆడటం ప్రారంభించిన నీరజ్ స్కూలు చదువును మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. 10, 12 తరగతుల్లో ప్రైవేటుగా ఫీజు కట్టి పాసయ్యాడు.
కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ బీఏలో చేరాడు.
18 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ కోటా కింద ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. డిగ్రీ లేకపోయినా డిప్యూటీ సుబేదార్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
రాజ్‌పుతానా రైఫిల్స్‌లో ఉన్న నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవగానే మొదటి ప్రశంసలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచే లభించాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు
2016లో పీవీ సింధు, సాక్షి మలిక్ సాధించిన పతకాలతో భారత్‌లో సంబరాలు జరగుతున్నప్పుడే, మరోవైపు అథ్లెటిక్స్ ప్రపంచంలో ఒక కొత్త తార ఆవిర్భావం జరుగుతోంది.
అదే ఏడాది పోలాండ్‌లో జరిగిన అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నీరజ్ స్వర్ణాన్ని గెలిచాడు.
అనతి కాలంలోనే ఈ యువ జావెలిన్ త్రోయర్ అంతర్జాతీయ స్థాయిలో తన ముద్రను వేసుకోవడం ప్రారంభించాడు.
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ ఈటెను 86.47 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని సాధించాడు. 2018 ఆసియా క్రీడల్లో జావెలిన్‌ను 88.07 మీ. దూరం విసిరి జాతీయ రికార్డు సృష్టించి బంగారు పతకాన్ని కూడా అందుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఈటెను విసిరే చేతి మణికట్టుకు తీవ్ర గాయం
ఆటల్లో గాయాలు అవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని గాయాలు కెరీర్‌ను దెబ్బతీసేవిగా ఉంటాయి. 2012లో పానిపట్‌లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు నీరజ్ మణికట్టు ఎముక విరిగింది. అదే చేతితో ఆయన జావెలిన్ విసురుతాడు. ఒక దశలో ఇక ఆడలేనని అనుకున్నానని నీరజ్ చెప్పాడు.
అయితే, నీరజ్ పట్టుదలతో ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఆట కొనసాగించాడు.
ఇప్పుడైతే నీరజ్ వద్ద విదేశీ కోచ్‌లు, బయోమెకానికల్ నిపుణులు ఉన్నారు. కానీ, 2015 సమయంలో ఆయన సొంతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అలాంటప్పుడు గాయాల బారిన పడే ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి అతనికి కోచ్‌లు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
2019 ఏడాది నీరజ్‌కు చాలా కఠినంగా గడిచింది. 2019లో అదే చేతికి మళ్లీ గాయమై దాదాపు 8 నెలలు ఆటకు దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకోవడం నీరజ్‌కు సవాలుగా మారింది.
2020లో కరోనా కారణంగా అంతర్జాతీయ పోటీలు జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆటల కోసం మాంసాహారం..
క్రీడాకారులు మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కాకుండా, మైదానం వెలుపల కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా డైట్, ఫిట్‌నెస్ విషయంలో.
అందుకే నీరజ్ చోప్రా గంటల పాటు జిమ్‌లోనే గడుపుతాడు.
ఒక దశలో రోజూ జిమ్‌లో ఏడెనిమిది గంటల పాటు కఠోర వ్యాయామాలు చేసేవాడినని ఒక ఇంటర్వ్యూలో నీరజ్ వెల్లడించాడు.
‘‘నేను 4,000-5,000 కేలరీలు తీసుకుంటాను’’ అని చెప్పాడు.
నీరజ్ సర్వస్వం జావెలిన్. అయితే, ఆయనకు బైక్ నడపడం, హరియాణా సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ఆయన ప్లే లిస్టులో పంజాబీ పాటలు, బబ్బూ మాన్ పాటలు కూడా ఉంటాయి.
ఒకప్పుడు శాకాహారి అయిన నీరజ్ ఆటల్లోకి వచ్చాక మాంసాహారం తినడం మొదలుపెట్టాడు.
జంక్‌ఫుడ్ అయినప్పటికీ పానీపూరీ అతడి ఫేవరేట్.
పొడవైన జుట్టు కారణంగా సోషల్ మీడియాలో అందరూ నీరజ్‌ను ‘మోగ్లీ’ అని పిలుస్తుంటారు.
నీరజ్ రియో ఒలింపిక్స్‌లో ఆడలేదు. క్వాలిఫయింగ్‌కు గడువు ముగిసిన తర్వాత ఆయన ఒలింపిక్స్ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. దీంతో చాలా నిరాశ చెందాడు. కానీ, టోక్యోలో అలా జరగనివ్వలేదు.
టోక్యోతో పాటు ఇప్పుడు పారిస్‌లోనూ వరుస పతకాలు గెలిచి భారత జావెలిన్ ప్రపంచంలో నీరజ్ చరిత్ర సృష్టించాడు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














