అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పూర్వీకులు చెన్నైలో ఉండేవారా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాకు ఉపాధ్యక్షురాలు కాబోతున్న కమలా హ్యారిస్ తల్లి తమిళనాడులోనే పుట్టారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయితే, అధ్యక్ష పదవి చేపట్టబోతున్న జో బైడెన్ పూర్వీకులకు కూడా భారత్‌తో అనుబంధం ఉందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
జో బైడెన్‌ను డెమొక్రటిక్ పార్టీ అధ్యక అభ్యర్థిగా ఎంచుకున్న తర్వాత లండన్‌లోని కింగ్స్ కాలేజీ విజిటింగ్ ప్రొఫెసర్ టిమ్ విలాసీ విస్లీ www.gatewayhouse.in వెబ్‌సైట్‌కు ఓ వ్యాసం రాశారు. బైడెన్ పూర్వీకులు చెన్నైలో ఉండి ఉంటారని అందులో టిమ్ చెప్పారు.
బైడెన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ వ్యాసం చర్చనీయాంశమైంది.
2013లో జో బైడెన్ ముంబయిలో పర్యటించారు. తమ పూర్వీకులు ముంబయిలో నివసించారని అప్పుడు ఆయన అన్నారు.
2015లో వాషింగ్టన్ డీసీలో ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ... తన తాతయ్యకు తాతయ్య జార్జ్ బైడెన్ ఈస్ట్ ఇండియాలో కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసినట్లు చెప్పారు. 1972లో తాను సెనేటర్‌గా ఎన్నికయ్యాక ముంబయి నుంచి వచ్చిన ఓ ఉత్తరం ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు.

ఆ ఉత్తరాన్ని పంపిన వ్యక్తి పేరు కూడా బైడెన్ అని, అప్పుడు ఆ విషయానికి తాను మరీ అంత ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పారు. ముంబయిలో బైడెన్ అనే పేరుతో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని కూడా అన్నారు.
ఈ వివరాల ఆధారంగా టిమ్ విలాసీ తన వ్యాసం రాశారు. భారత్‌లో జార్జ్ బైడెన్ పేరుతో ఆ వ్యక్తి పనిచేసినట్లు రికార్డులు లేవని పేర్కొన్నారు. విలియం హెన్రీ బైడెన్, క్రిస్టోఫర్ బైడెన్ అనే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారని తెలిపారు.
విలియం బైడెన్, క్రిస్టోఫర్ బైడెన్ అన్నదమ్ములని, వాళ్లద్దరూ యుక్త వయసులో ఉన్నప్పుడే మూడో లేదా నాలుగో తరగతి కార్మికులుగా ఇంగ్లాండ్ నుంచి చైనాకు వెళ్తున్న ఓడలో వచ్చారని టిమ్ రాశారు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా భారత్‌కు ఓడ ప్రయాణం ప్రమాదకరమని అప్పట్లో భావించేవారని, కానీ ఇక్కడికి వస్తే జీవితాలు మెరుగుపడతాయన్న ఆశతో చాలా మంది ఆ సాహసం చేసేవారని టిమ్ పేర్కొన్నారు.
హన్రీ బైడెన్ క్రమంగా రాబర్ట్సన్, గాంజెస్, తాలియా ఓడలకు కెప్టెన్ అయ్యారు. 1843లో రంగూన్‌లో 51 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు.
హెన్రీ అన్న క్రిస్టోఫర్ బైడెన్ చెన్నైలో ఉండిపోయారు. అప్పట్లో నగరంలో ఆయన ప్రముఖుడు. మొదట్లో రాయల్ జార్జ్ ఓడలో కింది స్థాయి కార్మికుడిగా ఆయన ఉండేవారు. 1818కి వచ్చేసరికి ఆయన ప్రముఖమైన ఉద్యోగం వచ్చింది. 1821లో ప్రిన్సెస్ చార్లెట్ ఆఫ్ వేల్స్ అనే ఓడకు కెప్టెన్ అయ్యారు. ఆ తర్వాత రాయల్ జార్జ్ ఓడకు కెప్టెన్ అయ్యారు. 1819లో హారియట్ ఫ్రీత్ అనే ఆవిడను ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు పుట్టారు.

1830లో ప్రిన్సెస్ చార్లెట్ ఓడ కెప్టెన్‌గా క్రిస్టోఫర్ రిటైరయ్యారు. ఆ తర్వాత లండన్‌లోని బ్లాక్‌హీత్‌లో ఆయన స్థిరపడ్డారు. క్రిస్టోఫర్ ఓ పుస్తకం కూడా రాశారు.
41 ఏళ్ల వయసులోనే రిటైరైన క్రిస్టోఫర్... ఆ తర్వాత విక్టరీ అనే ఓడను కొనుగోలు చేశారు. బొంబాయి, కొలంబోలకు ప్రయాణాలు చేశారు.
విక్టరీ ఓడతో క్రిస్టోఫర్ బైడెన్‌కు లాభాలు వచ్చాయా? లేదా? అన్న సమాచారం లేదు. అయితే మార్కిస్ కమడెన్ అనే ఓడలో ఆయన భార్య, కూతర్లుతో కలిసి చెన్నై వచ్చారు. ఈ ప్రయాణ సమయంలో ఆయన కూతుర్లలో ఒకామె జబ్బుపడి చనిపోయింది. చెన్నైకి వచ్చాక అక్కడి ఓడల గోదాముకు క్రిస్టోఫర్ నిర్వాహకుడిగా ఉన్నారు.
చెన్నైలో దాదాపు 19 ఏళ్లపాటు క్రిస్టోఫర్ ఉన్నారు. ఓడ ప్రయాణాలకు సలహాదారుడిగా పనిచేశారు. నావికుల మరణం వల్ల ఇబ్బందుల్లో పడ్డ వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు క్రిస్టోఫర్ కృషి చేశారు.
క్రిస్టోఫర్ కొడుకు 1846లో చెన్నైకి వచ్చారు. చెన్నై ఆర్టిలరీలో చేరి, కర్నల్‌గా పనిచేశారు.
క్రిస్టోఫర్ చెన్నైలోనే 1858 ఫిబ్రవరి 25న చనిపోయారు. నగరంలోని సెయింట్ జార్జ్ క్యాథెడ్రల్‌లో ఆయన సమాధి ఉంది. క్యాథెడ్రల్‌లో క్రిస్టోఫర్ జ్ఞాపకార్థం వేయించిన ఫలకంపై, ఆయన అస్థమాతో మరణించినట్లుగా ఉంది.
క్రిస్టోఫర్ మరణం తర్వాత ఆయన భార్య లండన్‌కు తిరిగివెళ్లారు. 1880 వరకూ ఆమె అక్కడే జీవించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆమె పేపర్లు కొన్ని ఉన్నాయి. క్రిస్టోఫర్ బైడెన్‌కు మరో భార్య ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావనైతే లేదు.

జో బైడెన్ చెబుతున్నట్లు జార్జ్ బైడెన్ అనే వ్యక్తి భారత్‌లో ఉన్నట్లు ఎలాంటి రికార్డులూ లేవని, ఆయన చెబుతున్న పూర్వీకుడు క్రిస్టోఫర్ బైడెన్ అయ్యుండొచ్చని టిమ్ విలాసీ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాసం ఎందుకు రాశానన్నది కూడా టిమ్ బీబీసీకి వివరించారు.
''సెయింట్ జార్జ్ కేథడ్రల్‌లో కొన్నేళ్ల క్రితం ఓ ఫలకం ఫొటోను నేను తీసుకున్నా. దాని మీద కనిపించిన క్రిస్టోఫర్ బైడెన్ పేరుకు, జో బైడెన్‌కు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉన్నా. తమ పూర్వీకులు ఈస్ట్ ఇండియా కంపెనీలో కెప్టెన్లుగా పనిచేసినట్లు జో బైడెన్ స్వయంగా చెప్పారని నాకు తర్వాత తెలిసింది. అందుకే, ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించా. చాలా పత్రాలు, పుస్తకాలు చదివా. జో బైడెన్ చెప్పిన వివరాలకు విలియం బైడెన్, క్రిస్టోఫర్ బైడెన్‌లు సరిపోతున్నారు. క్రిస్టోఫర్ బైడెన్ భారత్ పట్ల, భారతీయుల పట్ల చాలా గౌరవంతో ఉండేవారని నాకు తెలిసింది'' అని టిమ్ అన్నారు.
''క్రిస్టోఫర్ బైడెన్ విషయంలో జో బైడెన్ గర్వపడొచ్చు. క్రిస్టోఫర్ రాసిన పుస్తకం చదివితే, ఆయన మానవత్వం మనకు అర్థమవుతుంది. చెడ్డ రాజకీయ వ్యవస్థలోనూ మంచి వ్యక్తులు ఉండొచ్చన్నదానికి ఆయన ఉదాహరణ'' అని వివరించారు.
(అదనపు వివరాలు: సుగన్ సభర్వాల్, బీబీసీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి:
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. ఒళ్లు గగుర్పొడిచే యుద్ధాలలో ఏం జరిగింది
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ‘నేను బెంగాలీ.. నా బాయ్ ఫ్రెండ్ నల్ల జాతీయుడు - మా అమ్మ ఏం చేసిందంటే..’
- ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజన ఎలా ఉండబోతోంది... ఎన్ని కొత్త జిల్లాలు రాబోతున్నాయి?
- భారత్-చైనా ఉద్రిక్తతలు: భారత్ ఎందుకు వరుసగా క్షిపణి పరీక్షలు చేపడుతోంది?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- కోర్టు ధిక్కరణ అంటే ఏమిటి.. ఈ నేరానికి ఏ శిక్షలు విధిస్తారు?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








