8 రోజుల కోసం స్పేస్‌లోకి వెళ్లి చిక్కుకుపోయారు, 8 నెలలు అక్కడే ఉండాలి

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ న్యూస్
2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు.. అక్కడే కొన్ని రోజులు గడిపి తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది. అయితే, అన్నీ అనుకున్నట్లు జరగలేదు.
బారీ విల్‌మోర్, సునీత విలియమ్స్ రెండు నెలల తర్వాత కూడా ఇంకా అక్కడే ఉన్నారు.
ఎప్పుడు తిరిగి వస్తారో తెలియకుండా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ వ్యోమగాములు వేసవితో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు కూడా అక్కడే జరుపుకోవాల్సిన పరిస్థితి.
61ఏళ్ల విల్‌మోర్, 58 ఏళ్ల సునీత విలియమ్స్ బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఈ కొత్త అంతరిక్ష వ్యౌమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరినీ ఇందులో పంపించారు.

అయితే, ఈ వ్యౌమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ఇందులో ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి.
అయినప్పటికీ, వారు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు. కానీ, తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే స్టార్ లైనర్‌లో భూమిపైకి తిరిగిరావడం అంత సురక్షితం కాదు.
వాళ్లిద్దర్నీ భూమి మీదకు తీసుకు వచ్చేందుకు చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అధికారులు తెలిపారు.
"విల్‌మోర్, సునీతను స్టార్ లైనర్ అంతరిక్షనౌకలోనే తిరిగి భూమికి తీసుకురావాలనేది మా తొలి ప్రాధాన్యం. ఇతర ప్రత్యామ్నాయాల విషయంలో మాకొక ప్రణాళిక ఉంది" అని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ తెలిపారు.

‘‘వాళ్లిద్దరినీ భూమి మీదకు తీసుకురావడానికి ప్రస్తుతానికి ఒక బలమైన ప్రత్యామ్నాయం ఉంది. అదేంటంటే..సెప్టెంబర్‌లో మరో వ్యోమనౌకను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపిస్తున్నాం. 2025 ఫిబ్రవరిలో అది తిరిగి వస్తుంది. అందులో వీరిద్దరినీ తీసుకురావాలని అనుకుంటున్నాం’’ అని నాసా అధికారులు తెలిపారు.
‘‘అంతరిక్ష కేంద్రానికి పంపించే క్రూ డ్రాగన్ వ్యోమనౌకను స్పేస్ఎక్స్ తయారు చేసింది. అందులో నలుగురిని పంపించాలని అనుకున్నాం. అయితే అవసరాన్ని బట్టి రెండు సీట్లు ఖాళీగా ఉంచుతాం’’ అని చెప్పారు.
కాకపోతే, ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లిన వీరిద్దరూ ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఎనిమిది నెలలు ఉండాల్సి ఉంటుంది.
క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కనుక ఉపయోగిస్తే, స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఎవరూ లేకుండా కంప్యూటర్ కంట్రోల్ సాయంతో భూమి మీదకు తీసుకువస్తారు.
దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని నాసా అధికారులు తెలిపారు.
స్టార్‌లైనర్‌ను తిరిగి భూమి మీదకు వచ్చే అవకాశాలు గత రెండు వారాల్లో కాస్త మెరుగయ్యాయని నాసా అంతరిక్ష కార్యకలాపాల డైరెక్టర్ కెన్ బోవర్సాక్స్ చెప్పారు.
“మేం దాన్ని నిశితంగా గమనిస్తున్నాం. కచ్చితంగా భూమి మీదకు తీసుకురాగలమని అనుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను ఒకవేళ స్పేస్‌ఎక్స్ రూపొందించిన స్పేస్ క్రాఫ్ట్‌లో తీసుకొస్తే అది బోయింగ్ కంపెనీకి పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే స్పేస్‌ఎక్స్ కంపెనీతో బోయింగ్ చాలాకాలంగా పోటీ పడుతోంది.
ఈ వారం మొదట్లో ఇద్దరు వ్యోమగాములకు ఆహార పదార్థాలను, దుస్తులను అందజేసేందుకు స్పేస్‌ఎక్స్ రాకెట్‌ను పంపించారు.
‘‘స్టార్ లైనర్ అద్భుతంగా ఉంది. మేం అనుకున్న సమయానికే తిరిగి వస్తామని విశ్వాసం ఉంది’’ అని గత నెలలో అంతరిక్షం నుంచి మాట్లాడుతూ విల్‌మోర్, సునీత చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నేవీ హెలికాప్టర్ పైలట్‌గా పనిచేసి రిటైర్ అయిన సునీత విలియమ్స్ అంతర్డాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం ఇది మూడోసారి.
అలాగే ఫైటర్ జెట్ పైలట్‌గా పనిచేసిన విల్‌మోర్ కూడా గతంలో రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు.
“మేం ఇక్కడ చాలా బిజీగా ఉన్నాం. సిబ్బందితో కలిసిపోయాం” అని ఇటీవల అంతరిక్షం నుంచి జరిపిన సంభాషణలో విలియమ్స్ అన్నారు.
‘‘మాకు తిరిగి ఇంటికి వచ్చినట్టుగానే ఉంది. అటూ, ఇటూ ఇలా తేలుతూ ఉంటే చాలా బాగుంది. ఇలా అంతరిక్షంలో ఉండటం అద్భుతంగా ఉంది’’ అని వారు చెప్పారు.
స్టార్‌లైనర్ వ్యోమనౌక అంతరిక్షానికి తరచుగా వెళ్లి రావడానికి మార్గం సుగమం చేస్తుందని బోయింగ్ ఆశించింది.
ఇక స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ నాసాతో కలిసి పనిచేసేందుకు 2020లో అనుమతి పొందింది.
అంతకుముందు కూడా నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగానే వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నారు.
1990లో రష్యన్ వ్యోమగామి వలెరీ పులికోవ్ 437 రోజులపాటు మిర్ స్పేస్ స్టేషన్‌లో గడిపారు.
గత ఏడాది ఫ్రాంక్ రుబియో 371 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండి వచ్చారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన అమెరికన్ వ్యోమగామి ఆయనే.
అంతరిక్షం నుండి మాట్లాడినప్పుడు ఇచ్చిన ఇంటర్వూలో... తాము అనుకోకుండా అంతరిక్షంలో ఇన్ని రోజులు ఉండాల్సి రావడం చాలా బాగుందని సునీత విలియమ్స్, విల్‌మోర్ అన్నారు.
అదనంగా కొన్ని వారాలు ఇక్కడ ఉండాల్సి వచ్చినందుకు తాము ఎటువంటి ఫిర్యాదు చేయమని, ఇలా ఉండటం తమకు నచ్చిందని చెప్పారు.
పరిస్థితులు ఎలా ఉన్నా, వీరు కొన్ని వారాల పాటు అంతరిక్షంలోనే ఉంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















