హాకీలో కాంస్యం: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం అందించిన పురుషుల హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది.
స్పెయిన్‌పై 2-1 తేడాతో గెలిచి ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకాన్ని అందించింది.
2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు తాజా పతకంతో వరుసగా రెండోసారి కాంస్యం సాధించినట్లయింది.
ఈ మ్యాచ్‌లో స్పెయిన్ జట్టులో మార్క్ మిరాల్స్ ఒక గోల్ చేయగా.. భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించారు.
రెండు సార్లు పెనాల్టీ కార్నర్‌లను హర్మన్ విజయవంతంగా గోల్స్‌గా మలిచాడు.
ఈ ఒలింపిక్స్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మొత్తం 11 గోల్స్ చేశాడు.

1972 తరువాత మళ్లీ ఇప్పుడే..
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ తరువాత మళ్లీ ఇప్పుడు వరుసగా రెండు పతకాలు సాధించింది భారత హాకీ జట్టు.
ఇంతకుముందు 1968, 1972లో వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలుచుకుంది.
మంగళవారం(06.08.2024) జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయిన భారత జట్టు కాంస్యం కోసం గురువారం(08.08.2024) స్పెయిన్‌తో ఆడింది.
హాకీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ అయిదో స్థానంలో ఉండగా స్పెయిన్ 8వ స్థానంలో ఉంది.
స్పెయిన్ కూడా నెదర్లాండ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 0-4తో ఓడిపోవడంతో భారత్‌తో కాంస్యం కోసం పోటీ పడింది.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీజేష్‌కు ఇదే చివరి మ్యాచ్
భారత గోల్‌కీపర్ శ్రీజేష్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్.
ఆట చివరి 40 సెకన్లలో స్పెయిన్‌కు ఒక పెనాల్టీ కార్నర్ వచ్చింది. దాంతో స్కోర్ సమం చేయడానికి స్పెయిన్‌కు ఒక అవకాశం వచ్చింది.
అయితే, గోల్ కీపర్ శ్రీజేష్ స్పెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యం కొనసాగింది.
అది, భారత్ విజయాన్ని ఖాయం చేసింది.
కాగా స్వర్ణం గెలవలేకపోయినందుకు హర్మన్ ప్రీత్ సింగ్ దేశానికి క్షమాపణలు చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..
భారత పురుషలు హాకీ జట్టు:
హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), శ్రీజేష్(గోల్ కీపర్), సంజయ్, సుమిత్, మన్‌దీప్ సింగ్, అభిషేక్ నయన్, మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యయ, హార్దిక్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్, వివేక్ ప్రసాద్, అమిత్ రోహిదాస్, శంషేర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, జర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














