జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడు భారత్‌తో ఎలాంటి సంబంధాలు నెరపనున్నారా.. ఆయన భారత్‌కు అనుకూలమా కాదా

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శర్మ
    • హోదా, బీబీసీ కోసం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయిన రెండు దఫాల్లోనూ బైడెన్ ఉపాధ్యక్షుడుగా ఉంటూ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. 77 ఏళ్ల బైడెన్.. విదేశీ వ్యవహారాల నిపుణుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడైన తర్వాత విదేశీ వ్యవహారాల పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుంది? ఆయన ట్రంప్‌ కంటే భిన్నమైన విదేశీ విధానాలను పాటిస్తారా? అనే అంశాలపై విశ్లేషకులు ఆసక్తి చూపుతున్నారు.

భారత్ పట్ల బైడెన్ వైఖరి ఎలా ఉంటుంది? ట్రంప్ భార‌త్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లే బైడెన్ కూడా కొనసాగిస్తారా లేక భిన్న విధానాలను అనుసరిస్తారా? అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వాణిజ్యం, హెచ్1బీ వీసాలు, అమెరికాలో భారతీయులకు రానున్న ఉద్యోగాలు, రక్షణలో భాగస్వామ్యం, పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి, ఉగ్రవాదం, ఇరాన్‌పై నిర్ణయాలు, కశ్మీర్‌పై దృష్టి... ఇలా ఎన్నో విషయాల్లో బైడెన్ విధానాలు ఎలా ఉంటాయనేది భారత్‌కు చాలా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఏ దేశ విదేశాంగ విధానమైనా కొద్దో గొప్పో మారుతూ ఉంటుంది కానీ దానికి ఒక అనుక్రమం, పరంపర ఉంటాయి" అని మాజీ దౌత్యవేత్త పినాక్ రంజన్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

“క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచీ గమనిస్తే, భారత అణు పరీక్షల తరువాత రెండు దేశాల సంబంధాల్లో కొంత చీలిక వచ్చిన మాట వాస్తవమేగానీ, ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. క్లింటన్ కూడా భారత్‌లో పర్యటించారు"అని పినాక్ రంజన్ అన్నారు.

"బుష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్, అమెరికా మధ్య అణు సహకారానికి ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. తరువాతి కాలంలో ఒబామా రెండుసార్లు భారత్‌ను సందర్శించారు. ట్రంప్ కూడా రెండుసార్లు ఇండియా వచ్చారు"అని ఆయన గుర్తు చేశారు.

"డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల విదేశాంగ విధానాలలో ఒక క్రమం ఉంటుంది. బైడెన్ వచ్చిన తరువాత ఈ విధానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు".

“ట్రంప్, బైడెన్ భిన్న వ్యక్తిత్వాలు, సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు అయినప్పటికీ, కొన్ని మార్పులు చేర్పులు రావొచ్చు.. తప్పితే పెద్ద పెద్ద అంశాల్లో తేడా ఉండదు”.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, SAUL LOEB/AFP via Getty Images

"వాణిజ్యం, భద్రత, ఉగ్రవాదం లాంటి అంశాల్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ విషయాల్లో ఒక కామన్ ప్లాట్‌ఫార్మ్ ఏర్పడిపోయింది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులెవరైనా సరే వీటిని మార్చే ప్రయత్నాలు చెయ్యరు"అని పినాక్ అభిప్రాయపడ్డారు.

"భారత్, అమెరికా సంబంధాల్లో వ్యక్తుల పాత్ర తగ్గుతూ. సంస్థల పాత్ర పెరుగుతోంది. ఈ పద్ధతిలోనే బైడెన్ కూడా భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తారు"అని అబ్జర్వర్ ఫౌండేషన్‌లో స్ట్రాటజిక్ స్టడీస్ ప్రోగ్రాం డైరెక్టర్‌ ప్రొ. హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

"నాలుగేళ్ల క్రితం ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు కూడా ఇలాగే భారతదేశం పట్ల అమెరికా వైఖరి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ట్రంప్ ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించడంతోపాటూ, తమ విదేశాంగ విధానంలో భారత్‌కు ఒక ముఖ్య స్థానం కల్పించారు. ఒబామా కాలంలో కూడా ఇదే జరిగింది"అని ఆయన తెలిపారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Andrew Harnik-Pool/Getty Images

చైనా విషయంలో బైడెన్ వైఖరి భారత్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతుందా?

బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరం చేసిన తరువాత చైనా పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది, ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్న విషయమని విశ్లేషకులు అంటున్నారు.

ట్రంప్ పాలనలో చైనా పట్ల అమెరికా కఠినమైన విధానాలను అవలంబించింది. ఈ కోణంలో అమెరికా విధానం భారత్‌కు అనుకూలంగా నిలిచింది. లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు అమెరికా బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపింది.

కానీ ఇప్పుడు బైడెన్, చైనా పట్ల కాస్త మృదువుగా వ్యవహరించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"భారత్, అమెరికాల మధ్య మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి... ఒకటి ఉగ్రవాదం-పాకిస్తాన్, రెండోది చైనా, మూడోది ఆర్థిక సంబంధాలు" అని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర తెలిపారు.

"ఇండో-యూఎస్ సంబంధాలపై చైనా ప్రభావం ఉండొచ్చు. ట్రంప్ చూపినంత కఠినమైన వైఖరి బైడెన్ పాటించకపోవచ్చు"అని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

"భారత్, చైనాల మధ్య ఎల్ఏసీ వద్ద ఇంకా ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో బైడెన్ చైనా పట్ల మృదువుగా వ్యవహరిస్తే, దాన్ని భారత్ హర్షించకపోవచ్చు".

"చైనా విషయంలో ట్రంప్, బైడెన్‌ల మధ్య స్వరం, భాష, వ్యవహార పద్ధతులలో తేడా కనిపిస్తోంది. ఇది భారత్-అమెరికాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది"అని మహాపాత్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

"చైనా విషయంలో ట్రంప్ భారత్‌కు అనుకూలంగా ఉన్నారు. కానీ ఇప్పుడు బైడెన్ అధ్యక్షతన అమెరికా, చైనాతో వాణిజ్య ఒప్పందాలతో పాటూ ఇతర అంశాలలో కూడా కచ్చితంగా కొన్ని రకాల మార్పులు తీసుకొస్తుంది. దీనిపై భారత్ ఓ కన్నేసి ఉంచుతుంది"అని హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Yuichi Yamazaki/Getty Images

డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత వివాదాలు ఇండియాపై ప్రభావం చూపిస్తాయా?

ఈ సమయంలో డెమొక్రటిక్ పార్టీలో కొన్ని లుకలుకలు రేగుతున్నాయని, వామపక్ష వాదుల గొంతు బలంగా ఉందని ప్రొ. హర్ష్ పంత్ తెలిపారు.

"అమెరికా గత కొన్నేళ్లుగా భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోని ధోరణి పాటిస్తోంది. కానీ సీఏఏ, ఆర్టికల్ 370లాంటి విషయాల్లో డెమొక్రటిక్ పార్టీలోని వామపక్షవాదులు, కమలా హ్యారిస్‌తో సహా పలువురు భారత సంతతికి చెందినవారు అభ్యంతరాలు లేవనెత్తారు"అని ఆయన అన్నారు.

ఈ అంశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రమీలా జయపాల్‌ను కలవడనికి నిరాకరించారు.

ఇప్పుడు మళ్లీ ఈ అంశాలన్నీ పైకొస్తాయా? అదే జరిగితే భారత్ వీటన్నింటినీ ఎలా డీల్ చేస్తుంది?

"అయితే, బైడెన్ మధ్యేవాది అని భారత్ విశ్వసిస్తోంది. ఈ విషయాలన్నింట్లోనూ ఆయన భారత్ పక్షం వహిస్తారని ఆశిస్తోంది" అని హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు.

కానీ డెమొక్రటిక్ పార్టీలో వామపక్షాల ఆధిపత్యం పెరిగితే అది కచ్చితంగా భారత్‌పై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Andrew Harnik-Pool/Getty Images

కశ్మీర్‌కు అనుకూలంగా...

ఈ ఏడాది జూన్‌లో కశ్మీర్‌కు అనుకూలంగా బైడెన్ చేసిన ఒక ప్రకటనలో... కశ్మీర్ ప్రజల హక్కులన్నీ పునరుద్ధరించాలని, భారత్ అందుకు కావలసిన అన్ని రకాలు చర్యలు చేపట్టాలని తెలిపారు.

భారత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్‌ఆర్‌సీ)ల పట్ల కూడా బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జో బైడెన్ ప్రచార వెబ్‌సైట్లో ప్రచురించిన ఒక పాలసీ పేపర్‌లో..."భారతదేశం ఎన్నో ఏళ్లుగా లౌకికవాదం, భిన్నత్వం, ప్రజాస్వామ్యం పాటిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు వాటన్నిటికీ విరుద్ధంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు.

2010 నవంబర్‌లో ఒబామా భారత పర్యటనలో కశ్మీర్ వివాదం గురించి మాట్లాడుతూ "కశ్మీర్ విషయంలో మా పాత్ర ఏమీ లేదు. కానీ రెండు పక్షాలకు సాయం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం"అని తెలిపారు.

"భారత అంతర్గత నిర్ణయాల పట్ల, విధానాల పట్ల బైడెన్ అసంతృప్తి కనబరచవచ్చు, వాటి గురించి ప్రకటనలు చేయవచ్చుగానీ అవి భారత-అమెరికా వ్యూహాత్మక సంబంధాలపై ప్రభావం చూపబోవు"అని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

"కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ను పునరుద్ధరించమని బైడెన్ భారత్‌పై ఒత్తిడి తీసుకురాలేరు"అని పినాక్ రంజన్ అభిప్రాయపడ్డారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Andrew Harnik-Pool/Getty Images

వాణిజ్య వ్యవహారాలు ఎలా ఉంటాయి?

ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి అంగీకారం కుదరలేదు. సమగ్ర వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన ఏర్పడినప్పుడు మినీ డీల్ కోసం ప్రయత్నాలు జరిగాయి కానీ ఇరు దేశాల మధ్య రాజీ కుదరలేదు.

అయితే, జో బైడెన్ దశాబ్దాలుగా సెనేటర్‌గా ఉన్నప్పుడు, ఎనిమిదేళ్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా సేవలు కొనసాగించినప్పుడు కూడా భారతదేశాన్ని మిత్రదేశంగానే పరిగణించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగుపరిచడానికి ప్రయత్నించాలని ఎన్నోసార్లు సూచించారు.

ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఆయన పలుమార్లు సూచించారు. అయితే, భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని సమకూర్చడంలో బైడెన్ సఫలమవుతారా?

"ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు. అందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో పెద్ద స్థాయిలో మార్పులు రావడం కష్టం" అని పినాక్ రంజన్ అభిప్రాయపడ్డారు.

వాణిజ్య విషయాల్లో భారత్‌కు డెమొక్రట్లతోనూ, రిపబ్లికన్లతోనూ కూడా విభేదాలున్నాయి. ట్రేడ్ విషయంలో ట్రంప్ బలమైన వైఖరి అవలంబించి అధిక దిగుమతి సుంకాలను విధించారని మహాపాత్ర తెలిపారు.

"ట్రంప్ ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించినప్పుడు కూడా, ట్రేడ్ డీల్ కుదురుతుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ మహమ్మారి కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడం రెండు పక్షాలకూ మేలు చేస్తుంది"అని మహాపాత్ర అభిప్రాయపడ్డారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, DANIEL SLIM/AFP via Getty Images

భద్రతా మండలిలో భారత్‌కు‌ సభ్యత్వం

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యుఎన్ఎస్‌సి)లో సంస్కరణలకు భారత్ పదే పదే డిమాండ్ చేస్తోంది. అందులో సభ్యత్వం ఇవ్వాలని వాదిస్తోంది. అమెరికా కూడా చాలాసార్లు భారత్‌ వాదనను సమర్థించింది.

అయితే, ఇప్పటివరకూ దానిపై ఎలాంటి పెద్ద చర్యలూ చేపట్టలేదు.

"భారత్ ఐక్యరాజ్యసమితిలో కీలక పాత్ర పోషించాలని, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని అమెరికా కోరుకుంటోంది"అని 2010 నవంబర్ 8న భారత పార్లమెంటులో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.

భారత్ ప్రపంచ స్థాయి నేతల బాధ్యతలు కూడా నెరవేర్చాల్సి ఉంటుందని ఆయన అప్పుడు చెప్పారు. బైడెన్ వచ్చిన తర్వాత కూడా ఈ అంశంలో ఏవైనా పెద్దగా మార్పులు చోటుచేసుకుంటాయని ఆశించడం కష్టమే.

రెండు దేశాల మధ్య సంబంధాల విషయానికి వస్తే ఇది అంత పెద్ద అంశం కాదని మహాపాత్ర చెబుతున్నారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Olson/Getty Images

భారతీయులకు ఉద్యోగాలు, హెచ్1బీ వీసా

హెచ్1బీ వీసా, ఇమిగ్రేషన్ గురించి ట్రంప్ విధానాలు కఠినంగా ఉంటూ వచ్చాయి. అమెరికన్లకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ట్రంప్ ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వచ్చేవారి సంఖ్య తగ్గించడానికి ప్రయత్నించారు.

ఇదే ఏడాది జూన్‌లో ఆయన హెచ్1బీ, హెచ్4 వీసా లాంటి తాత్కాలిక వర్క్ పర్మిట్లను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయం వేలాది మందికి అమెరికాలో ఉద్యోగాలు రాకుండా, వర్క్ - స్టడీ ప్రోగ్రామ్స్ లో చేరలేకుండా చేసింది

అయితే, బైడెన్ ఈ అంశంలో ఉదారంగా వ్యవహరిస్తారని, ఆయన హెచ్1బీ వీసాల సంఖ్య పెంచవచ్చని భావిస్తున్నారు.

"భారత్, అమెరికా మధ్య ఇమిగ్రేషన్ లాంటి కొన్ని అంశాలపై వివాదాలు ఉండచ్చు. కానీ, వాటి వల్ల పెద్దగా తేడా ఉండదు" అని పినాక్ చెబుతున్నారు.

భారత్, అమెరికా మధ్య ఉద్యోగాలు ఒక పెద్ద సమస్యగా నిలిచాయి. 2010లో ఒబామా భారత్‌లో పర్యటించిన సమయంలో "భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడం లేదు. భారత్‌తో ఒప్పందాల వల్ల అమెరికా పనిసామర్థ్యం పెరుగుతుంది"అని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ అన్నారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, ARIF ALI/AFP via Getty Images

పాకిస్తాన్, ఉగ్రవాదంపై బైడెన్ వైఖరి

గత 14 ఏళ్లలో ఏ అమెరికా అధ్యక్షుడూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. జార్జ్ డబ్ల్యు బుష్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన చివరి అమెరికా అధ్యక్షుడు అయ్యారు.

బరాక్ ఒబామా, ఆయన తర్వాత అధ్యక్షుడు అయిన ట్రంప్ కూడా భారత పర్యటనకు వచ్చారు. కానీ వారు ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్లలేదు.

తీవ్రవాదం, అఫ్గానిస్తాన్‌లపై పాకిస్తాన్ విధానాల వల్ల.. అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా ఏళ్ల నుంచీ సజావుగా లేవు.

అమెరికా స్పెషల్ ఫోర్సెస్ పాకిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత నుంచి రెండు దేశాల మధ్య అంతరం మరింత పెరిగింది.

ట్రంప్ తన పదవీకాలంలో అమెరికా పాకిస్తాన్‌కు ఇవ్వబోయిన బిలియన్ డాలర్ల సాయాన్ని కూడా అడ్డుకున్నారు.

2016లో ఒబామా రెండో పదవీకాలం ముగుస్తున్న సమయంలో వైట్ హౌస్ ఆయన పాకిస్తాన్ పర్యటన గురించి ఒక ప్రకటన జారీ చేసింది.

పాకిస్తాన్‌తో ఉన్న సంక్లిష్ట సంబంధాల కారణంగా అధ్యక్షుడు ఆ దేశంలో పర్యటించలేరని అప్పుడు వైట్ హౌస్ చెప్పింది.

అలాంటప్పుడు పాకిస్తాన్ గురించి బైడెన్ విధానంలో ఏదైనా పెద్ద మార్పు వస్తుందా. ఆ దేశం పట్ల బైడెన్ వైఖరి ఎలా ఉంటుందనేదానిపై భారత్ ప్రధానంగా దృష్టి సారించింది.

ఎందుకంటే భారత్, పాకిస్తాన్ సంబంధాలు సుదీర్ఘకాలం నుంచీ సరిగా లేవు. సమీప భవిష్యత్తులో వాటిలో ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.

బైడెన్ విజయం వల్ల తమకు మంచే జరుగుతుందని పాకిస్తాన్ భావిస్తోంది.

బైడెన్ విజయంతో భారత పాలిత కశ్మీర్‌పై సానుకూల ప్రభావం ఉండే అవకాశాలు పెరిగాయని పాకిస్తాన్ పత్రిక ఎక్స్ ప్రెస్ రాసింది.

2008లో ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, పాకిస్తాన్ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'హిలాల్-ఎ-పాకిస్తాన్‌'తో జో బైడెన్‌ను గౌరవించారని ఆ పత్రిక చెప్పింది.

బైడెన్‌కు అప్పుడు ఇచ్చిన ఈ గౌరవం పాకిస్తాన్‌కు అమెరికా నుంచి 1.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించడంలో కీలక పాత్ర పోషించడానికి కారణం అయ్యిందని చెప్పింది.

"ఒక అవార్డు ఇవ్వడం వల్ల కీలక అంశాల్లో ఒక నేత తన అభిప్రాయం మార్చుకోవడం అనేది జరగదు. రెండోది, బైడెన్ ఉపాధ్యక్షుడుగా ఉన్నప్పుడే పాకిస్తాన్‌లో లాడెన్‌ను చంపారు. అందుకే, పాకిస్తాన్ పట్ల బైడెన్ ఏదైనా సున్నిత విధానాన్ని అవలంబించడం అనేది కష్టంగా కనిపిస్తోంది" అని మహాపాత్ర చెప్పారు.

పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందించడాన్ని సమర్థించే కొంతమంది అమెరికా నేతల్లో బైడెన్ కూడా ఉన్నారు.

తమ పట్ల బైడెన్ విధానంలో బహుశా ఏవైనా మార్పులు ఉండవచ్చని పాకిస్తాన్‌కు అనిపిస్తోంది. కానీ, ఆ దేశం విషయంలో బైడెన్ విధానం అంతకు ముందులాగే ఉంటుందని నాకు అనిపిస్తోంది" అన్నారు పినాక్ రంజన్.

బైడెన్ కూడా అఫ్గానిస్తాన్ నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటున్నారు. కానీ, ఆయన అఫ్గానిస్తాన్‌లో కొంత ఉనికి కోరుకుంటున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ అవసరం రావచ్చు. ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ పాత్ర ఉండవచ్చు. కానీ. బైడెన్ తీవ్రవాదం పట్ల భారత వైఖరిని సమర్థించారు" అన్నారు.

అమెరికా-భారత్ సంబంధాలు

ఫొటో సోర్స్, Pradeep Gaur/Mint via Getty Images

మోదీ-ట్రంప్ స్నేహం ప్రభావం

ఇదే ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ అహ్మదాబాద్‌లో డోనల్డ్ ట్రంప్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. దానికి 'నమస్తే ట్రంప్' అని నామకరణం చేశారు.

2019 సెప్టెంబర్‌లో టెక్సస్, హ్యూస్టన్‌లో 'హౌడీ మోదీ' కార్యక్రమం ఏర్పాటుచేశారు.

ఇద్దరు నేతలు పరస్పరం తాము మంచి స్నేహితులమని చెప్పుకుంటారు. అలాంటప్పుడు బైడెన్‌తో భారత్ భవిష్యత్ సంబంధాలపై ట్రంప్‌తో మోదీ స్నేహం ప్రభావం పడుతుందా? అనే ప్రశ్న కూడా వస్తుంది.

"అమెరికాలో ఎవరు కొత్త అధ్యక్షుడు అయినా, అందరూ ఆయనతో మంచి సంబంధాలు పెట్టుకోవాలనే కోరుకుంటారు. రెండు దేశాల సంబంధాలు ముందుకే సాగుతాయి. మోదీ, ట్రంప్ స్నేహం వల్ల దానిపై ఎలాంటి ప్రభావం పడదు"అన్నారు పినాక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)