వినేశ్ ఫొగాట్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే..

- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హరియాణాలోని చర్ఖీ దాద్రీ జిల్లాలోని బలాలీ గ్రామం.
మేము ఈ ఊరిలోకి ప్రవేశించిన వెంటనే, ప్రతి భారతీయ క్రీడా ప్రేమికుని మనసులో బుధవారం నుంచి గూడు కట్టుకున్న బాధ, విచారం స్పష్టంగా కనిపించాయి.
అన్నీ సక్రమంగా జరిగి ఉంటే, ఈ గ్రామంలో భారీగా విజయోత్సవాలు జరిగి ఉండేవి.
కానీ పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ అనర్హత వార్త తెలియగానే ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది.
బుధవారం మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ అధిక బరువు కారణంగా, ఆమెను ఫైనల్ మ్యాచ్‌కు అనర్హురాలిగా ప్రకటించారు.
దీంతో, స్వర్ణం కోసం బలమైన పోటీదారుగా భావించిన వినేశ్‌కు రజత పతకం కూడా వచ్చే అవకాశం లేకుండాపోయింది.

వినేశ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే..
‘అంతర్జాతీయ మహిళా రెజ్లర్లు గీత, బబిత, వినేశ్, రీతూల గ్రామమైన బలాలీ హృదయపూర్వకంగా మీకు స్వాగతం పలుకుతోంది.’
బుధవారం మధ్యాహ్నం గ్రామంలోకి అడుగుపెట్టి, ప్రవేశద్వారం వద్ద రాసిన ఈ వాక్యాన్ని చదివి, మేము హరియాణాలో ‘కుమార్తెల’ పేర్ల ఆధారంగా గుర్తింపు పొందిన ఒక గ్రామానికి వచ్చామని సులభంగా ఊహించాం.
కొంతదూరం నడిచాక, ‘'వినేశ్ ఫొగాట్ ఇల్లు ఎక్కడ ఉంది?’' అని ఒక వ్యక్తిని అడిగాం.
ఆ వ్యక్తి, “ఇల్లు ముందుంది కానీ అక్కడెవరూ లేరు. వినేశ్ వాళ్ళ అమ్మ, వదిన ఇంట్లో ఉన్నా వాళ్ళు ఎవరితోనూ మాట్లాడడం లేదు” అన్నారు.
మేం వీధిలో దూరం నుంచి కనిపిస్తున్న వినేశ్ ఇంటి వైపు కదిలాం. పెద్ద ఇంటి మొదటి అంతస్తులోని అద్దాలపై ఐదు ఒలింపిక్ రింగులు దూరం నుంచే కనిపిస్తున్నాయి.
బహుశా ఈ రింగులు వినేశ్ గత తొమ్మిదేళ్లుగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న కలలను ప్రతిబింబిస్తున్నాయేమో.
మేం ఇంటి బయట ఉండి ఎన్నిసార్లు బెల్ కొట్టినా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వాళ్లూ మాతో పెద్దగా మాట్లాడలేదు.
కానీ, “ఈ అమ్మాయి విషయంలో ఏదో చాలా తప్పు జరిగింది” అనే మాట మాత్రం అక్కడ వినిపించింది.
ఇంటి బయట మమ్మల్ని కలవడానికి వచ్చిన వినేశ్ బంధువు మంజేష్ ఫొగాట్, “మేము ఉదయం నుంచి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఆమె పోటీ ఎప్పుడు జరుగుతుందా అని చూస్తుండగా, వార్తల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపించింది" అన్నారు.
“మేమూ టోర్నమెంట్లలో పోరాడాం, పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు కోచ్, ఫిజియో పూర్తి బాధ్యత వహిస్తారు. మా కోచ్‌లు రెండు గంటల ముందు మమ్మల్ని బరువు తూచేవాళ్లు. ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉంది అంటున్నారు, అలాంటప్పుడు కోచ్, ఫిజియోలు ఏం చేస్తున్నారు? 100 గ్రాములు తగ్గించడం పెద్ద విషయం కాదు. ఇదొక కుట్ర” అని ఆయన ఆరోపించారు.

సీఎంనూ కలవని వినేశ్ తల్లి
ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలప్పుడు రెండు పోలీసు వాహనాలు వేగంగా వచ్చి వీధిలో ఆగాయి. వినేశ్ ఇల్లు ఎక్కడ అని పోలీసులు అడుగుతున్నారు.
పోలీసులు సమీపంలో పార్క్ చేసిన వాహనాలను తొలగించడం ప్రారంభించారు.
ముఖ్యమంత్రి అక్కడికి వస్తున్నారని, వినేశ్ తల్లిని కలవాలనుకుంటున్నారని, దాని కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.
ఈ క్లిష్ట సమయంలో కుటుంబాన్ని ఓదార్చడానికి హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ వస్తున్నారని మేము మొదట అనుకున్నాం. కానీ, "ఇక్కడికి వస్తున్నది హరియాణా సీఎం కాదు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్" అని ఒక పోలీసు అధికారి చెప్పారు.
హరియాణాలో ఉన్న వినేశ్ కుటుంబాన్ని కలవడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వస్తున్నారా? ఇది వింతగా అనిపించినా, ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వచ్చారని, తిరిగి వెళుతుండగా వినేశ్ అనర్హత వార్త తెలిసి ఇక్కడికి వస్తున్నారని తెలిసింది.
అయితే, పోలీసులు అరగంట ప్రయత్నించినా వినేశ్ తల్లి ఇంటి తలుపు తీయలేదు. చాలా సేపు ప్రయత్నించాక, పోలీసుల ఆదేశాల మేరకు కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి గోడ దూకి, ఇంట్లోకి ప్రవేశించి ఎలాగోలా తలుపు తెరిచారు.
అయినప్పటికీ, వినేశ్ తల్లి ముఖ్యమంత్రిని కలవడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు. చివరకు భగవంత్ మాన్ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వినేశ్ అంకుల్, రెజ్లింగ్ కోచ్ మహావీర్ ఫొగాట్‌ను కలిసి వచ్చారు.
ఈలోగా చాలా మంది జర్నలిస్టుల కార్లు వచ్చి ఇంటి వెలుపల నిలిచాయి. కానీ కొంత సమయం తర్వాత అందరూ తమ కెమెరాలతో కొన్ని ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు.
మేం చాలా సేపు వేచి ఉండటం చూసి కొంతమంది గ్రామస్తులు.. "మీకు ఇక్కడ ఏమీ దొరకదు. మీరూ అకాడమీకి వెళ్ళండి. మహావీర్ ఫొగాట్ జీ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు" అని సలహా ఇచ్చారు.
మహావీర్ ఫొగాట్‌ను చుట్టుముట్టిన మీడియా
మేం కొంతమందిని దారి అడుగుతూ, చివరికి మహావీర్ ఫొగాట్‌ని కలవడానికి రెజ్లింగ్ అకాడమీకి చేరుకున్నాం. అక్కడ మీడియా సమావేశం జరుగుతోంది.
మహావీర్ నిశ్శబ్దంగా ఉన్న దాదాపు రెండు డజన్ల మంది ప్రజల మధ్య కూర్చున్నారు. ఆయన కళ్ళలో నిరాశ, ముఖంలో అలసట కనిపిస్తున్నాయి. ఆయన గత కొన్ని గంటలుగా నిరంతరం మీడియాతో మాట్లాడుతున్నారని మాకు తెలిసింది.
ఒక జర్నలిస్ట్ తన ఛానెల్ లైవ్‌లో ఆయనతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరొకరు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నారు.
ఆ గదిలోని వాతావరణం శోకపూరితంగా ఉంది. అందరి ముఖాల్లో 'వినేశ్ విషయంలో ఏదో తప్పు జరిగింది' అన్న బాధ కనిపిస్తోంది.
మహావీర్ ఫొగాట్‌తో మాట్లాడేందుకు వేచి చూస్తున్న జర్నలిస్టుల క్యూలో మేమూ నిలుచున్నాం. మా వంతు రాగానే ఆయన, “వినేశ్ ఫైనల్స్‌కు చేరుకుందని తెలియగానే మేము చాలా సిద్ధం చేశాం. బాణాసంచా, మిఠాయిలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. తనపై అనర్హత వేటు వేసినట్లు ఉదయం వార్తలు రావడంతో మాకు చాలా బాధ కలిగింది" అన్నారు.
"దీనికి నేను కోచ్‌నే తప్పు పడతాను. ఆమె బరువు తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఆమె తినే ఆహారం మీద ఒక దృష్టిపెట్టాలి. ఇది కోచ్ నిర్లక్ష్యమే అంటాను. ఆమె తలపై 200 గ్రాముల వెంట్రుకలు ఉన్నాయి, ఆ జుట్టును పూర్తిగా కత్తిరించి, గుండు చేసి ఉంటే సరిపోయేది. ఈ విషయం నా దృష్టికే రాలేదు, నేను వాళ్లను సంప్రదించలేకపోయాను’’ అని ఆయన చెప్పారు.

బజరంగ్ పునియా ఏం చెప్పారు?
అంతకుముందు బుధవారం ఉదయం 9 గంటలకు, మేము సోనిపత్‌లో బజరంగ్ పునియాతో మాట్లాడాం. వినేశ్‌పై అనర్హత వేటు పడిందన్న వార్త అప్పటికి బయటకు రాలేదు. సెమీ ఫైనల్‌లో ఆమె విజయం పట్ల బజరంగ్ పునియా చాలా సంతోషంగా ఉన్నారు.
ఆ రోజు వినేశ్ స్వర్ణం తెస్తుందని, సెమీఫైనల్లో విజయం సాధించడం తమను సమర్థించని వారికి చెంపదెబ్బ అని ఆయన ఇంటర్వ్యూలో పదే పదే అంటున్నారు.
బుధవారం ఉదయం మాట్లాడుతున్నప్పుడే, వినేశ్ బరువుపై బజరంగ్ పునియా ఆందోళన వ్యక్తం చేశారు.
"ఏ ఆటగాడూ ముందుగా సంబరాలు చేసుకోడు. ముందుగా బరువు తగ్గించుకోవాలి. 50 కిలోల కంటే తక్కువకు బరువును తగ్గించడం కష్టం. అబ్బాయిలు త్వరగా బరువు తగ్గుతారు. అబ్బాయిలకు ఎక్కువ చెమట పడుతుంది. అదే అమ్మాయిలకు చాలా కష్టం. బరువును 50 కిలోల కంటే తక్కువకు తీసుకురావడానికి చాలా కష్టపడాలి" అని ఆయన అన్నారు.
"గత ఆరు నెలలుగా, ఆమె బరువు తగ్గడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. కొద్దిగా నీరు, ఒకటో, రెండో రోటీలు తింటోంది. బరువు తగ్గడం చాలా కష్టం. అయితే, వినేశ్ ఫొగాట్ అక్కడ నిలబడ్డమే మాకు పతకం" అని బజరంగ్ పునియా అన్నారు.
మేము బజరంగ్ పునియా భార్య, వినేశ్ ఫొగాట్ సోదరి అయిన సంగీతా ఫొగాట్‌ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం. బజరంగ్ స్వయంగా ఆమెను తీసుకురావడానికి వెళ్ళినా, కొంత సమయం తరువాత తిరిగి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదని చెప్పారు.
‘‘ఆమె మనసు ఇప్పుడేం బాగాలేదు’’ అని ఆయన బాధతో చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














