జో బైడెన్‌ అమెరికా తదుపరి అధ్యక్షుడు, కమలాహారిస్ ఉపాధ్యక్షురాలు... తీవ్ర ఉద్రిక్తతల నడుమ ధ్రువీకరించిన కాంగ్రెస్

బైడెన్, హారిస్

ఫొటో సోర్స్, EPA/BIDEN CAMPAIGN/ADAM SCHULTZ

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నికను యూఎస్ కాంగ్రెస్ ధ్రువీకరించింది.

పెన్సిల్వేనియా, ఆరిజోనా రాష్ట్రాల ఓట్లపై వచ్చిన అభ్యంతరాలను సెనేట్‌, సర్వప్రతినిధుల సభ రెండూ తోసిపుచ్చిన తరువాత ఎలక్టోరల్ ఓట్ల ధ్రువీకరణ జరిగింది.

బుధవారం నాడు కాంగ్రెస్ చేపట్టిన విధాన ప్రక్రియకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్ మీదకు దాడి చేయడంతో అంతరాయం ఏర్పడింది. దాడికి పాల్పడిన వ్యక్తులను భవనం నుంచి పంపించిన తరువాత సభ మళ్లీ మొదలై రాత్రంతా కొనసాగింది.

యూఎస్ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల ఎన్నికను నిర్ధరించిన కాసేపటికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, "జనవరి 20న అధికార బదలాయింపు ప్రక్రియ పద్ధతి ప్రకారం జరిగేలా చూసేందుకు" కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్‌లోనూ ఆయన ఎన్నికల్లో అవినీతి జరిగిందంటూ నిరాధార ఆరోపణలను కొనసాగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"ఈ ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా ఏకీభవించకపోయినప్పటికీ, జనవరి 20 న జరగనున్న అధికార బదిలీ క్రమబద్ధంగా జరుగుతుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనను ఆయన ప్రతినిధి ట్విటర్ అకౌంట్ కామెంట్ బాక్సు ద్వారా పోస్టు చేశారు. ట్రంప్ అకౌంట్‌ను ట్విటర్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. "చట్టబద్ధంగా పోల్ అయిన ఓట్లను మాత్రమే లెక్కించేందుకు మేము పోరాడుతూనే ఉంటామని చెబుతూనే ఉన్నాను.

అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత ఘనత వహించిన తొలి నాలుగేళ్ల పాలనకు ముగింపు పలుకుతున్నప్పటికీ, అమెరికాను ప్రతిష్ఠాత్మకంగా చేయడానికి మేము చేస్తున్న పోరాటానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను సవాలు చేస్తూ ట్రంప్ మద్దతుదారులు నమోదు చేసిన 60 కి పైగా కోర్టు కేసులు వీగిపోయాయి.

'ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్‌పై నిషేధం నిరవధికంగా కొనసాగుతుంది' -జుకర్‌బర్గ్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో మిగిలిన చివరి రోజులను అధికార బదిలీ ప్రశాంతంగా జరగకుండా చూసేందుకు వాడుకునే అవకాశం ఉందని గత 24 గంటల్లో జరిగిన విస్మయాత్మక ఘటనలు రుజువు చేస్తున్నాయని ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ అన్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

నిరసనకారులను అదుపు చేయడానికి బదులు ప్రేరేపించడానికి తన సోషల్ ప్లాట్‌ఫార్మ్‌ను ఉపయోగించుకోవాలనే ఆయన నిర్ణయం అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలోని ప్రజలను కూడా ఆందోళనకు గురిచేసిందని, ఆయన పెట్టిన పోస్టుల ప్రభావాన్ని గుర్తించి వాటిని తొలగించామని జుకర్‌బర్గ్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను కాంగ్రెస్ ధ్రువీకరించిన నేపథ్యంలో అధికార బదలాయింపునకు మిగిలి ఉన్న 13 రోజులు ప్రశాంతంగా గడిచేలా, బదలాయింపు సాఫీగా జరిగేలా చూసే బాధ్యత మొత్తం దేశం మీద ఉందన్న జుకర్‌బర్గ్, ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బ్లాక్ చేసిన ట్రంప్ అకౌంట్లను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం రెండు వారాల పాటు ఆయన అకౌంట్లపై నిషేధం కొనసాగుతుందని అన్నారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

క్యాపిటల్ హిల్‌పై దాడిని ఖండించిన వైట్ హౌస్ అధికారులు

అమెరికా కాంగ్రెస్ భవనాన్ని నిరసనకారులు ముట్టడించడాన్ని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు దగ్గరగా పని చేసిన ఇద్దరు వైట్ హౌస్ మాజీ అధికారులు కూడా ఖండించారు. ట్రంప్ ఈ హింసను ప్రేరేపించారని అమెరికా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కూడా నేరుగా ఆరోపించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

"ఈ రోజు క్యాపిటల్ భవనం పై జరిగిన హింసాత్మక దాడులు... ట్రంప్ ప్రోత్సాహంతో అమెరికా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలే" అని ఆయన ఒక ప్రకటనలో అన్నారు. భ్రమల్లో ఉన్న కొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ట్రంప్ ఈ పనులు చేస్తున్నారని, వారి పేర్లు పిరికి వారిగా అపఖ్యాతితో మిగిలిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. సిరియాపై యుద్ధం విషయంలో అధ్యక్షునితో విభేదించిన మాటిస్ 2018లో తన పదవికి రాజీనామా చేశారు. జులైలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల సమయంలో కూడా ట్రంప్ స్పందించిన తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేసిన జాన్ కెల్లీ కూడా, "ఈ దేశ భూభాగంలో ఏ పదవికైనా ఎవరినైనా ఎన్నుకునే ముందు ప్రజలు చాలా లోతుగా ఆలోచించాలి. నిశితంగా దృష్టి కేంద్రీకరించాలి" అని అంటూ ట్వీట్ చేశారు. అభ్యర్థిని ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి నైతిక విలువలు, వ్యక్తిత్వం, సమగ్రతను మరింత అవగాహనతో పరిశీలించాలని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ ఈ దాడులపై చేసిన వ్యాఖ్యలను 'అద్యక్షుడి స్పందన'గా భావిస్తున్నానని కూడా కెల్లీ అన్నారు. ఆయన కూడా మాటిస్ లాగే 2018లో వైట్ హౌస్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ట్రంప్ పనితీరును బహిరంగంగా విమర్శిస్తున్నారు.

క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి

అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ అమెరికా పార్లమెంటు 'క్యాపిటల్' భవనంలోకి డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులు భారీ సంఖ్యలో దూసుకెళ్లారు. ట్రంప్ అనుకూల నినాదాలు చేస్తూ, జెండాలు ఊపుతూ.. పోలీసు రక్షణ వలయాన్ని కూడా చేధించుకుని ముందుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, అమెరికా పార్లమెంటుపైకి దండెత్తిన ట్రంప్ మద్దతుదారులు

క్యాపిటల్ భవనాన్ని ముట్టడించి, గదుల్లో తిరిగారు. గందరగోళం సృష్టించారు. ఈ హింసాత్మక అల్లర్లలో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 52 మందిని అరెస్ట్ చేసారు. వారిలో 47మంది కర్ఫ్యూ అమలును ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.

అల్లర్లలో చనిపోయిన మహిళను అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యాష్లీ బాబిట్‌గా గుర్తించారు. శాన్ డియాగోలో నివసించే బాబిట్ ట్రంప్‌కు మద్దతు తెలిపేవారని ఆమె బంధువులు తెలిపారు.

ప్రస్తుతం అమెరికా పార్లమెంట్‌లో ఏం జరుగుతోంది?

ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను చట్టసభ సభ్యులు ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బైడెన్ 306 ఓట్లు గెలుచుకోగా, ట్రంప్ 232 గెలుచుకున్నారు.

రాష్ట్రాలవారీగా ఎవరు ఎన్ని ఓట్లు గెలుచుకున్నారన్నది ప్రకటిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిపై రెండు గంటలపాటూ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు.

ఇంతకుముందే అరిజోనా ఎన్నికల ఫలితాలపై లేవనెత్తిన అభ్యంతరాలు వీగిపోయాయి.

పెన్సిల్వేనియాలో బైడెన్ విజయాన్ని ధృవీకరించడంపై తెలిపిన అభ్యంతరాలను కూడా తిరస్కరించారు. జైడెన్ గెలుపును అంగీకరిస్తూ 92మంది ఓటు వేయగా, కేవలం ఏడుగురు మాత్రమే అభ్యంతరాలు లేవనెత్తారు. దీని తరువాత, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఇంక అభ్యంతరాలు ఉండబోవని సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కానల్ అభిప్రాయపడ్డారు.

డోనల్డ్ ట్రంప్ ట్విటర్, ఫేస్‌బుక్ అకౌంట్లు లాక్

అమెరికా పార్లమెంట్‌పై దాడి చేసిన అల్లరిమూకను ఉద్దేశిస్తూ ట్రంప్ ట్వీట్ చేసిన తరువాత ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ట్రంప్ అకౌంట్‌ను లాక్ చేసాయి.దాడికి పాల్పడినవారిని ఇంటికి తిరిగి వెళ్లిపొమ్మని సందేశం ఇచ్చేముందు ట్రంప్ వారిని ఉద్దేశిస్తూ "ఐ లవ్ యూ" అని సోషల్ మీడియాలో రాసారు.ట్రంప్ చేసిన మూడు ట్వీట్లు తమ "సివిక్ ఇంటిగ్రిటీ పాలసీ"కు వ్యతిరేకమని, వాటిని తొలగించకపోతే ట్రంప్ అకౌంట్ లాక్ అయి ఉంటుందని ట్విట్టర్ తెలిపింది.భవిష్యత్తులో ట్విట్టర్ నిబంధనలను పాటించకపోతే అమెరికా అధ్యక్షుడి అకౌంట్‌ను పూర్తిగా తొలగించవలసి వస్తుందని తెలిపింది.ఫేస్‌బుక్ ట్రంప్ అకౌంట్‌ను 24 గంటలపాటూ రద్దు చేసింది. యూట్యూబ్ కూడా ట్రంప్ వీడియోను తొలగించింది.ట్రంప్ సందేశాలు ప్రస్తుతం జరుగుతున్న హింసను తగ్గించకుండా, దాన్ని ఎగదోయడానికి కారణమవుతాయని, సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ అకౌంట్‌ను తాత్కాలికంగా రద్దు చేసామని ఫేస్‌బుక్ తెలిపింది.

సెనేట్ చాంబర్‌లోకి దూరిన ఒక ఆందోళనకారుడిపైకి గన్‌లు గురిపెట్టిన భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెనేట్ చాంబర్‌లోకి దూరిన ఒక ఆందోళనకారుడిపైకి గన్‌లు గురిపెట్టిన భద్రతా సిబ్బంది

అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు నగర మేయర్ మురియెల్ బౌజర్ ప్రకటించారు. మరో 15 రోజులవరకూ అంటే పదవీ స్వీకారం జరిగే మర్నాటివరకూ ఎమర్జెన్సీ కొనసాగించాలని తెలిపారు.నగరవాసులకు కావలసిన భద్రతా ఏర్పాట్ల దిశగా అదనపు బలగాలను మోహరించేందుకు ఈ ప్రకటన తోడ్పడుతుంది.ఇప్పటికే నగరంలో కర్ఫ్యూ అమలు చేసారు. అవసరమైతే అత్యవసర సేవలను విస్తరిస్తారని, నిత్యావసరాలు పంపిణీ చేస్తారని తెలిపారు.జనవరి 21 మధ్యహ్నం 3.00 గంటలవరకూ ఎమర్జెన్సీ కొనసాగుతుందని తెలిపారు.

అమెరికా పార్లమెంటు ముట్టడిపై స్పందించిన మోదీ

అమెరికాలో జరుగుతున్న ఘర్షణలపై పలు దేశాల నాయకులు విచారం వ్యక్తం చేసారు.

"వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అల్లర్లు, హింస బాధాకరం. అధికార బదిలీ చట్టబద్ధంగా, శాంతియుతంగా జరగాలి. చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడాన్ని సమ్మతించలేం" అని మోదీ తెలిపారు.

"యూఎస్‌లో విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రజాస్వామానికి పెద్ద పీట వేసే అమెరికాలాంటి దేశంలో అధికార బదిలీ చట్టబద్ధంగా, శాంతియుతంగా జరగడం చాలా ముఖ్యం" అని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేసారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ప్రజాస్వామ్యం అంటే ఓటు వేసే హక్కు, ప్రజల అభిప్రాయాన్ని తెలిపే హక్కు. అంతే కాకుండా ప్రజల అభిప్రాయాన్ని శాంతియుతంగా ఉన్నత స్థానంలో నిలిపే విధానం. ఈ విధానానికి ఒక అల్లరిమూక ద్వారా ఆటంకం కలుగకూడదు" అని న్యూజీల్యాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు.

"ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించేవారికి ఈరోజు వాషింగ్టన్ డీసీలో జరుగుతున్నది సంతోషాన్నిస్తుంది. బాధాకరమైన మాటలు హింసను ప్రేరేపిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని తొక్కేయడం ఆపండి" అంటూ జర్మనీ విదేశాంగ మంత్రి హెయ్‌కో మాస్, ట్రంప్ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

సాయుధ బలగాలు పార్లమెంటులోకి ప్రవేశించిన ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాయుధ బలగాలు పార్లమెంటులోకి ప్రవేశించిన ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకున్నాయి

‘అమెరికా పార్లమెంట్ చరిత్రలో ఇది చీకటి రోజు’

జరిగిన సంఘటనలపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్పందిస్తూ...అమెరికా పార్లమెంట్ చరిత్రలో ఇది చీకటి రోజు అంటూ విచారం వ్యక్తం చేసారు. "హింస ఎప్పుడూ విజయం సాధించలేదు. స్వేచ్ఛ మాత్రమే గెలుపు సాధిస్తుంది" అని ఆయన అన్నారు.అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం దేశాధ్యక్షుడు తన విధులను సరిగ్గా నిర్వహించలేకపోయినట్లైతే, అధికారాలను మరొకరికి అప్పగించవచ్చు.ఈ సందర్భంలో..ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడంలో విఫలం అవుతున్నారని, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ యాక్టింగ్-ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుపుతూ మైక్ పెన్స్‌తో సహా మెజారిటీ క్యాబినెట్ నాయకులు ఉమ్మడిగా కాంగ్రెస్ లీడర్స్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే, 1967లో ఈ సవరణ ఆమోదముద్ర పొందిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా అమలు చెయ్యలేదు.అమెరికా పార్లమెంట్‌పై దాడి నేపథ్యంలో..ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నారని, 25వ సవరణను అమలులోకి తేవల్సిందిగా పలువురు పెన్స్‌ను కోరుతున్నారు.

అమెరికా కాంగ్రెస్ సెంట్రల్ హాలులో ట్రంప్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా కాంగ్రెస్ సెంట్రల్ హాలులో ట్రంప్ మద్దతుదారులు

వైట్ హౌస్ డిప్యుటీ సెక్రటరీ రాజీనామా

వైట్ హౌస్ డిప్యుటీ సెక్రటరీ సారా మాథ్యూస్ తన పదవికి రాజీనామా చేసారు.

"ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినందుకు, మేము అమలు చేసిన పాలసీ విధానాల విషయంలో గర్విస్తున్నాను. కానీ ఈరోజు జరిగిన దాడి నన్ను చాలా బాధించింది. అధికార బదిలీ శాంతియుతంగా జరగాలి" అని ఆమె అన్నారు.

‘ఈ హింస దేశానికే సిగ్గుచేటు’ - బరాక్ ఒబామా

అమెరికా పార్లెమెంట్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక ప్రకటన విడుదల చేసారు."ఇవాళ పార్లమెంట్‌పై జరిగిన దాడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. చట్టబద్ధంగా జరిగిన ఎన్నికలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రస్తుత అధ్యక్షుడు ప్రేరేపించిన ఈ హింస మన దేశానికే సిగ్గుచేటు" అని మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

"ఎన్నికల ఫలితాల వలన కలత చెందిన ఓటర్లకు నిజం చెప్పడం ద్వారానే గౌరవం ఇవ్వాలి. నిజం ఏమిటంటే...ట్రంప్ ఓడిపోయారు. బైడెన్ గెలిచారు. ఇదేమీ ఆట కాదు. నిజాన్ని ఒప్పుకుని తీరాల్సిందే" అని 2012 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నే తెలిపారు.

సౌత్ కాలిఫోర్నియా సెనేటర్, ట్రంప్ విధేయుడు లిండ్సే గ్రాహం మట్లాడుతూ..."ఈ ఘర్షణలకు నేను మద్దతు తెలుపలేను. ఇప్పటివరకూ జరిగింది చాలు. జో బైడెన్, కమలా హారిస్ చట్టబద్ధంగా ఎన్నికల్లో గెలుపొందారు. జనవరి 20న వారిద్దరూ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు" అని అన్నారు.

ఇలినాయిస్ సెనేటర్ టామీ డక్వర్త్ మాట్లాడుతూ...ట్రంప్‌ను రక్షించే దిశలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకూ సబబో ఆలోచించాలని తన సహోద్యోగులను కోరారు.

వీగిన రిపబ్లికన్ల అభ్యంతరాలు

అరిజోనా ఎన్నికల ఫలితాల పట్ల టెడ్ క్రూజ్ తదితరులు లేవనెత్తిన అభ్యంతరాలు వీగిపోయాయి.కేవల ఆరుగురు రిపబ్లికన్లు మాత్రమే వీరు లేవనెత్తిన అభ్యంతరాలకు అనుకూలంగా ఓటు వెయ్యడంతో అవి వీగిపోయాయని ఉపాధ్యక్షుడు పెన్స్ తెలిపారు.

కాంగ్రెస్ ఉభయ సభలు తాత్కాలికంగా వాయిదా

ఈ అల్లకల్లోలం నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశాలు మొదలయ్యాయి.

ట్రంప్ మద్దతుదారుల 'తిరుగుబాటు' ఉద్యమాన్ని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా తప్పుపట్టారు.

డోనల్డ్ ట్రంప్ కూడా ఈ హింసను ఖండించాలని జో బైడెన్ కోరారు.

పార్లమెంటు భవనం వెలుపల ట్రంప్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Reuters

అయితే, అమెరికా పార్లమెంటువైపు నడుచుకుంటూ వెళ్లాలని తొలుత ప్రదర్శనకారులకు పిలుపు ఇచ్చిన డోనల్డ్ ట్రంప్ తర్వాత వారిని ఇంటికి వెళ్లాలని కోరారు.

క్యాపిటల్ భవనం
ఫొటో క్యాప్షన్, తూర్పు ప్రవేశ ద్వారం వైపు నుంచి ఆందోళన కారులు క్యాపిటల్ భవనంలోకి చొరబడ్డారు

పార్లమెంటు భవనంలోకి ఆందోళనకారులు రావడంతో కాంగ్రెస్ సభ్యులు బల్లల కింద దాక్కున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యలు కొందరు గ్యాస్ మాస్కులు ధరించారు.

క్యాపిటల్ భవనంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్యాపిటల్ భవనంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు

ఈ గందరగోళంలో పార్లమెంటు భవనంలో జరిగిన కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందారని మెట్రోపాలిటన్ పోలీసు డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి తెలిపారు.

పార్లమెంటు భవనం లోపల ట్రంప్ మద్దతుదారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పార్లమెంటు భవనం లోపల ట్రంప్ మద్దతుదారులు

రెండు అనుమానాస్పద పేలుడు పదార్థాలు కూడా గుర్తించామని, వాటిని ఎఫ్‌బీఐ, క్యాపిటల్ హిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణల నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్ విధించారు.

క్యాపిటల్ భవనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, క్యాపిటల్ భవనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)