భారత్ ధనిక దేశంగా మారేందుకు ఇంకా ఎన్నేళ్లు పడుతుంది? ఆలోగా జనం వృద్ధులైపోతారా?

ఇండియా, ఎకానమీ, తలసరి ఆదాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చెన్నైలోని ఓ కర్మాగారంలో మోటార్ ‌సైకిల్‌ను అసెంబుల్ చేస్తున్న కార్మికులు
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత దేశాన్ని 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండేళ్లుగా చెబుతున్నారు. రానున్న ఆరేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని అనేక సూచీలు చెబుతున్నాయి.

అధికాదాయ ఆర్థిక వ్యవస్థల్లో స్థూల జాతీయ ఆదాయంలో వ్యక్తుల, వ్యాపారాల తలసరి ఆదాయం దాదాపు 12 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

ప్రస్తుతం భారత దేశ తలసరి ఆదాయం రెండు లక్షల వెయ్యి రూపాయలు మాత్రమే. ఈ లెక్కన చూస్తే భారత్ దిగువ మధ్య తరగతి దేశాల జాబితాలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ఎకానమీ వలలో చిక్కుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఒక దేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ, వేగంగా అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

ఏదైనా దేశం “ఒక వలలో చిక్కుకుని ఖర్చులు పెరిగి పోటీ పడే స్వభావాన్ని నష్టపోయినట్లు కనిపించడాన్ని” ఇలాంటి పరిస్థితిగా అభివర్ణించారు ఆర్థిక వేత్త అర్డో హాన్నోసన్.

బీబీసీ వాట్సాప్ చానల్

ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక కూడా ఇలాంటి ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. భారత దేశ ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం, అది అమెరికన్ తలసరి ఆదాయంలో పావు శాతం సాధించడానికి 75 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నివేదిక-2024 చెబుతోంది.

భారత్‌, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా ఎదగాలని భావిస్తున్న మరో వంద దేశాలు రానున్న కొన్ని దశాబ్దాల్లో ఇలాంటి ఆటంకాలను ఎదుర్కొంటాయని ఈ నివేదిక తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 40 శాతం వాటా 108 అభివృద్ధి చెందుతున్న దేశాలది. ప్రపంచవ్యాప్తంగా గాలిలో కలుస్తున్న కర్బన ఉద్గారాలలో ఈ 108 దేశాల నుంచి మూడింట రెండొంతులు వెలువడుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే ప్రపంచంలోని మూడొంతుల జనాభా ఈ 108 దేశాల్లోనే ఉంది. ఇందులో మూడింట రెండొంతుల మంది తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు.

భారత దేశం, అమెరికా, మెక్సికో, వరల్డ్ బ్యాంక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత దేశ తలసరి ఆదాయం రూ. 2,01,957

అభివృద్ధి చెందుతున్న ఎకానమీ అనే వలలో చిక్కుకుని ఈ దేశాలు భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు. వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో వృద్ధుల రక్షణ చర్యలు పెరగడం, సంప్రదాయ ఇంధనం నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం వైపు మళ్లడం లాంటివి ఈ సవాళ్లలో ఉన్నాయి.

“అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అగ్ర స్థానానికి చేరుకోవాలనే యుద్ధంలో గెలిచినా, ఓడినా అది చాలా భారీగా ఉంటుంది” అని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్, పరిశోధకుల్లో ఒకరైన ఇందర్మిత్ గిల్ చెప్పారు.

“అయితే, ఈ దేశాలలో ఎక్కువ శాతం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారేందుకు కాలం చెల్లిన వ్యూహాల మీదనే ఆధారపడుతున్నాయి. అవి సుదీర్ఘకాలం కాలం పాటు పెట్టుబడులు పెడుతూనే ఉండటం లేదా ఫలితాల దశలోనే ఉన్న అన్వేషణలను ఆచరించడం” లాంటివి చేస్తున్నాయని ఆయన చెప్పారు.

ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యాపారాలు వృద్ధి చెందే రేటు నిదానంగా ఉండటం ఒకటని పరిశోధకులు చెప్పారు.

అమెరికా, మెక్సికో, పెరూలో పని చేస్తున్న సంస్థల పరిమాణం రెట్టింపు కావడానికి 40 ఏళ్లు పడుతోంది. అదే అమెరికాలో అయితే 40 ఏళ్లలో సంస్థల పరిమాణం ఏడు రెట్లు పెరుగుతోంది.

మధ్య ఆదాయ దేశాల్లో సంస్థల ఎదిగేందుకు ఎంత కష్టపడాలో ఈ లెక్కలు చెబుతున్నాయి. సంస్థ ఎదగడానికి ఇబ్బంది పడుతున్నా, ఇవి దశాబ్దాల పాటు కొనసాగుతున్నాయి. భారత్, పెరు, మెక్సికోలలో 90 శాతం కంపెనీల్లో ఐదుగురు కంటే తక్కువ ఉద్యోగులు ఉన్నారు. కొన్ని సంస్థల్లోనే పది, అంత కంటే ఎక్కువ మంది ఉన్నారని నివేదిక తెలిపింది.

వృద్ధిరేటు, ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ+

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరాలంటే భారత్ కొత్త విధానాలు అనుసరించడం అవసరం అంటున్న నిపుణులు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధిరేటు వేగంగా పెరగాలంటే కొత్త మార్గాన్ని అనుసరించాలని గిల్‌తో పాటు ఆయన సహచర పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ దేశాలు ఎక్కువగా పెట్టుబడుల మీద దృష్టి సారించాలి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడంతో పాటు ఆవిష్కరణల మీద దృష్టి పెట్టాలని వారు చెబుతున్నారు.

దీనికి దక్షిణ కొరియా చక్కని ఉదాహరణ అని అంటున్నారు.

1960లో దక్షిణ కొరియా తలసరి ఆదాయం 1,200 డాలర్లు. 2023 నాటికి అది 33 వేల డాలర్లకు పెరిగింది. దక్షిణ కొరియా మొదట ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో భారీగా పెరట్టుబడులను ప్రోత్సహించింది. 1970లో ఈ దేశం తమ పారిశ్రామిక విధానాన్ని మార్చుకుంది. దేశంలోని చిన్న చిన్న సంస్థలు కూడా విదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, ఆధునిక ఉత్పాదక విధానాలను అమలు చేసేలా ప్రోత్సహించింది.

శాంసంగ్ లాంటి సంస్థలు దీనికి స్పందించాయి. మొదట్లో నూడుల్స్ తయారు చేసే శాంసంగ్ తర్వాతి కాలంలో జపాన్ సంస్థల నుంచి లైసెన్సులు తీసుకుని దేశీయ మార్కెట్ కోసం టీవీలు తయారు చేయడం మొదలు పెట్టింది.

ఇది విజయవంతం కావడంతో వృత్తి నిపుణులకు గిరాకీ పెరిగింది. దీంతో యూనివర్సిటీల్లో ఇలాంటి నైపుణ్యాలు నేర్పేందుకు నిధులు పెంచడంతో పాటు లక్ష్యాలను నిర్దేశించింది ప్రభుత్వం. ఇవాళ శాంసంగ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ. ప్రపంచంలో అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు ఉత్పత్తి చేసే సంస్థ కూడా అదే.

శాంసంగ్, నార్త్ కొరియా, శాంసంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నూడుల్స్ తయారు చేసే సంస్థగా ప్రయాణం ప్రారంభించి ప్రపంచలోనే అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా ఎదిగింది శాంసంగ్

పోలండ్, చిలీ లాంటి దేశాలు కూడా ఇదే బాటలో నడిచాయని నివేదిక తెలిపింది. పశ్చిమ యూరోపియన్ దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి పోలండ్ ఉత్పాదకతను పెంచుకుంది. స్థానికంగా కొత్త వాటిని కనుక్కునేందుకు అవసరమైన సాంకేతికతను అందించడం, నార్వేజియన్ సాల్మన్ వ్యవసాయ విధానాలను పాటించి సాల్మన్ చేపల ఎగుమతిలో ప్రపంచంలో ఉన్నత స్థానానికి చేరింది.

మధ్య ఆదాయ దేశాలు ఎలాంటి చిక్కుల్లో చిక్కుకుంటాయనే దాని గురించి చరిత్ర కావల్సినన్ని ఆధారాలను అందిస్తుంది.

దేశాలు ఆర్థికంగా ఎదిగే కొద్దీ అవి పదిశాతం వృద్ధి రేటు వద్ద తమను తాము మధ్య ఆదాయ దేశాలుగా ప్రకటించుకోవడం ద్వారా ఉచ్చులో చిక్కుకుంటాయి. అయితే అది మధ్య ఆదాయ దేశాలుగా గుర్తింపు పొందడానికి మధ్యలో ఉన్నట్లు అని ప్రపంచ బ్యాంకు సూత్రీకరించింది.

1990 నుంచి 34 మధ్య ఆదాయ దేశాలు మాత్రమే అధిక ఆదాయ దేశాల హోదా పొందే స్థాయికి ఎదిగాయి. అందులో మూడో వంతు యూరోపియన్ యూనియన్‌లో చేరడం ద్వారా లబ్ధి పొందడం లేదా కొత్తగా చమురు నిల్వలను కనుక్కోవడం ద్వారా జరిగింది.

భారత దేశ ప్రజల తలసరి ఆదాయం రానున్న రోజుల్లో 4 శాతం చొప్పున పెరిగినా 2060 నాటికి అది 10 వేల డాలర్లకు మాత్రమే చేరుతుంది. ఇది ప్రస్తుత చైనా తలసరి ఆదాయం కంటే తక్కువ అని ఆర్థిక వేత్తలు రఘురామరాజన్‌, రోహిత్ లంబా వేర్వేరుగా అంచనా వేశారు.

“మనం బాగా పని చేయాలి. రానున్న దశాబ్ధంలో కూడా మనకు జనాభాపరంగా లాభం ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే రానున్న దశాబ్ధంలో కూడా భారతదేశంలో శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం ముసలి వాళ్లం కావడానికి ముందే మనం బాగా పని చేయాలి” అని ఈ అర్థికవేత్తలిద్దరూ ఇటీవల రాసిన తమ కొత్త పుస్తకం ‘ద మౌల్డ్ : రీమెయినింగ్ ఇండియాస్ ఫ్యూచర్‌’లో చెప్పారు.

“దేశంలో యువతకు ఉపాధి అందించగలిగితే, మనం వృద్ధి రేటుని పెంచవచ్చు. మన దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడానికి ముందే మనం ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి” అని అందులో చెప్పారు.

దీన్ని మరో మాటలో చెప్పాలంటే.. “భారత దేశంలో వృద్ధ జనాభా పెరిగిపోక ముందే అది సంపన్న దేశంగా మారగలదా” అని ఆ రచయితలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)