కమిటీ కుర్రోళ్ళు రివ్యూ : ఈ కోనసీమ కథ ఆకట్టుకుందా

ఫొటో సోర్స్, Twitter@IAmVarunTej
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా విడుదలైన సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు.’
కోనసీమలోని ఒక గ్రామంలో ఉండే కుర్రాళ్ల కథ ఇది. ఇరవై మందికి పైగా కొత్త నటులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? ఈ రివ్యూలో చూసేద్దాం.
ఈ కథ 1990ల నాటిది. ఆ కాలంలో ఒక గ్రామంలో ఉండే కుర్రాళ్ల స్నేహం, వారి ప్రేమలు, చదువులు, ఆ గ్రామ జాతర, రాజకీయాలు కేంద్రంగా సాగేది ఈ కథ.
ఆ ‘కమిటీ కుర్రోళ్ళ’ మధ్య గొడవతో గ్రామం మొత్తం ఎలా విడిపోయింది? వారి వల్ల జాతర ఎందుకు ఆగిపోయింది? ఆ ఊరి రాజకీయాల్లో వారు ఏం మార్పు తెచ్చే ప్రయత్నం చేశారు? అనేది ఈ కథలో చూపించారు.

ఫొటో సోర్స్, Twitter@IAmVarunTej
ఎవరెలా నటించారు?
ఒక వ్యక్తి హీరోగా రాసిన కథ కాదు కనుక ఎన్నో క్యారెక్టర్స్ ముఖ్య పాత్రలుగా ఈ సినిమాలో ఉన్నాయి.
అందులో కమిటీలో ఉన్న కుర్రాళ్లుగా శివ (సందీప్), సూర్య (యశ్వంత్), విలియం (ఈశ్వర్), సుబ్బు (త్రినాథ్) ఫర్వాలేదనిపించారు.
సుబ్బు పాత్రను వయసుకు తగినట్టు మార్చి చూపించడం వల్ల ఆ ఎమోషనల్ ఇంటెన్సిటీ తగ్గిపోయింది. ప్రసాద్ బెహరా మాత్రం ‘పెద్దోడు’ పాత్రలో చురుక్కులు తగిలించాడు.
సాయి కుమార్ పాత్రకు స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటం సినిమాకు పెద్ద లోటుగా అనిపిస్తుంది.
ఆ తక్కువ స్క్రీన్ టైమ్‌లోనే సాయికుమార్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు.
పాత్రలు తమ పరిధిలో బాగానే నటించినా, క్యారెక్టర్స్ కథ స్పేస్‌కి మించి ఉండటం వల్ల ఏ పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే మ్యాజిక్ చేయలేకపోయింది.

ఫొటో సోర్స్, Twitter@PinkElephant_P
పాటలు, సినిమాటోగ్రఫీ ఎలా ఉన్నాయి?
ఈ సినిమాలోని పాటలు ఒకే రకంగా ఎక్కడా అనిపించవు. సినిమాలో ఉన్న నాలుగు పాటలకు ప్రాధాన్యం ఉంది.
కథకు పాటలకు మధ్య ఒక కెమిస్ట్రీ ఉంది. కథలో ముఖ్య భాగమైన జాతర. ఈ జాతర గురించి సింహాచలం రాసిన లిరిక్స్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయో.. దానికి అనుదీప్ మ్యూజిక్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంది.
ఇక మిగిలిన పాటల నేపథ్యం బాగున్నా, ఇప్పటికే ఈ తరహాలో అనేక పాటలు రావడంతో ఒరిజినాలిటీ లేదన్న భావన కలుగుతుంది.
అలాగే భిన్న నేపథ్యాల్లో ఉండే ఈ పాటలైనా సంగీత వైవిధ్యం ఎక్కువ కనిపించకపోవడం లోటు.
కోనసీమ ప్రకృతి అందాలను సినిమాటోగ్రాఫర్ ‘రాజు ఎదురురోలు’ చాలా అందంగా స్క్రీన్ మీద చూపించారు. లైటింగ్, విజువల్స్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
సినిమానా? డాక్యుమెంటరీనా?
డాక్యుమెంటరీ అంటే ఒక కాలంలో జరిగిన సంఘటనలు క్రమంలో చెప్తుంది. దానికి కాన్‌ఫ్లిక్ట్, పాత్రల బలం, డైలాగ్స్, ఎమోషన్స్ వంటి వాటితో సంబంధం లేదు. అలా వీటితో సంబంధం లేకుండా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను విసిగిస్తుంది.
రిజర్వేషన్ వల్ల నష్టపోయిన విద్యార్థి ఘటన లాంటి ఒక పవర్‌ఫుల్ సన్నివేశం కూడా ఈ డాక్యుమెంటరీ శైలి వల్ల తేలిపోయింది.
డాక్యుమెంటరీలో ఫ్యాక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. 90ల జనరేషన్‌లో ఆడిన ఆటలు, యవ్వనంలో వారి సరదాలు-ప్రేమలు, కుల సమస్యలు ఇలా అనేకం ఈ కథలో ఉన్నాయి.
కానీ ఇవన్నీ ఒక బలమైన అంశాన్ని అల్లుకుని నిర్మించకుండా, ఒక దశకంలో ఉన్న యువకుల కథగా చెప్పడం వల్ల ఇవి బలహీనమైపోయాయి.
అందుకే ఈ అంశాలను ఫ్యాక్ట్స్‌గా మాత్రమే ప్రేక్షకులు గుర్తించగలరు గానీ, వాటిని తమ జీవితంలోని జ్ఞాపకాలతో అనుసంధానించుకోలేరు.
మొత్తంగా స్టోరీ నెరేషన్‌లో ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయి, సెకండ్ హాఫ్ కొంత ఎమోషనల్ ఫ్లోతో ఫర్వాలేదనిపించింది.

ఫొటో సోర్స్, Twitter@PinkElephant_P
ప్లస్ పాయింట్స్
1) సినిమాటోగ్రఫీ, సంగీతం
2) గ్రామ జీవితంలో ఉండే సహజత్వాన్ని చూపించడం
3) సెకండ్ హాఫ్‌లో స్టోరీ కనెక్షన్, ఎమోషనల్ ఫ్లో
4) సెకండాఫ్‌లో ప్రీ-క్లైమాక్స్‌లో ఉన్న ఎన్నికల సన్నివేశాలు సెటైర్‌తో ఉండటం
5) ప్రసాద్ బెహరా పంచ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్
మైనస్ పాయింట్స్
1) ప్రారంభ సన్నివేశం బలంగా ఉన్నా, దానితో కనెక్ట్ చేయకుండా దాదాపు గంట పాటు కమిటీ కుర్రోళ్ళ బాల్యం, టీనేజ్‌ల గురించి బలమైన నేపథ్యం లేకుండా చూపించడం
2) గ్రామంలో జాతర, రాజకీయ నేపథ్యాన్ని బలపరిచే సన్నివేశాలు ఫస్ట్ హాఫ్‌లో ఉండకపోవడం
3) కథలో పాత్రలు ఎక్కువ ఉన్నప్పుడు వాటిని ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే మ్యాజిక్ స్క్రీన్‌ప్లేలో లేకపోవడం
టైటిల్‌కి తగ్గ విషయం ఉన్న సినిమానే అయినా, సస్పెన్స్ కలిగించే అంశాలు, ఏం జరుగుతుందో అని ఎదురుచూసేలా ఉత్కoఠ కలిగించే బిగి స్క్రీన్‌ప్లే ఫస్ట్ హాఫ్‌లో లేకపోవడం వల్ల ఈ 'కమిటీ కుర్రోళ్ళు' ప్రేక్షకులతో కనెక్ట్ కావడంలో కొంత సాగదీతగా అనిపించింది.
మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ, ఎక్కువ పాత్రలతో గజిబిజి అయ్యింది. కథేమో ఆలస్యంగా ట్రాక్ ఎక్కి, ఫస్ట్ హాఫ్‌లో విసిగించి, తర్వాత ఫర్వాలేదనిపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














