డోనల్డ్ ట్రంప్ ఓడిపోయారు... కానీ, ఆయనకు నల్లజాతీయులు, లాటినోల్లో ఆదరణ పెరిగిందా?

ఫొటో సోర్స్, NICHOLAS KAMM
- రచయిత, అశిష్టా నగేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని చవిచూసినప్పటికీ, 2016తో పోలిస్తే ప్రస్తుతం తనకు మైనారిటీల్లో ప్రజాదారణ బాగా పెరిగిందని రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ఈ విషయంలో చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
జాత్యహంకారం, ఇస్లామోఫోబియాలను ట్రంప్ ప్రేరేపిస్తున్నారని ఎప్పటి నుంచో డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆఫ్రికన్-అమెరికన్లను ట్రంప్ తక్కువగా చూస్తున్నారని వారు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేస్తూ వచ్చారు.
ప్రస్తుతం నల్లజాతీయుల్లో ట్రంప్ ఓటు బ్యాంకు ఆరు శాతం పెరిగినట్లు రిపబ్లికన్లు చెబుతున్నారు. మరోవైపు హిస్పానిక్ జాతి మహిళల్లోనూ ఐదు శాతం ఓటింగ్ పెరిగినట్లు వివరిస్తున్నారు.
అంటే 2016 ఎన్నికల్లో వేరే పార్టీలకు ఓట్లు వేసిన లేదా ఓటు వేయని వారు ప్రస్తుతం ట్రంప్‌కు మద్దతు పలికారు. పెరిగిన ఈ ఓటు శాతం.. ఆయా జాతుల్లో ట్రంప్‌కున్న ఆదరణకు అద్దంపడుతోంది.

ఫొటో సోర్స్, Mateo Mokarzel
‘‘మొదట్లో ఆయన్ను సీరియస్‌గా తీసుకోలేదు’’
40 ఏళ్ల మెట్టెయో మొకర్జేల్ హ్యూస్టన్‌లో చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రుల్లో ఒకరు మెక్సికో, మరొకరు లెబనాన్ సంతతికి చెందినవారున్నారు. 2016 ఎన్నికల్లో మెట్టెయో ఓటు వేయలేదు.
తనకు ఏ పార్టీపైనా అభిమానం అంటూ ఏమీలేదని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి ఓటు వేసినట్లు ఆయన వివరించారు.
‘‘నేను చాలా ఉదారవాద వాతావరణంలో పెరిగాను. 1960ల్లో మా అమ్మమ్మ టెక్సస్‌లో పౌర హక్కుల ఉద్యమాల్లో పాల్గొన్నారు. నేను కూడా అవే సిద్ధాంతాలను నమ్ముతూ పెరిగాను’’
‘‘నాలుగేళ్ల క్రితం ట్రంప్ మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు, ఎవరికి ఓటు వేయాలో నాకు అర్థంకాలేదు. సెలబ్రిటీ చర్చల్లో వ్యాఖ్యాతలా ఆయన అనిపించేవారు. నేను ఆయన్ను సీరియస్‌గా తీసుకోలేదు. ఆయన కేవలం హిల్లరీ క్లింటన్‌కు ప్రత్యర్థి మాత్రమేనని అనుకునేవాణ్ని. ఆయనపై అంత ఆసక్తి ఉండేది కాదు’’అని మెట్టెయో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘విదేశాంగ విధానాలతో..’’
టెక్సస్‌లో పుట్టి పెరగడం వల్ల, రెండు పార్టీలపైనున్న అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయని మెట్టెయో వివరించారు.
‘‘టెక్సస్‌కు వెలుపల నివసించేవారికి ఇక్కడి పరిస్థితులు అర్థం కావడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ డెమొక్రటిక్ పార్టీ గెలిచేదని ప్రజలు మరచిపోయారు. రెండు పార్టీల్లోనూ జాత్యహంకార నాయకులను నేను చూస్తూ నేను పెరిగాను’’అని ఆయన చెప్పారు.
అయితే, ట్రంప్ జాత్యహంకార నాయకుడనే వాదనను మెట్టెయో ఖండించారు. ట్రంప్ విదేశాంగ, ఆర్థిక విధానాలు తనపై చాలా ప్రభావం చూపాయని ఆయన చెప్పారు.
‘‘ప్రపంచీకరణ వ్యతిరేక విధానాలను ట్రంప్ అనుసరించారు. నియో లిబరల్ విస్తరణ కాంక్షతో అమెరికా, మెక్సికోలకు చాలా చేటు జరిగింది. మాకు ఇక్కడ జీవించడానికే చాలా కష్టమయ్యేది. ఉద్యోగాలు ఉండేవికాదు. డబ్బులు ఉండేవి కాదు. మాదకద్రవ్యాలపై దేశం యుద్ధం చేస్తున్నట్లు అనిపించేది. ఈ విషయాల్లో ట్రంప్ చాలా మంచి చర్యలు తీసుకున్నారు’’అని ఆయన వివరించారు.
‘‘ఆయన ఏం చెప్పారో, అది చేసి చూపించారు. నిజంగా రిపబ్లికన్ నేతలు ఏం చెబుతారో అదే చేస్తారు’’

ఫొటో సోర్స్, Getty Images
‘‘మా జీతాలు పెరిగాయి’’
మెట్టెయో భార్య లిల్లీ ఉపాధ్యాయురాలు. ఆమె మెక్సికో, అమెరికా సంతతికి చెందిన మహిళ. ఆమె కూడా ట్రంప్‌కు గట్టి మద్దతుదారు. ఆర్థికపరమైన అంశాల వల్లే తను ట్రంప్‌కు మద్దతు పలికినట్లు ఆమె వివరించారు.
‘‘ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక, మా జీతాలు పెరిగాయి’’అని ఆమె వివరించారు.
తనతో పనిచేసే వారిలో చాలా మంది డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు పలికారని ఆమె చెప్పారు. తనకు మాత్రం ట్రంప్ అంటేనే ఇష్టమని వివరించారు.
‘‘ట్రంప్‌పై ఎలాంటి ఆరోపణలు గుప్పించారో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇదివరకు ఎప్పుడూ నేను ఓటు వేయలేదు. ఎందుకంటే, నా ఓటుతో ఏం మారుతుందని అనుకునేదాన్ని. కానీ, ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత మా జీవితాలు చాలా మెరుగుపడ్డాయి’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘క్రమంగా వైఖరి మారుతూ వచ్చింది’’
27ఏళ్ల ఎలిజబెత్ కూడా గత నాలుగేళ్లలో ట్రంప్‌పై తన వైఖరి మారుతూ వచ్చిందని చెప్పారు.
మెక్సికో అమెరికన్ సంతతికి చెందిన ఎలిజబెత్ టెక్సాస్‌లోని లరేడోలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం మెక్సికో సరిహద్దుల్లో ఉంటుంది. చాలా మంది లాటిన్ అమెరికన్లు ఇక్కడ నివసిస్తారు. ఈ ప్రాంతాల్లో బైడెన్ కంటే ట్రంప్ చాలా ముందంజలో ఉన్నారు.
2016లో ఆమె ఓటు వేయలేదు. కానీ ప్రస్తుతం కన్జర్వేటివ్, క్యాథలిక్ భావజాలానికి, ముఖ్యంగా గర్భస్రావ నిబంధనల విషయంలో, రిపబ్లికన్ పార్టీ దగ్గరగా ఉన్నట్లు తను భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.
గర్భస్రావాలను వ్యతిరేకించే కోనీ బ్యారెట్‌ను సుప్రీం కోర్టు జడ్జిగా ట్రంప్ నామినేట్ చేశారు.
‘‘మా ఇంట్లో అందరూ డెమొక్రటిక్ పార్టీకి మద్దతు పలికేవారు. కానీ ఈసారి వారిలో మార్పు కనిపించింది. బరాక్ ఒబామా సహా చాలా మంది అధ్యక్షులు హామీలు ఇచ్చారు. కానీ వాటిని పూర్తిచేయలేదు. అధ్యక్షుడైన సమయంలో ట్రంప్ కూడా చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ వట్టి మాటల్లానే అనిపించాయి. కానీ అలా జరగలేదు. ఒక్కొక్కటిగా ఆయన హామీలను నెరవేర్చుకుంటూ వచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది’’అని ఎలిజబెత్ చెప్పారు.
2020 ఎన్నికల్లో లాటినోలు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఇక్కడ మారారు. అమెరికాలో నల్లజాతీయుల కంటే వీరే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లు రాజకీయంగా చాలా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. వీరి జనాభాలో భిన్న సిద్ధాంతాలు, రాజకీయ దృక్పథాలను అనుసరించే వారు ఉంటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫ్లోరిడాలోని మయామీ డేడ్‌లో ఫలితాలను చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక్కడ క్యూబన్ అమెరికన్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. వీరిని తమ వైపు తిప్పుకొనేందుకు డెమొక్రటిక్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. కానీ ఇక్కడ రిపబ్లికన్ పార్టీ పైచేయి సాధించింది.
బైడెన్, కమలా హ్యారిస్.. సోషలిస్టులుగా ట్రంప్ వర్గం చేపట్టిన ప్రచారం క్యూబన్ అమెరికన్లు, వెనెజువెలా అమెరికన్లపై ప్రభావిం చూపివుండొచ్చు.
‘‘క్యూబా నుంచి బహిష్కరించిన కుటుంబం మాది. ఫిడిల్ క్యాస్ట్రో అధికారం ఎప్పుడు అంతం అవుతుంది? అని మేం రోజూ చర్చించుకునేవాళ్లం. మళ్లీ మా ఇళ్లను ఎప్పుడు చూసుకోగలమా అనుకునేవాళ్లం. 1960ల్లో నేను స్కూలుకు కూడా వెళ్లకముందే, అక్కడ కమ్యూనిస్టు సిద్ధాంతాలు రాజ్యమేలాలు. మాకు సోషలిజం, కమ్యూనిజం అంటే అర్థం కూడా ఏమిటో అప్పట్లో తెలియదు’’అని క్యూబన్ అమెరికన్ సంతతికి చెందిన పవోలా రమోస్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నల్లజాతీయుల్లోనూ...
మరోవైపు 2016తో పోలిస్తే, నల్లజాతీయుల్లోనూ ట్రంప్ ఓటింగ్ శాతం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
నల్లజాతీయులు డెమొక్రటిక్ పార్టీకి ఎప్పటినుంచో గట్టి మద్దతుదారులు. ప్రతీసారి వారి ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చేది.
ట్రంప్ మద్దతునిచ్చే నల్లజాతీయుల ఓట్ల శాతం పెరిగిన మాట వాస్తవేమనని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషకుడు శాం ఫుల్‌వుడ్ చెప్పారు. అయితే, ఆ శాతం మరీ ఎక్కువ పెరిగినట్లు రిపబ్లికన్లు చెబుతున్నారని ఆయన అన్నారు.
‘‘నాకు తెలిసినంతవరకు దీన్ని చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. నల్లజాతీయుల్లో, ముఖ్యంగా నల్లజాతి మహిళలు, బైడెన్‌కు మద్దతుగా నిలిచారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
నల్లజాతీయులు ఎక్కువగా డెమొక్రటిక్ పార్టీకి ఓటు వేస్తారనే మాట వాస్తవమే. కానీ వీరి ఓటింగ్‌లో ఎలాంటి మార్పూ లేదనే వాదనలో నిజంలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వలసల విధానాలతో ప్రభావం
2018లో చేపట్టిన హార్వర్డ్ హ్యారిస్ అధ్యయనం ప్రకారం.. వలసల సంఖ్యలను తగ్గించేందుకు నల్లజాతీయులు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. దాదాపు 85 శాతం మంది వలసలపై నియంత్రణ విధించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు దీనిలో చెప్పారు. మిగతా వర్గాల్లో 54 శాతం మంది మాత్రమే వలసలు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. కొందరు నల్లజాతీయులు అయితే, వలసలపై పూర్తిగా నిషేధం విధించాలని అభిప్రాయం వ్యక్తంచేశారు.
‘‘ఉద్యోగాల విషయంలో నైపుణ్యాలు తక్కువగా ఉండే వలసదారుల నుంచి తమకు ఎక్కువ పోటీ ఎదురవుతోందని నల్లజాతి యువకులు భావిస్తున్నారు’’అని మాజీ దౌత్యవేత్త డేవ్ సెమినారా.. లాస్ ఏంజెలిస్ టైమ్స్‌కు రాసిన కథనంలో తెలిపారు.
చాలా మంది నల్లజాతీ సెలబ్రిటీలు కూడా ఎన్నికలకు ముందు ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. సంగీత కళాకారులు కర్టిస్ జాక్సన్, ఐస్ క్యూబ్ తదితర ప్రముఖులు వీరిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నల్లజాతి ఓటర్లు డెమొక్రటిక్ పార్టీపై కోపంగా ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేసివేసి మేం అలసిపోయాం. మాకు ఎలాంటి ఆర్థిక సాయమూ అందలేదు. ఉద్యోగాలూ రాలేదు. బైడెన్‌కు చాలా మంది నల్లజాతీయులు మద్దతు పలకడం లేదు’’అని బ్లాక్ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఫౌండర్ రాబర్ట్ జాన్సన్ చెప్పారు.
‘‘నల్లజాతీయుల్లో చాలా మంది ట్రంప్‌ను జాత్యహంకారిగా, అసమర్థుడిగా చెప్పారు. అయితే, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన కొంచెం మెరుగ్గానే పనిచేశారని ఒప్పుకున్నారు’’అని బ్లాక్ స్వింగ్ ఓటర్స్ ప్రాజెక్టులో భాగంగా నల్లజాతీయులపై సర్వే చేపట్టిన ఫుల్‌వుడ్.. బీబీసీతో చెప్పారు.
ఈ వ్యాఖ్యలు, విశ్లేషణలు చూసిన తర్వాత, జాత్యహంకార ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీగా మైనారిటీ వర్గాలు ఓట్లు వేశాయని ఇంకా భావించొచ్చా?
‘‘ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలు, మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలతో ట్రంప్‌పై అభిమానం మరింత పెరిగింది’’అని మెట్టెయో తెలిపారు.
‘‘ఆయనకు జాతీయవాద నాయకుడనే పేరుంది. ప్రతి అమెరికన్ దేశ సరిహద్దులను పటిష్ఠం చేసుకోవాలని, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచుకోవాలని అనుకుంటాడు’’అని మెట్టెయో అన్నారు. జాత్యహంకారులకు ట్రంప్ మద్దతు పలుకుతారని తను అనుకోనని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు
- అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సాల్యూట్ చేశారు
- గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం
- కరోనావైరస్: వచ్చే చలికాలానికి అంతా నార్మల్ అవుతుందంటున్న వ్యాక్సీన్ రూపకర్తలు
- నెల్సన్ మండేలా సహా ఎందరో రాజకీయ ఖైదీల విడుదలకు కృషి చేసిన తెలుగు వ్యక్తి
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








